RTC dipo
-
గానం.. ఆమె ప్రాణం
హన్మకొండలోని ఆర్టీసీ డిపోలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తోన్న గూడెల్లి ప్రేమలతకు చిన్నప్పటి నుంచి పాటలంటే ప్రాణం. జనగామ జిల్లా కొడకండ్ల మండలం రేగుల గ్రామం ఆమె స్వస్థలం. పాఠశాల స్థాయి నుంచే వేదికలపై పాటలు పాడటం అలవాటుగా చేసుకుంది. రాగయుక్తంగా పలు సామాజిక, సినీ గీతాలు ఆలపించి గుర్తింపు పొందింది. చిన్నప్పటి నుంచే పాటలు పాడి ఆల్బంలుగా విడుదల చేయాలనే తపన ఉన్నా పేదరికం అడ్డొచ్చింది. ఇందుకోసం డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదివేటప్పుడే ఉద్యోగ ప్రయత్నాలు మొదలెట్టింది. 2013లో ఆర్టీసీ కానిస్టేబుల్ ఉద్యోగం రావడంతో ఆమె పాటకు రెక్కలొచ్చాయి. జానపద ఆల్బంల రూపకల్పన.. ఉద్యోగం సాధించాక పాటలు పాడేందుకు, ఆల్బమ్‌లు తయారు చేసేందుకు ఆర్థికంగా వెసులుబాటు దొరికింది. వరంగల్‌లోని ప్రభుత్వ సంగీత కళాశాలలో కర్ణాటక సంగీతంలో ఓనమాలు దిద్దింది. సరిగమలు నేర్చుకుంటూనే పల్లెగీతాలను ఆలపించడంపై దృష్టి సారించింది. తొలుత పలు యూ ట్యూబ్ ఛానళ్లలో గీతాలు ఆలపించింది. స్వయంగా రాసి ఆలపించిన ‘తాళి కట్టి ఏలుకో పిలగా, తెల్ల చీరకట్టు, నాటు కోడి గరం మసాలా, ముదిరాజు ముద్దుబిడ్డడటా, నేనొక మగువను, బతుకమ్మ, సమాజ కనువిప్పు, కరోనా’ తదితర గీతాలు పల్లె ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. అవే కాకుండా ప్రీ వెడ్డింగ్ గీతాలు, వివాహాలు, జన్మదినాల సందర్భంగా గీతాలు రాసి ఆలపిస్తూ గుర్తింపు పొందుతోంది. తాను రాసిన గీతాలు ఆల్బమ్‌లుగా రూపొందించడమే కాకుండా నటించి ఔరా అనిపించింది. తల్లి వరి నాట్లు వేసేటప్పుడు పాడిన పాటలు.. ఊర్లో అమ్మలక్కలు పలు సందర్భాల్లో ఆలపించిన గీతాలు చిరుప్రాయంలోనే ఆమె మనసుకు హత్తుకున్నాయి. పల్లెటూరిలో ప్రకృతితో పెనవేసుకున్న బంధం పాటల ఊటలా మారింది. ఎన్నో గీతాలు రాసేందుకు, వాటిని జనరంజకంగా పాడేందుకు ఆలంబన అయింది. వృత్తి వేరైనా.. పాటలు పాడటం ప్రవృత్తిగా చేసుకున్న ఆ యువతి రాణిస్తోంది. స్వతహాగా గీతాలు రాస్తూ వాటికి బాణీలు సమకూరుస్తూ పసందైన పల్లె గీతాలను సమాజానికి అందిస్తోంది. ఆర్టీసీ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తూనే జానపద గాయనిగా తనదైన ముద్ర వేసుకున్న గూడెల్లి ప్రేమలత సంగీత ప్రియులను ఓలలాడిస్తోంది. – తొర్రూరు -
డిపో ఎప్పుడో?
నర్సాపూర్: నర్సాపూర్‌లో ఆర్టీసీ డిపో నిర్మాణం నత్తనడకన సా...గుతోంది. మూడు నెలలుగా పనులు నిలిచిపోయాయి. ఇప్పటి వరకు చేపట్టిన వాటికి నిధులు విడుదల కానందునే సదరు కాంట్రాక్టర్ పనులను నిలిపివేశాడని సమాచారం. 20 ఏళ్లక్రితం డిపో ఏర్పాటుకు అప్పట్లో రవాణ శాఖ మంత్రిగా ఉన్న ప్రస్తుత సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత పనులు ముందుకు సాగింది లేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం.. సీఎం కేసీఆర్ కావడంతో ఇక్కడ డిపో ఏర్పాటవుతుందని ప్రజలు ఆశించారు. ఈ మేరకు గత ఏడాది డిపో ఏర్పాటుకు ఒక రూపం వచ్చింది. గత ఏడాది మే 9న మెదక్‌లో జరిగిన సమావేశంలో నర్సాపూర్‌కు ఆర్టీసీ డిపో మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. అదే నెలలో డిపో ఏర్పాటుకు రూ.పది కోట్లు మంజూరయ్యాయి. జూన్‌లో టెండర్లు పూర్తి చేయగా జూలై 26న అప్పటి మంత్రులు హరీశ్‌రావు, మహేందర్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మ, స్థానిక ఎమ్మెల్యే మదన్‌రెడ్డి తదితరులతో కలిసి డిపో నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన అనంతరం రవాణ మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ డిపో నిర్మాణానికి హామీ ఇవ్వడంతో పాటు రూ.పది కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. ఆ నిధులతో ఆరు నెలల్లో డిపో నిర్మాణ పనులు పూర్తి చేయిస్తామని ప్రకటించారు. 26 బస్సులతో పాటు 150 మంది సిబ్బందిని నియమించి సేవలందిస్తామని హామీ ఇచ్చారు. పదకొండు నెలలు కావస్తున్నా .. మంత్రి ప్రకటించి 11 నెలలు కావస్తున్నా పనులు ఇంకా పునాది స్థాయిలో ఉండడం గమనార్హం. జూలైలో శంకుస్థాపన చేయగా ఆగస్టులో డిపో నిర్మాణ పనులు ప్రారంభించారు. షెడ్డు కోసం ఐరన్ రాడ్స్ ఫ్రేంలు ఏర్పాటు చేసినా వాటికి పైకప్పు వేసే పనులతో పాటు ఇతర పనులన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. మరో భవన నిర్మాణం కోసం పునాదులు తీసి వదిలేశారు. ప్రహరీ నిర్మాణ పనులు సైతం అసంపూర్తిగానే ఉన్నాయి. డిపో ఆవరణలో పెట్రోలుబంక్ ఏర్పాటు చేసి అద్దెకివ్వాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. అందులో భాగంగా బంకు నిర్మాణ పనులు హైదరాబాద్ రోడ్డును ఆనుకుని చేపట్టగా తుది దశకు చేరాయి. పెట్రోలు బంకు పనులు చివరి దశకు వచ్చినా డిపో పనులు మాత్రం ఇంకా పునాది స్థాయిలోనే ఉండడంపై స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. నిధులు విడుదల కానందునే..? ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కానందునే డిపో నిర్మాణ పనులు ఆగాయని తెలిసింది. డిపో నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పది కోట్ల రూపాయలు మంజూరు చేయగా టెండరు పూర్తి చేయడం, శంకుస్థాపన, నిర్మాణ పనులు చేపట్టడం వరుసగా పూర్తి చేశారు. నిర్మాణ పనులు ప్రారంభించిన తర్వాత నిధులు విడుదల చేయనందునే పనులకు బ్రేక్ పడినట్లు సమాచారం. ఇప్పటి వరకు సుమారు రూ.కోటి విలువ చేసే పనులను సదరు కాంట్రాక్టరు చేపట్టగా అతనికి ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కానందున పనులను ఆపి వేశాడని తెలిసింది. ఇప్పటికైనా డిపో నిర్మాణం విషయంలో అధికారులు, ప్రభుత్వం చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు. -
ప్రజాసేవే ఆర్టీసీ లక్ష్యం : మహేందర్‌రెడ్డి
నర్సాపూర్ మెదక్ : ఆర్టీసీ నష్టాల్లో ఉన్నప్పటికీ ప్రజాసేవే లక్ష్యంగా తమ సంస్థ పని చేస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి చెప్పారు. గురువారం నర్సాపూర్‌లో డిపో ఏర్పాటుకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నప్పటికీ పేద ప్రజల సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. సంస్థ నష్టాల్లో ఉండడంతో దేశంలో ఎక్కడ లేని విధంగా సీఎం కేసీఆర్ వెయ్యి కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించారని చెప్పారు. నర్సాపూర్ డిపో ఏర్పాటుకు పది కోట్ల రూపాయలను సీఎం మంజూరు చేశారని, ఆరు నెలల్లో డిపోను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. మంత్రిని సన్మానించిన యూనియన్ నాయకులు మంత్రి మహేందర్‌రెడ్డిని తెలంగాణ మజ్దూర్ యూనియన్ రీజినల్ సెక్రటరీ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో యూనియన్ నాయకులు సంగమేశ్వర్, అహ్మద్, శాఖయ్య, శ్యాంసుందర్‌గౌడ్ తదితరులు శాలువ, పూలమాలలతో సన్మానించారు. డిపో ఏర్పాటు చేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. -
టీఎంయూ దాడిపై టీజేఎంయూ ఆగ్రహం
ఇబ్రహీంపట్నం: అధికార టీఎంయూ నాయకులు చేసిన దాడిని నిరసిస్తూ టీజేఎంయూ కార్మికులు శనివారం ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో ముందు గేట్ ధర్నా నిర్వహించారు. అధికార టీఎంయూ నాయకులు కొందరు ఓడీల్లో డ్యూటీని వేయించుకుని... ఆ డ్యూటీలను కూడా సక్రమంగా చేయకుండా డిపోలో ఎస్టీఐ, సీఐ సీట్లల్లో కూర్చుం టూ కార్మికులపై పెత్తనం చెలాయిస్తున్నారని టీజేఎంయూ డిపో కార్యదర్శి రమేష్ ఆరోపించారు. వేలాది రూపాయల జీతం తీసుకుంటూ డ్యూటీలు చేయకుండా సంస్థకు నష్టం కలిగిస్తున్నారని డిపో మేనేజర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఆర్టీఐ(సమాచార హక్కు)చట్టం ద్వారా ఓడీలు చేస్తున్న వారి వివరాలు సేకరించినట్లు వెల్లడించారు. దీనిపై ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఓడీలను రద్దు చేయాలని ఆర్ఎం ఆదేశించినట్లు చెప్పారు. దీంతో కక్ష పెంచుకున్న టీఎంయూ నాయకులు గత మంగళవారం తనను అసభ్యపదజాలంతో తీవ్రంగా దుర్భాషలాడుతూ కాలర్ పట్టుకుని దాడి చేసేందుకు యత్నించారన్నారు. దీనిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని టీఎంయూ నాయకులు ఏ.శ్రీనివాస్, వి.శ్రీనివాస్, ఎస్ఎల్ రెడ్డి, చందర్‌లపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కేసు రిజిష్టర్ అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని... దాడులను నిరసిస్తూ డిపో ముందు ధర్నాను నిర్వహించినట్లు చెప్పారు. టీజేఎంయూ జోలికొస్తే ఊరుకోం టీజేఎంయూ నేతల జోలికొస్తే ఊరుకునేది లేదని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్, ప్రధాన కార్యదర్శి హన్మంత్ హెచ్చరించారు. ధర్నాకు హాజరై న వారు మాట్లాడుతూ కార్మికుల సమస్యలపై స్పందిస్తూ... ఆర్టీసీని లాభాలబాట పట్టేందుకు అంకితభావంతో పనిచేస్తున్న తమ సంఘం నేతలపై భౌతిక దాడులకు పాల్పడితే అదే రీతిలో సమాధానం చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. తమ నేతలపై జరుగుతున్న దాడులపై డిపోలో ఓటీ డ్యూటీలపై జరుగుతున్న అక్రమాలపై ఆర్టీసీ ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు జి.రవీందర్, ప్రేమ్‌నాథ్, స్వాములయ్య, డిపో నాయకులు బి.శ్రీశైలం, సురేష్‌యాదవ్, అబ్దుల్ రజాక్, రవి, ఐలయ్య పాల్గొన్నారు. -
నష్టాల నివారణకు ప్రత్యేక చర్యలు
అద్దంకి, న్యూస్‌లైన్ : ఆర్టీసీ ప్రకాశం రీజియన్ పరిధిలో నష్టాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు రీజినల్ మేనేజర్ నాగశివుడు తెలిపారు. అద్దంకి ఆర్టీసీ డిపోను శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నష్టాలు తగ్గించేందుకు అద్దంకి, మేదరమెట్ల డిపోల పరిధిలో ప్రయాణికులతో రద్దీగా ఉండే భవానీ సెంటర్, బస్టాండ్ సెంటర్, మేదరమెట్ల బస్టాండ్ సెంటర్ల వద్ద కొంతమంది ప్రైవేట్ వ్యక్తులను నియమించి అక్కడ ఆటోలు తిరగకుండా చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. అదే విధంగా వివిధ ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సుల వేళలను ప్రయాణికులకు తెలియజేయడం, ఆయా సెంటర్ల వద్ద బస్సులను పది నిముషాలపాటు నిలిపి ఉంచి ప్రయాణికులను ఎక్కించడం వంటివి చేయనున్నట్లు చెప్పారు. వారికి తోడుగా ఆర్టీసీ సిబ్బంది ఒకరు అక్కడే ఉంటారని తెలిపారు. అవసరమైతే పోలీసుల సహాయం కూడా తీసుకుంటామన్నారు. ఈ చర్యల్లో భాగంగా రోజుకో ఆర్టీసీ డిపోను తాను సందర్శిస్తానన్నారు. డీజిల్‌ను బయట మార్కెట్లో కొనుగోలు చేయడం వల్ల కూడా ఆర్టీసీకి నష్టం వస్తుందని గుర్తించామన్నారు. ప్రస్తుతం బల్క్ డీజిల్ కొనుగోలు ధర తగ్గడంతో ఇకపై డీజిల్‌ను బల్క్‌గా కొనుగోలు చేసి నష్టాలను తగ్గించేందుకు కృషి చేస్తామని ఆర్ఎం పేర్కొన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కొత్త డిపోల ఏర్పాటుకు మళ్లీ ప్రతిపాదనలు పంపనున్నట్లు తెలిపారు. పర్సన్ కాస్ట్ పెరగడం వల్ల కూడా నష్టాలు... జిల్లాలోని ఆర్టీసీ డిపోల్లో నష్టాలు రావడానికి పర్సన్ కాస్ట్ పెరగడం కూడా కారణమని ఆర్ఎం తెలిపారు. సీనియర్ కార్మికులకు వేతనాలు, ఇతర బిల్లుల చెల్లింపులు పెరగడం వల్ల పర్సన్ కాస్ట్ విపరీతంగా పెరిగిందని చెప్పారు. జిల్లావ్యాప్తంగా చూసుకుంటే కిలోమీటర్‌కు 11.67 రూపాయలుగా పర్సన్ కాస్ట్ ఉందన్నారు. అద్దంకి డిపోలో రూ.13.27, ఒంగోలు డిపోలో రూ.14.28, చీరాల డిపోలో రూ.12.75, కందుకూరు డిపోలో రూ.13.67, కనిగిరి డిపోలో రూ.8.82, మార్కాపురం డిపోలో రూ.9.89, పొదిలి డిపోలో రూ.10.40, గిద్దలూరు డిపోలో రూ.10.67గా పర్సన్ కాస్ట్ ఉందని ఆయన వివరించారు. దీనివల్ల కూడా నష్టాలు వస్తున్నాయని పేర్కొన్నారు. 100 మందికి పోస్టింగ్‌లు... జిల్లాలోని ఆర్టీసీ డిపోలకు కొత్తగా 247 మంది సిబ్బందిని ఎంపిక చేయగా, వారిలో 100 మందికి డ్రైవర్లుగా పోస్టింగ్‌లు ఇచ్చినట్లు ఆర్ఎం తెలిపారు. మరో 110 మంది శిక్షణలో ఉన్నట్లు వెల్లడించారు. కండక్టర్లు, డ్రైవర్లకు రోజుకు 8 గంటలకు మించి డ్యూటీ వేయడం లేదని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. దూరప్రాంతాలకు వెళ్లే బస్సులకు ఇద్దరు డ్రైవర్లను ఏర్పాటు చేస్తుండటం వల్ల వారికి మళ్లీ డ్యూటీ వేస్తున్నట్లు చెప్పారు. మొత్తంమీద 8 గంటలే డ్యూటీ వేస్తున్నామన్నారు. అన్ని డిపోల్లో నష్టాలు... జిల్లాలోని 8 డిపోల్లో నష్టాలు వస్తున్నట్లు ఆర్ఎం నాగశివుడు వెల్లడించారు. గత ఏడాది అన్ని డిపోల్లో కలిపి రూ.2.11 కోట్లు, ఈ ఏడాది రూ.2.58 కోట్లు నష్టం వచ్చిందన్నారు. దానికి సంబంధించి ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.