ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా చేస్తున్న టీజేఎంయూ నేతలు
ఇబ్రహీంపట్నం: అధికార టీఎంయూ నాయకులు చేసిన దాడిని నిరసిస్తూ టీజేఎంయూ కార్మికులు శనివారం ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో ముందు గేట్ ధర్నా నిర్వహించారు. అధికార టీఎంయూ నాయకులు కొందరు ఓడీల్లో డ్యూటీని వేయించుకుని... ఆ డ్యూటీలను కూడా సక్రమంగా చేయకుండా డిపోలో ఎస్‌టీఐ, సీఐ సీట్లల్లో కూర్చుం టూ కార్మికులపై పెత్తనం చెలాయిస్తున్నారని టీజేఎంయూ డిపో కార్యదర్శి రమేష్ ఆరోపించారు. వేలాది రూపాయల జీతం తీసుకుంటూ డ్యూటీలు చేయకుండా సంస్థకు నష్టం కలిగిస్తున్నారని డిపో మేనేజర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఆర్టీఐ(సమాచార హక్కు)చట్టం ద్వారా ఓడీలు చేస్తున్న వారి వివరాలు సేకరించినట్లు వెల్లడించారు.
దీనిపై ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఓడీలను రద్దు చేయాలని ఆర్‌ఎం ఆదేశించినట్లు చెప్పారు. దీంతో కక్ష పెంచుకున్న టీఎంయూ నాయకులు గత మంగళవారం తనను అసభ్యపదజాలంతో తీవ్రంగా దుర్భాషలాడుతూ కాలర్ పట్టుకుని దాడి చేసేందుకు యత్నించారన్నారు. దీనిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని టీఎంయూ నాయకులు ఏ.శ్రీనివాస్, వి.శ్రీనివాస్, ఎస్‌ఎల్ రెడ్డి, చందర్‌లపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కేసు రిజిష్టర్ అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని... దాడులను నిరసిస్తూ డిపో ముందు ధర్నాను నిర్వహించినట్లు చెప్పారు.
టీజేఎంయూ జోలికొస్తే ఊరుకోం
టీజేఎంయూ నేతల జోలికొస్తే ఊరుకునేది లేదని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్, ప్రధాన కార్యదర్శి హన్మంత్ హెచ్చరించారు. ధర్నాకు హాజరై న వారు మాట్లాడుతూ కార్మికుల సమస్యలపై స్పందిస్తూ... ఆర్టీసీని లాభాలబాట పట్టేందుకు అంకితభావంతో పనిచేస్తున్న తమ సంఘం నేతలపై భౌతిక దాడులకు పాల్పడితే అదే రీతిలో సమాధానం చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. తమ నేతలపై జరుగుతున్న దాడులపై డిపోలో ఓటీ డ్యూటీలపై జరుగుతున్న అక్రమాలపై ఆర్టీసీ ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు జి.రవీందర్, ప్రేమ్‌నాథ్, స్వాములయ్య, డిపో నాయకులు బి.శ్రీశైలం, సురేష్‌యాదవ్, అబ్దుల్ రజాక్, రవి, ఐలయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment