
అర్బన్ హెల్త్ సెంటర్లకు మహర్దశ!
విజయనగరం ఆరోగ్యం : జిల్లాలోని పట్టణ ఆరోగ్య కేంద్రాలకు (అర్బన్ హెల్త్ సెంటర్లు) మహర్దశ పట్టనుంది. వీటిని పీహెచ్‌సీలుగా అప్‌గ్రేడ్ చేయూలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) ద్వారా ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ఈ మేరకు ప్ర భుత్వం ఇప్పటికే ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలో ఎనిమిది పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వాటిలో విజయనగరంలో నాలుగు, బొబ్బిలిలో రెండు, సాలూరులో ఒకటి, పార్వతీపురంలో ఒకటి ఉన్నాయి. మొదటిసారిగా జిల్లాలోనిపట్టణ ఆరోగ్య కేంద్రాలను అర్బన్ పీహెచ్‌సీలుగా మార్చి, ఇక్కడ విజయవంతమైన తరువాత దశల వారీగా రాష్ట్రంలోని అన్ని అర్బన్ హెల్త్ సెంటర్లను అర్బన్ పీహెచ్‌సీలుగా అప్‌గ్రేడ్ చేయనున్నారు.
పస్తుతం పట్టణాల్లో 50వేల జనాభాకు ఒక అర్బన్ హెల్త్ సెంటర్ ఉంది. ఇందులో టెక్నికల్ సిబ్బంది ఎవరూ లేరు. ఒక వైద్యుడు, ఒక స్టాఫ్‌నర్సు, ఇద్దరు ఏఎన్‌ఎంలు, ఒక కమ్యూనిటీ ఆర్గనైజర్, వైద్యుడి సహాయకుడు ఒకరు, వాచ్‌మన్ ఒకరు, హెల్పర్ ఒకరు చొప్పన పని చేస్తున్నారు. అర్బన్ పీహెచ్‌సీగా అప్‌గ్రేడ్ అయితే పీహెచ్‌సీ మాదిరి ఒక డాక్టర్, ఒక స్టాఫ్ నర్సు, ఇద్దరు ఏఎన్‌ఎంలు, ఒక ఫార్మసిస్టు, ఒక ల్యాబ్ టెక్నీషి యన్, ఒక సీనియర్ అసిస్టెంట్, ఒక సీహెచ్‌ఓ, ఒక హెల్త్ సూపర్‌వైజర్, ఒక వాచ్‌మన్, ఒక కంటింజెంట్ వర్కర్ ఉంటారు. దీని వల్ల రోగులకు ప్రతిరోజూ 12 గంటల పాటు వైద్య సేవలు అందుతాయి. అంతేకాకుండా అన్ని రకాల వ్యాధులకు ఓపీ సేవలు, కుటుంబ సంక్షేమ శస్త్ర చికిత్సలు,
పసవాలు వంటి వైద్య సేవలు అందుతాయి. అర్బన్ హెల్త్ సెంటర్‌లో ప్రస్తుతం ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే వైద్య సేవలు అందుతున్నాయి. మందులు పూర్తిస్థాయిలో ఉండడం లేదు. దీని వల్ల రోగులకు సక్రమంగా సేవలు అందడం లేదు. వీటిని పీహెచ్‌సీలుగా అప్‌గ్రేడ్ చేస్తే పట్టణవాసులకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందుతాయి. గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించడం కోసం ఎన్‌ఆర్‌హెచ్‌ఎం పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోంది. ఇకపై పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజలకు నేషనల్ హెల్త్ మిషన్( ఎన్‌హెచ్‌ఎం) ద్వారా నిధులు విడుదల కానున్నాయి. కాగా సీహెచ్‌ఎన్‌సీ మాదిరి పట్టణాల్లో కూడా అర్బన్ సీహెచ్‌ఎన్‌సీలను ఏర్పాటు చేయనున్నారు. 2.50 లక్షల జనాభాకు ఒక పట్టణ సీహెచ్‌ఎన్‌సీ ఏర్పాటు చేయూలని కేంద్రం భావిస్తోంది.
వివరాల సేకరణలో వైద్య సిబ్బంది
ప్రస్తుతం అర్బన్ హెల్త్ సెంటర్లలో పని చేస్తున్న సిబ్బంది పట్టణాల్లోని వార్డుల్లో ఉన్న జనాభా వివరాల సేకరణలో బిజీగా ఉన్నారు. ఏ వార్డులో ఎంత మంది జనాభా ఉన్నారు. ఎంతమంది గర్భిణులు.. ఎంతమందికి వ్యాధి నిరోధక టీకాలు వేస్తున్నారు. క్షయ, హెచ్‌ఐవీ, కాన్సర్, బోదకాలు, మలేరియా వంటి వాధులతో ఎంతమంది బాధపడుతున్నారు వంటి పూర్తిస్థాయి వివరాలు సేకరిస్తున్నారు.