మానసిక ఆరోగ్యంపై ప్రజల్లో పెరుగుతున్న శ్రద్ధ
డాక్టర్ల కోసం నెట్‌లో శోధన
ఈ ఏడాది 41 శాతం పెరుగుదల
వైద్యుల వద్దకు వెళ్లడంలో దేశ వ్యాప్తంగా గణనీయ వృద్ధి
జస్ట్ డయల్ సంస్థ నివేదికలో వెల్లడి
సాక్షి, అమరావతి: ఒత్తిడి, ఆందోళన, అనవసర భయాలు వంటి మానసిక సమస్యలతో బాధపడే వారికి మానసిక వైద్యులను సంప్రదించాలంటే భయం, బెరుకు ఉంటాయి. ఎవరైనా చూస్తే పిచ్చోళ్ల కింద లెక్క కడతారనే అపోహలతో చాలా మంది ఆ సమస్యలను నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే ప్రస్తుత రోజుల్లో ఇలా భావించే వారిసంఖ్య తగ్గుతోంది. మానసిక సమస్యలపై నిర్భయంగా వైద్యులను సంప్రదించే వారు పెరుగుతున్నారు.
గత ఏడాదితో పోలిస్తే 2024లో మానసిక వైద్యుల సమాచారం కోసం ఇంటర్నెట్‌లో శోధించిన వారి సంఖ్య 41 శాతం పెరగడమే ఇందుకు నిదర్శనం. ముఖ్యంగా అక్షరాస్యులు ఎక్కువగా ఉండే మెట్రో నగరాల్లో గణనీయమైన వృద్ధి కనిపిస్తోంది.
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జనవరి–అక్టోబర్ నెలల మధ్య మానసిక వైద్యుల కోసం అన్వేషిoచిన వారి సంఖ్య కోల్‌కతాలో 43 శాతం, ముంబై 36, కోజికోడ్ (క్యాలికట్)లో 29 శాతం చొప్పున పెరిగింది. ఈ అంశం జస్ట్ డయల్ సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. హెల్త్ కేర్ సెర్చ్‌లలో మెట్రో నగరాల్లో మొత్తంగా 15 శాతం వృద్ధి కనిపించింది. ఢిల్లీలో 20, హైదరాబాద్ 17, చెన్నై వంటి నగరాల్లో 16 శాతం పెరుగుదల నమోదైంది.
ఆరోగ్య సమస్యలపై 23 శాతం పెరిగిన అన్వేషణ
ఆరోగ్య సంరక్షణ నిపుణుల కోసం ఇంటర్నెట్‌లో అన్వేషించిన వారి సంఖ్య ఈ ఏడాది దేశ వ్యాప్తంగా 23 శాతం పెరిగినట్టు తేలింది. ఆధునిక జీవన శైలి నేపథ్యంలో మధ్య వయసు్కల్లోనూ ఎముకలు, కీళ్ల నొప్పుల సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. దేశం మొత్తం ఆర్థోపెడిక్ సెర్చ్‌లు 38 శాతం పెరిగినట్టు వెల్లడైంది. అత్యధికంగా లక్నోలో 37, ఢిల్లీలో 36 శాతం చొప్పున పెరిగినట్టు తేలింది.
బెంగళూరు, పాట్నా నగరాల్లో 32 శాతం వృద్ధి చోటు చేసుకుంది. గైనకాలజిస్ట్‌ల కోసం శోధనలు 28 శాతం పెరిగాయి. ఈ తరహా వృద్ధి హైదరాబాద్‌లో 31 శాతం, పూణేలో 33, ముంబైలో 29 శాతం నమోదైంది. కాగా, దేశ వ్యాప్తంగా ఆయుర్వేద వైద్య సేవల వైపు మొగ్గు చూపుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.
ఈ నేపథ్యంలోనే గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 18 శాతం ఆయుర్వేద వైద్యుల కోసం శోధనలు పెరిగాయి. ఢిల్లీలో 29 శాతం, ముంబైలో 21 శాతం చొప్పున వృద్ధి నమోదైంది. సంప్రదాయ వైద్య పద్ధతులపై పెరుగుతున్న ఆసక్తిని ఈ పెరుగుదల సూచిస్తోంది.
అవగాహన పెరిగింది
గతంలో ప్రజలు మానసిక సమస్యలపై వైద్యులను సంప్రదించాలంటేనే ఎంతో భయపడేవాళ్లు. అప్పటితో పోలిస్తే ప్రస్తుతం మానసిక ఆరోగ్యం పట్ల ప్రజల్లో అవగాహన పెరిగింది. గతంలో మాదిరిగా భూత వైద్యం, మంత్ర, తంత్రాలను నమ్మే పరిస్థితులు పోతున్నాయి. ప్రస్తుతం రోజు రోజుకు ప్రజల్లో మానసిక సమస్యలు పెరుగుతున్నాయి. కేవలం పిచ్చే కాకుండా ఆందోళన, అసహనం, భావోద్వేగ సమస్యలన్నీ మానసిక అనారోగ్యం కిందకే వస్తాయి.
ఇలాంటి ఇబ్బందులున్న వారు బయటకు చెప్పుకుంటే ఏమవుతుందోనని భయపడాల్సిన అవసరం లేదు. తమ సమస్యలను కుటుంబ సభ్యులు, సన్నిహితులతో పంచుకోవాలి. ప్రారంభ దశలోనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స, కౌన్సెలింగ్ పొందాలి. – డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి, మానసిక వైద్యనిపుణులు, విజయవాడ
Comments
Please login to add a commentAdd a comment