తల్లిదండ్రుల ప్రేమను ఎవరూ క్వొశ్చన్ చేయలేరు.
కానీ ఒక రోజు ఉంటుంది.
ఆ రోజు... ఎవరో కాదు, పిల్లలే క్వొశ్చన్ చేస్తారు!
‘ఏంటి మమ్మీ... ప్రతిదానికీ...’ అనే మాట రావచ్చు.
‘ఐ యామ్ నాట్ ఎ కిడ్ డాడ్...’ అనే విసుగు కూడా.
అప్పుడు తల్లీ, తండ్రీ షాక్ అవుతారు.
ఆలోచనలో పడిపోతారు.
జాగ్రత్తలు చెప్పడం తప్పా?
అన్నీ అమర్చిపెట్టడం తప్పా?
తప్పు కాదు కానీ...
ఇంకా లాల పోసినట్టే, ఇంకా జోలపాడినట్టే
ప్రతిదీ వెంటబడి వెంటబడి చేస్తుంటే, చెప్తుంటే...
వయసొస్తున్న పిల్లలు అమ్మ ఒడిలో ఇముడుతారా?
నాన్న వేలు పట్టుకుని నడిచేందుకు ఇష్టపడతారా?
ప్రేమంటే పట్టు మాత్రమే కాదు, విడుపు కూడానని బాధ్యత అంటే... బాధ్యతలను నేర్పడం కూడానని పేరెంట్స్‌కి చెప్పడమే... ఈవారం ‘లాలిపాఠం’.
ఈ తరం కుటుంబాలో పెరిగిన జీవన ప్రమాణస్థాయులు కావచ్చు, అధునాతనమైన సౌకర్యాల వల్ల కావచ్చు... పిల్లల విషయంలో తల్లిదండ్రుల ధోరణిలో మార్పు కనిపిస్తోంది. పిల్లలను భద్రంగా చూసుకోవాలనుకోవడంతోపాటు ప్రతిదీ తామే నేర్పించాలనే తపన పెరుగుతోంది. పిల్లల బాల్యమంతా తల్లిదండ్రులే అవుతున్నారు. అన్నిపనులూ తల్లిదండ్రులే చేసిపెడుతుండడంతో పిల్లల్లో సోమరితనం పెరుగుతోంది. ఏదీసొంతంగా చేసుకోవడం చేతకాకపోవడంతో వారిలో అభద్రత భావం పెరుగుతోంది. ‘పిల్లల్లో కాన్ఫిడెన్స్ పెరగాలంటే ఎక్స్‌పోజర్ పెరగాలి, వాళ్లు ఏదైనా చేయాలని సరదా పడితే ఆ పని హానికరం కానంతవరకు వాళ్లను నియంత్రించాల్సిన అవసరం లేదు. నేర్చుకునే అవకాశం ఉన్నంత వరకు ప్రోత్సహించాలి’ అంటున్నారు సైకియాట్రిస్టులు.
తల్లిదండ్రులు ఓవర్ ప్రొటెక్టింగ్‌గా ఉంటే పిల్లల్లో తాము పెద్దవుతున్నామా లేదా అనే అయోమయం, నేనింత పెద్దయ్యాను కదా మరి! ఈ చిన్న పనిని కూడా సరిగా చేయలేననే సందేహమా నా మీద?... ఇలాంటి అనుమానాలు వస్తుంటాయి. ఇదే పరిస్థితి మితిమీరితే పిల్లల్లో ‘ఏమో నాకు చేతకాదేమో’ అని సర్ది చెప్పుకోవడం మొదలవుతుంది. అది ఇంకా ప్రమాదకరం.
సొంతంగా తెలుసుకోనివ్వాలి!
పిల్లలు ఎదిగే క్రమంలో వచ్చే మార్పులను తమకు తాముగా గుర్తించగలరు, వారికి చైల్డ్‌హుడ్, టీనేజ్, ఎర్లీ అడల్ట్‌హుడ్ దశల్ని గుర్తించే అవకాశం ఇవ్వాలి. ఆ దశలో సాధారణంగా ఉండే భావోద్రేకాల మీద అవగాహన కలిగించుకునే అవకాశం ఇవ్వాలి. దేహంలో వచ్చే మార్పులు అంటే గొంతుమారడం, మీసాలు రావడం, అమ్మాయిల్లో దేహాకృతిలో వచ్చే మార్పులను తమకు తాముగా గ్రహిస్తారు. ఇదే సమయంలో సమాజం వారిని చూసే ధోరణి కూడా మారుతుంది. దానిని పిల్లలు ఎంజాయ్ చేస్తారు కూడ. ఆ దశలో ఎలా ఉండాలో అవగాహన పెంచుకుంటారు.
హితబోధ ఎక్కువైతే!
తల్లిదండ్రుల్లో ఒక రకం తత్వం ఎలా ఉంటుందంటే... ప్రమాదాన్ని భయంకరంగా ఊహించుకుని ముందు జాగ్రత్తగా పిల్లలకు ‘అలా చేయాలి ఇలా చేయకూడదు’ అని పూసగుచ్చినట్లు చెబుతుంటారు. ఘోరమైన ప్రమాదం ఏదో జరుగుతుందేమోననే భయంతో పిల్లలు ఆ జాగ్రత్తలను వింటారు. కానీ అంతా సాఫీగా జరిగిన తర్వాత ‘అబ్బా! అమ్మానాన్న అంతగా చెప్పారు, ఏమీ కాలేదు కదా వాళ్లది ఒట్టి చాదస్తం’ అనుకుంటారు. ఇలాంటి హితబోధ అవసరమే, కానీ ప్రతిసారీ చేస్తోంటే పిల్లల్లో విసుగు మొదలవుతుంది. క్రమంగా తలకెక్కించుకోవడం మానేస్తారు.
ఈ తేడా పెద్దవాళ్లకూ అర్థమవుతుంది. అప్పుడు మరింత ఆందోళనకు లోనవుతూ ‘పిల్లలు తమ మాటలను పెడచెవిన పెడుతున్నారనే అభిప్రాయాన్ని పెంచుకుంటారు’. నిజానికి ఇది పిల్లల్లో వయసురీత్యా వచ్చే సహజమైన మార్పే. కానీ చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఇలా మారడానికి వారి స్నేహితులే కారణం అని నెపాన్ని మోపడానికి కూడా వెనుకాడరు. పైగా ‘ఫలానా ఫ్రెండ్ కారణంగానే వీడు ఇలా తయారవుతున్నాడు’ అనుకుంటూ ఆ ఫ్రెండ్ పేరు చెప్పకుండా ఆ లక్షణాలను, ఆ ఫ్రెండ్ ప్రవర్తనను తప్పుబడుతూ కౌన్సెలింగ్ ఇస్తారు.
ఇక్కడ తల్లిదండ్రులది ఊహాజనితమైన కారణం, పిల్లలు చూసేది వాస్తవం. వాళ్లు చూసే వాస్తవాన్ని కాదని, ఊహాజనితమైన భయాలను చెప్తూ పోతే పిల్లలు సింపుల్‌గా ‘అమ్మానాన్నల పోరు ఎక్కువైంది’ అనేసుకుంటారు. వాళ్ల మెదడు కూడా పేరెంట్స్ చెప్పే విషయాలకు ప్రాధాన్యం ఇవ్వక్కర్లేదు అనే కండిషన్‌లోకి వెళ్తుంది.
పియర్ ప్రెషర్...
టీనేజ్ పిల్లల్లో చాలా సహజంగా కనిపించే లక్షణం పియర్ ప్రెషర్ (సాటి పిల్లలతో పోల్చుకోవడం వల్ల కలిగే ఒత్తిడి). దీని ఫలితాలు ఇలా... అని స్పష్టంగా చెప్పలేం. కొందరు బాగా చదివే క్లాస్‌మేట్స్‌తో పోల్చుకుని పోటీపడుతుంటారు. ఇక పియర్ ప్రెషర్ చూపించే ప్రతికూల ప్రభావం ఎలా ఉంటుందంటే... క్లాస్‌లో ఒకరు వాడుతున్న స్కూల్ బ్యాగ్‌ని ఫ్రెండ్స్ అంతా మెచ్చుకుంటే సహజంగానే అలాంటి ప్రశంసలు తనక్కూడా కావాలనుకుంటూ... ఇంటికి వచ్చి ‘నా స్కూల్‌బ్యాగ్ పాడయింది కొత్తది కావాల’ని డిమాండ్ చేస్తారు, ఫలానా మోడల్‌దే అయి ఉండాలని పట్టుపడతారు. అది తమ సొంతం చేసుకునేంతవరకు స్థిమితంగా ఉండలేరు. పియర్ ప్రెషర్‌ని సరైన క్రమంలోకి మార్చగలిగితే అది మేలు చేసే లక్షణమే. సాధారణంగా 90 శాతం పిల్లలు... తల్లిదండ్రుల మాటను కాదనరు. పిల్లలకు బోర్ కొట్టేలా చెప్పనంతవరకు అమ్మానాన్నల మాటలను పిల్లలు గౌరవిస్తూనే ఉంటారు.
- వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
ఏం చేయకూడదు!
చిన్న వయసులో జి.కె నేర్పించడం వల్ల పిల్లల మెదడు చాలా ఒత్తిడికి లోనవుతుంది.
ప్రతిదీ తాము చెప్పినట్లు చేయాలని నియంత్రించడం వల్ల పిల్లలు మైనపు ముద్దల్లా, తోలుబొమ్మల్లా మారుతారు లేదా వారిలో తిరుగుబాటు ధోరణి తలెత్తుతుంది.
టీవీల్లో చూసి, పేపర్లలో చదివిన ప్రమాదాలు తమ పిల్లలకే సంభవిస్తాయేమోనే ఆందోళనతో తమ కళ్లముందు నుంచి ఎటూ వెళ్లనివ్వకుండా కట్టడి చేస్తూంటారు. పైగా పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాం అనుకుంటారు. అది జాగ్రత్తగా పెంచడం కాదు. భద్రత అనే వలయాన్ని గీసి అందులో బంధించడమే అవుతుంది.
ఎలా చెప్పాలో తెలియక..!
ఇటీవల మా దగ్గరకు వచ్చే చాలామంది పేరెంట్స్‌ని గమనిస్తే... వాళ్లకు పిల్లలకు ఎలా చెప్పాలో తెలియడం లేదనిపిస్తుంది. చిన్నదానికీ, పెద్దదానికీ విపరీతమైన భద్రత కోరుకుంటారు. కుర్చీలో కూర్చున్న పిల్లవాడు కిందకు దిగాలనుకుంటాడు. వాడు కదలగానే అమ్మ లేదా నాన్న ‘బాబూ! పడిపోతావ్! దిగకు అలాగే కూర్చో’ అంటారు. అంటే తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్రమాద హెచ్చరిక మాత్రమే చేస్తున్నారు. కానీ, అధిగమించడానికి అవసరమైన నైపుణ్యా లను నేర్పడం లేదన్నమాట.
- డా॥కల్యాణ్‌చక్రవర్తి, సైకియాట్రిస్ట్
ఇంకా లాల పోసినట్టే! ఇంకా జోల పాడినట్టే!
Published Mon, Nov 11 2013 12:29 AM | Last Updated on Sat, Sep 2 2017 12:30 AM
Advertisement
Advertisement