భార్య.. భర్త.. ఒక కొడుకు | Your Parents need to Have your Support for Ashwin | Sakshi
Sakshi News home page

భార్య.. భర్త.. ఒక కొడుకు

Published Thu, Apr 25 2019 1:22 AM | Last Updated on Thu, Apr 25 2019 5:09 AM

Your Parents need to Have your Support for Ashwin - Sakshi

భార్యాభర్తలకు పుట్టిన బిడ్డకువాళ్లు అమ్మానాన్నలు కాకపోతే..ఆ బిడ్డ ఏమౌతాడు? ఏమైపోతాడు?!అమ్మానాన్నలకు పుట్టిన అవగుణం అవుతాడు.అమ్మ బ్యాడీ, నాన్న బ్యాడీ అని చెప్పుకునే చాడీకి.. ప్రతిరూపం అవుతాడు. అమ్మానాన్నలూ.. ఈ కథనం చదవండి.భార్యాభర్తల్లా ఉండిపోకండి.

స్కూల్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. స్కూల్‌ ఫోనంటే ఈ మధ్య టెన్షన్‌ వస్తోంది దివ్యకు.‘హలో’‘మీరొకసారి స్కూల్‌కి అర్జెంట్‌గా రావాలండీ’‘ఏమైంది టీచర్‌’‘మీ బాబు పక్కనున్న అబ్బాయి చేయి కొరికేశాడు. రక్తం వచ్చేంత గట్టిగా’దివ్య హడావిడిగా ఆఫీసు నుంచి స్కూల్‌కు పరిగెత్తింది. వెళ్లేసరికి అశ్విన్‌ ప్రిన్సిపాల్‌ రూమ్‌ బయట అటూ ఇటూ గెంతుతూ కనిపించాడు. ఆ స్కూల్లో కొట్టరు. కాని అరిచినా పట్టించుకోని పద్ధతిలో లెక్కలేనట్టుగా గెంతుతున్నాడు.‘చూడండి. ఇది మూడో కంప్లయింట్‌. మీరు సింగిల్‌ పేరెంట్‌ అని సానుభూతితో సహిస్తున్నాను. మీ బాబును తీసుకెళ్లండి. ఒక వారం స్కూల్‌కు పంపొద్దు. వాణ్ణి సెట్‌ చేశాకే తిరిగి పంపండి. అప్పుడు కూడా బిహేవియర్‌ మారకపోతే డిస్మిస్‌ చేయాల్సి ఉంటుంది. అయామ్‌ సారీ’ అంది ప్రిన్సిపాల్‌.దివ్య అశ్విన్‌ దగ్గరకు వెళ్లింది.‘ఏం చేశావురా’‘ఏం చేయలేదు’‘ఎందుకు కొరికావు’‘ఊరికే.

కోపం వచ్చింది... కొరికాను’భరించలేని నిస్సహాయత కమ్ముకొస్తుంటే వాణ్ణి జబ్బపట్టి విసురుగా ఇంటికి తీసుకొచ్చింది.అశ్విన్‌ ఇప్పుడు ఒకటో క్లాసు. ఆరేళ్ల పిల్లాడు. మూడేళ్లు నిండగానే నర్సరీలో వేసింది. ఎల్‌.కె.జి., యు.కె.జి ఆ స్కూల్లోనే చదివాడు. ఇప్పుడు ఫస్ట్‌ స్టాండర్డ్‌కు వచ్చాడు. ఎప్పుడూ కంప్లయింట్‌ లేదు. కాని మూడు నెలలుగా వాడి ప్రవర్తన చాలా వింతగా ఉంది. ఇంట్లో కూడా బాగా అల్లరి చేస్తున్నాడు. వస్తువులు పడేస్తున్నాడు. టీవీ వాల్యూమ్‌ పెంచేస్తున్నాడు. అరిస్తే అన్నం మానేసి మంకుపట్టు పడుతున్నాడు. ఎంత ప్రయత్నించినా తినడు. ఆ కోపంతో కొట్టాల్సి వస్తోంది. కొడితే ఇంకాస్త గట్టిగా పట్టు పడుతున్నాడు. ఇది చాలా భయంకరమైన హింసగా ఉంది దివ్యకు. అమ్మా నాన్నలతో కలిసి ఉంటోంది దివ్య. ముగ్గురికీ అశ్విన్‌ తప్పితే మరొకరు లేరు. ముగ్గురూ వాణ్ణి బాగా చూసుకోవాలనే అనుకుంటారు. చూసుకుంటున్నారు.

కాని వాడి ప్రవర్తన ఇంత ఘోరంగా ఎందుకు మారిందో అర్థం కావడం లేదు.‘సైకియాట్రిస్ట్‌ దగ్గరకు తీసుకు వెళదామా అమ్మా’ అన్నాడు తండ్రి ఎందుకైనా మంచిదని.అదే మేలైన పనిగా దివ్యకు కూడా అనిపించింది.లేడీ సైకియాట్రిస్ట్‌ గదిలో అశ్విన్‌ కుదురులేకుండా ఉన్నాడు. కూచోమంటే కూచోవడం లేదు. ఒక మూలన ఆర్టిఫీషియల్‌ మొక్క ఉంటే వెళ్లి దాని ఆకులు పీకుతున్నాడు. సోఫా ఉంటే ఎగిరి దుముకుతున్నాడు.‘ఈ మధ్య మీ ఇంట్లో ఏవైనా గొడవలు అయ్యాయా’‘లేదు డాక్టర్‌’ అంది దివ్య.‘మీ ఇంటికి ఎవరైనా వచ్చారా?’‘లేదండీ’‘మీరు కొత్త ప్రాంతం వెళ్లారా?’‘ఊహూ. కాని బాబు వాళ్ల నాన్నను కలవడానికి రెండు రోజులు వెళ్లి వచ్చాడు’లేడీ సైకియాట్రిస్ట్‌ తల పంకించింది.‘నాన్నా.. ఇలా రా... మనం మాట్లాడుకుందామా’ అని అనునయంగా అశ్విన్‌ను పిలిచి వాణ్ణి మాటల్లో దింపింది.దివ్య, మల్లిక్‌లకు ఎనిమిదేళ్లక్రితం పెళ్లయ్యింది.

పెద్దలు కుదిర్చిన పెళ్లే. కాని రెండు మూడు నెలలకే వారికి కుదరదని అర్థమైంది. ఇద్దరి స్వభావాలు వేరు వేరు. ఇద్దరి ధోరణులూ వేరువేరు. కొట్లాటలు తిట్లాటలు తొందరగా మొదలయ్యాయి. కాని ఈలోపే ఆమె గర్భం దాల్చడం, అశ్విన్‌కు జన్మనివ్వడం కూడా జరిగింది. కాని వాడికి ఒక సంవత్సరం వచ్చేసరికి ఇద్దరూ ఎవరి సొంతిళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. మల్లిక్‌ తన తల్లిదండ్రులతో కలిసి ఉంటుంటే దివ్య తన తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. అశ్విన్‌ తల్లి దగ్గరే ఉండక తప్పలేదు. మరో రెండేళ్లకు కోర్టు విడాకులు మంజూరు చేస్తూ కూడా అదే మాట చెప్పింది. అయితే కొడుకును అప్పుడప్పుడు చూసుకునే హక్కును తండ్రికి కల్పించింది. అశ్విన్‌ చాలా చురుకైన పిల్లవాడు. ముద్దుగా కూడా ఉంటాడు. మరీ పసివాడుగా ఉండగా తండ్రి వచ్చి తీసుకువెళ్లడం, తల్లితో తండ్రి లేకుండా కలిసి ఉండటం వాడికి ఏమాత్రం అర్థం అయ్యే వీలు లేదు. కాని ఆరేళ్లు వచ్చేసరికి వాడికి కొద్దికొద్దిగా అర్థమవసాగింది.

వాడిని అన్నింటి కంటే ఎక్కువగా బాధిస్తున్న విషయం తల్లి చెప్పే తండ్రి చెడు. తండ్రి చెప్పే తల్లి చెడు.ఇంట్లో ఉంటే తల్లి, అమ్మమ్మ, తాతయ్యలు నిత్యం తండ్రిని తిడుతూనే ఉంటారు.‘మీ నాన్న దుర్మార్గుడురా. చూడు మీ అమ్మను ఎలా కష్టాల్లోకి నెట్టాడో’ అని చిన్న పిల్లాడని కూడా చూడకుండా వాడితో అనడం మొదలెట్టారు.‘నాన్నతో ఎక్కువ క్లోజ్‌ కాకు నాన్నా. అసలే బ్యాడ్‌ డాడీ’ అని తల్లి చెప్పి మరీ కొడుకును తండ్రి దగ్గరకు పంపేది.అక్కడకు వెళితే తండ్రి తల్లి మీద కోపం వెళ్లగక్కేవాడు. బూతులు మాట్లాడేవాడు.‘మీ అమ్మను చంపేసేవాణ్ణి. నీ కోసం వదిలిపెట్టాను’ వరకు అతను మతిలేని మాటలు మాట్లాడేవాడు.‘మీ అమ్మ మీ నాన్న జీవితాన్ని నాశనం చేసింది. వాడు ఏ సంతోషం లేకుండా బాధలు పడుతున్నాడు’ అని తాత, నానమ్మ అనేవారు.ఏదో సరదాగా ఆడుకోవడానికి వచ్చే అశ్విన్‌కు ఇవన్నీ ఆ పసిప్రాయంలో తీవ్ర ప్రభావాన్ని ఏర్పరిచాయి.

తండ్రి దగ్గర ఉన్నప్పుడు తల్లి దుర్మార్గురాలిగా, తల్లి దగ్గర ఉన్నప్పుడు తండ్రి దుష్టుడుగా వాడికి అనిపించసాగారు. వాడికి ఇద్దరూ కావాలనిపించేది. కాని ఇద్దరూ దూరమైపోతారేమోనన్న భయం కూడా కలిగింది.దీని వల్ల వాడి ప్రవర్తన మారింది. లోలోపల నలుగుతూ హింస పడుతున్నాడు. తెలియకుండా సమస్యలు తెచ్చి పెడుతున్నాడు.సైకియాట్రిస్ట్‌కు అంతా అర్థం అయ్యింది.సెకండ్‌ సిట్టింగ్‌లో దివ్యను, మల్లిక్‌ను కలిపి కూచోబెట్టింది.‘చూడండి... విడాకులు పొందినవారు పిల్లల విషయంలో పాటించాల్సిన మొదటి సూత్రం గతాన్ని తవ్వకపోవడం. ఒకరి గురించి మరొకరు పిల్లలకు చెడు చెప్పకపోవడం. మీరు విడాకులు తీసుకున్నా ఒకరి మీద ఒకరు కోపం పోగొట్టుకోలేదు. ఆ ద్వేషాన్ని పిల్లాడికి నూరిపోయాలని చూశారు. వాణ్ణి తమ వైపుకు తిప్పుకోవాలని ఎవరికి వారు ప్రయత్నించారు. కాని దాని వల్ల వాడు చాలా డిస్ట్రబ్‌ అవుతున్నాడు.

అయ్యాడు. ఇంకా మీరిలాగే ప్రయత్నిస్తే వాడు దేనికీ పనికి రాకుండా పోతాడు. ఒకటి గుర్తు పెట్టుకోండి... విడాకులు మిమ్మల్ని భార్యాభర్తలు కాకుండా చేయగలవు కాని తల్లిదండ్రులుగా కాకుండా మాన్పలేవు. ఈ జన్మకు అశ్విన్‌కు మీరే తల్లిదండ్రులు. వాడికి మీ ఇద్దరి సపోర్టూ కావాలి. మీతో మాట్లాడిన దానిని బట్టి మీ ఇద్దరూ మీ వ్యక్తిగత జీవితాల్లో మంచివారనీ ఇద్దరి హృదయాల్లో మీ బాబు జీవితం బాగుండాలనే తపన ఉందని నేను గమనించాను. కనుక మీరిరువురూ మీ గతాన్ని, ఒకరిపై మరొకరికి ఉన్న అభ్యంతరాలని మర్చిపోండి. ఒకవేళ ఉన్నా వాటిని బాబుకు చెప్పకండి. బాబు మీతో ఉంటూ తనకు తానే మీ గురించి తెలుసుకునేలా ప్రయత్నించండి. మీరు మారితే వాడూ మారతాడు. వాడు మారితే మీ సమస్య తీరుతుంది’ అంది.
ఇద్దరూ తలాడించారు.‘మరో విషయం. ఈ సంగతి మీ మీ తల్లిదండ్రులకు గట్టిగా చెప్పండి.

వారు మీ పిల్లాడితో గడపబోయే జీవితం కంటే మీరిరువురూ గడపబోయే జీవితం పెద్దది. కనుక వారిని కూడా మార్చాల్సిన బాధ్యత మీ ఇద్దరిదే’ అందామె.ఆరునెలలు గడిచిపోయాయి.అశ్విన్‌ తల్లి దగ్గరే ఉంటూ అప్పుడప్పుడు తండ్రిని కలిసి వస్తున్నాడు. ఇక్కడ ఉన్నప్పుడు అతని ప్రస్తావన రాకుండా; అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రస్తావన రాకుండా అశ్విన్‌ సంతోషంగా ఉండేలా వాడికి తమ ప్రేమ అర్థమయ్యేలాగా ఇరుపక్షాలు ప్రయత్నించాయి.అశ్విన్‌ నెమ్మదిగా కుదురుకున్నాడు.ఫస్ట్‌ క్లాస్‌లో క్లాస్‌ టాపర్‌గా వచ్చాడు.యానివర్సరీ డే నాడు గ్రాడ్యుయేషన్‌ డ్రస్‌ వేసుకొని ఫస్ట్‌ క్లాస్‌ పాసైన డిగ్రీని చేత్తో పట్టుకుని వాడు నవ్వుతూ దిగిన ఫొటో ఇప్పుడు రెండు ఇళ్లలోనూ గోడ మీద సంతోషంగా వేళ్లాడుతూ ఉంది.
కథనం: సాక్షి ఫ్యామిలీ
ఇన్‌పుట్స్‌: పద్మ పాల్వాయి, సైకియాట్రిస్ట్‌

ఒకటి గుర్తు పెట్టుకోండి... విడాకులు మిమ్మల్ని భార్యాభర్తలు కాకుండా చేయగలవు కాని తల్లిదండ్రులుగా కాకుండా మాన్పలేవు. ఈ జన్మకు అశ్విన్‌కు మీరే తల్లిదండ్రులు. వాడికి మీ ఇద్దరి సపోర్టూ కావాలి. కనుక మీరిరువురూ మీ గతాన్ని, ఒకరిపై మరొకరికి ఉన్న అభ్యంతరాలని మర్చిపోండి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement