భర్త గారూ... తెలుసా మీకు? | Husband knows everything except one wifes mind | Sakshi
Sakshi News home page

భర్త గారూ... తెలుసా మీకు?

Published Thu, Feb 21 2019 12:03 AM | Last Updated on Thu, Feb 21 2019 4:22 AM

Husband knows everything except one wifes mind - Sakshi

భర్త గారికి బజారు తెలుసు. ఆఫీసు తెలుసు. బ్యాంక్‌ తెలుసు. కరెన్సీ తెలుసు. రాజకీయాలు తెలుసు. ఫ్రెండ్స్‌తో పైలాపచ్చీసు తెలుసు. భర్త గారికి అన్నీ తెలుసు.ఒక్క భార్య మనసు తప్ప. అందులో ఏముంది?  అతడు ఆ మనసును  చీకటి గుహగా మార్చాడా? లేదా  వెలుతురు గుమ్మంలా మలిచాడా?

వైద్యం చేయాల్సిన వైద్యుడు మెడిసిన్‌ పేరు ఒక క్షణం మర్చిపోతే పర్వాలేదు. గుర్తు తెచ్చుకొని రాయవచ్చు. కాని బాధలో ఉన్న స్త్రీ తాను ఏ కారణం చేత బాధలో ఉందో పూర్తిగా మర్చిపోతే ఎలా వైద్యం చేయాలి? మనిషికి మరుపొక స్వర్గం అన్నాడు సినీ కవి. అన్నీ గుర్తుండటం కష్టం కావచ్చు కాని అన్నీ మర్చిపోవడం మాత్రం చాలా కష్టం. భరించరానంత కష్టం.ఆమెకు అరవై ఏళ్లు ఉంటాయి. రాతి బొమ్మకు ప్రాణం వచ్చినట్టు ఉంటుంది. కదలమంటే కదులుతుంది. కూర్చోమంటే కూర్చుంటుంది. కొన్ని చిన్న చిన్న పనులు చేసుకుంటుంది. ఫోన్‌ వచ్చిందని చెప్పి అందిస్తే అవతలి మనిషిని గుర్తుపట్టి మాట్లాడుతుంది. కాని నిజమైన ప్రాణం లేనట్టే ఉంటుంది. పెద్ద కొడుకు గుంటూరులో ఉన్నాడు. కూతురు హైదరాబాద్‌లోనే స్థిరపడి ఉంది. ఇంట్లో దిగులు లేని జీవితం. భర్త, తను, సొంత ఇల్లు.కాని ఆమె నవ్వడం లేదు. పోనీ ఏడవడమూ లేదు. అసలు ఆమెకు ఏదీ గుర్తుండటం లేదు.సైకియాట్రిస్ట్‌ దగ్గరకు తీసుకువచ్చారు.సైకియాట్రిస్ట్‌ అడిగిన మొదటి ప్రశ్న– ‘ఈమె ఈ కండిషన్‌లో ఉన్నప్పుడు తోడుగా రావలసింది భర్త కదా. ఆయనెక్కడ?’తల్లిని తీసుకొచ్చిన కొడుకు, కూతురు బదులు చెప్పారు– ‘అసలు సమస్య ఆయనే అయితే ఆయనను తోడు పెట్టుకుని రావడం ఎందుకు డాక్టర్‌?’

హిట్లర్లు జర్మనీలో పుట్టారనీ అక్కడే చచ్చిపోయారని అందరూ అనుకుంటూ ఉంటారు. కాని చాలా ఇళ్లల్లో హిట్లర్లు ఉంటారు. వాళ్లు భర్తలుగా, తండ్రులుగా తిరుగుతూ ఉంటారు. రమణరావు అలాంటి హిట్లర్‌. కాని ఆ సంగతి అతనికి తెలియదు. మిలట్రీలో నలభై ఏళ్లు పని చేశాడు. డిసిప్లిన్‌గా కుటుంబం ఉండాలని అనుకున్నాడు. డిసిప్లిన్‌లో ఉంచానని భావించాడు. తాను గాలాడే గదిలో ఉంచానని అతడనుకున్నాడు. అది జైలు గది కదా అని కుటుంబం అనుకుంది. కాని ఆ మాట బంధువులు చెప్పలేరు. కడుపున పుట్టిన పిల్లలు చెప్పలేరు. మరీ ముఖ్యంగా కట్టుకున్న భార్య చెప్పుకోలేదు.సైకియాట్రిస్ట్‌ కోరిక మేరకు రమణరావు వచ్చాడు. 65 ఏళ్లు ఉంటాయి. చక్కగా టక్‌ చేసి ఉన్నాడు. మంచిగా కనపడుతున్నాడు.‘నేను నా జీవితమంతా నా కుటుంబం కోసం కష్టపడ్డాను. వాళ్లకు ఏ లోటూ రానివ్వలేదు. కాని నా భార్య ఇలా తయారైందంటే నా దురదృష్టం’ అన్నాడు.‘మీ భార్యకు తీవ్రమైన డిప్రెషన్‌ ఉంది. ఆమె దురదృష్టం ఏమిటంటే దానికి తోడు డిమెన్షియా (మతిమరుపు) కూడా వచ్చింది. ఆమెను బాధించే విషయాలు ఏమిటో ఆమె బయటకు చెప్తేనే డిప్రెషన్‌ తగ్గుతుంది. కాని అవి ఆమెకు గుర్తులేవు. కనుక వాటిని చెప్పాల్సింది మీరే’ అన్నాడు డాక్టర్‌.రమణరావు సాలోచనగా చూశాడు.‘ఆమెను బాధించే విషయాలు నాకేమీ తెలియవు డాక్టర్‌. నాకేం కావాలో ఏం నచ్చుతాయో చెప్పేవాణ్ణి. వాటిని బట్టి ఆమె నడుచుకునేది’ అన్నాడు. కొంచెం ముందుకు వాలుతూ ‘మీరు నన్ను చెడ్డవాణ్ణని అనుకుంటున్నారా? అలా అయితే నా మనసుకు కష్టంగా ఉంటుంది’ అన్నాడు.‘లేదు లేదు. మీరు మంచివారే కావచ్చు. మీ భార్యకు తప్ప’ అన్నాడు సైకియాట్రిస్ట్‌.


సైకియాట్రిస్ట్‌ ఆమెతోనే మళ్లీ ఒకరోజు కూర్చున్నాడు.‘మీ పెళ్లి గుర్తుందా అమ్మా’ అడిగాడు.తలాడించింది.‘పెళ్లి తర్వాత?’ఎటో చూసింది.‘పెళ్లికి ముందు?’ మళ్లీ ఎటో చూసింది.‘మీ చిన్నప్పుడు?’ఆమె ముఖంలో చిన్న కాంతి వచ్చింది.ఆమె ఊరు కర్నూలు దగ్గర ఒక పల్లె. అది తల్లిగారి ఊరు. పినతల్లులు మేనమామలు అక్కడే ఉన్నారు. చాలా మంది బంధువులు అక్కడే ఉన్నారు. వాళ్లందరి మధ్య ఆమె బాల్యం అక్కడ సాగింది. వాళ్లందరూ కనిపిస్తూ ఉంటే ఆమెకు చాలా సంతోషంగా ఉండేది. పెళ్లయ్యాక ఢిల్లీలో కాపురం పెడితే మూడు నెలలు ఢిల్లీలో ఏమిటోగా అయిపోయింది. తల్లిగారి ఊరికి వచ్చి తనవాళ్లను చూసుకుంటేనే ధైర్యం వచ్చి తిరిగి ఢిల్లీలో కాపురానికి సిద్ధపడింది. ఈ వివరాలన్నీ ఆమె కూడదీసుకుంటూ చెప్పగలిగింది. ఆ తర్వాత సైకియాట్రిస్ట్‌ ఆమెను బయట కూచోబెట్టి పిల్లలను పిలిచాడు.‘మీ అమ్మ ఆ ఊరు వెళ్లి ఎంతకాలం అయ్యింది?’‘ముప్పై సంవత్సరాలు డాక్టర్‌’‘ముప్పై ఏళ్లా?’‘అవును. అక్కడ ఒక పెళ్లికి వెళితే మా నాన్నకు సరిగా మర్యాదలు జరగలేదట. ఇంక ఈ ఊరికే రాను అని శపథం చేశాడు. ఆయన దానికి గట్టిగా కట్టుబడ్డాడా లేదా మాకు తెలియదు. కాని ఆయననుమేముగాని మా అమ్మగాని కనీసం అడగను కూడా అడగని దూరంతో ఉంచాడు’ అన్నాడు కొడుకు.‘అన్నయ్య పెళ్లిలో కాని నా పెళ్లిలోకాని అమ్మ మాట ఏమీ చెల్లుబాటు కాలేదు. అసలు అమ్మను అభిప్రాయం కూడా అడగలేదు. నాన్న భయానికి అమ్మ మూగమొద్దులాగా ఉండటం వల్ల వదిన ఆమెను లెక్క చేయలేదు. అమ్మ ఇలా కావడానికి వదిన కారణం అని నాన్న అనుకుంటున్నారు తప్ప తనే కారణం అనుకోవడం లేదు’ అంది కూతురు.‘అర్థమైంది. మీ నాన్న కాదు అన్న విషయాలన్నీ గుర్తుకొచ్చి అవి బాధిస్తూ ఉండేకన్నా అన్నింటినీ మర్చిపోయి సుఖంగా ఉండటం మేలని బలవంతంగా మీ అమ్మ మతిమరుపు తెచ్చుకుంది. సరే. ముందు మీరొక పని చేయండి. వెంటనే మీ అమ్మను ఆమె ఊరికి తీసుకెళ్లండి. మీ నాన్నతో నేను కూడా చెప్తాను’ అన్నాడు సైకియాట్రిస్ట్‌.


ఆమె ఆ ఊరు వెళ్లిందట. పొలిమేరల్లో అడుగు పెడుతూనే నవ్వేసిందట. బంధువుల పేర్లు ఒక్కొక్కటే చెప్తూ ఆ ఇళ్లకు పరుగు తీసిందట. అమ్మమ్మ ఇంటి అరుగు మీద తృప్తిగా కూలబడిందట. ఆ ఇంటి మంచినీరు తాగి అదే పెద్ద మందన్నట్టు కుదుట పడిందట. మేనమామలను కలిసింది. పిన్నమ్మలను కలిసింది. ఒకరిద్దరు స్నేహితురాళ్లను కలిసింది. అన్నింటి కంటే ముఖ్యం మర్చిపోయిన ఆమె జ్ఞాపకాలన్నింటినీ కలిసింది.ఆశ్చర్యం ఏమిటంటే ఆ ఊళ్లో ఉన్నప్పుడు అన్నీ గుర్తున్నాయి. ఇంటికి రాగానే మళ్లీ యథావిధిగా మారిపోయింది.సైకియాట్రిస్ట్‌ ఆమె భర్తను పిలిచి చెప్పాడు.‘రమణరావుగారూ. మీ భార్యకు డిమెన్షియా ఉందని అనుకున్నాను. కాని అది ‘సూడో డిమెన్షియా’ అని ఈ ఘటన వల్ల తెలిసొచ్చింది. అంటే అబద్ధపు మతిమరుపు అన్నమాట. మీరు ఆమెను అర్థం చేసుకోకపోవడం వల్ల, ఆమె ఇష్టాలను, కోరికలను, విన్నపాలను పూర్తి స్థాయిగా అణిచేయడం వల్ల ఆ నొప్పిని తాళలేక ఆమె మతిమరుపును తెచ్చుకుంది. మిమ్మల్ని ప్రేమించి ఇష్టపడి మీతో ఇన్నాళ్లుసహజీవనం చేసిన మీ భార్యకు ఇంత క్షోభ కలిగిస్తున్నారని మీకు తెలుసా?’ఎందుకనో ఆ పెద్దమనిషి పట్టనట్టుగా ఏడ్చాడు. చాలాసేపు ఏడ్చాడు.‘నాకు తెలియదు డాక్టర్‌. ఆ ఊళ్లో వాళ్లమ్మ బిహేవియర్‌ను పిల్లలు నాకు చెప్పాకనే తెలిసింది. నేనేదో భార్యను అదుపులో పెట్టుకున్నానని అనుకున్నాను తప్ప ఇలా మానసికంగా నాశనం చేశానని అనుకోలేదు’ అన్నాడు.

మొత్తం ఆరు నెలలు పట్టింది ఆమె పూర్తిగా కోలుకోవడానికి.రమణరావు మిలట్రీని ఇంటి కాంపౌండ్‌వాల్‌ బయటపెట్టి ఇంట్లో తనొక మామూలు మనిషిగా మారాడు. సాధారణ భార్యాభర్తలు ఎలా ఉంటారో తాము అలా ఉండే ప్రయత్నం చేశాడు. పిల్లలు ఆయన దగ్గర చనువు పెంచుకున్నారు. ఆయనా పుస్తకాల్లో చదివిన జోకులు గుర్తు పెట్టుకుని మరీ భార్యకు చెప్పి నవ్విస్తున్నాడు.ఒకరు చెప్పి ఒకరు వినే కాపురంలో జబ్బులొస్తాయి.ఇద్దరూ విని చెప్పుకునే కాపురంలో ఇదిగో ఇలా నవ్వులు పూస్తాయి.
– కథనం: సాక్షి ఫ్యామిలీ
ఇన్‌పుట్స్‌: డాక్టర్‌ కల్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement