నాకు తెలియాలి | Family Members Are Overly Responsive To Us Which Can Lead To Problems | Sakshi
Sakshi News home page

నాకు తెలియాలి

Published Thu, Nov 14 2019 12:02 AM | Last Updated on Thu, Nov 14 2019 12:02 AM

Family Members Are Overly Responsive To Us Which Can Lead To Problems - Sakshi

‘ఇమాజినేటివ్‌ కన్ఫ్యూజన్‌’ అనే మాట వైద్యంలో ఉంటుంది. ఇంట్లో మనకు తెలిసినదానిని బట్టి  ‘ధోరణి’ ‘తిక్క’ ‘పెత్తనం’, ‘ఓవరాక్షన్‌’ లాంటి పదాలు వాడతాం. మన కుటుంబ సభ్యులు కొందరు మన గురించి అతిగా స్పందిస్తుంటారు. దాని వల్ల సమస్యలు వస్తాయి. వారిని పట్టించుకోవాలి. వైద్య నిపుణుల సహాయం తీసుకోవాలి. అది అమ్మ గురించి కావచ్చు.నాన్న గురించి కావచ్చు.

రాజు ఆ ఇంటి పెద్ద కొడుకు. పెళ్లి చేసుకోనంటున్నాడు. అతనికి ఇరవై అయిదు వచ్చేశాయి. రెండో కొడుకు ఇరవై మూడేళ్ల వయసులో క్యూలో ఉన్నాడు. ఆ ఇద్దరూ మంచి వయసులో ఉత్సాహంతో కొండలను కూడా పిండి కొట్టగల ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ఉన్నారు కూడా. కాని వారి మనసులో ఏదో వెలితి. ఏదో అసంతృప్తి. నిరాశ. తల్లిదండ్రులు పెద్ద కొడుకును సైకియాట్రిస్ట్‌ దగ్గరకు తీసుకువచ్చారు. ‘డాక్టర్‌.. వీడు పెళ్లి చేసుకునేలా చూడండి’ అని కోరారు. ఆ వయసు కుర్రాళ్లకు ఉండే సమస్యలు తెలుసుకుందామని సైకియాట్రిస్ట్‌ అతనితో మాట కలిపాడు. ‘ఏంటి నీ సమస్య రాజూ?’ ‘నాకేం సమస్య సార్‌. నాకు ఏ సమస్యా లేదు. సమస్యల్లా మా అమ్మా నాన్నలదే. వాళ్లు సంతోషంగా ఉన్నట్టు నేను ఊహ తెలిసినప్పటి నుంచి చూళ్లేదు.

ఎప్పుడూ ఏదో ఒక కీచులాటే. వాళ్లను చూసి చూసి నాకు పెళ్లి చేసుకోవాలనిపించడం లేదు’ అన్నాడు. అయితే సమస్య ఇక్కడ లేదని రెండో కొడుకును పిలిచాడు. ‘ఏంటి ప్రాబ్లమ్‌’ ‘ఏం చెప్పమంటారు సార్‌. నాకూ మా అన్నకూ గొడవలు వచ్చేస్తున్నాయి ఈ మధ్య. దానికి కారణం మా అమ్మానాన్నలు. ఏదో పనికి మాలిన విషయానికి వాళ్లిద్దరు వాదులాడుకుంటారు. మేము ఇంట్లో ఉంటాము కదా. తెలియకుండానే ఒకరు అమ్మ పక్షం, ఒకరు నాన్న పక్షం అయిపోతున్నాం. వాళ్లు కాసేపు తిట్టుకొని మామూలైపోతారు. నేనూ అన్నయ్య తగాదా కంటిన్యూ చేస్తూ మనస్పర్థలు పెంచుకుంటూ ఉన్నాం’. ఇప్పుడు సైకియాట్రిస్ట్‌ తల్లిని పిలిచాడు. ‘డాక్టర్‌.. వారి కోసం అనుక్షణం ఆలోచించే తల్లిని. భార్యను. వారి బాగోగులు చూసుకోవడం నా తప్పా?’ అని అడిగింది ఆమె.

ఆమెలో ఏ లోపమూ కనిపించలేదు. తండ్రిని పిలిపించాడు.‘సార్‌.. నా భార్యకు వంక పెట్టడానికి లేదు. ఆమె తన జీవితం మొత్తాన్ని నా కోసం మా ఇద్దరు అబ్బాయిల కోసం వెచ్చించింది. కష్టపడింది. అయితే–’ అని ఆగాడు.‘అయితే?’ ‘ఆ కష్టం కొంచెం ఎక్కువయ్యింది సార్‌. ప్రతి దాంట్లో ఆమె ఇన్‌వాల్వ్‌ అవుతుంది. మాకు ఒక మోస్తారు వ్యాపారం ఉంది. నేనూ మా ఇద్దరబ్బాయిలు చూసుకుంటాం. బయట సవాలక్ష ఉంటాయి. అవి అన్నీ ఆమెకు తెలియడం ఎందుకు చెప్పండి? అంటే ఆమె నుంచి దాచే విషయాలని కాదు. ఆమెకు చెప్పాల్సింది ఆమెకు చెప్తాం. కాని ఆమె వినదు. ఎప్పుడూ ఏదో ఒక ఆందోళనే. నేను ఏం చేస్తున్నానో, పెద్దాడు ఏం చేస్తున్నాడో, చిన్నాడు ఏం చేస్తున్నాడో... బిజినెస్‌ సరిగ్గా జరుగుతున్నదో లేదో, కలెక్షన్స్‌ అవుతున్నాయో లేదో, సేల్స్‌ ఎలా ఉన్నాయో అన్నీ కావాలంటే ఎలా? పని చేసి ఇంటికి రాగానే ఏదో ఒక వివరం అడుగుతుంది.

నాకు చెప్పే ఓపిక ఉండదు. దాంతో తగాదా. ఆమెను మేం బాగా చూసుకుంటున్నాం. హాయిగా ఉండొచ్చు కదా. మమ్మల్ని బాధ పెడుతోంది’ అన్నాడతను. తీగలాగితే డొంక కదిలినట్టు సమస్య తల్లిలో ఉందని సైకియాట్రిస్ట్‌కు అర్థమైంది. సత్యవతికి చిన్నప్పటి నుంచి ఊహాజనితమైన భయాలు ఉన్నాయి. ఏదో ఒక నష్టం జరుగుతుందేమో తనకు అనే భయం అది. ఆమె బాల్యంలో తెలిసిన వారి కుటుంబాల్లో అకాల మరణాలు చూసింది. అనుకోని విషాదాలు చూసింది. జీవితం అంటే ఏదో ఒక ప్రమాదం అనుక్షణం పొంచి ఉంటుందనే భయం ఆమెలో స్థిరపడింది. ఆమెకు భర్త, పిల్లలే లోకం. వీరికి ఏ ఆపద వచ్చి పడుతుందో అని ఆమె భయం.భర్త షాప్‌కు వెళ్లగానే ఫోన్‌ చేస్తుంది. ఆ తర్వాత షాప్‌లో పని చేసే వర్కర్లకు చేస్తుంది. ఆ తర్వాత పెద్ద కొడుక్కు చేస్తుంది. ఆ తర్వాత చిన్న కొడుక్కు చేస్తుంది. ఏదో ఇప్పుడిప్పుడు కృష్ణారామా అంటూ వ్యాపారం సెటిల్‌ అయ్యింది.. కొడుకులు అందివచ్చారు... ఈ సంతోషానికి ఏదైనా విఘాతం జరిగితే అని ఆమెకు ఒకటే రంధి.భర్త, కొడుకులు ఈ ధోరణితో విసిగిపోతున్నారు.

దీనిని పెత్తనం అనుకుంటున్నారు. చాదస్తం అనుకుంటున్నారు. ‘మీకున్న ఇబ్బందిని ఇమాజినేటివ్‌ కన్ఫ్యూజన్‌ అంటారమ్మా’ అన్నాడు డాక్టర్‌ ఆమెతో. ‘మీరే సమస్యను ఊహించుకుని, దానిలో చిక్కుకుని, మీరే పరిష్కారం కోసం ఆందోళన పడటం దీని లక్షణం’ అన్నాడాయన. ‘భర్త గురించి పిల్లల గురించి ఆందోళన పడటం తప్పా డాక్టర్‌?’ అందామె. ‘తప్పు కాదమ్మా. కాకపోతే నువ్వు ఎక్కువ ఆందోళన పడుతున్నావు. నీకు బాగా వ్యతిరేక స్వభావం ఏర్పడింది. రేప్పొద్దున తెల్లారదేమో అనే భయం నీకు లేదు. కాని రేప్పొద్దున ఏ నష్టం వస్తుందోననే భయం మాత్రం ఉంది. తెల్లారి తీరుతుంది అని మనసుకు తెలిసినట్టుగా నావాళ్లకు ఏమీ కాదు అని మనసుకు ఎందుకు చెప్పుకోలేకపోతున్నావు? హైదరాబాద్‌లో దాదాపు కోటిమంది జనాభా ఉన్నారు.

మనం పేపర్‌ తీస్తే రోజుకు అయిదో పదో దుర్ఘటనలు వ్యక్తుల మరణాలు నష్టాలు చూస్తాం. అంటే కోటి మందిలో కోటి మందీ ప్రమాదంలో లేనట్టే కదా దీని అర్థం. అందరికీ అన్నీ నష్టాలే జరిగితే ఇన్ని వేల సంవత్సరాల్లో మానవులు ఎప్పుడో హరించుకుపోయి ఉండేవారు’ అన్నాడాయన. ఆమె కాస్త తెరిపిన పడింది. ‘నీ భర్తను, పిల్లలను చూసుకోవడానికి నువ్వు కాకుండా ప్రభుత్వము, అధికారులు, పోలీసులు, సైన్యము, సమాజమూ, ఇరుగు పొరుగు, నువ్వు నమ్మేటట్టయితే దైవము ఇంత మంది ఉంటారు. కాబట్టి నిశ్చింతగా ఉండి వాళ్లకు ఎంత అవసరమో అంత సపోర్ట్‌ చేయి. నువ్వు సొంతంగా నీకిష్టమైన వ్యాపకం పెట్టుకో. ఫ్రెండ్స్‌ని కలువు. ఇంకేమైనా పనులు చేయి.

సంతోషంగా ఉండి కుటుంబాన్ని సంతోషంలో పెట్టు. మీ ఇంటికి న్యూస్‌పేపర్‌ వస్తే అందులో రెండో మూడో విషయాలు నువ్వు చదువుతావు. అచ్చయిన ప్రతి వార్తా చదవవు కదా... నీ భర్త, పిల్లలు బయట జరిగే ప్రతి వ్యవహారం నీతో ఎందుకు చెప్పాలి చెప్పు? ఒకటి రెండు అవసరమైనవి చెప్తారు. నువ్వే కాదమ్మా... చాలా ఇళ్లల్లో నీలా తల్లులో తండ్రులో అన్నయ్యలో అనవసర ఆందోళన వల్ల అనవసర జోక్యం చేసుకుని అశాంతికి కారణమవుతున్నారు. కొంచెం సర్దుబాటు చేసుకుంటే ఇదంతా సమస్యే కాదు’ అని వివరించాడు. ఇంత వివరించాక ఆమెలో మార్పు రాకుండా ఉంటుందా? ఆమెకే కాదు, ఎవరిలోనైనా రావాల్సిందే.
– కథనం: సాక్షి ఫీచర్స్‌ డెస్క్‌
ఇన్‌పుట్స్‌: డాక్టర్‌ కల్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement