సరస్వతీ పుత్రికలు క్రమశిక్షణలో సుశిక్షిత సైనికులు ఏ పరీక్షల ఫలితాలు వచ్చినా బాలికలే టాప్ కిశోరమణులంటూ ప్రశంసలెలా ఉన్నా... మరోవైపు జీవిత విషమ పరీక్షలు ఎదుర్కొంటున్నారు... పదో తరగతి పరీక్షలు వస్తున్నాయంటే పుస్తకాలతో కుస్తీ పట్టాలి... కానీ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మూడైదుల వయసు దాటకుండానే మూడు ముళ్ల బంధంలో బందీలైపోతున్నారు...
రాయవరం (మండపేట): విద్యార్థులకు వార్షిక పరీక్షలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థినులు వార్షిక పరీక్షల కంటే కూడా తమ తల్లిదండ్రులు ఎక్కడ బాల్య వివాహాల వైపు మొగ్గు చూపుతారోనని ఆందోళన చెందుతున్నారు. గతంలో జరిగిన బాల్య వివాహాలను పరిశీలిస్తే ఎక్కువగా 9,10, ఇంటర్ విద్యార్థినులే బాల్య వివాహాలకు బందీలవుతున్న విషయాన్ని చైల్డ్‌లైన్ అధికారులు అంగీకరిస్తున్నారు. గత నాలుగేళ్లలో 189 బాల్య వివాహాలు నమోదయ్యాయి.
ఏటా అధికారికంగా 90కి పైగా బాల్య వివాహాలు..
జిల్లాలో చాలా మంది తల్లిదండ్రులు 10వ తరగతి పూర్తికాగానే బాలికలకు పెళ్లిళ్లు చేయడానికే మొగ్గుచూపుతున్నారు. ఆడపిల్లలు చదివితే వారి చదువుకు తగ్గ వరుడు లభించరనేది ఒకటైతే, దీనికితోడు అమ్మాయిలు ఇతర ప్రాంతాలకు వెళ్లి చదవాలంటే రక్షణ ఉండదన్న భయం తల్లిదండ్రులను వెంటాడుతోంది. దీనికితోడు ఆర్థిక, సామాజిక పరిస్థితులు, నమ్మకాలు బాలికలకు శాపంగా మారుతున్నాయి. జిల్లాలో 8,9 తరగతులు చదివే విద్యార్థినులకు కూడా పెళ్లిళ్లు చేసిన సందర్భాలు గతంలో వెలుగు చూశాయి. కారణమేదైనా ఏటా పదుల సంఖ్యలో బాల్య వివాహాలు జరిగి పోతున్నాయి. జిల్లాలో ఏటా 50కి పైగా బాల్య వివాహాలు జరుగుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. 2012 నుంచి 2017 వరకు 400కి పైగా బాల్య వివాహాలను అధికారులు అడ్డుకున్నారు. 2017లో 64 బాల్య వివాహాలను అడ్డుకున్నారు.
పది, ఇంటర్ విద్యార్థినుల్లో ఆందోళన..
పది, ఇంటర్ పరీక్షలు సమీపిస్తున్న కొద్దీ కొందరు విద్యార్థినుల్లో భయం ప్రారంభమవుతోంది. పరీక్షలు ముగియగానే పెళ్లి చేసేస్తారేమోనన్న భయంతో పరీక్షల కసరత్తు వైపు దృష్టి సారించడం లేదు. జిల్లాలో ఈ ఏడాది ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల్లో తొమ్మిదో తరగతి 34,032, పదో తరగతి 31,493, ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌లో 49,955 మంది బాలికలు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఏటా సుమారు 50కి పైగా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తిస్తుండగా అధికారులకు తెలియకుండా అదనంగా వందల సంఖ్యలో చాపకింద నీరులా వివాహాలు సాగిపోతున్నాయి. బాల్య వివాహాల్లో ఎక్కువగా 10, ఇంటర్ ఉత్తీర్ణత చెందిన వారే ఉండడం విచారకరం.
కిశోర బాలికలతో అవగాహన..
శిక్షణ పొందిన కిశోర బాలికలతో హాస్టల్స్‌లో ఉన్న విద్యార్థినులకు మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే మైదాన ప్రాంతంలో ఉన్న 59 హాస్టళ్లలోని 574 మంది శిక్షణ పొందిన కిశోర బాలికలు 14,980 మంది బాలికలకు బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరించే ప్ర యత్నం చేస్తున్నారు. బాల్య వివాహాలకు తల్లిదండ్రులు బలవంతంగా ప్రయత్నిస్తే ఎవరి సహాయం తీసుకోవా లనే విషయాలపై కూడా అవగాహన కల్పిస్తున్నారు. ఈ నెల 30న ఏజెన్సీలో అవగాహన కల్పించేందుకు 155 మంది కిశోర బాలికలకు శిక్షణ ఇవ్వనున్నారు.
ఆరోగ్య సమస్యలు అధికం..
వయస్సు రాకముందే బాలికలకు వివాహం చేస్తే అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. పుట్టబోయే బిడ్డలపై కూడా ఈ ప్రభావం పడనుంది. తల్లిదండ్రులు బాలికలను బాగా చదివించి 18 సంవత్సరాలు నిండిన తరవాతే పెళ్లి చేయాలి.
– డాక్టర్ డి.సంధ్యాదేవి, పీహెచ్‌సీ, మాచవరం, రాయవరం మండలం.
అన్ని రకాల సమస్యలకూ మూలం..
బాల్య వివాహాలు చేయడం అన్ని రకాల సమస్యలకూ మూలం. కుటుంబం, సంసారంపై సరైన అవగాహన లేకపోవడం వల్ల నిత్యం కలహాలు, సమస్యలకు దారితీస్తుంది. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు సమాచారం అందితే వెంటనే స్పందించి అడ్డుకుంటున్నాం.
– వై.సుశీల కుమారి, పీవో, ఐసీడీఎస్, రాజానగరం
తల్లిదండ్రుల్లో మార్పు అవసరం..
బాలికలకు చదువు పూర్తయిన అనంతరం తల్లిదండ్రులు వివాహాలు జరిపించాలి. కిశోరి పథకం కింద బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా 18 ఏళ్లు నిండిన 729 మంది యువతులకు 15 అంశాలపై శిక్షణ ఇచ్చాం. వీరు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలో విద్యార్థినులకు అవగాహన కల్పిస్తున్నారు. బాల్య వివాహాలు జరిగితే 1098కు ఫోన్ చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతారు.
– సీహెచ్ వెంకట్రావు, జిల్లా బాలల సంరక్షణ అధికారి, కాకినాడ.
Comments
Please login to add a commentAdd a comment