నిర్భయ భారత్‌ | Mamata Raghuveer Fight Against Child Marriages | Sakshi
Sakshi News home page

నిర్భయ భారత్‌

Published Mon, Apr 22 2019 12:33 AM | Last Updated on Mon, Apr 22 2019 5:11 AM

Mamata Raghuveer Fight Against Child Marriages  - Sakshi

సమాజం.. మహిళను తన బతుకు తనను బతకనివ్వదా?ముఖ్యంగా మగ సమాజం కళ్లు ఆడవాళ్ల మీదనే ఉంటాయా?ఆడవాళ్లు.. కాకపోతే...ఆ డేగ కళ్లు పసిపిల్లల మీద!!‘అమ్మాయిని భద్రంగా పెంచుకోవాలి... అబ్బాయిని బాధ్యతగా పెంచాలి’.అమ్మానాన్నలు.

ఈ నినాదాన్ని ఒంటపట్టించుని ఉంటే...‘అత్యాచార రహిత భారత్‌’ అనే నినాదం పుట్టాల్సిన అవసరమే ఉండేది కాదు. మరేమిటి పరిష్కారం? ఉద్యమించక తప్పదా?!అవును.. ఉద్యమించకపోతే... మహిళకు జీవితం ఉండని సమాజంలో..ఉద్యమించకపోతే...పిల్లలకు భవిష్యత్తు మిగలని సమాజంలో..ఊపిరిపోసుకున్న మరో ఉద్యమమే‘రేప్‌ ఫ్రీ ఇండియా’.

అత్యాచార రహిత భారతదేశం, అత్యాచార ముక్త్‌ భారత్‌... భాష ఏదైనా నినాదం ఏదైనా భావం ఒక్కటే. అత్యాచారాలు లేని భారతదేశ నిర్మాణం జరగాలి. అత్యాచారాలు జరుగుతున్నాయని ఆవేదన చెందడం కాదు మేధావులు చేయాల్సింది. అత్యాచార బాధితులు న్యాయం కోసం పోరాటం చేయడానికి వెసులుబాటు కల్పించడం కాదు ప్రభుత్వం చేయాల్సింది. ఇంకా విస్తృతంగా చర్చించాలి, ఇంకొంత తీక్షణంగా చర్యలు తీసుకోవాలి. మెదడుకు పట్టిన మకిలిని వదిలించే స్వచ్ఛ భారత్‌ చేపట్టాలి.

సత్యార్థి ఫౌండేషన్‌ చేపట్టిన స్వచ్ఛభారత ఉద్యమమే అత్యాచార రహిత భారత్‌. ఈ లక్ష్యాన్ని సాధించడానికి దేశంలోని ప్రతిరాష్ట్రం నుంచి భావసారూప్యం కలిగిన సామాజిక కార్యకర్తలు కలిసి ఉద్యమిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి గొంతు కలుపుతున్న వారిలో మమతా రఘువీర్‌ ఉన్నారు. ఆమె ‘తరుణి’ స్వచ్ఛంద సంస్థను స్థాపించి బాల్య వివాహాలను అరికడుతున్నారు. ప్రస్తుతం నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత కైలాస్‌ సత్యార్థి స్థాపించిన సత్యార్థి ఫౌండేషన్‌తో కలిసి అత్యాచార రహిత సమాజం కోసం కృషిచేస్తున్నారు.

పిల్లలు దేశ సంపద
‘‘పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. బాల్యం పువ్వులాంటిది. రెక్కలు రాలిపోకుండా అందంగా విచ్చుకుంటేనే వికాసం. అది పువ్వైనా, బాల్యమైనా. పిల్లలను నిర్లక్ష్యం చేస్తే ఆ నష్టం తల్లిదండ్రులకు, ఆ పిల్లల భవిష్యత్తుకు మాత్రమే కాదు. అసలైన నష్టం దేశానిది. బాల్యాన్ని చిదిమేస్తే ఆ పీడన వాళ్లను వెంటాడుతూనే ఉంటుంది. పెద్దయిన తర్వాత కూడా వాళ్ల వ్యక్తిత్వం ఆరోగ్యకరంగా విచ్చుకోదు. వ్యక్తిత్వలోపం ఉన్న సమాజంతో దేశం అభివృద్ధి చెందదు. అందుకే పిల్లల్ని కాపాడుకోవడం అమ్మానాన్నల బాధ్యత మాత్రమే కాదు దేశం బాధ్యత కూడా’’ అన్నారు మమతా రఘువీర్‌. 

మనిషి మారాలి
‘‘మేము డీల్‌ చేసిన కేసులు కొన్ని హృదయవిదారకంగా ఉన్నాయి. ఓ కుటుంబం తిరుమల దర్శనానికి వెళ్లి తిరిగి వస్తోంది. అందరూ తిరుపతిలో రైలెక్కారు. ఎనిమిదేళ్ల పాప బాత్‌రూమ్‌కి వెళ్లాలని అడిగింది. పెద్దవాళ్లెవరూ తోడు వెళ్లకుండా పాపను పంపించారు. బాత్‌రూమ్‌లో పాప మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడో దుండగుడు. పాప అరుపు ఎవరికీ వినిపించలేదు. ఎంతటి దారుణం అంటే.. పాప పేగులు బయటికొచ్చేశాయి. ఆ తర్వాత రెండేళ్ల వరకు కూడా ఆ పాపకు ఆపరేషన్‌లు జరుగుతూనే ఉన్నాయి. ఓ తొమ్మిదేళ్ల కుర్రాడు ఇళ్ల మధ్యలోనే అబ్యూజ్‌కు గురయ్యాడు. అతడు తండ్రితోపాటు ఉదయాన్నే పాల ప్యాకెట్లు వేస్తుంటాడు. అపార్ట్‌మెంట్‌లో తండ్రి ఒక వరుసలో పాలు వేస్తూ కొడుకుని మరో వరుసలో వేయమని పంపించాడు.

ఓ మధ్యవయస్కుడు ఆ కుర్రాడిని ఇంట్లోకి లాగి తలుపేసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ కుర్రాడు ఏడాదిపాటు సెకండరీ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడ్డాడు. ఇదంతా ఒక ఎత్తయితే అఘాయిత్యానికి గురైన బాధితులకు ఐడెంటిఫికేషన్‌ పెరేడ్‌ మరో నరకం. ఒక పాపకయితే మతి చలించినంత పనైంది. ‘ఆ అంకులే అలా చేసింది’ అనే ఒక్క మాట తప్ప మరో మాట మాట్లాడేది కాదు. ఆ బిడ్డను మామూలు స్థితికి తీసుకురావడం ఎలాగో తెలియక ఆ తల్లిదండ్రులు పడిన వేదనను వర్ణించడానికి మాటలుండవు. మరీ చిన్న పిల్లల్లో ఇలా ఉంటే.. టీనేజ్‌లో ఉన్న ఓ అమ్మాయి అబ్యూజ్‌కు గురైన తర్వాత తన దేహాన్ని తాను అసహ్యించుకుంటూ ఆత్మహత్య చేసుకుంది. ఇలాంటివి తెలిసినప్పుడు సమాజం మారాలి... అని చాలా సింపుల్‌గా అనేస్తుంటారు. కానీ నిజానికి మారాల్సింది మనిషి.

విచక్షణగల దేశాలు
లైంగిక వాంఛలు తీర్చుకోవడానికి పిల్లల్ని పావులుగా వాడుకోవాలనే ఆలోచన రావడమే పెద్ద మానసిక లోపం. యూరోపియన్‌ దేశాల్లో ఈ విషయంలో చాలా పరిణతి కనిపిస్తుంది. తమలో అలాంటి ఆలోచనలు కలుగుతుంటే అది మానసిక లోపమని గుర్తిస్తారు. వెంటనే కౌన్సెలింగ్‌కు వెళ్తారు. తమలో ఇటువంటి మానసికలోపం ఉన్నట్లు గుర్తించిన వాళ్లను స్వచ్ఛందంగా పేరు నమోదు చేసుకోవలసిందిగా పిలుపునిచ్చినప్పుడు ఏడాదికి 250 మంది రిజిస్టర్‌ చేసుకున్నారు. మనిషి తనను తాను సంస్కరించుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి.

అంతే తప్ప తమ ఆలోచనలను దాచిపెట్టుకుని పెద్దమనిషి ముసుగు వేసుకుని సమాజంలో గౌరవంగా చెలామణి అవుతూ, అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండి, నిస్సహాయులు దొరకగానే రాక్షసత్వానికి పాల్పడడం వంటి అవాంఛిత ధోరణులు పాశ్చాత్య దేశాల్లో దాదాపుగా కనిపించవు. మహిళలు, పిల్లలు వస్తువులు కాదు, వాళ్లూ మనుషులే అనే సత్యాన్ని గ్రహించగలిగితే మనిషి తనంతట తానే సంస్కరణ చెందుతాడు. ఆ రకంగా సమాజాన్ని సెన్సిటైజ్‌ చేయడం కోసమే ‘రేప్‌ ఫ్రీ ఇండియా’ ఉద్యమం. ఈ ఉద్యమం గత నెలలో మొదలైంది. 

ఐదో తరగతిలో భార్య.. ఏడో తరగతిలో భర్త..!
నేను సోషల్‌ యాక్టివిస్టుగా మారడానికి వేదిక వరంగల్‌లో నివసించడమే. రఘువీర్‌కి హన్మకొండ  పోస్టింగ్‌ వచ్చింది. మేము అక్కడ ఉన్నప్పుడు మహిళా సమతా సొసైటీతో పనిచేశాను. నేను పెరిగిన వాతావరణానికి అక్కడి సామాజిక పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉండేవి. స్కూలు పిల్లల్లో భార్యాభర్తలు కనిపించేవారు. హెల్త్‌ అవేర్‌నెస్‌ పట్ల ఆడపిల్లలను చైతన్యవంతం చేయడానికి ఓ స్కూలుకి వెళ్లినప్పుడు ఐదో తరగతిలో ఉన్న అమ్మాయి మెడలో పుస్తెలు, కాళ్లకు మట్టెలు చూసి ఆశ్చర్యపోయాను. అదేమని అడిగితే తనకు పెళ్లయిందని భర్త అదే స్కూల్లో ఏడో తరగతిలో ఉన్నాడని చెప్పింది. మరికొందరమ్మాయిల విషయంలో అమ్మాయికి పదేళ్లుంటే భర్తకు పాతికేళ్లుంటాయి. అతడు ఎక్కడో ఉద్యోగమో, వ్యవసాయమో చేస్తూ ఉంటాడు. ఈ అమ్మాయిని స్కూలుకి పంపించేది కూడా మెచ్యూర్‌ అయ్యే వరకే.

ఆ తర్వాత అత్తగారింటికి పంపేస్తారు. ఒక అమ్మాయికైతే పెళ్లి పీటల మీద కూర్చోక పోతే, ఐస్‌క్రీమ్‌ ఇచ్చి కూర్చోబెట్టి పెళ్లి చేశారు. 1929లో బాల్య వివాహ నిరోధక చట్టం వచ్చింది. మనదేశంలోని సామాజిక పరిస్థితులను గమనించిన బ్రిటిష్‌ పాలకులు ఈ రుగ్మతను నివారించడానికి చట్టాన్ని తెచ్చారు. కానీ అలాంటి చట్టం ఒకటుందనే ఆలోచనే లేదక్కడ. టీచర్లను అడిగితే ‘ఇక్కడిది మామూలే’ అనేశారు. మనం చేయగలిగిందేమీ లేదనే నిస్పృహ వాళ్ల మాటల్లో! దేహారోగ్యం గురించి చైతన్యవంతం చేయడం కాదు మానసిక ఆరోగ్యం కోసం పని చేయాల్సింది చాలా ఉందనిపించింది. ‘తరుణి’ స్వచ్ఛంద సంస్థ స్థాపించి బాల్య వివాహాలను నివారించడానికి పని చేశాను. 

మూడు నెలలు ప్రచారం
వరంగల్‌ జిల్లా అంతటా పర్యటించి సర్వే చేశాం. బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్న 82 గ్రామాలను గుర్తించి కళాజాతలతో ప్రచారం చేశాం. బాల్య వివాహాల నివారణ గురించి ఆడపిల్లలకు శిక్షణ ఇచ్చి వాళ్ల చేతనే గ్రామసభల్లో మాట్లాడించాం. ఆ జిల్లాలో అప్పుడు నలభై పెళ్లిళ్లు ఆపగలిగాం. అయితే తదనంతర పరిణామాలు కొన్ని చూసిన తరవాత పీటల మీద పెళ్లిళ్లు ఆపడం వల్ల ఉపయోగం ఉండదని తెలిసింది. అప్పటికే డబ్బు ఖర్చయి ఉంటుంది. పెళ్లి కోసం అప్పు తెచ్చి ఉంటారు. పైగా పీటల మీద పెళ్లి ఆగిపోతే మళ్లీ పెళ్లయ్యేదెలా అనే ఆందోళన ఒకటి. దాంతో పెళ్లిని ఆ క్షణానికి ఆపేసి మేమటు వెళ్లగానే ఏ గుళ్లోనో రహస్యంగా మూడుముళ్లు వేయించేసే వాళ్లు. ఆ తర్వాత ఓ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ముందుగా సమాచారం అందుకుని వెళ్లి, పెళ్లి కుదురుతున్న దశలోనే కౌన్సెలింగ్‌ ఇచ్చే వాళ్లం.

ఖాతరు చేయకుండా పెళ్లి చేస్తే కేసవుతుందని కూడా హెచ్చరించేవాళ్లం. అలా ఓ అరవై పెళ్లిళ్ల వరకు ఆపేసి ఆ అమ్మాయిలను మళ్లీ చదువులకు పంపించగలిగాం. అయినప్పటికీ కొంతమంది పెళ్లి చేసేవాళ్లు. అలా జరిగిన పెళ్లిళ్ల విషయంలో 56 కేసులు వేశాం. ఒక్కో కేసులో ఆ పెళ్లి జరిపించిన పురోహితుడి నుంచి గ్రామ ప్రతినిధి వరకు దాదాపుగా పదిహేను మంది మీద కేసులు పెట్టాం. అయితే ఆ కేసుల్లో ఏ ఒక్కరికీ శిక్ష పడలేదు. కానీ బాల్య వివాహాలు చట్టవిరుద్ధం అని, కేసులు పడతాయనే భయం మొదలైంది. 2000 నుంచి ఇప్పటి వరకు మొత్తం పీటల మీద పెళ్లిళ్లు రెండు వేలు, మాటల దశలో ఉండగా ఆపినవి పదిహేను వేలు ఉంటాయి. పెళ్లి కుదుర్చుకుంటున్న ఇళ్లలో ముసలి వాళ్లలో చైతన్యం తీసుకురావడం మంచి ఫలితాలనిచ్చింది.

వెయ్యి అబద్ధాలాడి అయినా ఒక పెళ్లి చేయాలంటారు, కానీ నేను ఇన్ని వేల పెళ్లిళ్లు ఆపానని చెప్పుకోవడం వినేవాళ్లకు నవ్వులాటగా అనిపిస్తుందేమో కానీ నాకు గర్వంగానే ఉంది. ఇప్పుడు మేము చేపట్టిన రేప్‌ ఫ్రీ ఇండియా ఉద్యమాన్ని విజయవంతంగా పూర్తి చేయగలమనే నమ్మకం కూడా ఉంది’’ అన్నారు మమత.దూరదర్శన్‌ నుంచి ‘సప్తగిరి సబల’, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ నుంచి ‘ఉత్తమ కార్యకర్త’, యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ నుంచి ‘ఉమన్‌ ఆఫ్‌ ది హిస్టరీ మంత్‌’ పురస్కారాలను అందుకున్నారు మమతా రఘువీర్‌. యూరప్‌ దేశాల్లో సామాజిక స్థితిగతులను అధ్యయనం చేసిన మమత ప్రస్తుతం హైదరాబాద్‌ నగర పోలీస్‌ శాఖ ఏర్పాటు చేసిన ‘భరోసా’ కమిటీలో సలహాదారుగా, తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థలో సభ్యురాలిగా కూడా సేవలందిస్తున్నారు. 
వాకా మంజులారెడ్డి
ఫొటోలు : జి.అమర్‌

చట్టం కోసం ఎంపీల సంతకాలు
మనదేశంలో జరుగుతున్న అత్యాచారాలు తక్కువేమీ కాదని, మరే దేశంలోనూ ఆ స్థాయిలో జరగడం లేదని గణాంకాలు చెప్తున్నాయి. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో నివేదికలు చూస్తే ఏడాదికి అటూఇటూగా పాతికవేల అఘాయిత్యాలు కనిపిస్తాయి. ఇవి నమోదైన కేసులు మాత్రమే. కేసులు పెట్టకుండా నోరు నొక్కిన సంఘటలను మరెన్నో ఉంటాయి. ఇలాంటి తరుణంలో ‘అత్యాచార ముక్త్‌ భారత్‌’ ఉద్యమం అవసరం ఎంతో ఉంది. అక్రమ రవాణా నిరోధక బిల్లు పార్లమెంట్‌లో పెండింగ్‌లో ఉంది. ఈ బిల్లు చట్టసభల ఆమోదం పొంది చట్టంగా రూపొందాలి. ఇండియన్‌ పీనల్‌ కోడ్, 1860, ద ట్రాఫికింగ్‌ ఆఫ్‌ పర్సన్‌ (ప్రివెన్షన్, ప్రొటెక్షన్‌ అండ్‌ రీహాబిలిటేషన్‌) బిల్, 2018 ప్రకారం అక్రమ రవాణా నేరానికి పాల్పడితే శిక్షలు కఠినంగా ఉంటాయి. ఒక వ్యక్తిని అక్రమంగా రవాణా చేసిన నేరానికి ఏడు నుంచి పది సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా ఉంటాయి.

ఇద్దరు అంతకంటే ఎక్కువ మందిని రవాణా చేస్తే పదేళ్లు జైలు, జరిమానా. ఒక మైనర్‌ బాలికను అక్రమంగా తరలించినప్పుడు పదేళ్ల నుంచి జీవిత ఖైదు, జరిమానా ఉంటాయి. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది మైనర్‌లను అక్రమంగా రవాణా చేసినప్పుడు జీవిత ఖైదు, జరిమానా ఉంటాయి. అక్రమ రవాణాకు పాల్పడిన వ్యక్తి ప్రజా ప్రతినిధి లేదా ప్రభుత్వ ఉద్యోగి అయితే శిక్ష మరింత కఠినంగా ఉంటుంది. ఇంతటి కీలకమైన బిల్లు చట్టంగా రూపొందితే మహిళలు, బాలికల పట్ల అఘాయిత్యాలు గణనీయంగా తగ్గిపోతాయి. ఆ బిల్లు పాస్‌ కావలసి ఉంది. ఈ ఉద్యమ కార్యకర్తలు ‘రేప్‌ ఫ్రీ ఇండియా ఉద్యమంలో మా వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాం’ అని పార్లమెంటు సభ్యులందరి చేత సంతకాలు చేయిస్తారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఎన్నికల బరిలో దిగిన ప్రధాన పార్టీల అభ్యర్థుల సంతకాల సేకరణ కొన్ని రాష్ట్రాల్లో మొదలైంది. 

న్యాయం కోసం ‘నీలా’
నేను పుట్టింది నల్గొండ, పెరిగింది హైదరాబాద్‌లో. నాన్న డిస్ట్రిక్ట్‌ జడ్జి, అమ్మ జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్స్‌లో ప్రొఫెసర్‌. ఎమ్మెస్సీలో ఉన్నప్పుడు రఘువీర్‌తో పెళ్లయింది. ఆయన ఐఎఫ్‌ఎస్‌ ఆఫీసర్‌. సివిల్స్‌ రాయాలనే నా కోరికకు పెళ్లి కారణంగా ఫుల్‌స్టాప్‌ పడలేదు. ప్రిపరేషన్‌ కంటిన్యూ చేశాను. కానీ పిల్లల కారణంగా పరీక్షలు రాయలేకపోయాను. పెళ్లి తర్వాత న్యాయశాస్త్రం, హ్యూమన్‌ రీసోర్స్‌ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లమో, ఎంబీఏ చేశాను.

పిల్లలు పెద్దయిన తర్వాత నాకిష్టమైన సోషల్‌ వర్క్‌ మీద దృష్టి పెట్టాను. స్వచ్ఛంద సంస్థలలో పని చేశాను. తరుణి సంస్థను స్థాపించి బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, మహిళలపై లైంగిక వేధింపులు రూపు మాపడానికి పని చేస్తున్నాను. ‘నీలా’ (నెట్‌వర్క్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ లీగల్‌ యాక్టివిస్ట్‌) ద్వారా న్యాయసహాయం అందిస్తున్నాను. ఇప్పుడు సత్యార్థి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో చందనతో కలిసి రేప్‌ ఫ్రీ ఇండియా ఉద్యమాన్ని చేపట్టాను.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement