శారా, రేచెల్, రూతు, మేరీ, సలోమి... లాంటి బైబిల్ స్త్రీల పేర్లున్న వాళ్ళు మనకు కనిపిస్తారు కానీ రాహాబు అనే పేరు కూడా బైబిల్ స్త్రీదే అయినా ఆ పేరు మనకు వినిపించదు. ఎందుకంటె ఆమె యెరికో పట్టణానికి చెందిన ఒక వేశ్య. నిజమే, ఒక వేశ్య పేరు ఎవరు పెట్టుకుంటారు? సమాజం అత్యంత హీనమైన జాతికి చెందిన స్త్రీల జాబితాలో రాహాబును ఆమె వృత్తిని బట్టి చేర్చింది కాని యెరికోలో ఆమె చేసిన పరిచర్యను బట్టి, దేవుడామెను కొత్తనిబంధనలో అబ్రాహాము, నోవహు, ఇస్సాకు, యాకోబు, దావీదు వంటి మహా విశ్వాసవీరులతో సమానంగా వారి జాబితాలో చేర్చి అత్యున్నతమైన జాతికి చెందిన స్త్రీగా హెచ్చించాడు (హీబ్రు 11:31). ఇశ్రాయేలీయులైన ఇద్దరు విశ్వాసులు యెరికో పట్టణానికి వేగు చూసేందుకు వస్తే వారికి తన ఇంట్లో ఆశ్రయమిచ్చి, యెరికోపై విజయం సాధించడానికి అవసరమైన సమాచారాన్ని, స్ఫూర్తిని అందించి సహకరించింది రాహాబు.
నిజానికి ఆ కాలంలో, శత్రువులైన వేగుల వాళ్ళపై ఒక కన్నేసి, వారి సమాచారాన్ని రాజుగారికి అందిస్తూ వారిని అప్పగించే నియమం వేశ్యలకుండేది. అందుకు వారికి బోలెడు బహుమతులు, నగదు దొరికేది.. అందువల్ల రాహాబు ఎదుట ఆనాడు రెండు మార్గాలున్నాయి. ఆ ఇద్దరు వేగులనీ యెరికో రాజుకు అప్పగించి ఆర్థికంగా లాభపడి, రాజుగారి చేత ’శభాష్’ అనిపించుకోవడం మొదటిదైతే, వారిని దాచిపెట్టి, కాపాడి, వారికవసరమైన సమాచారాన్నిచ్చి, రాబోయే ఇశ్రాయేలీయుల దండయాత్రలో మృత్యువాత పడకుండా తనను, తన వారిని కాపాడుకోవడమనేది రెండవమార్గం. లోకపరంగా ఆలోచిస్తే మొదటిమార్గంలో బోలెడులాభముంటే, రెండో మార్గంలో బోలెడు నష్టముంది, పైగా ప్రాణహాని కూడా ఉంది. వేగులవాళ్ళు తన ఆతిథ్యం పొంది వెళ్లారన్న విషయం తెలిసిన మరుక్షణం యెరికో రాజు తనకు మరణశిక్ష విధించే ప్రమాదం ఎంతో ఉంది.
ఆమె స్థానంలో ఉంటే మనమేం చేస్తాం? డబ్బుకోసం కాకపోయినా, ప్రాణగండం నుండి తప్పించుకునేందుకైనా, నా ఓటు రాజుగారికే అంటాం. దేవుని కోసం, ఎప్పుడో ఎవరో మన పట్టణాన్ని గెలిచినప్పుడు. వాళ్ళు మనల్ని చంపకుండా ఉండేందుకు, ఇప్పుడు ప్రాణాలకు ‘రిస్కు’ తెచ్చుకోవడం అవివేకమనుకుంటాం. దేవుని పనిని గాలికొదిలేసి, చేతికందిన అవకాశాన్ని వాడుకొని, అందినంత సంపాదించి మనల్ని మించిన తెలివైన వారు లేరనుకుంటాం.ఏది చేపట్టినా ఇందులో మనకెంత లాభం? అని మాత్రమే ఆలోచించే సమాజంలో, ప్రాణాలకు ముప్పు తెచ్చుకొని మరీ వేగులవాళ్ళను కాపాడి యెరికో జైత్రయాత్రలో తనదంటూ ఒక పరోక్ష పాత్రను పోషించాలన్న నిర్ణయం తీసుకున్న రాహాబు లాంటి వాళ్ళు పిచ్చివాళ్ళు, నష్టజాతకులు, తెలివితక్కువదద్దమ్మలే!!! జీవితమంతా అప్రతిష్టతో వేశ్యగా బతికిన రాహాబు ముంగిటికి దేవుడొక జీవితకాలపు సువర్ణావకాశాన్ని ఆనాడు తెచ్చిపెట్టాడు.
రాహాబు ఆ అవకాశాన్ని రెండు చేతులతో ఒడిసిపట్టుకుని, జీవితమంతా తాను అపవాది గుప్పిట్లో బతికినా, ఇకనుండైనా దేవుని పక్షంగా ఆయన ప్రియమైన కుమార్తెగా బతుకుతానని నిర్ణయించుకొని ధైర్యంగా ముందుకు సాగి జీవన సాఫల్యాన్ని పొందింది. అలా తననీ, తన కుటుంబాన్నీ దేవుని కృపావలయంలో నిలబెట్టి ఆశీర్వాదాలు పొందింది. చివరికి తన వంశావళిలోనే దేవుడామెను చేర్చాడంటే, ఆమెను, ఆమె పరిచర్యను ఎంతగా ప్రేమించాడో మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని పిల్లలమని చెప్పుకొంటూ ఒక్కరోజైనా, ఒక్కటైనా దేవుణ్ణి ప్రసన్నపర్చే పనిచెయ్యకుండా, దేవునిపక్షం వహించకుండా తటస్థంగా, నామకార్థంగా బతకడంకన్నా, రాహాబులాగా ప్రాణాలకు తెగించి ఒక్కరోజైనా దేవుని పక్షంగా నిలబడటం ఎంత మహా భాగ్యమో తెలిపే గొప్ప ఉదంతమిది.
క్రియలులేని విశ్వాసం మృతమని బైబిల్ స్పష్టంగా చెబుతూ ఉంటే, కేవలం చర్చలు, ప్రసంగాలు, ప్రగల్భాలు, సిద్ధాంతాలు, కొత్తభాష్యాలు, వివరణలతో పరలోకానికి వెళ్లిపోదామనుకోవడం కేవలం ఒక భ్రమ. కాణీ ఖర్చు, రవ్వంత ‘రిస్కు’ లేకుండా దేవునిసేవ ‘బహు గొప్పగా’ చేసి, పరలోకంలో ప్రథమ స్థానాన్ని కొట్టేయాలన్నది చాలామంది ప్రయాస. రాహాబునే రక్షించిన దేవుడు నన్ను రక్షించడా? అనుకోకుండా. నన్నే రక్షించిన దేవుడు రాహాబును రక్షించడా? అనుకునే తగ్గింపుతో కూడిన జీవిత విధానం మాత్రమే మనల్ని దేవుని సర్వసత్యానికి దగ్గరగా తీసుకెళ్తుంది, అంటే రాహాబులాంటి పాపిని నేను కాదని అతిశయించడం కాదు, నావంటి పాపి ఈ లోకంలోనే లేడు అనుకోవడం వల్ల పరలోకం మనకు మరింత దగ్గరవుతుంది.
– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్
Comments
Please login to add a commentAdd a comment