
కిరణ్‌బేడీ
ఇంట్లో ఆడపిల్లలకు జాగ్రత్త చెబితే ఆ పిల్ల ఒక్కటే సురక్షితంగా ఉంటుంది. ఇంట్లో మగపిల్లవాడిని.. ‘జాగ్రత్త’ అని హెచ్చరిస్తే బయటి ఆడపిల్లలంతా సురక్షితంగా ఉంటారు. ‘దిశ’ ఘటన తర్వాత అమ్మాయిల భద్రత కోసం అనేక మంది అనేక విధాలైన సలహాలు ఇస్తున్నారు. అందులో ఇదీ ఒకటిలా అనిపించవచ్చు. అయితే మిగతా సలహాల కన్నా ఇది ఫలవంతమైనది. ఇప్పటికిప్పుడు కాకపోవచ్చు. ఒక జనరేషన్ మగపిల్లల్ని తల్లిదండ్రులు నియంత్రణలో పెంచితే.. ఇప్పుడు చాలామంది అంటున్నట్లు, ఆశిస్తున్నట్లు.. సమాజంలో మార్పు వస్తుంది. సమాజంలో మార్పు రావడం అంటే ఇంట్లో అబ్బాయిల్ని సంస్కారవంతంగా పెంచడం. ఈ సూచన ఇచ్చినవారు పుదుచ్ఛేరి గవర్నర్ కిరణ్ బేడీ.
‘‘తల్లిదండ్రులకు ఆడపిల్లల్ని మాత్రమే హద్దుల్లో పెంచడం తెలుసు. ఆ హద్దుల్నే మగపిల్లలకు ఏర్పరిస్తే, వాళ్ల ప్రవర్తనను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటే మహిళలపై నేరాలు వాటంతటవే తగ్గిపోతాయి’’ అని బేడీ అన్నారు. ఆవిడే ఇంకో సలహా కూడా ఇచ్చారు. పరీక్షల కోసం చదువులు కాకుండా.. విలువల కోసం విద్య అనే విధానం రావాలి అన్నారు. మరి దోషుల్ని శిక్షించడంపై బేడీ ఏమన్నారు? ‘శిక్ష తీవ్రంగా ఉండాలి. తప్పు చేసినవాళ్లకే కాదు, తప్పు చేయాలన్న ఆలోచన రాబోయిన వారు కూడా ఆ శిక్ష గుర్తొచ్చి హడలెత్తిపోవాలి అన్నారు కిరణ్ బేడీ. ‘దిశ’ దారుణ ఘటనపై స్పందించమని అడిగినప్పుడు ఆమె ఇలా అన్నారు.