ఒక్కరే సంతానమా?! | IHD Survey Report Included Some Useful Tips For Parents | Sakshi
Sakshi News home page

ఒక్కరే సంతానమా?!

Published Mon, Jan 6 2020 1:32 AM | Last Updated on Mon, Jan 6 2020 1:32 AM

IHD Survey Report Included Some Useful Tips For Parents - Sakshi

పై చదువులు, ఉద్యోగాల పేరుతో చాలా జంటలు ఒక్క సంతానానికే మొగ్గు చూపుతున్న ధోరణి సమాజంలో నేటికీ కొనసాగుతూనే ఉందని తాజాగా ‘ఇండియా హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌’ (ఐహెచ్‌డి) సర్వే వెల్లడించింది. ఒకే సంతానంగా ఉన్నవాళ్లు ఎప్పుడూ ఒంటరితనంతో బాధపడటమే కాక, తోబుట్టువులు ఉన్నవారితో పోల్చితే ఒంటరి పిల్లలు నలుగురితో సరిగా కలవలేరన్న సామాజిక అభిప్రాయానికి కూడా ప్రాధాన్యం ఇస్తూ.. తల్లిదండ్రులకు ఉపయోగపడే కొన్ని సూచనలను కూడా ఐహెచ్‌డి తన సర్వే నివేదికలో పొందుపరిచింది. మీరు కూడా ఒకే సంతానం కలవారైతే మీరు ఈ సూచనల గురించి తప్పక తెలుసుకోవలసిందే.

స్నేహితులను పెంచుకోనివ్వాలి
తల్లిదండ్రులుగా మీరు మీ ఒకే ఒక్క బిడ్డ పట్ల శ్రద్ధ చూపుతూనే ఉండవచ్చు. అయితే కనిపించని ఆ ఒంటరితనం వెనక ఒక నిర్వికార స్థితి మొదలవకుండా చూడవలసింది కూడా మీరే. మీ బాబు / పాప వీలైనన్ని సామాజిక సమావేశాలకు హాజరయ్యేలా, స్నేహితులను పెంచుకునేలా చూడండి. నలుగురిలో కలవడం కోసం ఉదయం, సాయంత్రం మీ బిడ్డను పార్క్‌లో తిరగడానికి తీసుకెళ్లండి. తరచుగా బంధువులతో కలిసేలా, వేడుకలలో పాల్గొనేలా అవకాశం ఇవ్వండి. జాగ్రత్త పేరుతో అతిగా ర క్షణలో ఉంచాలనుకోవద్దు. వారికి స్నేహితులున్న ప్రదేశాలలో కొంతసేపు గడిపేలా అవకాశం ఇవ్వండి. వేసవి శిబిరాల్లో చేర్చండి.

నియమాలు బాగుండాలి
అమ్మాయి / అబ్బాయి మీ మొదటి ఏకైక సంతానం అయినందున మీ పిల్లలు తమ ప్రతి ఉత్సాహాన్ని మీతో పంచుకోవడానికి మొగ్గుచూపుతారు. దానిని నిరుత్సాహపరచకండి. అలా చేస్తే ‘లిటిల్‌ ఎంపరర్‌ సిండ్రోమ్‌’ అనే ఒక ప్రవర్తన వల్ల తల్లిదండ్రులతో వారు ఒక ఆదేశపూరిత బంధాన్ని మాత్రమే ఏర్పరచుకుంటారు. కాబట్టి మీ బిడ్డ అంచనాలను నిజం చేయడానికి, ఇతర అవసరాలకు ప్రతిస్పందనగా ఉండటానికి కొన్ని నియమాలు పెట్టుకోండి. అయితే ఆ నియమాలు ఆ బిడ్డను కట్టడి చేయాలనే ఆలోచన మాత్రంతో కాదని గ్రహించాలి.

‘షేర్‌ అండ్‌ కేర్‌’ తప్పనిసరి
ఒకే బిడ్డ భిన్నమైన సర్దుబాట్లు చేసుకోవడం కష్టం అని నిపుణుల అభిప్రాయం. ఫలితంగా వాళ్లు తమకు తాము కొన్ని కఠినమైన అభిప్రాయాలను ఏర్పరుచుకుంటారు. ఇతరుల పట్ల తక్కువ సానుభూతిని చూపిస్తారు. దీన్ని నివారించడానికి జట్టుగా ఉండటంలోని బలం ఏమిటో మీ బిడ్డ  తెలుసుకునేలా చేయాలి. అందుకు పాఠశాల, ఇతర చోట్ల జట్టు కార్యకలాపాల్లో భాగం కావాలని వారిని ప్రోత్సహించాలి. అలాగే, ఆ సింగిల్‌ చైల్డ్‌ను తనకు ఇష్టమైన కొన్ని బొమ్మలను స్నేహితులతో, బంధువుల పిల్లలతో పంచుకోనివ్వాలి.
– ఆరెన్నార్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement