సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో బాల్యవివాహాలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. అధికారులు ఎంత ప్రచారం చేసినా బాల్య వివాహాలు మాత్రం తగ్గట్లేదు. 15 ఏళ్లు నిండకుండానే చిన్నారులు వివాహ బంధంతో మెట్టినింట కాలుపెట్టి కుటుంబ భారాన్ని భుజాన వేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఇప్పటివరకు రాష్ట్ర్‌ర వ్యాప్తంగా 3,342 బాల్యవివాహాలకు అడ్డుకట్ట వేసినా పరిస్థితిలో మార్పు రావట్లేదు. బాల్య వివాహాలకు ఆర్థిక అసమానతలే కారణమని భావించినా.. చదువుకుని, ఆర్థికంగా నిలదొక్కుకున్న కుటుంబాల్లో కూడా ఇలాంటి పరిస్థితులే ఉండటం ఆందోళన కలిగించే విషయం. హైదరాబాద్‌లోని ఒక కార్పొరేట్ స్కూల్‌లో చదివే 14 ఏళ్ల అమ్మాయి తల్లిదండ్రులకు 42 ఏళ్ల వ్యక్తి డబ్బు ఆశ చూపించి పెళ్లి నిశ్చయం చేసుకున్నారు. పదో తరగతిలో 9.8 జీపీఏ సాధించిన అమ్మాయికి 30 ఏళ్ల వ్యక్తితో పెళ్లి చేయాలని నిశ్చయించడంతో సమాచారం అందుకున్న బాలల హక్కుల సంఘం కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి ఆ వివాహాన్ని అడ్డుకున్నారు.
తెలంగాణలో పెరిగాయి..
గతేడాది జాతీయ నేర సమగ్ర సర్వే (ఎన్‌సీఆర్‌బీ) లెక్కల ప్రకారం తెలంగాణలో 18 శాతం బాల్య వివాహాలు పెరిగాయి. రాష్ట్రంలో 19 ఏళ్లలోపు తల్లులైన వారు 38 శాతం ఉన్నారు. ఆడవాళ్లకే కాదు.. మగవాళ్లకి కూడా 21 ఏళ్లు నిండకుండానే పెళ్లిళ్లు చేస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి, జిల్లాలతో పాటు హైదరాబాద్‌కు ఆనుకుని ఉన్న గ్రామాల్లోనూ బాల్య వివాహాలు జరుగుతుండ టం బాధాకరం. దేశవ్యాప్తంగా జరుగుతున్న బాల్య వివాహాల్లో 85 శాతం పేదరికం వల్లే జరుగుతున్నాయని సర్వేలు చెబుతున్నాయి.
శారీరక సమస్యలు..
చిన్న వయసులో పెళ్లి చేయడం వల్ల అమ్మాయిలకు ప్రసవం సమయంలోఇబ్బందులు ఉంటాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నా పరిస్థితుల్లో మార్పు రావట్లేదు. దీంతో తప్పని పరిస్థితుల్లో సిజేరియన్ చేస్తుండటంతో భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు ఉంటాయని చెబుతున్నారు. ప్రజల్లో బాల్య వివాహాలపై అవగాహన పెంచాల్సిన ఐసీడీఎస్ అధికారులకే దీనిపై అవగాహన లేకపోవడం కూడా మైనర్ వివాహాలకు కారణం అవుతోంది. గ్రామస్థాయిలో కమిటీలు బలోపేతం చేసి మరిన్ని అవగాహన కార్యక్రమాలు చేపడితే పరిస్థితులు కొంతవరకు మారే అవకాశం ఉంటుంది. బాల్యవివాహాలు అరికట్టేందుకు 2012లో ప్రభుత్వం 1098 టోల్‌ఫ్రీ నంబర్ అందుబాటులోకి తెచ్చింది. ఫోన్ చేయగానే చైల్డ్ కనెక్టింగ్ సెంటర్ సిబ్బంది రిసీవ్ చేసుకుంటారు. సీసీసీ నుంచి జిల్లా కేంద్రంలోని ఐసీడీఎస్ కు కాల్ ఫార్వర్డ్ అవడంతో అధికారులు రంగంలోకి దిగి సమస్య పరిష్కరిస్తారు.
ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు
పేదరికాన్ని ఆసరా చేసుకుని, అందంగా ఉందని, పిల్లల కోసం, ఇతరత్రా కారణాలతో మైనర్ బాలికలను రెండో పెళ్లి చేసుకుంటున్న ఘటనలు తరచుగా కన్పిస్తున్నాయి. బాల్యవివాహాల నిరోధక చట్టం అమలు సరిగా జరగకపోవడం, క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడంతోనే బాల్య వివాహాలు పెరుగుతున్నాయి.
ృ అచ్యుతరావు, బాలల హక్కుల
సంఘం అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment