వాట్‌శాపం..  పెనుభూతం | Whatsapp is now a curse and a ghost | Sakshi
Sakshi News home page

వాట్‌శాపం..  పెనుభూతం

Published Thu, Dec 13 2018 12:00 AM | Last Updated on Thu, Dec 13 2018 12:00 AM

Whatsapp is now a curse and a ghost - Sakshi

అనుమానం పెనుభూతం అంటారు. వాట్సాప్‌ ఇప్పుడు శాపంలా, భూతంలా తయారైంది!భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తెస్తోంది. వీళ్ల అపోహల్ని, అపార్థాల్నీ చూస్తుంటే..పెళ్లి ముందా... అనుమానం ముందా.. అనే డౌట్‌ వస్తోంది.ఏది ముందైనా.. నమ్మకం వాటికి ముందుంటే...దంపతులను ఈ వాట్సాప్‌లు శపించలేవు.భూతాలై ఆలూమగల అనురాగాన్ని  కబళించలేవు. ఇదే ఈవారం మైండ్‌ స్టోరీ. ‘డాక్టర్‌ ఇదీ కేసు’ అన్నాడు 

భార్యాభర్తలు వారిరువురూ. ఆమె పేరు సంధ్య. అతడి పేరు విజయ్‌. పదేళ్లయ్యింది పెళ్లయ్యి. ఆమె ఇంట్లో ఉంటుంది. అతడు ఆఫీసుకు వెళతాడు. వాళ్లకో పాప. మూడో క్లాస్‌ చదువుతోంది. సంధ్య ఉదయాన్నే లేచి పాపను నిద్రలేపి స్కూల్‌కు రెడీ చేస్తుంది. విజయ్‌ ఈలోపు కొంచెం టీ పెట్టుకొని తాగి పాపను స్కూల్‌ బస్‌లో చేరవేస్తాడు. పాప వెళ్లిపోయాక విజయ్‌ రెడీ అయ్యేంత సేపు వాళ్లు గతంలో బాగా కబుర్లు చెప్పుకునేవారు. విజయ్‌ బాగా నవ్విస్తాడు. సంధ్య బాగా నవ్వుతుంది. బ్రేక్‌ఫాస్ట్‌ చేసే సమయంలో ఈ పక్క ఫ్లాట్‌ వాళ్ల మీదో ఆ పక్క ఫ్లాట్‌ వాళ్ల మీదో ఏవో జోకులు నడుస్తాయి. ఆ తర్వాత అతను ఆఫీసుకు వెళ్లిపోతాడు. ఆమె ఇంటి పనుల్లో పడుతుంది. అయితే ఈ మధ్య బ్రేక్‌ఫాస్ట్‌ కబుర్లు నడవడం లేదు.ఆ సమయంలో ఇద్దరూ ఫోన్‌ చూసుకుంటూ ఉంటారు.అపార్ట్‌మెంట్‌లో ఉన్న 70 ఫ్లాట్లలోని ఆడవాళ్లందరూ ఒక గ్రూప్‌ పెట్టుకున్నారు. సంధ్య ఆ గ్రూప్‌లో బిజీగా ఉంటుంది. అది కాకుండా సంధ్య వాళ్ల పుట్టింటి గ్రూప్‌ ఒకటి ఉంది. ఆ తర్వాత కాలేజీ ఫ్రెండ్స్‌ గ్రూప్‌ ఒకటి ఉంది. ఇవి కాకుండా తెలిసినవాళ్లతో పిచ్చాపాటి చాటింగ్‌ కూడా ఉంటుంది.విజయ్‌ కూడా వాట్సాప్‌లో తక్కువ తినలేదు. ఆఫీస్‌ గ్రూప్‌ ఒకటి తప్పనిసరి. ఇది కాకుండా అతడికి చేపలు పట్టడం సరదా. రెండు మూడు వారాలకు ఒక గ్రూప్‌తో కలిసి చుట్టుపక్కల చెరువులకు, ఒక్కోసారి చాలా దూరం వెళ్లి నదుల ఒడ్డున చేపలు పడుతుంటాడు. అదో గ్రూప్‌ ఉంది. జోకుల గ్రూపులు కొన్ని ఉన్నాయి. ఆయుర్వేదం గ్రూప్‌ ఒకటి.ఈ గ్రూపుల్లోని బ్లింక్‌లతోటే కాలం గడుస్తూ ఉంది.కాలం అలాగే గడిచినా సమస్యలేమీ లేకపోవు.కానీ ఈలోపు ఉన్నట్టుండి ఒకరోజు సంధ్య స్నేహితురాలు భార్గవి సంధ్య ఇంటికి వచ్చింది. సమస్య అక్కణ్ణుంచే మొదలైంది.

‘ఓ... ఎంత బాగుందో మీ ఇల్లు’ అంది భార్గవి సంధ్య ఇంటిని చూస్తూ.‘ఇందులో నా టేస్ట్‌ కన్నా మా ఆయన టేస్టే ఎక్కువ’ అంది సంధ్య గర్వంగా.‘అబ్బో.. అంత మంచి టేస్ట్‌ ఉన్న మీ ఆయన్ను పరిచయం చేసుకోవాల్సిందే’ అంది భార్గవి.అది సాయంత్రం వేళ కావడం, ఆ రోజు విజయ్‌ అనుకోకుండా తొందరగా ఇల్లు చేరడంతో భార్గవికి విజయ్‌ని పరిచయం చేసింది సంధ్య.‘ఓ... మీరు కూడా గులాబీ టీమేనా?’ అన్నాడు నమస్తే పెడుతూ విజయ్‌.భార్గవి ఉలిక్కి పడింది.‘లె..లె..లేదే’‘మాకు తెలుసులేండీ. సంధ్య చెప్పింది. గులాబీ సినిమా చూసి ముక్కు మొహం తెలియనివారికి ఫోన్‌ చేసి ప్రేమిస్తున్నామంటూ ఏడిపించేవారంట గదా మీ ఫ్రెండ్సంతా. మీరా టీమ్‌లో లేరా?’‘నిజానికి ఆ అల్లరి మొదలెట్టిందే ఈ పిల్ల’ అంది సంధ్య.‘ఆ రోజుల్లో అంటే మీ అల్లరి నడిచింది. ఇప్పుడైతే ఏ నంబర్‌ నుంచి చేస్తున్నారో క్షణాల్లో తెలిసిపోతుంది’ నవ్వుతూ అన్నాడు విజయ్‌.‘తెలియని వాళ్లతో ఎందుకండీ. తెలిసినవాళ్లతోనే బోల్డన్ని కబుర్లు చెప్పుకోవచ్చు ఇప్పుడు. అన్నీ ఫ్రీ సిమ్‌లు. వైఫైలు. వాట్సాప్‌లు’ భార్గవి కూడా నవ్వింది.వాళ్లు ఈ ఊరు కొత్తగా వచ్చారట. దొరక్క దొరక్క సంధ్య దొరకడంతో తరచూ రాకపోకలు సాగాయి. సంధ్య ఊరికే ఉండకుండా ‘ఒక్కోసారి ఫోన్‌ ఎక్కడో పెట్టి మర్చిపోతుంటాను. ఎందుకైనా మంచిది మా వారి నంబర్‌ కూడా పెట్టుకో’ అని విజయ్‌ నంబర్‌ ఇచ్చింది.‘మీ ఫ్రెండ్‌ మెసేజ్‌ పెట్టింది. బావగారూ ఇవాళ సంధ్య దోసకాయ కూర చేసిందట. మీకు పస్తే. దానికా కూర చేయడం రాదు’ అని నవ్వాడు విజయ్‌.‘దానికి వంకాయ కూర చేయడం కూడా రాదు. నాకు వంకలు పెడుతుందా’ సంధ్య కూడా నవ్వింది.‘మీ ఫ్రెండ్‌ బర్త్‌ డే విషెస్‌ చెప్పింది. పార్టీ కావాలట’‘దాందేముంది పచ్చిమిరపకాయ పులుసు రెడీగా ఉందని చెప్పండి’ సంధ్య జోక్‌గా అంది.వెంటనే  భార్గవి వాట్సాప్‌ అకౌంట్‌లో విజయ్‌ పచ్చిమిరపకాయల గంప ఫొటో పెట్టి స్మైలీ పెట్టాడు.

ఒకరోజు విజయ్‌ ఫోన్‌ను క్యాజువల్‌గా చూస్తూ ఉంది సంధ్య. ఫోల్డర్‌లో భార్గవి ఫొటో కనిపించింది. ఆశ్చర్యపోయింది. భార్గవి ఫొటో విజయ్‌ ఫోన్‌లో ఎందుకు ఉన్నట్టు?‘భార్గవి ఫొటో ఉందేంటి?’‘నీకు పెట్టబోయి నాకు పెట్టిందట. డిలీట్‌ చేసేలోపే నా ఫోల్డర్‌లో పడిపోయినట్టుంది’ అన్నాడు విజయ్‌ క్యాజువల్‌గా.సంధ్యకు కూడా గుర్తొచ్చింది అదే ఫొటోను తనకు కూడా పెట్టింది భార్గవి. కానీ ఎందుకో చిన్న అనుమానం.చిన్నదా?ఆ రోజు నుంచి సంధ్య గూఢచర్యం పెరిగింది. విజయ్‌ స్నానానికి వెళ్లినప్పుడు, వాకింగ్‌కు వెళ్లినప్పుడు, లేదా పాపను తీసుకుని కిందకు వెళ్లినప్పుడు ఫోన్‌ చెక్‌ చేసేది. వాట్సాప్‌లో భార్గవి అకౌంట్‌ ఓపెన్‌ చేసి చూసేది. గుడ్‌ మార్నింగ్‌ అని, నమస్తే అని, హ్యాపీ శాటర్‌డే అని ఇలాంటి మెసేజ్‌లు ఉండేవి. ఒక్కోసారి చాట్‌ క్లియర్‌ చేసినట్టుగా క్లీన్‌గా ఏ మెసేజ్‌ కనిపించేది కాదు. అంటే మాట్లాడుకుని చాట్‌ డిలీట్‌ చేశారా? అసలు వాళ్లు మాట్లాడుకునే ఉండకపోవచ్చు కదా అని ఆమె అనుకునేది కాదు.


విజయ్‌ సైకియాట్రిస్ట్‌తో సంధ్యను తీసుకొచ్చి.తల ఒంచుకుని కూచున్న సంధ్య వెంటనే తల ఎత్తి ‘డాక్టర్‌ వాళ్లిద్దరికీ సంబంధం ఉంది. అది బయటపడకుండా ఉండటానికి నాకు పిచ్చి అనే ముద్ర వేసి మీ దగ్గరకు తీసుకొచ్చాడు ఈ దుర్మార్గుడు’  అంది.‘కొత్త ఫోన్‌ చాలా బాగుందండీ. థ్యాంక్యూ’‘నీ కోసమే కొన్నానోయ్‌. వాట్సాప్‌లో మాట్లాడుకోవచ్చుగా’‘అవును. అన్నింటికీ ఫోన్‌ చేయడం ఎందుకూ?’‘ఇక అన్నం పెడతావా?’‘అన్నం పెడతాను. దానికి ముందు హగ్‌ కూడా ఇస్తాను’ఆమె నవ్వేసింది. అతడు దగ్గరకు తీసుకున్నాడు.


రాను రాను సంధ్యకు ఈ అనుమానం ముదిరింది.ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడల్లా తన ఫోన్‌లో వాట్సప్‌కు వెళ్లేది. అందులో విజయ్‌ అకౌంట్‌ చూసేది. లాస్ట్‌ సీన్‌ టైమ్‌కు, భార్గవి అకౌంట్‌లోని లాస్ట్‌ సీన్‌ టైమ్‌కు పొంతన లేకపోతే సంతృప్తిగా ఊపిరి పీల్చుకునేది. అవి రెండూ దగ్గర దగ్గరగా ఉంటే కలవర పడేది.ఇంకా ఘోరమైన విషయం ఎప్పుడు మొదలైందంటే ఒకరోజు విజయ్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేస్తే ఆన్‌లైన్‌లో ఉన్నట్టుగా కనిపించింది. వెంటనే భార్గవి అకౌంట్‌ కూడా ఓపెన్‌ చేసింది. అదీ ఆన్‌లైన్‌ అని చూపిస్తూ ఉంది. ఒకేటైమ్‌లో ఆన్‌లైన్‌లో ఉన్నారంటే వీళ్లిద్దరూ చాటింగ్‌లో ఉన్నట్టేగా?ఆ క్షణమే ఆమె స్పృహ తప్పి పడిపోయింది.‘డాక్టర్‌ ఇదీ కేసు’ అన్నాడు విజయ్‌ సైకియాట్రిస్ట్‌తో సంధ్యను తీసుకొచ్చి.తల ఒంచుకుని కూచున్న సంధ్య వెంటనే తల ఎత్తి ‘డాక్టర్‌ వాళ్లిద్దరికీ సంబంధం ఉంది. అది బయటపడకుండా ఉండటానికి నాకు పిచ్చి అనే ముద్ర వేసి మీ దగ్గరకు తీసుకొచ్చాడు ఈ దుర్మార్గుడు’ అంది.‘మీరు బయటకెళ్లండి’ అన్నాడు విజయ్‌తో.ఆ తర్వాత సంధ్యతో మాట్లాడటం మొదలెట్టాడు.

‘చూడమ్మా... నీ భర్త సంగతి తర్వాత ఆలోచిద్దాం.. ముందు నువ్వు నీ స్నేహితురాలిని అవమానిస్తున్నావని అనుకోవడం లేదా? ఆమె నిన్ను అక్కగా నీ భర్తను బావగారిలా భావించి గౌరవిస్తుంటే నువ్వు అవమానిస్తావా? ఈ సంగతి ఆమెకు తెలిస్తే ఎంత బాధ పడుతుంది? ఇక నీ భర్త ఇన్నాళ్లలో ఎప్పుడూ అలా బిహేవ్‌ చేయలేదు. పరిచయం చేసింది నువ్వే. పలకరించేలా చేసిందీ నువ్వే. వాళ్లలా మాట్లాడుకుంటే కలవరపడుతున్నదీ నువ్వే. మనిషి కంటే ఎక్కువగా యంత్రాన్ని నమ్ముకుంటే వచ్చే ప్రమాదాలు ఇవి. వాట్సాప్‌ ఆన్‌ చేసి వేరే పనుల్లో పడినా ఆన్‌లైన్‌ అనే చూపిస్తుంది. ఆఫీస్‌ మెసేజుల్లో ఉన్నా ఆన్‌లైనే అని చూపిస్తుంది. అసలు మీ మధ్య ఫోన్‌ ఎప్పుడు వచ్చిందో అప్పుడే దూరం పెరిగి ఆ ఖాళీలో చేరవలసిన చెత్తంతా చేరుతోంది. టెక్నాలజీని ఎంత వాడుకోవాలో అంతే వాడుకోవాలి. ముందు మీరు చేయవలసిన పని ఏమిటంటే ఫ్రెండ్స్‌ పేరుతో ఒక గ్రూప్‌ క్రియేట్‌ చేసుకోవడం. అందులో మీరూ మీ వారు భార్గవి భార్గవి భర్త ఉండండి. అక్కడ మాట్లాడుకోండి. మీ నలుగురూ కలిసి డైనింగ్‌ టేబుల్‌ మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేయడమే నేను ప్రిస్క్రైబ్‌ చేయగల మెడిసిన్‌. ఆ మెడిసిన్‌ను తీసుకుంటావా?’సంధ్య తెరిపిన పడ్డట్టు చూసి లేచింది.బహుశా వాళ్ల భోజనంలో ఏమేమి వండాలన్న చర్చ కొత్త గ్రూప్‌లో నలుగురి మధ్య నవ్వులతో సాగుతుండవచ్చు.
– ఇన్‌పుట్స్‌: కల్యాణ చక్రవర్తి,  సైకియాట్రిస్ట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement