బీపీ వల్లనో లేదా నిద్ర సరిగా పట్టకపోవడం వల్లో కాస్త తల నొప్పిగా ఉంటుంది. కొంతమందకి బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి ఉన్న ఈ భయానక తలనొప్పిని అనుభవిస్తారు. తలలో కంతుల వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. కానీ అలాంటివి ఏమీ లేకుండా ఉత్తిపుణ్యానికి వచ్చే తలనొప్పి ఒకటి ఉంది. ఎంత భయంకరంగా ఉంటుందంటే..భరించలేక ప్రజలు కెవ్వుకెవ్వుమని అరుస్తూనే ఉంటారట. కొందరైతే ఆ బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుంటారని వైద్యుల చెబుతున్నారు. ఇలాంటి తలనొప్పి బారినే డారెన్ ఫ్రాంకిష్ అనే వ్యక్తి పడ్డాడు. దీంతో అతని జీవితం గందరగోళంగా మారిపోయింది. ఆఖరికి వైద్యులు సైతం దీనికి మందు లేదని జీవితాంత ఆ వ్యాధిని భరించాల్సిందేనని షాకింగ్ విషయాలు వెల్లడిస్తున్నారు.
యూకేకి చెందిన డారెన్ ఫ్రాంకిష్ అనే వ్యక్తి 17 ఏళ్లుగా విపరీతమైన తలనొప్పితో బాధపడుతున్నాడు. ఈనొప్పిని తట్టుకోలేక ఆయన గట్టిగా అరవడం, తలను గోడకేసి బాదుకోవడం వంటివి చేసేవాడని తెలిపాడు. తలపై బేస్‌బాల్ బ్యాట్‌తో గట్టిగా కొడుతున్నట్లు, కత్తితో కంట్లో పొడుస్తున్నట్లు ఆ నొప్పి ఉంటుందని ఈ 53 ఏళ్ల డారెన్ చెబుతున్నారు. ఆయన ఒక హార్టికల్చర్‌ఇంజనీర్. ఆయన ప్రతీక్షణం ఈ తలనొప్పి మళ్లీ ఎప్పుడూ వస్తుందో అన్న భయంతో బతుకుతున్నాడు.
ఈ తలనొప్పి ఎప్పుడైన రావచ్చొనే సంగతి నాకు తెలుసు గానీ, ఇలా భయంతో బతకడం మాత్రం నరకంగా ఉందని ఆవేదనగా చెప్పారు డారెన్. ఆ నొప్పి 15 నిమిషాల నుంచి మూడు గంటల పాటు ఉంటుందని చెప్పారు. ఇది మొదటగా తన తలకు ఎడమ కన్నుపై నుంచి ప్రారంభమై తర్వాత కన్ను నీరు కారడం మొదలవ్వుతుందని తెలిపారు. ఎవరో కంటిలోపల కత్తితో గుచ్చుతున్న భావన కలిగి, దిండుని పట్టుకుని తట్టుకోలేక అరుస్తుంటానని చెప్పుకొచ్చారు. ఈనొప్పి వచ్చినప్పుడూ తాను ఎవ్వరితోనూ మాట్లాడనని చెప్పుకొచ్చారు. ఇటీవల కాలంలో ఈ బాధ మరింత ఎక్కువయ్యిందని అన్నారు. ఈ తలనొప్పిని వైద్య పరిభాషలో 'క్లస్టర్ తలనొప్పి లేదా సూసైడ్ తలనొప్పి' అంటారు. దీని కారణంగా అనుభవించే మానసిక వేదన చనిపోవాలనిపిస్తుంది కాబట్టి ఆ వ్యాధికి ఆ పేరు వచ్చింది.
క్లస్టర్ హెడేక్స్ అంటే..
క్లస్టర్ తలనొప్పులు అరుదైనవి. వెయ్యి మందిలో ఒకరిని ఈ నొప్పి వేధిస్తుంటుంది. యూకేలో 65 వేల మంది దీని బాధితులున్నట్లు అంచనా. తలనొప్పి కంటే ఇది చాలా తీవ్రమైనదని బ్రెయిన్ రీసెర్చ్ యూకే రీసెర్చి మేనేజర్ కేటీ మార్టిన్ అన్నారు. బాధితుడు డారెన్ వివరించినట్లుగా క్లస్టర్ అటాక్ వల్ల కలిగే నొప్పి భరించలేనిది. ఆ నొప్పిని తట్టుకోలేక ప్రజలు అరుస్తారు, గోడలకు తలను బాదుకుంటారు. బాధితులకు సమర్థవంతమైన ఉపశమనాన్ని అందించేందుకు కొత్త చికిత్సల కోసం అవసరమైన పరిశోధనల కోసం తాము నిధులు సమకూర్చుతున్నాం అని పరిశోధకుడు కేటీ మార్టిన్ చెబుతున్నారు.
ఈ తలనొప్పి మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువగా కనిసిస్తుంది. బాధితులు 30 ఏళ్లు పైబడినవారై ఉంటారు. నొప్పి వచ్చే తీరు మాత్రం మారుతుంటుంది. ఒక్కోసారి కొన్ని రోజుల వ్యవధిలో ఒకసారి నొప్పి వస్తే, కొన్నిసార్లు ఒకే రోజులో పలుమార్లు ఈ నొప్పి వస్తుంది. అయితే నొప్పి వచ్చిన ప్రతీసారి 15 నిమిషాల నుంచి కొన్ని గంటల పాటు అది కొనసాగవచ్చు. నొప్పితో పలుమార్లు ఆసుపత్రికి వెళ్లాల్సి రావొచ్చు. ఇది ప్రజల జీవన శైలిని ప్రభావితం చేస్తుంది. నిరుద్యోగానికి దారి తీస్తుంది. దీనివల్ల డిప్రెషన్ వచ్చే ముప్పు మూడు రెట్లు పెరుగుతుంది. పైగా ఆత్మహత్య ఆలోచనలకు పురికొల్పుతున్నట్లు కూడా నివేదికలు వచ్చాయి. అయితే దీనికి చికిత్స లేదని చెబుతున్నారు. ఇక్కడ డారెన్ కూడా జీవితాంతం ఆ తలనొప్పిని భరించాల్సిందే అని తెలిపారు. వైద్యుల దీనికి మంచి చికిత్స కనిపెట్టే క్రమంలో ఆయనపై ఎన్నో రకాల ప్రయోగాలు చేశారు.
ఆ నొప్పి ఉశమించేలా స్టెరాయిడ్స్, లిథియం సహా గుండె సంబంధిత మందులు, మూర్చకు ఇచ్చే మందులను సైతం వైద్యులు సూచించినట్లు డారెన్ చెబుతున్నాడు. అయితే అవేమి పనిచేయ లేదని అన్నాడు. చివరికి వైద్యులు తనకు ఇంజెక్షన్‌ని సిఫార్సు చేశారు. ఒక్కోసారి అది పనిచేస్తుంది. ఒక్కోక్కసారి అది కూడా పని చేయదని బాధగా చెబుతున్నాడు. అలాగే మత్తుమందులు నరాలను మొద్దుబారేలా చేయగా, స్టెరాయిడ్స్ ఒక ఏడాది వరకు తలనొప్పి రాకుండా ఆపగలదని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధి కారణంగా డారెన్ వైవాహిక జీవితం కూడా దెబ్బతింది. ప్రస్తుతానికి వైద్యులు చికిత్సలో భాగంగా ఆయనకు తలలో ఒక నర్వ్ బ్లాక్‌ను ఇంజెక్ట్ చేయనున్నట్లు వెల్లడించారు. అయితే ఈ వ్యాధి ఎందువల్ల వస్తుందనేందుకు కచ్చితమైన కారణాలు కూడా లేవు. ఇక్కడ డారెన్ వైద్యలు సరైన చికిత్సా విధానం కనుగొనేంత వరకు ఆయన ఈ తలనొప్పితో జీవించాల్సిందే. అయితే యూకేలో 65 వేల మంది దీని బాధితులున్నట్లు నివేదికలు చెబుతుండటం గమనార్హం.
(చదవండి: కుకీస్ తింటున్నారా? ఐతే ఓ డ్యాన్సర్ ఇలానే తిని..)
Comments
Please login to add a commentAdd a comment