ఈశాన్యం ‘మన’ తలనొప్పి | shekhar gupta writes on eastren states issues | Sakshi
Sakshi News home page

ఈశాన్యం ‘మన’ తలనొప్పి

Published Sat, Jun 20 2015 3:21 AM | Last Updated on Sun, Sep 3 2017 4:01 AM

ఈశాన్యం ‘మన’ తలనొప్పి

ఈశాన్యం ‘మన’ తలనొప్పి

జాతిహితం
 
ఈశాన్య భారతంలో ప్రజలు, కటువుగానూ కచ్చితంగానూ చెప్పాలంటే మన ‘భారతీయులం’ చావడం ఆగిపోయిన క్షణానే ఈశాన్యం కథ నిలిచి పోతుంది. అదే ఈశాన్య భారతపు మహా విషాదం.

మూడు దశాబ్దాల కిందట షిల్లాంగ్‌లోని ఖాసీ తెగకు చెందిన ఒక ప్రభుత్వ అధికారితో జరిపిన సంభాషణ వివరిస్తాను. అప్పట్లో దాదాపు మూడేళ్లపాటు రోజూ ఈశాన్య భారతం మొదటి పేజీ పత్రికా కథనంగా ఉండేది. సరిగ్గా ఆ కాలంలోనే (1981-83) కాకతాళీయంగా నేనా ప్రాం తంలో విధి నిర్వహణలో భాగంగా పర్యటించేవాడిని. ‘మా మేఘాలయ పౌరులు ఎందరు భారతీయులను చంపితే మీరు మా గురించి వార్తా కథ నాన్ని రాస్తారో చెప్పు, ‘‘శేఖర్! నువ్వూ ఇక్కడే ఉంటున్నావుగా?’’ అంటూ ఆ అధికారి కుండబద్ధలు కొట్టినట్టుగా సమస్యను స్పష్టం చేశాడు.

మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌ను కేంద్రంగా చేసుకొని ఈశాన్య ప్రాంతంలో పని చేసిన ఆ మూడేళ్లలో నేనా రాష్ట్రంపై ఒక్క ముఖ్య వార్తా కథనాన్నయినా రాయలేదు. అప్పట్లో నాగాలాండ్, మిజోరాం, త్రిపురలు అగ్ని గుండాల్లాగా ఉండేవి. అస్సాం పూర్తిగా స్తంభించిపోగా ‘భారత్‌కు’ ముడిచమురు చేరవేసే పైపు లైన్లను సైతం అడ్డగించేశారు. అలాంటి సమయంలో మేఘాలయ ఒక్కటే ప్రశాంతంగా ఉండేది. సైన్యం, వైమానిక బలగం, అస్సాం రైఫిల్స్, బీఎస్‌ఎఫ్‌లకే కాదు ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా)లకు సైతం అదే హెడ్ క్వార్టర్స్. అలాగే చాలా మంది పాత్రికే యులకూ అదే కేంద్రం. అయితే, మమ్మల్నందరినీ ఆంబుష్‌లతోనో, బాంబు దాడులతోనో చంపడానికి బదులుగా ఆ రాష్ట్రం ఆదరంగా మాకు స్వాగతం పలికింది. అందుకే మేం ఆ రాష్ట్రాన్ని పట్టించుకోలేదు.

ఆ మూడేళ్లలో ఆ రాష్ట్రం గురించి చేసిన పత్రికా రచనలు ఏమైనా ఉన్నా యంటే అవి అక్కడి సీతాకోక చిలుకలు, ఆర్చిడ్ పూల వ్యాపారం, తదితర ఆదివాసి విలక్షణతల గురించి మాత్రమే. మన ఆలోచనల్లో చైతన్యంలో ఈశాన్య భారతం అంటేనే అప్పట్లో అశాంతి, తిరుగుబాటు, జాతీయ భద్ర తకు ముప్పు, ప్రమాదంలో పడ్డ సరిహద్దుల గురించిన కథనం. దివంగత నారీ రుస్తోంజీ అదే పేరుతో ‘‘ఇంపెరిల్డ్ ఫ్రాంటియర్స్’’ అనే అద్భుత గ్రం థం రచించారు. అందులో ఆయన నాటి ఈశాన్యాన్ని... వైవిధ్యభరితమైన, మనకు తెలియని తెగల గుంపు నుండి మనల్ని కాపాడుకోవాల్సిన భూభా గంగా అభివర్ణించారు.

కశ్మీర్ విషయంలోలాగే ఈశాన్యంలో కూడా మన నిబ ద్ధతంతా ఆ భూభాగాలపై మన అస్తిత్వ హక్కును కాపాడుకోవడానికే పరి మితం. ప్రజలు మనకు ఎప్పుడూ అంతగా పట్టింది లేదు. కాబట్టే వారిని మనమెప్పుడూ నిజంగానే మనవారేనని కౌగలించుకుని ఎరుగం. ఒకప్పుడు ఈశాన్య భారతం జాతీయ భద్రతా సమస్యగా ఉండేది. ఆ అశాంతి సద్దు మణగడంతోనే ఆ ప్రాంతం గురించిన వార్తా కథనాలకు సైతం విలువ లేకుండా పోయింది.

పాతికేళ్ళుగా మేఘాలయలాగానే ఈశాన్యంలోని మిగతా రాష్ట్రాల్లో కూడా శాంతి నెలకొంది. దీంతో ఆ ప్రాంతం యావత్తూ మన దృష్టి నుంచి నుండి మటుమాయమైంది. కాబట్టే అవశేషంలా మిగిలిన, సాపేక్షికంగా చిన్న తిరుగుబాటుదార్ల బృందం మన సైనికుల కాన్వాయ్ మొత్తాన్ని వల పన్ని తుదముట్టించేస్తే... ఎలా స్పందించాలో మనకు తెలియలేదు.

అత్యంత ప్రగాఢమైన ఆలోచనలను సైతం 140 అక్షరాల్లో చెప్పేయడం అవసరమయ్యేటంతటి క్షణికమైన శ్రద్ధాసక్తులను మాత్రమే చూపగల కాల మిది. బహుశా పీహెచ్‌డీ సిద్ధాంత పత్రాలకు విషయాల ఎంపిక సైతం అప్ప టికేది ప్రస్తుతమో (ట్రెండింగ్) దాన్ని బట్టే నిర్ణయిస్తుండవచ్చు. అలాంటి సమయంలో ఎప్పుడో వారం క్రితం, దేశానికి తూర్పు కొసన ఎక్కడో ఈశాన్యంలో ‘ముగిసిపోయిన’ కథనాన్ని గురించి తిరిగి మాట్లాడటం తెలివి తక్కువతనమే కాదు, అసందర్భంగా చిత్తానుసారం మాట్లాడటం కూడా అవుతుంది.

మరో మోదీ (లలిత్ మోదీ) గురించిన కథనం ఈశాన్య వార్తను ఎప్పుడో వెనక్కు నెట్టేసింది. కానీ ఆ ప్రాంతంతో, ప్రత్యేకించి అత్యంత సుదూరపు సరిహద్దు ప్రాంత స్థావరంలాంటి మణిపూర్‌తో మనం ఇలా వ్యవహరించడం ప్రమాదకరమైన బాధ్యతారాహిత్యం. బలప్రయోగానికి తావులేని ఉద్వేగభరితమైన, ప్రజాస్వామిక అధికారం స్థానంలో బలప్రయో గానికి ప్రాధాన్యం ఇచ్చే ప్రభుత్వ సైనికవాద అధికారం ప్రవేశించినప్పుడే అత్యంత ఘోరమైన తప్పిదాలు జరిగాయి.

మయన్మార్‌లో సరిహద్దుల వెంబడి ఉన్న తిరుగుబాటుదార్ల శిబిరాలపై జరిపిన ప్రతీకార దాడి తప్పేమీ కాదు. అది ఆవశ్యకమైనది, సమర్థవంతమై నది, పూర్తిగా సమంజసమైనది కూడా. భారత సైనిక శ్రేణులనే పూర్తిగా తుడిచిపెట్టేసి తప్పించుకోగలమని ఏ సాయుధ తిరుగుబాటుదార్లూ భావిం చడానికి వీలు లేదు. అత్యంత రక్తసిక్త సమాజాలుగా పేరొందిన దేశాలు సైతం దాన్ని సహించవు. మన దేశం అలాంటి వాటిలో ఒకటి కాదనడం నిస్సందేహం. కాకపోతే ఆ విషయాన్ని బోర విరుచుకుని, జబ్బలు చరచు కొని చెప్పుకోవడంతోనే సమస్య. మొహమాటం లేకుండా చెప్పాలంటే ‘‘56 అంగుళాల’’ ఛాతీ (ప్రధాని మోదీ) సైతం విరుచుకొని విర్రవీగడం ప్రధాన సమస్య.

ఆ దాడి గురించి ఇలా గొప్పలు చెప్పుకోడాన్ని కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి ప్రారంభించారు. ఆయన మనిషిగా అద్భుత మైన వ్యక్తి, మాజీ సైనికుడు, జాతీయ క్రీడలకు సంకేతంగా నిలిచినవారు. మణిపూర్‌కు చెందిన ప్రముఖ క్రీడాకారులు సుదీర్ఘ కాలంపాటూ ఆయన జట్టులో అదనపు సభ్యులుగా ఉండేవారు. అత్యుత్సాహం ముంచె త్తగా ఆయన ఈ ఆత్మస్తుతికి శ్రీకారం చుట్టారు. ఇలాంటి దాడి లేదా ప్రతీకార జర గడం ఇదే మొదటిసారన్నట్టు మాట్లాడారు. వాస్తవానికి అది తప్పు.

భారత్‌ను కొన్ని సందర్భాల్లో సాఫ్ట్ పవర్‌గా (బలప్రయోగానికి తావి వ్వని విదేశాంగ నీతిని అనుసరించే దేశం) అభివర్ణిస్తుంటారు. కానీ ఏవి ధంగా చూసినా మన దేశం సాఫ్ట్ పవర్ కాదు. నిజానికి స్వీయపరిరక్షణకు వచ్చేసరికి మన దేశం అత్యంత క టువుగా వ్యవహరించే శక్తుల్లో ఒకటిగానే నిలిచింది. ప్రత్యేకించి ఆ కాఠిన్యం ఏ పార్టీ అధికారంలో ఉన్నదనే దానితో మారేదేమీ కాదు. 1984 ఆపరేషన్ బ్లూస్టార్‌లో ఇందిరాగాంధీ స్వర్ణదేవాల యంలోకి యుద్ధ ట్యాంకులను పంపారు.

1988లో రాజీవ్‌గాంధీ స్నైపర్‌లు (ఎంపిక చేసిన లక్ష్యాలను గురి చూసి కాల్చే నిపుణులు), కమాండోలను దించి మరోసారి దానిపై ఆపరేషన్ బ్లాక్‌థండర్ దాడిని నిర్వహించారు. ఊగిసలాడిన వీపీ సింగ్ ప్రభుత్వ హయాంలోనూ, ఆ తదుపరి పీవీ నరసిం హారావు హయాంలోనూ కూడా అదే కఠినమైన ప్రతిస్పందన కొనసాగింది. ఈ విషయాలను ధ్రువీకరించుకోవాలనుకుంటే ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ను అడగండి. ఆయన ఈ దాడులన్నిటిలోనూ కీలక పాత్ర వహించినవారే. నరసింహారావు హయంలో ఖలిస్థాన్ తిరుగు బాటును తుదముట్టించడానికి మనం చేపట్టిన సైనిక చర్య అత్యంత నిర్దాక్షిణ్యమైనది. ‘హైదర్’ చిత్రంలో చూపిన విధంగా తిరుగుబాటు ఉధృ తంగా ఉన్న సమయంలో కశ్మీరీలతో మనం వ్యవహరించిన తీరు అత్యంత కఠోరమైనది. కరడుగట్టిన అణచివేతవాదుల్లో పలువురి హృదయాలను సైతం అది కలచివేసింది.

ఆ సైనిక చర్యను సైతం ‘‘శ్రీమాన్ నిర్ణయ రాహి త్యం’’(మిస్టర్ ఇన్‌డెసిషన్) పీవీ హయాంలోనే జరిగిందని గుర్తుంచుకోండి. వాజపేయి హయాంలో మయన్మార్, భూటాన్ భూభాగాల్లో సైనిక చర్యలు జరిగాయి. ఉల్ఫాకు వ్యతిరేకంగా మన ఇరు దేశాల సేనలు కలసి నిర్వహిం చిన జాయింట్ ఆపరేషన్‌కు భూటాన్ రాజు నేతృత్వం వహించాడు. అయితే గత ప్రభుత్వాధినేతల్లో ఏ ఒక్కరూ దాని గురించి గొప్పలు చెప్పుకోలేదు. ఇందిర, రాజీవ్, పీవీ, వీపీ సింగ్, వాజపేయి, ఆ తర్వాత మన్మోహన్‌సింగ్‌లు కానీ లేదా వారి ప్రభుత్వాలు కానీ ఆ సైనిక చర్యల గురించి పల్లెత్తి మాట్లాడ లేదు. అందుకు రెండు కారణాలున్నాయి. ఒకటి, ఆ చర్యల్లో చాలా సున్నిత మైన అంశాలు, రహస్యాలు ఇమిడి ఉన్నాయి.

రెండు, మనం చంపిన వారికి ఆ గతి పట్టడం ఎంతగా సమంజసమైనప్పటికీ మన స్వదేశీయులనే చంపినందుకు మనం జబ్బలు చరచుకోలేం, బోర విరుచుకోలేం. బ్లూస్టార్ ఆపరేషన్‌కు జనరల్ సుందర్జీ (అప్పట్లో ఆయన లెఫ్టినెంట్ జనరల్, పశ్చిమ సైనిక విభాగపు కమాండర్), మేజర్ జనరల్ కే ఎస్ బ్రార్‌లు నేతృత్వం వహించారు. ఆ ఆపరేషన్ తర్వాత వారు ‘‘మేం మా హృదయాల్లో భక్తిశ్రద్ధ లతో, పెదవులపై ప్రార్థనలతో లోపలికి ప్రవేశించాం’’ అని మాత్రమే మీడి యాకు చెప్పారు. జో హమ్‌సే ఠక్రాయేగా, చుర్-చుర్ హో జాయేగా (మమ్మల్ని సవాలు చేసేవారెవరైనా ముక్కలు ముక్కలు కావాల్సిందే) అనే ప్రేలాపన ఆనాడు లేదు.

ఈ విషయాన్ని మరో విధంగా చూద్దాం. మన సైనికులను లక్ష్యంగా చేసుకునే సాహసం చేసిన ఏ సాయుధ గ్రూపుకైనా, అది మళ్లీ అలాంటి ప్రయత్నం చేయకుండా బుద్ధి చెప్పాల్సిందే. చట్టబద్ధమైన ప్రజాస్వామిక దేశంలో ప్రభుత్వానికి మాత్రమే ఆయుధాలను ధరించే హక్కూ, చట్టాలకను గుణంగా ప్రాణాంతక ఆయుధాలను ప్రయోగించే హక్కూ ఉంటాయి. గత పక్షంలో చాందెల్‌లో మన సైనికులు పద్దెనిమిది మందిని చంపేశారు. కానీ అంతకు నాలుగురెట్ల మందిని మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్ తాడిమెట్ల ఆంబుష్‌లో (ఏప్రిల్ 6, 2012) హతమార్చారు. ఆ తర్వాతి దాడుల్లోనూ అంతకంటే పెద్ద సంఖ్యలోనే చంపారు. మావోయిస్టులు అలా మళ్లీ సవాలు చేసినా వారి క్యాంపులపై ఇలాంటి కమెండో ప్రతీకార దాడులను మనం ఎందుకు నిర్వహించలేదు?

తాడిమెట్ల ఆంబుష్ తదుపరి మన సైనిక దశాల అధిపతులు మన సాయుధ దళాలు ‘‘మన సొంత’’ ప్రజలతోనే పోరాటంలో జోక్యం చేసుకో జాలమని, మావోయిస్టుల సవాలును పోలీసులకు, కేంద్ర పారామిలిటరీ బలగాలకూ వదిలేయడమే ఉత్తమమని ఎవరూ అడగకుండానే ప్రకటనలు చేశారు. నేను చెప్పదలుచుకున్నది తూర్పు-మధ్య భారతంలోని పేదల్లోకెల్లా కడుపేదలైన ఆదివాసులపైకి మన సాయుధ దళాలను ప్రయోగించాలని కాదు. నేను ప్రశ్నించేది ఒక సూత్రానికి సంబంధించిన సమస్య.

కశ్మీరీ, ఈశాన్య ప్రాంత తిరుగుబాటుదార్లపై అదే సాయుధ దళాలను ప్రయోగిం చేటప్పుడు మనకు అలాంటి సందేహాలు ఎందుకు రాలేదు? వారు మన తోటి భారతీయుల కారా? లేక మావోయిస్టులలాగా ప్రధాన భూభాగంలోని మరే ఇతరులకన్నా తక్కువ భారతీయులా? మన బలగాలు- కాకీ లేదా ఆలివ్‌గ్రీన్ లేదా మరి ఏ ఇతర యూనిఫారం ధరించినవైనా మవోయిస్టులపై చాందెల్ అనంతరం జరిగిన తరహా భారీ ఆపరేషన్‌ను చేపట్టి ఉంటే ఈ సంబరాలు లేదా జబ్బలు చరుచుకోవడాలు ఉండేవి కావని నేను మీకు నమ్మకంగా చెప్పగలను. జాతీయ భద్రతకు సంబంధించిన మన చర్చలో ఈ మౌలికమైన చిత్తశుద్ధి లోపించింది. సుదూరంలోని జాతులకు, మైనారిటీలకు భిన్నత్వంలోని ఏకత్వం గురించి మనం ఉపన్యాసాలు దంచుతాం. కానీ వారిని మాత్రం ప్రధాన భూభాగపు పౌరులకంటే తక్కువ వారిగా చూస్తాం.

దీనిని ఈశాన్య ప్రజలు మెచ్చరు. కొందరు, ప్రత్యేకించి తిరుగుబాటు తర్వాత తరాల యువత దీన్ని మరచిపోయినా... చాందెల్ అనంతరం మనం ప్రదర్శించిన ఏ మాత్రం హుందాతనంలేని మొరటుదనం ‘‘వారికి మనకు’’ మధ్య ఉన్న ఉద్వేగపరమైన దూరాన్ని గుర్తుకు తెచ్చి ఉంటుంది. దశాబ్దాల తరబడి తమ ప్రాంతం పరిస్థితి మెరుగుపడినా, ప్రశాంతంగా ఉన్నా మన నుండి వారికి నిజంగా లభించిన బహుమతంటూ ఏదీ లేదు.

జాతీయ మీడియాకు చెందిన చాలా సంస్థలు సైతం ఆ ప్రాంతం శాంతియు తంగా ఉంది కాబట్టే అక్కడి తమ బ్యూరోలను ఉపసంహరించుకున్నాయి. ఒకప్పుడు అత్యంత ఆందోళనకరమైనదిగా ఉండిన త్రిపురలో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (ఏఎఫ్‌ఎస్పీఏ) ఉపసంహరించు కున్నా, అక్కడ ఎంత ప్రశాంతంగా ఉందంటే ఓఎన్‌జీసీ గ్యాస్‌ను ఉత్పత్తి చేయగలుగుతోంది. దాన్ని ఆ రాష్ట్రంలోనే విద్యుత్తుగా మారుస్తోంది.

ఆ విష యం నామమాత్రపు ప్రస్తావనకు తప్ప నోచుకోలేదు. కాగా, మణిపూర్‌లోని ఈ ఒక్క ఘటన ఏఎఫ్‌ఎస్పీఏను ఏళ్ల తరబడి కొనసాగించడానికి సమంజ సత్వాన్ని కలుగజేస్తుంది. అదే సమయంలో, మావోయిస్టు ప్రాంతాల్లో ఏఎఫ్‌ఎస్పీఏ అమలును సూచిస్తే మాత్రం ప్రధాన స్రవంతి నుండి దానికి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతుంది. ఈ వైఖరే ఈశాన్యంలో పరాయితనానికి దారితీసింది. మన తాజా స్పందనలు దాన్ని కొత్త తరాలకు తిరిగి అంది స్తుంది.

అందుకే మరో మారు ఇలాంటి ఆంబుష్, దాని పర్యవసానాలు పునరావృతమయ్యే వరకు ఈ కథనాన్ని చావడానికి వీల్లేదు. ముందుగా ఈశాన్య ప్రజలను, ప్రత్యేకించి ఆదివాసి ప్రజలను మనతోటి వారుగా, మనతో సమానులుగా, విభిన్నమైన భారతీయులుగా గుర్తించి, వారిని అక్కున చేర్చుకోవాలి. అలాగాక ఆ ప్రాంతాన్ని పూర్తి జాతీయ భద్రత దృష్టి తోనే చూస్తున్నంత కాలం మనం మూల్యం చెల్లించక తప్పదు.
 

 - శేఖర్ గుప్తా
shekhargupta653@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement