తరచూ తలనొప్పి, జలుబు, దగ్గు..!
మా అబ్బాయి వయసు ఎనిమిదేళ్లు. తరచు తలనొప్పి, జలుబు, దగ్గు వస్తున్నాయి. మందులు వాడినప్పుడు తగ్గినా, మళ్లీ మామూలే. ఇలా తరచు తలనొప్పి ఎందుకు వస్తోందో తెలియడం లేదు. అలాగే చదువు ఒత్తిడి కూడా ఎక్కువగానే ఉంటోందంటున్నాడు. మా బాబుకు ఉన్న సమస్య ఏమిటి? వాడి విషయంలో మేమేం చేయాలి?
- సుదర్శన్, వరంగల్
మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీ అబ్బాయికి తలనొప్పి కాస్త తీవ్రంగానే వస్తున్నట్లు తెలుస్తోంది. పిల్లలలో తలనొప్పికి ముఖ్యంగా సైనస్ ఇన్‌ఫ్లమేషన్ (సైనసైటిస్), కళ్లకు సంబంధించిన సమస్యలు (రిఫ్రాక్టివ్ ఎర్రర్స్), వాస్క్యులార్ సమస్యలు (మైగ్రేన్), స్ట్రెస్ ఇండ్యూస్‌డ్ తలనొప్పి వంటి మానసిక సమస్యలు, కొన్ని న్యూరలాజికల్ సమస్యలను కారణాలుగా చెప్పవచ్చు. అయితే మీరు చెప్పిన లక్షణాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని సమీక్షించి చూస్తే మీ వాడికి రైనోసైనసైటిస్ అనే సమస్య ఉన్నట్లు చెప్పవచ్చు. దీన్ని సాధారణంగా ఏడేళ్లు పైబడిన పిల్లల్లో ఎక్కువగా చూస్తుంటాం. ఇది అలర్జీ టెండెన్సీ (అలర్జిక్ రైనైటిస్) ఉన్నవారిలో లేదా తరచూ ఏదైనా కారణాల వల్ల శ్వాసనాళం పైభాగం (అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్)లో ఇన్ఫెక్షన్ వచ్చే పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది.
ఈ పిల్లల్లో నొప్పి నివారణ మందులు, యాంటీబయాటిక్స్ వాడిన సమయాల్లో తలనొప్పి కొద్దిగా తగ్గడం, ఆ తర్వాత మళ్లీ తిరగబెట్టడం చూస్తుంటాం. దీనికి కారణం తల ఎముకల్లో ఉండే ఖాళీ ప్రదేశాలైన సైనస్ స్పేసెస్‌లో ఇన్ఫెక్షన్ రావడంతో పాటు, ఆ ప్రదేశంలోని స్రావాలు చక్కగా ప్రవహించకపోవడం వల్ల ఇలాంటి పిల్లల్లో తలనొప్పి, తలభారంగా ఉండటం, ముక్కుదిబ్బడ, ముఖంలోని కొన్ని భాగాల్లో వాపు, దీర్ఘకాలం పాటు దగ్గు చూస్తుంటాం.
శ్వాసనాళం పైభాగం (అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్)లో ఇన్ఫెక్షన్, కాలుష్యం, పొగ, అడినాయిడ్ గ్రంథులు పెద్దవి కావడం, ముక్కుకు సంబంధించి నిర్మాణపరమైన మార్పులు (అనటామికల్ ఛేంజెస్ ఇన్ నోస్), డీఎన్‌ఎస్, ముక్కులో కండ పెరగడం (నేసల్ పాలిప్స్), కడుపులో స్రావాలు పైకి తన్నడం (జీఈఆర్‌డీ), ఈత వంటి అనేక ప్రేరేపించే కారణాల (ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్) వల్ల సైనస్‌లో ఇన్‌ఫ్లమేషన్ ఎక్కువవుతూ ఉంటుంది. సైనస్ ఇన్‌ఫ్లమేషన్ ఉందా లేదా అన్నది పీఎన్‌ఎస్ సీటీ స్కాన్ అనే పరీక్షతో కచ్చితంగా గుర్తించవచ్చు.
ఇక చికిత్స విషయానికి వస్తే ముక్కులో వేసే చుక్కలమందు (సెలైన్ నేసల్ డ్రాప్స్), యాంటీ హిస్టమైన్స్, స్టెరాయిడ్ నేసల్ స్ప్రే, కచ్చితమైన యాంటీబయాటిక్ థెరపీ (కనీసం రెండు నుంచి మూడు వారాల పాటు), ఆవిరి పట్టడం (స్టీమ్ ఇన్‌హలేషన్) ద్వారా తప్పనిసరిగా వ్యాధి తీవ్రతను, వ్యాధి తరచూ తిరగబెట్టడాన్ని (ఫ్రీక్వెన్సీని) తగ్గించవచ్చు. అలాగే దీర్ఘకాలికంగా (క్రానిక్ సైనసైటిస్) కాంప్లికేషన్స్ వస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో శస్త్రచికిత్స (సర్జికల్ ఇంటర్వెన్షన్) ద్వారా... ముఖ్యంగా ఎండోస్కోపిక్ ఎన్‌లార్జ్‌మెంట్ ఆఫ్ మియటల్ ఓపెనింగ్ వల్ల, అలాగే కొన్నిసార్లు ముక్కుకు సంబంధించిన నిర్మాణపరమైన లోపాల (అనటామికల్ డిఫెక్ట్స్)ను చక్కదిద్దడం ద్వారా ఈ సమస్య నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది.
దాదాపు 40 శాతం కేసుల్లో అక్యూట్ సైనసైటిస్‌లు వాటంతట అవే తగ్గిపోతాయి. కాబట్టి మీరు మీ బాబు విషయంలో తలనొప్పికి ఇతర కారణాలేమీ లేవని నిర్ధారణ చేసుకోవడం చాలా ముఖ్యం. ఇక పిల్లలకు చదువుల ఒత్తిడి కూడా తలనొప్పికి ఒక కారణం కాబట్టి వాళ్లకు కొద్దిపాటి నాణ్యమైన రిలాక్సేషన్ టైమ్ ఇచ్చి ఆ సమయంలో వాళ్లకు ఇష్టమైన ఆటలు ఆడించడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. అందువల్ల టెన్షన్ సంబంధిత తలనొప్పులు తగ్గుతాయి. మీరు పైన చెప్పిన జాగ్రత్తలు తీసుకుని మరోసారి మీ పిల్లల వైద్యుడితో చర్చించి మీ బాబుకు తగిన చికిత్స తీసుకోండి.
డాక్టర్ రమేశ్‌బాబు దాసరి
పీడియాట్రీషియన్,
స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్