పాపకు  పదే పదే  చెవి నొప్పి...తగ్గేదెలా?  | Condition of your baby is called nimoniya in medical terminology | Sakshi
Sakshi News home page

పాపకు  పదే పదే  చెవి నొప్పి...తగ్గేదెలా? 

Published Fri, Apr 19 2019 3:22 AM | Last Updated on Fri, Apr 19 2019 3:22 AM

Condition of your baby is called nimoniya in medical terminology - Sakshi

మా పాప వయస్సు ఐదేళ్లు. రెండు నెలల క్రితం మా పాపకు జలుబు వస్తే ఈఎన్‌టీ స్పెషలిస్ట్‌ దగ్గరకు తీసుకెళ్లాం. ఆయన ముక్కు నుంచి చెవికి ఉండే ఎడినాయిడ్‌ గ్రంథి బ్లాక్‌ అయిందన్నారు. తగ్గిపోయాక ఇప్పుడు మళ్లీ మరో పక్క చెవి నొప్పిగా ఉందని అంటోంది. మళ్లీ ఇలా వచ్చే అవకాశం ఉందా?    
       
మీరు చెబుతున్న అంశాలను బట్టి మీ పాపకు ఉన్న కండిషన్‌ను ‘అడినాయిడైటిస్‌ విత్‌ యూస్టేషియన్‌ కెటార్‌’ అని చెప్పవచ్చు. ఎడినాయిడ్స్‌ అనే గ్రంధులు ముక్కు వెనకాల, టాన్సిల్‌ పైన ఉంటాయి. ఈ గ్రంథులకు టాన్సిల్స్‌ తరహాలో ఇన్ఫెక్షన్‌ రావచ్చు. ఇది కొన్ని వారాలు, నెలలు ఉండవచ్చు. చిన్న పిల్లల్లో ఈ కండిషన్‌ను తరచూ చూస్తుంటాం. ఇలాంటిది జరిగినప్పుడు మధ్య చెవి నుంచి ముక్కు వెనుక భాగంలో ఉండే యూస్టేషియన్‌ ట్యూబులో కొన్ని మార్పులు జరగవచ్చు.

ఎడినాయిడ్‌ ఇన్ఫెక్షన్‌ ఉన్నప్పుడు సైనుసైటిస్, ముక్కు రంధ్రాలు మూసుకుపోవడం (బ్లాక్‌ కావడం), నోటితో గాలి పీల్చడం, నిద్రపట్టడంలో ఇబ్బంది (రెస్ట్‌లెస్‌ స్లీప్‌) వంటి ఇతర లక్షణాలూ కనిపించవచ్చు. ఇలాంటి పిల్లలకు యాంటీహిస్టమిన్, యాంటీబయాటిక్‌ కోర్సులతో చికిత్స చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నొప్పి ఉంటే పెయిన్‌ మెడికేషన్‌ కూడా అవసరం కావచ్చు. ఇలాంటి లక్షణాలు చాలా దీర్ఘకాలం కొనసాగితూ ఉంటే కొందరిలో చాలా అరుదుగా ఎడినాయిడ్స్‌ను తొలగించాల్సి రావచ్చు. మీరు మీ పీడియాట్రీషియన్‌ లేదా ఈఎన్‌టీ సర్జన్‌ను కలిసి తగిన చికిత్స తీసుకోండి. 

బాబుకు ఛాతీలో నెమ్ముఏంచేయాలి? 

మా బాబు వయసు రెండేళ్లు. వాడు ఛాతీలో నెమ్ము సమస్యతో బాధపడుతున్నాడు. యాంటీబయాటిక్స్‌ ఇప్పించాం. నెమ్ము రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఒకవేళ వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరంగా చెప్పండి.                               

మీ బాబుకు ఉన్న కండిషన్‌ను వైద్య పరిభాషలో నిమోనియా అంటారు. పిల్లల్లో అత్యంత ప్రమాదకరంగా మారేందుకు కారణమయ్యే వ్యాధుల్లో నిమోనియా ఒకటి.   వైరల్, బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్లు నిమోనియాకు అత్యంత ప్రధాన కారణాలు. కొన్ని సందర్భాల్లో  కొన్ని శరీర నిర్మాణపరమైన లోపాల (అనటామికల్‌ ప్రాబ్లమ్స్‌) వల్ల, రోగనిరోధక శక్తి లోపాల (ఇమ్యునిటీ ప్రాబ్లమ్స్‌) వల్ల కూడా నిమోనియా కనిపించవచ్చు. కేవలం ఒక ఏడాదిలో వ్యవధిలోనే రెండు మూడు సార్లు నిమోనియా వస్తే అలాంటి పిల్లల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. అలాగని మొదటిసారి వచ్చినప్పుడు నిర్లక్ష్యం వహించడం సరికాదు.

నిమోనియా వచ్చినప్పుడు వారం నుంచి పది రోజుల పాటు యాంటీబయాటిక్స్‌తో పిల్లలకు సరైన వైద్య చికిత్స అందించడం ఎంతైనా ముఖ్యం. తీసుకోవాల్సిన జాగ్రత్తలు... ∙ఇలాంటి పిల్లలను మిగతా సాధారణ పిల్లల్లాగానే పరిగణించవచ్చు. అయితే సమూహాలుగా జనం (క్రౌడ్స్‌) ఉన్న ప్రాంతాలకు పిల్లలను పంపకూడదు. అలాగే తీవ్రమైన ఇన్ఫెక్షన్లతో బాధపడేవారి నుంచి దూరంగా ఉంచాలి ∙పిల్లలందరికీ టీకాలు వేయించడం (ఇమ్యూనైజేషన్‌) చాలా ప్రధానం. హెచ్‌ఐబీ, నిమోకోకల్‌ వ్యాక్సిన్లు, ఫ్లూ వైరస్‌ వ్యాక్సిన్‌లతో నిమోనియాను చాలా వరకు నివారించవచ్చు. మీ బాబుకు ఈ వ్యాక్సిన్లు వేయించడం తప్పనిసరి. నిమోనియా వచ్చిన పిల్లలకు యాంటీబయాటిక్స్‌తో పాటు వాళ్లలో కనిపించే లక్షణాలకు చికిత్స చేయడం (సపోర్టివ్‌ కేర్‌) అవసరం. 

పాప నోట్లో ఏమిటీ మచ్చలు? 

మా పాప వయసు పదేళ్లు. ఆమెకు తరచూ నాలుక మీద, పెదవుల మీద, దవడ భాగాల్లో పుండ్లు వస్తున్నాయి.ఆమె నాలుకపైన ఎర్రటి మచ్చల్లా వచ్చి తాను ఏమీ తినలేకపోతోంది. ఇవి రావడానికి కారణం ఏమిటి? ఇది ఏమైనా తీవ్రమైన వ్యాధికి సూచనా? సరైన సలహా ఇవ్వండి. 

మీ పాపకు ఉన్న సమస్యను ఏఫ్తస్‌ అల్సర్స్‌ అంటారు. ఇవి కొందరిలో పదే పదే వస్తూ ఉండవచ్చు. ఇది చాలా సాధారణంగా, తరచూ చూసే నోటి సమస్యల్లో ఒకటి. ఈ అల్సర్స్‌కు నిర్దిష్టంగా ఇదే కారణమని చెప్పలేకపోయినా... అలర్జీ, ఇమ్యూనలాజికల్‌ సమస్యలు, హెర్పిస్, రసాయనాల వల్ల నోరు కాలడం, వేడి వేడి ఆహారం తీసుకోవడంతో నోరు కాలడం, నోటిలోని మృదువైన కణజాలంలో అయ్యే గాయాల వల్ల, కొన్నిసార్లు ఇన్‌ఫ్లమేటరీ బవెల్‌ డిసీజ్‌ వల్ల కూడా ఈ రకమైన నోటి అల్సర్స్‌ వచ్చేందుకు అవకాశం ఉంది. ఈ పుండ్లు 5 నుంచి 10 రోజుల పాటు ఉండి, వాటికవే నిదానంగా తగ్గుతుంటాయి. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు బెంజోకైన్‌ లేదా లిడోకైన్‌ వంటి ద్రావకాలను స్థానికంగా పూయడం, సమస్య తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే పుండ్లపై  పూతమందుల రూపంలో లభ్యమయ్యే స్టెరాయిడ్స్‌  పూయడం, కొన్ని సందర్భాల్లో సరైన యాంటీబయాటిక్స్‌ వాడటం కూడా జరుగుతుంది.

అలాగే వ్యక్తిగత నోటి పరిశుభ్రత పాటించడం కూడా చాలా ప్రధానం. ఇక మీ పాపకు సంబంధించిన మరో సమస్య విషయానికి వస్తే... నాలుక మీద మచ్చలు మచ్చలుగా రావడాన్ని ‘జియోగ్రాఫికల్‌ టంగ్‌’ అని అంటారు. ఇది కొందరిలో అకస్మాత్తుగా వస్తూ... కొన్ని గంటలు లేదా రోజుల్లో మారుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఈ సమస్య ఒత్తిడి వల్ల, కారంగా ఉండే ఘాటైన ఆహారాల వల్ల మరింత తీవ్రమవుతుంది. అయితే ఈ సమస్యకు నిర్దిష్టమైన చికిత్స ఏదీ అవసరం లేదు. కాకపోతే ఘాటైన కారంతో ఉన్నవీ, మసాలాలతో కూడిన ఆహారాలకు దూరంగా ఉండి, నోటి పరిశుభ్రత పాటించాలి. సమస్య మరీ తీవ్రమైతే ఒకసారి మీ పిల్లల వైద్య నిపుణుడిని సంప్రదించండి. 

డా. రమేశ్‌బాబు దాసరి
సీనియర్‌ పీడియా ట్రీషియన్, రోహన్‌ హాస్పిటల్స్, 
విజయనగర్‌ కాలనీ, హైదరాబాద్‌

  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement