ఇలా మడతపడితే...భవిష్యత్తులో పిల్లలు పుట్టే అవకాశం ఉందా?
మా బాబు వయసు 12 సంవత్సరాలు. వాడికి ఒకవైపు వృషణంలో విపరీతమైన నొప్పి రావడం వల్ల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాను. ‘వృషణం మడతపడింది. వెంటనే ఆపరేషన్ చేయాలి’ అని చెప్పారు. ఆపరేషన్ చేసిన తర్వాత వృషణాన్ని పూర్తిగా తీసివేశారు. రెండోవృషణం అలా కాకుండా ఆపరేషన్ చేశారు. ఇప్పుడు ఒక వృషణమే ఉంది. వృషణం ఒక్కటే ఉండే మా బాబు పెద్దయ్యాక నార్మల్ సెక్స్ చేయడానికి, పిల్లలు పుట్టడానికి అవకాశం ఉందా? అందరికీ తెలుస్తుందేమోనని ఎవరికీ చెప్పుకోలేకపోతున్నాం.
- ఎమ్.ఎల్.ఎస్., మహబూబ్‌నగర్
యుక్తవయసు రాబోయే ముందు అకస్మాత్తుగా వృషణాల్లో నొప్పి వస్తే అది సాధారణంగా ఇన్ఫెక్షన్ (ఎపిడైడమో ఆర్కడైస్) కారణంగా గానీ, వృషణం మడత పడటం వల్ల గానీ (టెస్టిక్యులార్ టార్షన్) వల్లగాని కావచ్చు. విపరీతమైన నొప్పి వచ్చినప్పుడు కేవలం డాప్లర్ స్కాన్ ద్వారా వృషణాలకు రక్తప్రసరణ ఉందో లేదో చూసుకుని, ఒకవేళ వృషణం మడతపడి ఉంటే (టార్షన్ అయి ఉంటే) ఆరు గంటల లోపే ఆ మడతను విడదీయాలి. ఆర్కడైస్ ఉంటే యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ వాడాలి. అందువల్ల సడన్‌గా వాపుతో వచ్చే వృషణం నొప్పిని నిర్లక్ష్యం చేయకూడదు. అయితే ఒక వృషణం తీసివేసినా దాదాపు చాలామందిలో సెక్స్ చేయడానికిగానీ, పిల్లలు పుట్టడానికి గానీ ఎలాంటి అవరోధం ఉండదు. కాబట్టి మీరు మీ బాబుకు తగిన వయసు వచ్చినప్పుడు నిర్భయంగా వివాహం చేయవచ్చు.
నా వయస్సు 28 ఏళ్లు. నాకు హస్తప్రయోగం సమయంలో స్ఖలనం జరగగానే పురుషాంగంలో విపరీతంగా నొప్పి వస్తోంది. ఆ నొప్పిలోనే నాకు మరోసారి అంగస్తంభన అవుతోంది. ఆ టైమ్‌లో నరాలు లాగుతున్నట్లుగా ఉంటుంది. స్ఖలనం అయ్యాక దాదాపు గంటతర్వాత నొప్పి దానంతట అదే తగ్గిపోతోంది. దీనివల్ల భవిష్యత్తులో సెక్స్ చేయలేనేమో అనిపిస్తోంది. నాకు మంచి సలహా ఇవ్వండి.
- జె.వి.ఆర్., ఒంగోలు
వీర్యస్ఖలనం తర్వాత పురుషాంగంలో, మూత్రనాళంలో నొప్పి, కాస్తంత డిస్‌కంఫర్ట్‌గా ఉండటం కొందరిలో సాధారణం. కాకపోతే అది కొద్ది నిమిషాలే ఉంటుంది. మీకు నొప్పి మరీ ఎక్కువగా ఉంటే వీర్యం, మూత్రం పరీక్షలు చేయించుకుని, అందులో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందేమో చూడాలి. చాలావరకు ఇలాంటి సమస్యలతో బాధపడేవారికి తీవ్రమైన లేదా ప్రమాదకరమైన కారణాలేవీ ఉండవు. ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీబయాటిక్స్ తీసుకుంటే తగ్గుతుంది. మీ సమస్య వల్ల భవిష్యత్తులో సెక్స్ చేయలేని పరిస్థితి ఏమీ రాదు. మీరు ఆందోళన పడకుండా ఒకసారి యూరాలజిస్ట్‌ను సంప్రదించండి.
నా వయసు 32 ఏళ్లు. నేను సెక్స్‌లో పాల్గొన్న వెంటనే స్ఖలనం అయిపోతోంది. సెక్స్‌లో పాల్గొనే సవుయుంలో శీఘ్రస్ఖలనాన్ని నివారించడానికి డీ-సెన్సిటైజర్ క్రీమ్స్, లోకల్ అనస్థీషియూ క్రీమ్స్ దొరుకుతాయుని విన్నాను. వాటి విషయంలో నాకు తగిన సలహా ఇవ్వండి.
- ఎస్‌కెబి., గుంటూరు
మీరు శీఘ్రస్ఖలనం అనే సమస్యతో బాధపడుతున్నారు. ఇది సాధారణ సమస్య. మీ వయసులో ఉన్నవారు చాలామంది ఈ కంప్లయింట్ చేస్తుంటారు. శీఘ్రస్ఖలనాన్ని నివారించేందుకు మీరు చెప్పినట్లే కొన్ని లోకల్ అనస్థీషియూ క్రీమ్స్ ఉంటాయి. అయితే మీకు ఉన్న సమస్యకు అదే చికిత్స కాదు. సెక్స్ చేస్తున్నప్పుడు పురుషాంగం మీద ఉండే నరాలు త్వరగా స్పందించడం (స్టిమ్యులేట్ అవడం) వల్ల మీకు స్ఖలనం త్వరగా అయిపోతుంది. మీరు చెబుతున్న ఆ లోకల్ అనస్థీషియూ క్రీమ్స్ ఆ నరాలను మొద్దుబారేలా చేస్తాయి. కాబట్టి స్ఖలనం ఆలస్యమవుతుంది. అయితే దీనివల్ల సెక్స్‌లో సుఖం కూడా తగ్గుతుంది. మీరు చెప్పే డీ-సెన్సిటైజర్లు కూడా ఇదే పని చేస్తాయి
.
ఈ క్రీమ్స్, డీ-సెన్సిటైజర్స్ కంటే స్ఖలనం అయ్యే సమయంలో పురుషాంగం చివరను చేతి వేళ్లతో బిగించి పట్టుకుని, మళ్లీ ఆ ఫీలింగ్ తగ్గిన వెంటనే సెక్స్ కొనసాగించే పించ్ టెక్నిక్, స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ వంటి వాటిని అనుసరించండి. మీ ఉద్వేగాలను అదుపు చేసే టెక్నిక్స్ వంటివి స్ఖలనం రిఫ్లక్స్‌పై నియంత్రణ సాధించేలా చేసి మీకు దీర్ఘకాలికంగా మేలు చేస్తాయి.
నాకు 27 ఏళ్లు. ఇటీవలే పెళ్లయ్యింది. సెక్స్ చేస్తున్నప్పుడు పురుషాంగం ముందు చర్మం వెనక్కు పోయి తీవ్రమైన నొప్పి వచ్చింది. అప్పట్నుంచి సెక్స్ చేయడం లేదు. డాక్టర్‌కు చూపించుకుందామంటే సిగ్గుగా ఉంది. నాకు తగిన సలహా ఇవ్వండి.
- జి.వి.ఎస్., కర్నూలు
సాధారణంగా పురుషాంగం మీద చివరిభాగంలో ఉన్న చర్మం ఫ్రీగా ముందుకు-వెనక్కు కదలాలి. ఒకవేళ అలా కదలకపోతే దాన్ని ఫైమోసిస్ అంటారు. ఈ పరిస్థితుల్లో అంగస్తంభన జరిగినప్పుడు చర్మం బలం (ఫోర్సిబుల్) గా వెనక్కువెళ్లి తిరిగి ముందుకు రాకపోతే తీవ్రమైన వాపు, నొప్పి వస్తుంది. ఈ కండిషన్‌ను పారాఫైమోసిస్ అంటారు. దీనికి సున్తీ ఒక్కటే మార్గం. సున్తీ చేయించుకున్న తర్వాత సెక్స్‌లైఫ్ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆనందంగా ఉంటుంది. ఇందులో మీరు బిడియపడాల్సిందేమీ లేదు. దగ్గర్లోని డాక్టర్‌ను కలవండి.
డాక్టర్ వి.చంద్రమోహన్, యూరోసర్జన్, ఆండ్రాలజిస్ట్,
ప్రీతి యూరాలజీ - కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్‌బి, హైదరాబాద్