సైనసైటిస్ అంటువ్యాధి కాదు
ఈఎన్‌టీ కౌన్సెలింగ్
నా వయసు 38 ఏళ్లు. చాలాకాలంగా సైనసైటిస్ సమస్య ఉంది. ఇటీవల నాకు చాలా ఎక్కువగా తలనొప్పి వస్తోంది. ఇది నాకు ఎవరి నుంచైనా వ్యాపించిందేమో అనిపిస్తోంది. ఇది వాస్తవమేనా? నాకు తగిన సలహా ఇవ్వండి.
- విజయ్‌కుమార్, నల్లగొండ
మీరు చెప్పిన అంశాలను బట్టి మీకు దీర్ఘకాలిక సైనస్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు తెలుస్తోంది. మీరు, మీ ఫ్రెండ్స్ అనుకుంటున్నట్లుగానే సైనస్ ఇన్ఫెక్షన్ పట్ల మనలో చాలా అపోహలు ఉన్నాయి. వాటి గురించి ఉన్న కొన్ని అపోహలూ, వాస్తవాల గురించి ఒక చిన్న పట్టిక ఇది...
అపోహ: సైనసైటిస్‌తో పాటు తలనొప్పి తప్పక వస్తుంటుంది.
వాస్తవం: నిజానికి చాలా తక్కువ సందర్భాల్లోనే సైనసైటిస్‌తో పాటు తలనొప్పి వస్తుంటుంది. అయితే చాలామంది సైనసైటిస్ ఉన్నవారికి వచ్చేవారికి మైగ్రేన్ తలనొప్పి తప్పక వస్తుందనుకుంటారు. నిజానికి మైగ్రేన్, టెన్షన్ తలనొప్పి ఈ రెండూ వేరు. సైనస్ సమస్య ఉన్నవారికి తప్పక మైగ్రేన్ వస్తుందనేది ఒక తప్పుడు అభిప్రాయమే. సైనస్ లేకపోయినా మైగ్రేన్ లేదా టెన్షన్ వల్ల వచ్చే తలనొప్పులు కనిపించవచ్చు.
అపోహ: సైనస్ ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది.
వాస్తవం: నిజానికి సైనస్ ఇన్ఫెక్షన్ ఉన్నవారికి కలిగే జలుబు వంటి కండిషన్ వల్ల మీకు ఈ అపోహ ఏర్పడి ఉండవచ్చు. కానీ సైనస్ ఇన్ఫెక్షన్ ఎంతమాత్రమూ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే సాంక్రమిక వ్యాధి కాదు. ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు. అయితే సాధారణ జలుబు (కామన్ కోల్డ్) వైరస్ వల్ల వస్తుంది కాబట్టి ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుంటుంది.
అపోహ: సైనస్ ఇన్ఫెక్షన్ ఉన్న ప్రతివారూ తప్పక యాంటీబయాటిక్స్ వాడాలి.
వాస్తవం: సైనస్ ఇన్ఫెక్షన్స్ అన్నీ బ్యాక్టీరియా వల్ల కాకపోవచ్చు. కేవలం సైనస్‌లలో బ్యాక్టీరియా చేరినప్పుడు మాత్రమే యాంటీబయాటిక్స్ పనిచేస్తాయి. ఒకవేళ సైనస్‌లలో వైరల్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటే, వాటికి యాంటీబయాటిక్స్ వాడినా ప్రయోజనం ఉండదు. కాబట్టి సైనస్ ఇన్ఫెక్షన్ ఏ రకానికి చెందినది అన్న అంశాన్ని బట్టే మందులూ వాడాల్సి ఉంటుంది. మీది నిర్దిష్టంగా ఏ సమస్య అన్నది కనుగొని, దానికి తగినట్లుగా మందులు తీసుకుంటే, మంచి ఫలితం ఉంటుంది. మీరు వెంటనే ఈఎన్‌టీ నిపుణులను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోండి.
- డా॥శ్రీనివాస్ కిశోర్ సీనియర్ ఈఎన్‌టీ, హెడ్ అండ్ నెక్ సర్జన్, స్టార్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్