హోమియోలో మైగ్రేన్‌కు మంచి చికిత్స...
మెదడు చుట్టూ ఉండే రక్తనాళాల్లో అకస్మాత్తుగా రక్తం ప్రవహించడంతో అవి ఒక్కసారిగా వ్యాకోచిస్తాయి. ఫలితంగా అక్కడి నరాలపై ఒత్తిడి పడుతుంది. దాంతో నరాల నుంచి కొన్ని రసాయనాలు విడుదలవుతాయి. రక్తనాళాలు వ్యాకోచించినకొద్దీ నొప్పి అధికమవుతుంది. ఈ సమస్యనే మైగ్రేన్ అంటారు.
ఈ సమస్య తీవ్రస్థాయికి చేరినప్పుడు నరాల వ్యవస్థ దెబ్బతినడం వల్ల మెదడులో సమస్య ఉన్న భాగం నుంచి వచ్చే నరాల పనితీరు ప్రభావితమై శరీరంలోని కొన్ని అవయవాలు సరిగ్గా పనిచేయకపోవచ్చు. దాంతోపాటు మైగ్రేన్ ఉన్నవారికి కళ్లు తిరగడం, తలతిరగడం, వస్తువులు రెండుగా కనిపించడం వంటి లక్షణాలూ ఉంటాయి. హెమీప్లీజిక్, రెటినల్, ఆక్యులార్ మైగ్రేన్‌లలో శరీరం పక్షవాతం వచ్చినట్లుగా ఉండటం, చూపు ఒకవైపు సరిగ్గా కనిపించకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి.
కారణాలు : మానసిక ఒత్తిడి నిద్రలేమి ఉపవాసం హార్మోన్ల సమస్యలు అధిక వెలుతురు వాసనలు మత్తుపదార్థాలు, పొగాకు వాడకం, పొగతాగడం కాఫీ వంటి పానీయాలు మహిళలలో రుతుక్రమం ముందర ఈస్ట్రోజెన్ హార్మోన్లు ఎక్కువగా ఉండటం వల్ల పై లక్షణాలు కనిపించవచ్చు. ఈ కారణాలు సాధారణంగా తలనొప్పి వచ్చే తత్వం ఉన్నవారికి సమస్య మరింత అధికమయ్యేలా చేస్తాయి.
లక్షణాలు : తలనొప్పి అధికంగా, వేగంగా కొట్టుకుంటున్నట్లు, తలను ముక్కలు చేస్తున్నట్లుగా, ఒకవైపు లేదా రెండువైపులా ఉండవచ్చు నొప్పి సాధారణంగా నుదురు, కళ్లచుట్టూ, తల వెనక భాగంలో రావచ్చు తలనొప్పి ఒక పక్క నుంచి మరో పక్కకు మారవచ్చు రోజువారీ పనులు చేస్తుంటే నొప్పి ఎక్కువ కావచ్చు వికారం, వాంతులు, విరేచనాలు, ముఖం పాలిపోవడం, కాళ్లు, చేతులు చల్లబడటం, వెలుతురు చూసి తట్టుకోలేకపోవడం, శబ్దం వినలేకపోవడం * నిద్రలేమి, చికాకు, నీరసం, ఉత్సాహం లేకపోవడం, ఆవలింతలు, కొందరిలో తీపి ఇంకా కారపు పదార్థాలను
ఎక్కువగా ఇష్టపడటం
మైగ్రేన్ సమస్య ఉన్నవారిలో తలనొప్పికి ముందు కొన్ని లక్షణాలను గమనించవచ్చు. దీనినే మైగ్రేన్ ఆరా అంటారు. ఈ ఆరా లక్షణాలు... కళ్ల ముందు మెరుపులు, ప్రకాశవంతమైన జ్యోతులు కనిపించడం వంటివి. ఈ మెరుపులు ముందర మధ్యలో మొదలై... చివరలకు వెళ్లినట్లుగా కనిపిస్తాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
=ఎక్కువ శబ్దం లేని, వెలుతురు లేని గదిలో విశ్రాంతి తీసుకోవాలి
=తగినంత నిద్రపోవాలి
= మద్యపానం, పొగతాగడం వంటి అలవాట్లు మానుకోవాలి
=తలనొప్పి ఎక్కువగా ఉన్న సమయంలో కొవ్వు పదార్థాలు, మాంసం, పప్పుదినుసులు ఉన్న ఆహారాన్ని తగ్గించాలి. సాధ్యమైనంత వరకు అల్పాహారాన్ని తీసుకోవాలి
= తగినంత నీరు తాగాలి
= జీవనశైలిలో మార్పులు చేసుకుని రోజూ వ్యాయామం చేయాలి
= మానసిక ఒత్తిడిని వీలైనంతవరకు తగ్గించుకోవాలి. ఒత్తిడి కలిగించే అంశాలకు దూరంగా ఉండాలి.
హోమియో చికిత్స : ఈ సమస్యకు హోమియోలో వాడదగిన మందులు సాంగ్వినేరియా, బ్రయోనియా, నేట్రమ్‌మూర్, పల్సటిల్లా, నక్స్‌వామికా, సెపియా, లాకెసిస్, స్పైజీలియా వంటివి. వ్యక్తిగత లక్షణాలను పరిగణనలోకి తీసుకుని పై మందులను వాడాల్సి ఉంటుంది.
డాక్టర్ ఎం. శ్రీకాంత్, సి.ఎం.డి.,
హోమియోకేర్ ఇంటర్నేషనల్