నిరక్షరాస్యత, గ్రామీణ నేపథ్యం, ఆర్థిక పరిస్థితులు, అమాయకత్వం ఆరోగ్య సమస్యలను తీవ్రతరం చేయడానికి ఒక కారణమైతే... బిజీలైఫ్, అందుబాటులో ఉండే మెడికల్ షాప్‌లు, ఫోన్లలోనే డాక్టర్ సలహాలు, ఓవర్ ది కౌంటర్ మెడిసిన్స్, యాంటీబయాటిక్స్, పెయిన్‌కిల్లర్స్, ఇంటర్నెట్ సమాచారం అనారోగ్య లక్షణాలకు తాత్కాలికంగా ఉపశమనం ఇచ్చినా... సమస్యను తీవ్రం చేసే అంశమని చెప్పవచ్చు. వేడి చేసిందనీ, పడని ఆహారం తీసుకున్నామనీ, ప్రయాణాల వల్ల అని, అలసట అని, ఎప్పుడో తగిలిన దెబ్బల చిహ్నాలంటూ భ్రమపడటం వల్ల అనీ, వయస్సు పైబడే కొద్దీ కనిపించే లక్షణాలే అంటూ సర్దుకుపోవడం వల్ల... ఇలా కారణాలేమైనప్పటికీ అవి క్యాన్సర్‌ను చాలా లేటు దశలో గుర్తించే పరిస్థితులే చాలా సందర్భాల్లో ఏర్పడుతుంటాయి. క్యాన్సర్ చికిత్స విధానాలన్నీ ఏ దశలో వ్యాధి కనుగొన్నామనే అంశం మీదే ఎక్కువగా ఆధారపడి ఉంటాయి.
తలనొప్పి : తలనొప్పి తరచూ అందరూ ఎదుర్కొనేదే. చికాకు, పనుల ఒత్తిడి, ఎండ, కొన్ని రకాల వాసనలు, ఆకలి వంటి కారణాలతో మైగ్రేన్ లేదా తలనొప్పి అప్పుడప్పుడు రావడం చాలా సహజమే. మందులు వాడినప్పటికీ తలనొప్పి రావడం, అలాగే ఉదయం లేవగానే తలభారం, తీవ్రమైన నొప్పి, వాంతులు కావడం, వికారం లాంటి లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్‌కు సంకేతం కావచ్చు.
గొంతునొప్పి : చల్లటి పదార్థాలు, కొత్తప్రదేశం, తాగేనీరు మారాయి అందుకే గొంతు బొంగురు, నొప్పి అని బాధపడే వారిని చాలామందినే చూస్తుంటాం. వీటికి మందులు కోర్సుగా వాడాక కూడా ఆ సమస్య బాధిస్తుంటే మాత్రం డాక్టర్‌ను సంప్రదించి చెకప్స్ చేయించుకోవాలి. థైరాయిడ్ క్యాన్సర్, గొంతు సంబంధిత క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ లక్షణాలు తొలిదశలో ఇలాగే ఉంటాయి.
దగ్గు, ఆయాసం : సిగరెట్టు తాగేవారు మాకు ఇలాంటి లక్షణాలు అలవాటే అనుకుంటారు. కానీ వీరికి లంగ్ క్యాన్సర్‌తో పాటు అనేక రకాల ఇతర క్యాన్సర్లు వచ్చే ముప్పు ఎక్కువ అని గ్రహించాలి. గొంతులో నస, ఆగని దగ్గు, కళ్లె/తెమడలో రక్తం, ఆయాసం వంటివి టీబీ లేదా లంగ్‌క్యాన్సర్ లక్షణాలు కావచ్చు.
కడుపు ఉబ్బరం, మంట : సరైన జీవనశైలి అలవరచుకుని నీరు, పీచు ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ ఉన్నప్పటికీ, జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు వేధిస్తూ ఉంటే ఎండోస్కోపీ, స్కానింగ్ లాంటి పరీక్షలతో జీర్ణాశయానికి సంబంధించిన క్యాన్సర్లు, కాలేయం, పాంక్రియాస్, గాల్‌బ్లాడర్ క్యాన్సర్లను తొలిదశలోనే కనుగొనే అవకాశం ఉంది.
మూత్రవ్యవస్థలో తేడాలు : మూత్రంలో రక్తం పడటం, ఆగి ఆగిరావడం, మంటగా ఉండటం మొదలైన లక్షణాలు కనిపించినప్పుడు తమకు వేడిచేసిందని భ్రమిస్తూ ఉంటారు. సాధారణంగా నీళ్లు తక్కువ తాగడం, ఇన్ఫెక్షన్లు, కిడ్నీలో రాళ్లు వంటి కారణాలవల్ల ఈ లక్షణాలు కనిపించవచ్చు. ఇవి మరీ తీవ్రంగా ఉండి చికిత్సలకు లొంగకపోతే యూరినరీ బ్లాడర్‌కు సంబంధించిన క్యాన్సర్ కావచ్చని అనుమానించాలి. 50 ఏళ్లపైబడిన పురుషుల్లో ప్రోస్టేట్ గ్రంథి సమస్యలు, క్యాన్సర్ లక్షణాలు ఈ విధంగానే ఉండవచ్చు. నెలసరిమధ్య రక్తస్రావం, పొట్టభారంగా ఉండటం, ఆకలి మందగించడం, స్త్రీల నెలసరి ముందు ఉండే సమస్యలుగా (పీఎమ్‌ఎస్)గా పొరబడవచ్చుగానీ కొన్నిసార్లు అవి ఒవేరియన్, యుటిరైన్ క్యాన్సర్లూ కావచ్చు.
మలవిసర్జనలో తేడాలు : అజీర్తి, విరేచనాలు, మలంలో రక్తం వంటి లక్షణాలు ఆహారపు అలవాట్లు మారినప్పుడు పైల్స్, ఫిషర్, ఫిస్టులా వంటి సమస్యలున్నప్పుడు కనిపించవచ్చు. కానీ మలవిసర్జన సమయంలో ఎప్పుడూ రక్తం పడుతుంటే అవి కోలన్ క్యాన్సర్ లక్షణాలు కూడా కావచ్చు. సిగ్మాయిడోస్కోపీ, కొలనోస్కోపీ వంటి పరీక్షలతో సమస్య ఏమిటో తెలిసిపోతుంది. అసలు విషయాన్ని గమనించక రకరకాల ఆహార పదార్థాల వల్ల ఈ సమస్య తలెత్తోందంని ఇతర అంశాలకు దీన్ని ఆపాదించుకుంటాం. తీవ్రమైన అలసట, ఆకలి, బరువు తగ్గడం, వీడని జ్వరం ఇంకా ఆయా అవయవాలకు సంబంధించిన లక్షణాలు ఉన్నట్లయితే ‘గాలిసోకిందీ’, ‘దయ్యంపట్టిందీ’, ‘చేతబడి చేశారు’ అంటూ పూజలు, మంత్రాలు, విభూది, తాయెత్తులు, దిష్టితీయడాలు వంటి అనేక మూఢనమ్మకాల పాలబడకుండా ఉండాలి. ఇలాంటివి చేస్తూ ఉండే ఫలితం కనిపించకపోగా అసలు సమస్య బయటపడే సమయానికి చేయిదాటిపోయే ప్రమాదం ఉంది.
క్యాన్సర్ ఇతర భాగాలకూ వ్యాపించి, చికిత్సకు లొంగకుండా తయారుకావచ్చు. ప్రతినెలా కనిపించే గడ్డలే అనీ, పాలగడ్డలనీ రొమ్ములో దీర్ఘకాలం పాటు కనిపించే కణుతులను అశ్రద్ధ చేస్తే కణితి ఇతర భాగాలకు పాకే ప్రమాదం పొంచిఉంటుంది. అలసట, చర్మం మీద ఊదారంగు మచ్చలు, తేలికగా కమిలిపోవడం వంటివి బ్లడ్‌క్యాన్సర్‌ను హెచ్చరించవచ్చు. గోళ్లలో మార్పులు, ముందుకు వంగి ఉండటం లివర్ / లంగ్ క్యాన్సర్లకు సూచన కావచ్చు. ఒత్తిడికి గురైనప్పుడు, వాతావరణం, ఆహారం మారినప్పుడు పైన పేర్కొన్న లక్షణాలు దాదాపుగా అందరూ ఎదుర్కొనేవే. అయితే తీవ్రంగా ఉన్నప్పుడు కూడా అవే కారణాలని భ్రమపడి ముందు వాడిన మందులనే మళ్లీ వాడుకుంటూ కాలయాపన చేస్తే సమస్యలను మనమే తీవ్ర చేసుకున్నవాళ్లమవుతాం. అందుకే చాలావరకు క్యాన్సర్ ముదిరాకే చికిత్సకు వస్తూ ఉంటారు. అదృష్టవశాత్తూ గత కొంతకాలంగా హెల్త్‌చెకప్స్ చేయించుకోవడం, అవగాహన పెంచుకోవడం శుభపరిణామంగా చెప్పవచ్చు.
Dr. Ch. Mohana Vamsy Chief Surgical Oncologist
Omega Hospitals, Hyderabad Ph: 98480 11421,
Kurnool 08518273001
Comments
Please login to add a commentAdd a comment