వానాకాలం వచ్చేసింది.. దోమలు విజృంభించే కాలమిది. ఏం ఫర్వాలేదు.. వాటిని తరిమేందుకు మా దగ్గర కాయిల్ ఉందిగా అనుకుంటున్నారా.. అయితే మీరు ఈ వార్త చదవాల్సిందే. ఎందుకంటే దోమలను పారదోలేందుకు వాడే కాయిల్స్‌తో కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. కాయిల్స్ పొగతో పాటు ఇళ్లలోపల సిగరెట్ పొగ కారణంగా అనారోగ్యం గ్యారంటీ అని తాజా అధ్యయనం చెబుతోంది. అయితే ఇక్కడ ఓ శుభవార్త ఉంది. ఈ రెండు పొగల కారణంగా కేన్సర్ మాత్రం రాదని ఎస్‌ఎన్ అప్లయిడ్ సైన్సెస్ తాజా సంచికలో ప్రచురితమైన పరిశోధన వ్యాసం చెబుతోంది.
ఇళ్ల లోపలి గాలిలోని కాలుష్యం మన ఆరోగ్యంపై ఏ రకమైన ప్రభావం చూపుతుందో తెలుసుకునేందుకు ఆగ్రాలోని అంబేడ్కర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం నిర్వహించారు. సీల్ చేసిన గదిలో వేర్వేరు పొగల ద్వారా ఏయే రసాయనాలు, లోహాలు గాల్లో కలుస్తున్నాయి.. వాటి పరిమాణం ఎంత.. (పీఎం 25, పీఎం 10, పీఎం 2.5, పీఎం 1) అన్నది లెక్కకట్టారు. మండించేందుకు ముందు.. మండుతూ ఉండగా, ఆ తర్వాత పరిశీలించగా అల్యూమినియం, రాగి, జింక్, కాడ్మియం, క్రోమియం, మాంగనీస్, నికెల్, సీసం, వనాడియం, సెలీనియం, స్కాండియం వంటివి ఉన్నట్లు స్పష్టమైంది. వీటిల్లో కూడా అల్యూమినియం, జింక్‌ల మోతాదు ఎక్కువగా ఉందని, కాడ్మియం, వనాడియంలు లేశమాత్రంగా ఉన్నాయని అజయ్ తనేజా అనే శాస్త్రవేత్త తెలిపారు.
కేన్సర్ ప్రమాదం తక్కువే..
క్రోమియం, సీసం, నికెల్‌ల ద్వారా కేన్సర్ వచ్చే అవకాశం ఉన్నా.. దోమల కాయిల్, సిగరెట్ పొగ రెండింటి ద్వారా వెలువడే ఈ లోహాలు పరిమితమైన స్థాయిలోనే ఉన్నాయని ఈ అధ్యయనం ద్వారా తెలిసింది. అయితే ఎంతకాలం పాటు ఈ విషవాయువులను పీలిస్తే శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయో స్పష్టంగా తెలియదని అజయ్ తనేజా వివరించారు. కాయిల్‌కు బదులుగా ద్రవాన్ని వాడినా ఇవే రకమైన రసాయనాలు విడుదలవుతాయని చెప్పారు.
వాయుకాలుష్యం అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్న నేపథ్యంలో కేంద్రం వాయుకాలుష్య నివారణకు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. కాయిల్, సిగరెట్‌లను మండించినప్పుడు అతి సూక్ష్మమైన ధూళికణాలు గాల్లోకి చేరతాయని వీటిని పీల్చడం వల్ల.. శరీరంపై దద్దుర్లు, అనేక రకాల అలర్జీలు, ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే అవకాశముందని అజయ్ తెలిపారు. దీనిపై మరిన్ని పరిశోధనలు చేసి ఫలితాలను నిర్ధారించుకోవాల్సి ఉందని చెప్పారు.
కాయిల్ పొగ.. పెడుతుంది సెగ..!
Published Wed, Jul 3 2019 2:48 AM | Last Updated on Wed, Jul 3 2019 2:48 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment