ఇకనైనా కళ్ళు తెరుస్తారా? | Sakshi Editorial On Global warming | Sakshi
Sakshi News home page

ఇకనైనా కళ్ళు తెరుస్తారా?

Published Thu, Mar 23 2023 12:22 AM | Last Updated on Thu, Mar 23 2023 12:22 AM

Sakshi Editorial On Global warming

ప్రపంచానికి మరోసారి ప్రమాద హెచ్చరిక. పారిశ్రామికీకరణ మునుపటి స్థాయితో పోలిస్తే పుడమి తాపం ఇప్పటికే 1.1 డిగ్రీల సెంటీగ్రేడ్‌ పెరిగింది. ఈ లెక్కన గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాలను గణనీయంగా తగ్గించాలనీ, ఈ శతాబ్ది చివరకు భూతాపోన్నతి 1.5 డిగ్రీల లోపలే ఉండేలా చూసు కోవాలనీ చెప్పుకున్న ఊసులు, చేసుకున్న బాసలు తీరా రానున్న పదేళ్ళలోనే పూర్తిగా భగ్నం కానున్నాయి.

‘ఆఖరి అవకాశంగా తెరిచి ఉన్న తలుపు సైతం మూసుకుపోతోంద’ని ప్రపంచ అగ్రశ్రేణి శాస్త్రవేత్తల బృందం ‘ఇంటర్‌ గవర్నమెంటల్‌ ప్యానెల్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌’(ఐపీసీసీ) చేసిన హెచ్చరిక మానవాళికి మేలుకొలుపు. ఇప్పటికైనా గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాలను నియంత్రించడానికి ప్రభుత్వాలు తక్షణం బరిలోకి దిగితే, ఎంతో కొంత ప్రయోజనమని సోమవారం నాటి తాజా నివేదిక కర్తవ్యాన్ని బోధిస్తోంది.

వాతావరణ కాలుష్యానికి ప్రధాన కారణమైన సంపన్న దేశాలు దీన్ని చెవి కెక్కించుకోకుండా, వర్ధమాన, నిరుపేద దేశాలదే బాధ్యత అన్నట్టు ప్రవర్తిస్తుండడమే ఇప్పుడున్న చిక్కు. విషాదం ఏమిటంటే– పాపం ఎవరిదైనా, ఫలితం ప్రపంచమంతా అనుభవించాల్సిందే!

ఐపీసీసీ 1988లో ఏర్పాటైన నాటి నుంచి ఇది ఆరో నివేదిక. ఈ ఆరో అంచనా నివేదిక (ఏఆర్‌6) కు సంబంధించిన నాలుగో విడత వివరాలివి. ఇదే ఆఖరి విడత కూడా! మునుపటి మూడు ప్రధాన విభాగాల నివేదికలోని కీలక సమాచారాన్ని ఒకచోట గుదిగుచ్చి అందిస్తున్నారు గనకనే ఈ చివరి దాన్ని ఐపీసీసీ ఏఆర్‌6 ‘సంకలన నివేదిక’ అన్నారు.

2021 ఆగస్ట్, 2022 ఫిబ్రవరి, ఏప్రిల్‌లలో వచ్చిన మొదటి మూడూ వాతావరణ సంక్షోభం, దాని పర్యవసానాలు, గ్రీన్‌హౌస్‌ వాయువులను తగ్గించే మార్గాల గురించి చెప్పాయి. తాజా ‘సంకలన నివేదిక’ ప్రధానంగా మునుపటి ప్రచురణ ల్లోని కీలక ఫలితాల పునశ్చరణ. భూతాపం ‘మళ్ళీ తగ్గించలేని స్థాయికి’ చేరుతోందనీ, మానవాళికి దుష్పరిణామాలు తప్పవనీ, కఠిన చర్యలతోనే ప్రమాదాన్ని నివారించగలమనీ ఇది హెచ్చరిస్తోంది. 

అపార ధనబలం, సాంకేతిక సామర్థ్యం తమ సొంతమైన ధనిక దేశాలు కేవలం అప్పులు, ప్రైవేట్‌ రంగ పెట్టుబడులిచ్చి వాతావరణ పరిరక్షణ చర్యకు సహకరించామని చేతులు దులుపుకొంటే సరిపోదు. ఈ 2020 –30 మధ్య ఇప్పుడు చేస్తున్న దానికి కనీసం 6 రెట్లయినా వాతావరణంపై పెట్టుబడి పెడితే తప్ప, తాపోన్నతిని 1.5 డిగ్రీల లోపు నియంత్రించే లక్ష్యం సాధ్యం కాదట.

అలాగే,  2020 నాటి స్థాయిలోనే మన వాతావరణ విధానాలు బలహీనంగా ఉంటే, ఈ శతాబ్ది చివరకు భూతాపం 3.2 డిగ్రీలు పెరుగుతుంది. ఒకసారి 1.5 డిగ్రీలు దాటి ఎంత పెరిగినా, ఆ వాతావరణ నష్టం పూడ్చలేనిది. మానవాళికి మహా విపత్తు తప్పదు. పెను ప్రభావం పడే దేశాల్లో భారత్‌ ఒకటని నివేదిక తేల్చింది.

వడగాడ్పులు, కార్చిచ్చులు, ఆకస్మిక వరదలు, సముద్రమట్టాల పెరుగుదల,పంటల ఉత్పత్తి తగ్గుదల, 2050 నాటికి 40 శాతం జనాభాకు నీటి కొరత – ఇలా పలు ప్రమాదాలు భారత్‌కు పొంచివున్నాయి. అయితే, వాతావరణ మార్పుల నివారణ భారాన్ని అందరూ పంచు కోవాలనే ‘వాతావరణ న్యాయ’ సూత్రానికి ఈ నివేదిక జై కొట్టడం మన లాంటి దేశాలకు ఊరట. 

మునుపు మూడు విడతల్లో ప్రచురించిన వేలకొద్దీ శాస్త్రీయ సమాచారాన్ని సంక్షిప్తంగా, ప్రపంచవ్యాప్తంగా విధాన నిర్ణేతలకు వారు చేపట్టాల్సిన చర్యలను సారాంశరూపంలో అందించడం తాజా సంకలన నివేదిక ప్రత్యేకత. నవంబర్‌ 20న దుబాయ్‌లో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ఆతిథ్య మివ్వనున్న ఐరాస తదుపరి వాతావరణ సదస్సు ‘కాప్‌ 28’కు ఈ నివేదిక ఒక దిక్సూచి.

2015లో ప్యారిస్‌ వాతావరణ ఒప్పందం నాటి నుంచి నేటి వరకు గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాలను తగ్గించడంలో వివిధ దేశాల పురోగతిని ఆ ‘కాప్‌ 28’లో మదింపు చేస్తారు. ఇప్పటి దాకా చేస్తున్నవేవీ చాలట్లేదని తాజా నివేదిక సాక్షిగా తెలుస్తూనే ఉంది. వెరసి, వాయు ఉద్గారాలను తగ్గించే లక్ష్యంలో ప్రభుత్వా లన్నీ విఫలమయ్యాయి.

నిజానికి, ఐపీసీసీ ఓ సమగ్ర నివేదిక ఇచ్చేందుకు 6 నుంచి 8 ఏళ్ళు పడుతోంది. అయినా గ్రీన్‌హౌస్‌ గ్యాస్‌లు పెరుగుతూనే ఉన్నాయి. నివేదికల పరిమాణం, సంక్షోభంపై చర్యల అత్యవసరం కూడా పెరుగుతూనే వచ్చాయి. ఇప్పటికైనా ప్రపంచ దేశాలు కఠిన చర్యలు చేపట్టకుంటే, ఆ తర్వాత ఏం చేసినా చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టే! 

ఉద్గారాలను గణనీయంగా తగ్గించడం, పునరుత్పాదక ఇంధనంపైనా – ఇతర తక్కువ కర్బన సాంకేతికతల పైనా దృష్టి సారించి శిలాజ ఇంధనాల వినియోగం మానేయడం, అటవీ పెంపకం లాంటివి ప్రభుత్వాలు చేయాల్సిన పని. అలాగే, ‘వాతావరణాన్ని బాగు చేసే’ మార్గాల్ని అన్వేషించాలి.

గాలిలో నుంచి కార్బన్‌ డయాక్సైడ్‌ను పీల్చేసే ‘డైరెక్ట్‌ ఎయిర్‌ క్యాప్చర్‌’ టెక్నాలజీలను అభివృద్ధి చేయాలి. ఐరాస ప్రధాన కార్యదర్శి మాట విని, ధనిక దేశాలు 2040 నాటికి ‘నెట్‌ జీరో’ను అందుకొనేలా తమ లక్ష్యాన్ని ముందుకు జరుపుకొంటే మంచిది. 

ఈ దేశాలు తమ వాతావణ బాధ్యతను నిర్వర్తించేలా చూడడం ఇప్పుడు సవాలు. ధనిక ప్రపంచపు బాధ్యతారహిత, మొండి వైఖరికి మిగతా అందరూ మూల్యం చెల్లించాల్సి రావడం మహా దారుణం. ఐపీసీసీ తదుపరి నివేదిక 2030లో కానీ రాదు.

కాబట్టి భూతాపోన్నతిని 1.5 డిగ్రీల లోపలే నియంత్రించేలా చర్యలు చేపట్టడా నికి ఈ ఏఆర్‌6 తుది ప్రమాద హెచ్చరిక. మేల్కొందామా? లేక కళ్ళు తెరిచి నిద్ర నటిద్దామా? ప్రస్తుతం ఛాయిస్‌ ప్రపంచ దేశాలదే! ఒకసారి పరిస్థితి చేయి దాటేశాక మాత్రం ఏం చేసినా ఫలితం శూన్యం.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement