‘టేస్టీ’ తలనొప్పి... ఐస్‌క్రీమ్ హెడేక్!
మెడి క్షనరీ
ఐస్‌క్రీమ్ లాంటి చల్లటి పదార్థాలు తినగానే తలనొప్పి వస్తోందా? కూల్‌డ్రింక్స్ లాంటివి తాగగానే హెడేక్ మొదలవుతోందా? వైద్యపరిభాషలో ‘స్ఫినోపాలటైన్ గాంగ్లియోన్యూరాల్జియా’ అనే వ్యాధికి వాడుకలో ఉన్న పేరే ‘ఐస్‌క్రీమ్ హెడేక్’. కొంతమంది మైగ్రేన్ బాధితుల్లో కూడా ఈ తరహా తలనొప్పి కనిపిస్తుంటుంది. ఐస్ తగలగానే నోటిలోని ఖాళీస్థలాలలోకి తెరచుకునే రక్తనాళాలు సంకోచించండంతో, ఆ విషయాన్ని మెదడుకు తెలిపే నరం కూడా ప్రతిస్పందిస్తుంది. అలా నోట్లోని ఇబ్బందికరమైన పరిస్థితి తలకూ పాకుతుంది. ఇలా ఒకచోటి సమస్య మరోచోటికి పాకడాన్ని ‘రిఫరింగ్ పెయిన్’ అంటారు.
నోటిలోని పైకప్పు అంటే... అంగిలిలోని నొప్పి ఇలా పాకడం వల్ల ఈ నొప్పిని కూడా రిఫరింగ్ పెయిన్ అంటారు. అయితే ఈ నొప్పి 20 సెకండ్ల నుంచి కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటుంది. కాస్త గోరు వెచ్చని నీళ్లను పుక్కిలించగానే ఈ నొప్పి తగ్గిపోతుంది. కాస్తంత వేడిగా ఉండే గాలిని పీల్చినా నొప్పి తగ్గుతుంది.