హోమియో కౌన్సెలింగ్
మైగ్రేన్ నివారణ, చికిత్స...
నాకు విపరీతమైన తలనొప్పి వస్తోంది. వారంలో ఒకటి, రెండు సార్లు తీవ్రంగా వస్తోంది. ఎన్నో రక్తపరీక్షలు, ఎక్స్-రే, స్కానింగ్ పరీక్షలు చేయించాను. డాక్టర్లు దీన్ని మైగ్రేన్‌గా నిర్ధారణ చేశారు. జీవితాంతం వస్తుంటుందని చెప్పారు. హోమియోపతిలో దీనికి చికిత్స ఉందా?
- రమణ, నూజివీడు
తరచూ తలనొప్పి వస్తే అశ్రద్ధ చేయకూడదు. నేటి ఆధునికయుగంలో శారీరక, మానసిక ఒత్తిడి, అనిశ్చితి, ఆందోళనలు తలనొప్పికి ముఖ్యమైన కారణాలు. ఇంకా రక్తపోటు, మెదడు కణుతులు, మెదడు రక్తనాళాల్లో రక్తప్రసరణల్లో మార్పులు, సైనసైటిస్ మొదలైన వాటివల్ల తలనొప్పి వచ్చేందుకు ఆస్కారం ఉంది. తలనొపి ఏ రకానికి చెందినదో నిర్ధారణ తర్వాత ఖచ్చితమైన చికిత్స చేయడం సులువవుతుంది. మైగ్రేన్ తలనొప్పిని పార్శ్వపు తలనొప్పి అంటారు. మానసిక ఆందోళన, ఒత్తిడి, జరిగిపోయిన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం, డిప్రెషన్, నిద్రలేమి, అధికప్రయాణాలు, సూర్యరశ్మి, స్త్రీలలో హార్మోన్ సమస్యల వల్ల ఈ పార్శ్వపు తలనొప్పి వస్తుంటుంది. పురుషులతో పోలిస్తే ఇది స్త్రీలలోనే ఎక్కువ.
మైగ్రేన్‌లో దశలూ, లక్షణాలు: సాధారణంగా మైగ్రేన్ వచ్చినప్పుడు 24 గంటల నుంచి 72 గంటలలోపు అదే తగ్గిపోతుంది. ఒకవేళ 72 గంటలకు పైనే ఉంటే దాన్ని స్టేటస్ మైగ్రేన్ అంటారు. దీంతోపాటు వాంతులు కావడం, వెలుతురునూ, శబ్దాలను అస్సలు భరించలేకపోవడం వంటి లక్షణాలూ కనిపిస్తాయి.
వ్యాధి నిర్ధారణ: రక్తపరీక్షలు, రక్తపోటును పరీక్షించడం, సీటీస్కాన్, ఎంఆర్‌ఐ పరీక్షల ద్వారా మైగ్రేన్‌ను నిర్ధారణ చేయవచ్చు.
నివారణ: మైగ్రేన్ రావడానికి చాలా అంశాలు దోహదపడతాయి. ఉదాహరణకు మనం తినే ఆహారంలో మార్పులు, మనం ఆలోచించే విధానం, మానసిక ఒత్తిడి, వాతావారణ మార్పులు, నిద్రలేమి, మహిళల్లో రుతుసమస్యలు వంటి కారణాలతో వచ్చినప్పుడు జీవనశైలిలో మార్పులతో దీన్ని కొంతవరకు నివారించవచ్చు. ఇక మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు వ్యాయామం, యోగా, ప్రాణాయామం చేయాలి.
చికిత్స: మైగ్రేన్‌ను పూర్తిగా తగ్గించడానికి హోమియోలో మంచి మందులు ఉన్నాయి. శారీరక, మానసిక, కుటుంబ, అనువంశీక, వాతావరణ, వృత్తిసంబంధమైన కారణాలను అంచనా వేసి, వాటిని అనుగుణంగా మందును ఎంపిక చేయాల్సి ఉంటుంది. వారి జెనెటిక్ కన్‌స్టిట్యూటషన్ సిమిలియమ్ వంటి అంశాలన పరిగణనలోకి తీసుకోవాలి. బెల్లడోనా, ఐరిస్, శ్యాంగ్యునేరియా, ఇగ్నీషియా, సెపియా వంటి కొన్ని మందులు మైగ్రేన్‌కు అద్భుతంగా పనిచేస్తాయి.
జనరల్ హెల్త్ కౌన్సెలింగ్
ఒత్తిడి తొలగించుకుంటే చాలు
నా వయసు 38 ఏళ్లు. సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తాను. తీవ్రమైన ఒత్తిడిలో ఉంటాను. ఎక్కువగా ఆందోళనకూ, ఉద్వేగాలకు గురవుతుంటాను. ఆలోచనలు చాలా ఎక్కువ. నిద్ర సరిగా పట్టదు. నా సమస్యలకు తగిన చికిత్సను సూచించండి.
- పి. విక్రమ్, సికింద్రాబాద్
మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు యాంగ్జైటీ డిజార్డర్‌తో బాధపడుతున్నట్లుగా అనిపిస్తోంది. మీరు చెప్పిన లక్షణాలైన తీవ్రమైన ఆందోళనలు, ఎడతెరిపి లేని ఆలోచనలు దీన్నే సూచిస్తున్నాయి. సాధారణంగా తీవ్రమైన ఒత్తిళ్లలో పనిచేసేవారిలో ఇది చాలా ఎక్కువ. మీరు ముందుగా ఒకసారి రక్తపరీక్షలు చేయించుకొని, రక్తంలో చక్కెరపాళ్లను పరీక్షించుకోండి. ఎందుకంటే మీ తరహా పనితీరు (సెడెంటరీ లైఫ్‌స్టైల్) ఉన్నవారిలో ఒత్తిడి వల్ల రక్తంలో చక్కెరల విడుదల ఎక్కువగా ఉంటుంది. దాంతో డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇలా మీకు తెలియకుండానే డయాబెటిస్ ఉంటే అది నరాలపై ప్రభావం చూపి, పెరిఫెరల్ నర్వ్స్, అటనామస్ నర్వ్స్ (స్వతంత్రనాడీ వ్యవస్థ)పై ప్రభావం చూపి ఇలా గాభరా, హైరానా పడేలా చేయడం చాలా సాధారణం. మీకు చికిత్స కంటే కూడా జీవనశైలిలో మార్పులు అవసరం. సమస్యపై అవగాహనతో, పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్లాలి. మీరు ఉదయమే నిద్రలేచి బ్రిస్క్ వాకింగ్ వంటి వ్యాయామాలు, యోగా, మెడిషటేషన్ చేయడం, వేళకు భోజనం తీసుకోవడం, వేళకు నిద్రపోవడం, ఒత్తిడి తగ్గించుకునేందుకు ఆహ్లాదకరమైన వ్యాపకాలను అలవరచుకోవడం వంటి జీవనశైలి మార్పులు చేసుకోండి.
దాంతో మీ సమస్య చాలావరకు తగ్గుతుంది. పైన పేర్కొన్న పరీక్షలు చేయించాక ఫిజీషియన్‌ను కలవండి. ఒకవేళ మీకు తెలియకుండా షుగర్ వచ్చి ఉంటే డాక్టర్... ఆ సమస్యకు కూడా కలిపి చికిత్స సూచిస్తారు. ఒకవేళ మీకు షుగర్ లేకపోతే... మీ జీవనశైలి వల్ల త్వరగా డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఉన్నందున... ఆ సమస్యను నివారించచడం కోసం జీవనశైలి మార్పులను తప్పక అనుసరిస్తూ, యాంగ్జటీని తగ్గించే మందులైన యాంగ్జియోలైటిక్స్‌ను డాక్టర్ పర్యవేక్షణలోనే వాడాలి.
నాకు 65 ఏళ్లు. షుగర్, బీపీ ఏమీ లేవు. అయితే పాతికేళ్లుగా సైనస్ సమస్యతో బాధపడుతున్నాను. ఉదయం లేవగానే చాలాసేపు తుమ్ములు వచ్చి, ముక్కు, కళ్ల నుంచి ధారగా నీరు కారుతుంది. నా సమస్య తగ్గే మార్గాన్ని సూచించండి.
- ఎమ్. రాజేశ్వరరావు, వరంగల్
సైనసైటిస్ సమస్యతో బాధపడుతున్న వ్యక్తులు ఉదయం వేళల్లో చలిగాలి సోకినప్పుడు, ఆ గాలి వల్ల సైనస్ రంధ్రాలు మూసుకుపోయి ఒకవిధమైన తలనొప్పి (మైల్డ్ హెడేక్)తో బాధపడతారు. మీలో వ్యాధినిరోధకశక్తి పెరగడానికి విటమిన్-సి టాబ్లెట్స్ వాడటం, యాంటీ అలర్జిక్ మందులు వాడటం వల్ల ప్రయోజనం ఉంటుంది. మీకు సరిపడని వాతావరణానికి వీలైనంత దూరంలో ఉండండి. మీకు బాగా ఇబ్బందిగా ఉంటే ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీబయాటిక్స్ వాడటంతో పాటు ఆవిరిపట్టడం (స్టీమ్ ఇన్‌హెలేషన్), నేసల్ డీ-కంజెస్టెంట్స్ వంటి మందులను డాక్టర్ సూచిస్తారు. చికిత్స కోసం మీరు ఒకసారి ఫిజీషియన్‌ను కలవండి.
పీడియాట్రిక్ కౌన్సెలింగ్
గుక్కపడితే... పాప నీలంగా మారుతోంది!
మా పాపకు 11 నెలలు. గుక్కపట్టి ఏడుస్తున్నప్పుడు పాప ముఖం తరచూ నీలంగా మారుతోంది. ఆ సమయంలో పాపను చూస్తుంటే ఆందోళనగా ఉంది. దయచేసి పాప సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి.
- సునీల, విశాఖపట్నం
మీ పాప ఎదుర్కొంటున్న సమస్యను ‘బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్’గా చెప్పవచ్చు. అంటే పాప కాసేపు ఊపిరి తీసుకోకుండా ఉండిపోతుందన్నమాట. పిల్లల్లో కోపం ఫ్రస్టేషన్ / భయం / కొన్ని సందర్భాల్లో గాయపడటం జరిగినప్పుడు ఇలా కావడం చాలా సాధారణం. ఆందోళన పడాల్సిన అవసరం లేదు. తొమ్మిది నెలల నుంచి 24 నెలల లోపు పిల్లల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. చిన్నారుల్లో ఐదు శాతం మందిలో ఇది చాలా సహజం. కుటుంబ చర్రితలో ఈ లక్షణం ఉన్నవారి పిల్లల్లో ఇది ఎక్కువ. ఇలాంటి లక్షణం ఉన్న పిల్లలు పెద్దయ్యాక చాలా మొండిగా అవుతారంటూ కొన్ని అపోహలున్నా, వాటికి శాస్త్రీయమైన ఆధారాలేమీ లేవు.
ఇది ఎందుకు వస్తుందనేది చెప్పడం కష్టమైనప్పటికీ రక్తహీనత ఉన్నవారిలో ఇది ఎక్కువ శాతం మందిలో కనిపిస్తుంది. బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్‌లో... సింపుల్, సైనోటిక్, ప్యాలిడ్, కాంప్లికేటెడ్ అని నాలుగు రకాలు ఉన్నాయి. మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీ పాపకు వస్తోంది సైనోటిక్ అనిపిస్తోంది. ఇక ప్యాలిడ్ అనే రకంలో పిల్లలు పాలిపోయినట్లుగా అయిపోయి, స్పృహతప్పిపోతారు. ఇటువంటి పిల్లల్లో ఒకసారి ఈసీజీ, ఈఈజీ తీయించడం చాలా అవసరం. ఎందుకంటే తీవ్రమైన కారణాలు ఏవైనా ఉంటే అవి బయటపడే అవకాశం ఉంటుంది. ఇక చికిత్స విషయానికి వస్తే... పాపలో ఈ ధోరణి కనిపించినప్పుడు కుటుంబ సభ్యులంతా తీవ్రమైన ఆందోళనకు గురవుతారు కాబట్టి వాళ్లకు ధైర్యం చెప్పడమే మొదటి అవసరం. చాలా కొద్దిమందిలో మాత్రం ఐరన్ ఇవ్వడం ఉపయోగకరంగా ఉంటుంది. పిల్లలూ, తల్లిదండ్రుల మధ్య ప్రేమాభిమానాలు బలపడినకొద్దీ ఈ లక్షణం క్రమంగా తగ్గిపోతుంది. ఐదేళ్ల వయసు వచ్చాక ఈ లక్షణం కనిపించడం చాలా అరుదు. పైన పేర్కొన్న పరీక్షలు కూడా ఏవైనా తీవ్రమైన సమస్య ఉందేమో అన్నది తెలుసుకోడానికి మాత్రమే. ఈ విషయంలో నిర్భయంగా ఉండండి. మరీ అవసరమైనప్పుడు మీ పిల్లల డాక్టర్‌ను సంప్రదిస్తే చాలు.
ఒత్తిడి తొలగించుకుంటే చాలు
Published Wed, Sep 2 2015 11:10 PM | Last Updated on Sun, Sep 3 2017 8:37 AM
Advertisement
Advertisement