
ఏమిటీ తలనొప్పి!
ఒక్క తల కానీ, రావణాసురుడికి ఉన్నన్ని రాక్షస తలనొప్పులు. అన్నీ వివరించాలంటే... పుస్తకమే రాయాలి. అదో తలనొప్పి. అందుకే క్లుప్తంగా... సమగ్రంగా. ఎన్నిరకాల తలనొప్పులో అన్నిరకాల జాగ్రత్తలు. ఈ వ్యాసం చదివిన తర్వాత ఒక్క విషయాన్నైతే అడగరు.. ఏమిటీ తలనొప్పి?
తల ఉన్న ప్రతివారికీ జీవితకాలంలోని ఏదో ఒక సమయంలో ఒకసారి తలనొప్పి రావడం తప్పనిసరి. ఇది ఎంతో బాధాకరం. వచ్చినప్పుడు ఏమీ చేయలేక చికాకు పడుతుంటాం. కాబట్టే ఏదైనా మామూలు సమస్య వచ్చినప్పుడు కూడా మనం ‘అబ్బా అదో తలనొప్పి’ అనే వ్యవహరిస్తుంటాం. ఇది రోగులకే కాదు, నయం చేయాలనుకున్న 70 శాతం మంది డాక్టర్లకు / న్యూరాలజిస్టులకు సైతం తలనొప్పే. సెరీనా విలియమ్స్ వంటి టెన్నిస్ హేమాహేమీల నుంచి సాధారణ వ్యక్తుల వరకు ఇది తరచూ ఇబ్బందులకు గురిచేస్తుంటుంది. మనకు అన్నీ ఒకేలా అనిపిస్తుంటాయి గానీ... ఇందులో ఒకటీ రెండూ కావు... దాదాపు 200పైగా తలనొప్పులు ఉంటాయి. ఇలాంటి అనేర రకాల తలనొప్పుల గురించి అవగాహన కోసం ఈ ప్రత్యేక కథనం.
తలనొప్పుల తీరుతెన్నులు, వాటి నిర్ధారణ పద్ధతులు, చికిత్సలు, ఇతరత్రా అంశాల ఆధారంగా తలనొప్పులను రకరకాలుగా విభజించవచ్చు. అయితే తలనొప్పుల కారణాలు లేదా అవి ఉద్భవించే తీరుతెన్నులను బట్టి నిపుణులు వాటిని ప్రధానంగా మూడు రకాలుగా విభజిస్తారు. అవి...
1) ప్రైమరీ తలనొప్పులు... ఈ తరహా తలనొప్పులు నేరుగా తలలోనే ఉద్భవిస్తాయి. ఈ నొప్పులకు కారణం తలలోనే ఉంటుంది.
2) సెకండరీ తలనొప్పులు... ఈ తరహా తలనొప్పులు ఇంకేదో బయటి కారణంతో వస్తుంటాయి. అంటే... తలలో గడ్డలు ఏర్పడటం, తలకు గాయం కావడం లేదా పక్షవాతం వంటి కారణాల వల్ల ఈ తలనొప్పులు వస్తాయి. కాబట్టే వీటిని సెకండరీ తలనొప్పులుగా చెప్పవచ్చు.
3) క్రేనియల్ న్యూరాల్జియా లేదా ఫేషియల్ పెయిన్స్‌తో పాటు ఇతర తలనొప్పులు... (తల లోపల 12 నరాలు ఉంటాయి. వీటినే క్రేనియల్ నర్వ్స్ అంటారు. ఈ నరాలు ఏవైనా కారణాలతో ఉద్రిక్తతకు లోనైతే వచ్చే తలనొప్పులను ఇలా చెప్పవచ్చు.
1. ప్రైమరీ తలనొప్పులు
మెదడులోని రసాయనాల్లో సమతౌల్యం లోపించడం వల్ల తలలోనే ఉద్భవించే తలనొప్పులివి.
మైగ్రేన్ : తలనొప్పులన్నింటిలోనూ మైగ్రేన్ చాలా సాధారణమైనది. ఇది టీనేజ్ పిల్లల్లో ఎక్కువ. యువకుల్లో కంటే యువతుల్లో మరింత ఎక్కువ. ఈ తలనొప్పి చాలా సందర్భాల్లో తలకు ఒకే వైపు వస్తుంటుంది. కొన్నిసార్లు ఇరుపక్కలా వస్తుంటుంది. వచ్చినప్పుడు నాలుగు నుంచి 72 గంటల వరకు కూడా వేధిస్తుంది. తలనొప్పితో పాటు వికారం / వాంతులు; కాంతిని చూసినా, శబ్దాలు విన్నా తలనొప్పి పెరగడం లక్షణాలుంటాయి. కొంతమందిలో కళ్లకు చిత్రవిచిత్రమైన కాంతి వలయాలు, కాంతిపుంజాలు, మెరుపులూ (ఫ్లాషింగ్ లైట్స్) కనిపిస్తాయి.
కారణాలివి: మైగ్రేన్‌కు చాలా కారణాలు ఉంటాయి. తీవ్రమైన యాంగై్జటీ, ఒత్తిడి, సరిపడని పదార్థాలు తినడం (ఉదాహరణకు చాక్లెటు, చీజ్, వెన్న, సోయా సాస్, కాఫీలోని కెఫిన్, ప్రాసెస్ చేసిన మాంసాహార పదార్థాలు, నిమ్మ జాతి పండ్లు వంటివి. ఇవి వేర్వేరు వ్యక్తుల్లో వేర్వేరుగా ఉండవచ్చు); తగినంత నిద్రలేకపోవడం, సమయానికి తినకుండా ఆకలితో ఉండటం, తీవ్రమైన శారీరక శ్రమ, వాతావరణంలో వచ్చే ఆకస్మిక మార్పులు, అగరుబత్తీలు, కొన్ని రసాయనాలతో చేసిన సెంట్ల నుంచి వచ్చే ఘాటైన వాసనలు, ఆల్కహాల్ (అందులోనూ ముఖ్యంగా రెడ్‌వైన్), చైనీస్ ఫుడ్ ఐటమ్స్, యువతుల్లో హార్మోన్ల మార్పులు, తలస్నానం చేస్తూనే తలకు బిగుతుగా ఉండే హెయిర్ బ్యాండ్ ధరించడం, ఎండకు ఒకేసారి ఎక్స్‌పోజ్ కావడం, మలబద్దకం వంటి అంశాలు మైగ్రేన్ తలనొప్పిని ప్రేరేపించి బాధను తీవ్రతరం చేస్తాయి.
ఇవే కాకుండా ఒక్కో వ్యక్తికి కొన్ని ప్రత్యేకమైన కారణాలు కూడా మైగ్రేన్‌ను ట్రిగర్ చేయవచ్చు. అందుకే చాలా అంశాల్ని వాకబు చేసి డాక్టర్లు కారణాన్ని తెలుసుకుంటారు. దీని నిర్ధారణకు ఏ రకమైన నిర్దిష్టమైన పరీక్ష ఉండదు. తలనొప్పుల నిర్ధారణ కోసం చేసే అన్ని పరీక్షల్లోనూ ఏ లోపం కనిపించకపోవడంతో పాటు పై లక్షణాలతో తలనొప్పి అదే పనిగా మాటిమాటికీ వస్తుండటం వంటి లక్షణాల ఆధారంగా దీన్ని నిర్ధారణ చేస్తారు. మైగ్రేన్‌కు రెండు రకాల చికిత్స చేస్తారు. మొదట తీవ్రమైన తలనొప్పిని తక్షణం తగ్గించడానికి చేసే చికిత్స. ఆ తర్వాత అది మళ్లీ తిరగబెట్టకుండా ఉండటానికి చేసే దీర్ఘకాలిక చికిత్స. ఇందుకోసం మూడు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం వాడాల్సి ఉంటుంది. ఇక మైగ్రేన్‌కు మందులతో పాటు యోగా, ధ్యానం (మెడిటేషన్) వంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ కూడా చాలావరకు ఉపయోగపడతాయి.
ఈ మందులతో తగ్గని కొన్ని మైగ్రేన్‌లకు ఇటీవల బొటాక్స్ చికిత్స చేస్తున్నారు. పెప్పర్‌మెంట్ ఆయిల్, లావండర్ ఆయిల్ తలకు అప్లై చేసుకోవడంతో ఉపశమనం దొరుకుతుంది. మెగ్నీషియమ్, రైబోఫ్లేవిన్ (బి2 విటమిన్) అధికంగా ఉన్న పదార్థాలు (గోధుమ వంటి ధాన్యాలు– పండ్లు, ఆకుకూరల్లో ఇవి అధికం) తీసుకోవడం ద్వారా కూడా ఉపశమనం దొరకుతుంది.
క్లస్టర్ హెడేక్ : ఇది కాస్త అరుదుగా కనిపించే తలనొప్పి. కంటి పాపల వెనక బాగా తీవ్రమైన నొప్పి వచ్చి, రెండు మూడు గంటలు బాధిస్తుంది. ఒక్కోసారి ఇది మాటిమాటికీ తిరగబెడుతూ కొద్దిరోజుల పాటు వస్తుంటుంది. రోజూ ఒకే వేళకు వస్తుంటుంది. ఏడాదిలో 8–10 వారాల పాటు వస్తుంటుంది. ఒకసారి అలా వచ్చాక మళ్లీ ఏడాది పాటు రాదు. కానీ ఆ మరుసటి ఏడాది కూడా మొదటిసారి వచ్చినట్లే మళ్లీ 8–10 వారాల పాటు అదే వేళకు వస్తూ ఉంటుంది.
చికిత్స : దీనికి తక్షణ చికిత్సగా ఆక్సిజన్‌ను అందిస్తారు లేదా ట్రిప్టాన్ మందులను ముక్కుద్వారా పీల్చేలా చేసి మొదట నొప్పిని తగ్గిస్తారు. దీర్ఘకాలికంగా ఈ తరహా తలనొప్పి రాకుండా చికిత్స అందించాల్సి ఉంటుంది. ప్రైమరీ కాఫ్ అండ్ లాఫ్ హెడేక్ : తీవ్రంగా దగ్గడం లేదా గట్టిగా చాలాసేపు నవ్వడం లేదా గట్టిగా తుమ్మడం వంటి చర్యల వల్ల అకస్మాత్తుగా వచ్చే తలనొప్పి ఇది. ఒక్కోసారి గుండె నుంచి మెడ ద్వారా తలలోకి రక్తాన్ని తీసుకెళ్లే కెరోటిడ్ ఆర్టరీ అనే మంచి రక్తనాళం సన్నబడటం వల్ల కూడా ఈ తరహా తలనొప్పి రావచ్చు.
ప్రైమరీ స్టాబింగ్ హెడేక్: తలలో కత్తితో పొడిచినట్లుగా ఉండే తలనొప్పిని ఈ పేరుతో పిలుస్తారు.
హిప్నిక్ హెడేక్ : నిద్రలోనే మొదలై నిద్రలేచాక కూడా దాదాపు 15–30 నిమిషాల పాటు ఉంటుంది. సాధారణంగా 60 ఏళ్లు దాటిన వారిలో అందునా మరీ ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. నిద్రకు ఉపక్రమించే ముందు ఒక కాఫీ తాగడం లేదా లిథియమ్ మాత్రలు వంటివి ఈ తరహా తలనొప్పికి చికిత్స.
ఇతర తలనొప్పులు : ఇవేగాక న్యూ డైలీ పర్సిస్టింగ్ హెడేక్, ప్రైమరీ థండర్‌క్లాప్ హెడేక్, క్లస్టర్ హెడేక్స్‌లో ఒక రకమైన ప్రైమరీ పారాక్సిస్మల్ హెమిక్రేనియా వంటి చాలా రకాల తలనొప్పుల కూడా ఉన్నాయి. కొన్నిసార్లు పంటినొప్పి, చెవినొప్పి, గొంతునొప్పి, కళ్లు నొప్పిగా ఉండటం వంటి కారణాలు కూడా తలనొప్పికి దారితీస్తాయి. తలనొప్పి వచ్చినప్పుడు అంతగా ఆందోళన పడకూడదు. అయితే మాటిమాటికీ తలనొప్పి వస్తుంటే మాత్రం డాక్టర్‌ను కలిసి కారణాన్ని కనుగొని, తగిన చికిత్స తీసుకోవాలి.
చికిత్సకు ఎప్పుడు వెళ్లాలంటే...
జీవితంలో మొట్టమొదటి సారే తీవ్రంగా భరించలేనంత తలనొప్పి వచ్చినప్పుడు. అది మొదలుకావడమే తలబద్ధలైపోతూ భరించశక్యం కానప్పుడు. ∙సమయం గడుస్తున్నకొద్దీ ఏమాత్రం ఉపశమనం లేకుండా దాని తీవ్రత అంతకంతకూ పెరుగుతున్నప్పుడు ∙తలనొప్పితో పాటు జ్వరం/నీరసం/ఫిట్స్ / చేయి–కాలు బలహీనత వచ్చి కళ్లు మసకబారుతుంటే ∙పైకి లేస్తున్నప్పుడు లేదా ఏదైనా వస్తువును ఎత్తుతున్నప్పుడు లేదా ముందుకు వంగుతున్నప్పుడు తలనొప్పి రావడం. ∙నిద్రలో తలనొప్పి వచ్చి నిద్రాభంగం అవుతున్నప్పుడు
పైన పేర్కొన్న అంశాలు కనిపిస్తున్నప్పుడు తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించి సీటీ స్కాన్/ఎమ్మారై స్కాన్ అవసరాన్ని బట్టి మెదడు నుంచి నీరు తీసి చేసే సీఎస్‌ఎఫ్ (సెరిబ్రోస్పినల్ ఫ్లుయిడ్) పరీక్ష వంటివి చేయాలి.
2. సెకండరీ తలనొప్పులు
వీటిలో కొన్ని ప్రధానమైనవి.
మెనింజైటిస్ : ఇది మెదడు పొరల్లో ఒకదానికి వచ్చే ఇన్ఫెక్షన్. ఇందులో కనిపించే లక్షణాలు... తలనొప్పితో పాటు జ్వరం, వాంతులు, మెడ బిగుసుకుపోవటం, వెలుగు చూడటానికి ఇబ్బందిగా ఉండటం లేదా శబ్దాలు వినడానికి ఇబ్బందిగా ఉండటం. మెనింజైటిస్ సమస్యను సీఎస్‌ఎఫ్ (మెదడులోని ద్రవం – సెరిబ్రోస్పినల్ ఫ్లుయిడ్)ను పరీక్షించడం ద్వారా నిర్ధారణ చేయవచ్చు.
బ్రెయిన్ ట్యూమర్ : మెదడులో గడ్డలు ఏర్పడటం వల్ల తలనొప్పి వస్తుంది. మెదడులోని గడ్డ పెరుగుతున్న కొద్దీ నొప్పి కూడా పెరుగుతూ పోతుంది. వారాల తరబడి కొనసాగుతుంది.నిద్రలేవగానే నొప్పి ఎక్కువగా ఉంటుంది. తలనొప్పితో పాటు వాంతులు ఉంటాయి. ఒక్కోసారి ఫిట్స్ కూడా రావచ్చు. ముందుకు ఒంగినప్పుడు తలనొప్పి ఎక్కువగా ఉంటుంది లేదా ఏదైనా వస్తువులను ఎత్తినప్పుడు తలనొప్పి పెరుగుతుంది. ఇంట్రాక్రేనియల్ హేమరేజ్ తలనొప్పులు: తల (పుర్రె)లో అంతర్గత రక్తస్రావం కావడం వల్ల వచ్చే తలనొప్పి ఇది. అకస్మాత్తుగా తలనొప్పి వచ్చి శరీరంలోని ఏదైనా అవయవం బలహీనంగా కావడం లేదా చచ్చుబడిపోయినట్లుగా కావడం జరుగుతుంది. ఒక్కోసారి మాట ముద్దముద్దగా రావడం వంటి మార్పులు కనిపించవచ్చు. దీన్ని సీటీ స్కాన్ పరీక్షతో సమస్యను నిర్ధారణ చేయవచ్చు.
టెంపోరల్ ఆర్టిరైటిస్: ఇది 60 ఏళ్ల వారిలో కనిపించే తలనొప్పి. ఆ వయసు వారిలో మొదటిసారి కనిపించే తలనొప్పి ఇది. దీనితో పాటు జ్వరం, బరువు తగ్గడం, దవడ నొప్పి, ఏదైనా నములుతున్నప్పుడు నొప్పి పెరగడం, రాత్రిళ్లు నొప్పి ఎక్కువగా ఉండటం, కణతల వద్ద నొక్కినప్పుడు నొప్పి ఎక్కువగా ఉండటం వంటివి ఇందులో లక్షణాలు. రక్తపరీక్ష చేయించినప్పుడు ఈఎస్‌ఆర్ చాలా ఎక్కువగా ఉంటుంది, టెంపొరల్ ఆర్టరీ బయాప్సీ ద్వారా దీన్ని నిర్ధారణ చేస్తారు.
గ్లకోమా హెడేక్: కంటిగుడ్డులో ఒత్తిడి పెరగడం వల్ల వచ్చే తలనొప్పి ఇది. ఇందులో తలనొప్పితో పాటు వికారం, వాంతులు వంటి లక్షణాలు ఉంటాయి. ఇది నెమ్మదిగా చూపును హరించి వేస్తుంది. కాబట్టి తలనొప్పి కనిపించగానే డాక్టర్‌ను సంప్రదించాలి. ఇవే గాక... సర్వైకల్ నర్వ్స్ ఒత్తిడికి లోనైనప్పుడు, పక్క మీద తలగడ సరిగా లేనప్పుడు కూడా తలనొప్పులు వస్తుంటాయి. ఇలా ఇతరత్రా కారణాలతో వచ్చే తలనొప్పులు చాలా ఎక్కువగానే ఉన్నాయి.
సాధారణ నివారణ
తరచూ తలనొప్పి వస్తుంటే డాక్టర్‌ను సంప్రదించేలోపు ఈ జాగ్రత్తలు తీసుకోండి... ∙కంప్యూటర్ వర్క్ చేసే వారు కంటికి ఒత్తిడి కలగకుండా యాంటీ గ్లేయర్ గ్లాసెస్ ధరించాలి. అలాగే ప్రతి గంటకు ఒకసారి అయిదు నిమిషాల పాటు రిలాక్స్ అవాలి ∙పిల్లల్లో తలనొప్పులు వస్తే నిర్లక్ష్యం చేయకూడదు. ఐ సైట్ వల్ల తలనొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. తలనొప్పితో పాటు తల తిరగడం, వాంతుల కావడం వంటివి జరిగితే వెంటనే సంబంధిత వైద్యులను సంప్రదించాలి. ∙రోజూ ప్రశాంతంగా కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలపాటు నిద్ర పోవాలి. కొన్ని సందర్భాల్లో నిద్ర మరీ ఎక్కువైనా తలనొప్పి వస్తుంది. కాబట్టి వ్యక్తిగతంగా ఎవరికి సరిపడినంతగా వారు నిద్రపోవడం మంచిది. ∙మనకు సరిపడని పదార్థాలు తీసుకోవడం ఆపేయాలి. ∙ఆల్కహాల్, పొగతాగడం వంటి దురలవాట్లను తప్పనిసరిగా మానేయాలి.
3. క్రేనియల్ న్యూరాల్జియా
మన తలలోని పుర్రెను క్రేనియమ్ అంటారు. ఇందులో కీలకమైన 12 నరాలు ఉంటాయి. వీటిని క్రేనియల్ నర్వ్స్ అంటారు. ఇవి ఉద్వేగానికి లేదా ఉద్రిక్తతకు లోను కావడం వల్ల వచ్చే తలనొప్పులను క్రేనియల్ న్యూరాల్జియా అంటారు. న్యూరా.. అంటే నరం అని అర్థం. అలాగే ఆల్జియా అంటే నొప్పి. కాబట్టే తరహా తలనొప్పులను క్రేనియల్ న్యూరాల్జియాగా వ్యవహరిస్తుంటారు. ఆక్సిపెటల్ న్యూరాల్జియా: తీక్షణమైన కాంతిని చూసినప్పుడు తలలోని వెనుక భాగంలో (ఆక్సిపెటల్ అనే ప్రాంతంలో) ఉండే నరాలు ఉద్రిక్తతకు గురై తలనొప్పి రావచ్చు. ఇలా వచ్చే తలనొప్పిని ఆక్సిపెటల్ న్యూరాల్జియా అంటారు. ట్రైజెమినల్ న్యూరాల్జియా : నుదుటి నుంచి చెంప, దవడ వరకు అంటే దాదాపు పూర్తి ముఖానికి వెళ్లే తలనరాలలో ప్రధానమైనది ఈ ట్రైజెమినల్ నర్వ్. ఇది తీవ్రంగా ఉద్రిక్తం చెందినప్పుడు ఏ పదార్థాన్ని కూడా నమలలేనంత / తినలేనంత తీవ్రమైన నొప్పి వస్తుంది. కనీసం మాట్లాడటం కూడా సాధ్యం కాదు. ప్రముఖ బాలివుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇటీవల ఈ నొప్పితో బాధపడ్డాడు. ఈ తరహా తలనొప్పిని ముందుగా మందులతో తగ్గిస్తారు. 95 శాతం కేసుల్లో మందులతోనే తగ్గుతుంది. అయితే మందులతో తగ్గనప్పుడు చిన్న శస్త్రచికిత్స లేదా రేడియో శస్త్రచికిత్స ద్వారా ఈ నొప్పిని శాశ్వతంగా తగ్గించవచ్చు.
ఒక ముఖ్య సూచన : కొంతమంది హైబీపీ వల్ల తలనొప్పి వస్తుందని అపోహ పడుతుంటారు. తలనొప్పి రావాలంటే బీపీ 210 / 110 ఉన్నప్పుడు మాత్రమే తలనొప్పి వస్తుంది. అప్పుడే ఇంత హైబీపీ తలనొప్పికి కారణమవుతుంది.
డా. బి. చంద్రశేఖర్‌రెడ్డి
సీనియర్ న్యూరాలజిస్ట్
సిటీ న్యూరో సెంటర్, హైదరాబాద్