ఆ గాయకులకు.. చక్రినే అండ
హైదరాబాద్ : శ్రోతలకు మంచి సంగీతాన్ని ఇవ్వడమేకాదు...ఎంతో మంది మంచి గాయకులను చక్రి తెలుగు చిత్ర పరిశ్రమకు అందించారు. కౌసల్య, సింహ, రఘు కుంచే, రవి వర్మ లాంటి గాయకులకు చక్రీయే అండా దండ. చక్రి ఇచ్చిన ప్రోత్సాహంతోనే వీరంతా టాలీవుడ్‌లో నిలదొక్కుకోగలిగారు. అంతే కాదు...కొత్తవారిని పరిచయడం చేయడంలో చక్రి ఎప్పుడూ ముందుంటారు. చక్రీ మృతి పట్ల గాయకుడు సింహ మాట్లాడుతూ తనకు గాయకుడిగా జీవితాన్ని ఇచ్చింది చక్రి అన్నారు.
గత పదేళ్లగా ఆయన సంగీతం అందించిన ప్రతి సినిమాలోనూ ఓ పాట పాడేందుకు అవకాశం ఇచ్చారని.. ఆయన సంగీతం అందించిన చివరి చిత్రం ఎర్రబస్సు వరకూ తనకు పాడే అవకాశం ఇచ్చారని సింహ గుర్తు చేసుకున్నారు. చక్రితో అనుబంధం మరవలేనిదని, స్నేహానికి ఆయన మారుపేరు అన్నారు. వర్ధమాన గాయనీ, గాయకులకు చక్రి ఉన్నారనే భరోసా ఉండేదని, ప్రతిపాట ఆయన ప్రేమగా చేసేవారని సింహ అన్నారు. అలాంటి వ్యక్తిని మళ్లీ చూడలేమని...ఇంకా చూడలేమని సింహ పేర్కొన్నారు. చక్రి మరణం సంగీత ప్రపంచానికి తీర్చలేని లోటుగా అభివర్ణించారు.
ఇక చక్రి, కౌసల్య కాంబినేషన్‌లో వచ్చిన సాంగ్స్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్‌గా నిలిచిపోతాయి. తెలంగాణ రాష్ట్రానికి చెందిన అతి తక్కువ మంది సంగీతదర్శకుల్లో చక్రి ఒకరు. చిన్నవయస్సులోనే సంగీత దర్శకుడిగా అరంగేట్రం చేసి... మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. దర్శకుడు ఎన్. శంకర్ , జగపతిబాబు కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం జైబోలో తెలంగాణ సినిమాకి చక్రికే సంగీతమందించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే ప్రధానంశంగా తెరకెక్కిన ఈ సినిమాలో...చక్రి సమకూర్చిన పాటలు హైలెట్‌గా నిలిచాయి.