సంగీతమే ప్రాణంగా బతికిన వ్యక్తి చక్రి. పూరీ జగన్నాధ్ బచ్చి సినిమాతో సంగీత దర్శకుడిగా కెరీర్ ఆరంభించిన ఆయన దాదాపు 85 సినిమాలకు పని చేశారు. సింహా సినిమాకు గానూ నంది అవార్డు అందుకున్నారు. మాస్ మహారాజ రవితేజకు క్లాస్‌తో పాటు మాస్ సంగీతాన్ని అందించారు. రవితేజ చేసిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, ఇడియట్, కృష్ణ, భగీరథ, నేనింతే, అమ్మానాన్న ఓ తమిళమ్మాయి సినిమాలకు చక్రియే సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. శివమణి, దేవదాసు, దేశముదురు, ఢీ వంటి ఎన్నో చిత్రాలు విజయవంతం కావడంలో పాలు పంచుకున్నారు. ఊబకాయ సమస్యతో బాధపడిన చక్రి 2014 డిసెంబర్ 15న నిద్రలోనే తుదిశ్వాస విడిచారు.
చక్రి సోదరుడు మహతి నారాయణ్ సైతం ఇండస్ట్రీలో సంగీత దర్శకుడిగా రాణిస్తున్నాడు. తాజాగా ఆయన చక్రి మరణం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. 'మ్యూజిక్ ఫీల్డ్‌లోకి రావద్దనుకున్నాను. కానీ చక్రి అన్నయ్య.. నెక్స్ట్ జెనరేషన్‌కు నా వారసులు ఉండొద్దా? అనేవాడు. తన ఇన్‌ఫ్లూయెన్స్ నా మీద పడకూడదనేవాడు. చివరకు ఆయన వెళ్లిపోయి నన్ను వారసుడిని చేస్తాడనుకోలేదు. అలాంటి వారసత్వం ఇచ్చినప్పుడు నేను ఎంతో కష్టపడాలి. ఇంకా చాలా సాధించాలి.
అన్నయ్య మరణం మా జీవితంలో తీరని లోటు. అమ్మ ఇప్పటికీ ఆ విషాదం నుంచి కోలుకోవడం లేదు. తను పూర్తిగా ఆ బాధతోనే కాలం గడుపుతోంది. ఇంట్లో టీవీ పెట్టాలన్నా భయమేస్తోంది. అన్నయ్య పాటలొస్తే తను ఏడుస్తూనే ఉంటుంది. టీవీ పెట్టకపోతే అన్నయ్య గొంతు వినబడట్లేదు అని బాధపడుతుంది. తను ఇంకెప్పటికీ కోలుకోలేదు. ఒకవైపు మానసిక క్షోభ, మరోవైపు ఆర్థిక కష్టాలతో బతుకు వెళ్లదీస్తున్నాం.
అన్నయ్య మరణించిన సమయానికి మేము ఇంట్లో లేము. వదినతో జరిగిన కొన్ని గొడవల వల్ల వేరే ఇంట్లో ఉన్నాం. ఆరోజు రాత్రి అన్నయ్య మా దగ్గరకు వచ్చి తన ఇంటికి వెళ్లిపోయాడు. తెల్లారేసరికి చనిపోయాడన్న వార్త వచ్చింది. కానీ అన్నయ్య మరణంపై నాకిప్పటికీ అనుమానం ఉంది. ఆయనది సహజ మరణమే అయితే పోస్ట్‌మార్టమ్ చేయించడానికి ఎందుకు భయపడ్డారు? రాత్రి మా ఇంటికి వచ్చినప్పుడు అమ్మ విషం పెట్టి చంపింది అని పోలీసులకు ఫిర్యాదు చేశారు.. గుండెల్లో పెట్టుకున్న కొడుకును కన్నతల్లి విషం పెట్టి చంపుతుందా? మా దురదృష్టవశాత్తూ ఆయన ఎలా చనిపోయారని మేము నిరూపించలేకపోయాం. అక్కడ నేను ఫెయిలయ్యాను.
ఆయన చనిపోయాక తన స్టూడియో నాకు వచ్చేసిందని ప్రచారం నడిచింది. కానీ అందులో ఎలాంటి నిజం లేదు. చెప్పాలంటే ఎవరో కావాలని స్టూడియో బయట సోఫాలు తగలబెట్టి ఆ నేరం నాపై మోపారు. తీరా స్టూడియోకు వెళ్లి చూస్తే అందులో ఉన్న సామాను, అవార్డులంతా ఎత్తుకెళ్లారు. అన్నయ్య గుర్తులు ఏవీ లేకుండా పోయాయి' అని చెప్తూ కంటతడి పెట్టుకున్నాడు. మహిత్ నారాయణ విషయానికి వస్తే.. లవ్యూ బంగారం, నేనో రకం, రామప్ప, పరారీ, రెడ్డిగారి ఇంట్లో రౌడీయిజం వంటి పలు సినిమాలకు సంగీత దర్శకుడిగా వ్యవహరించాడు.
Comments
Please login to add a commentAdd a comment