Music Director Chakri
-
చక్రి అన్న మరణంపై ఇప్పటికీ అనుమానం.. పోస్ట్‌మార్టమ్ చేయనివ్వలేదు
సంగీతమే ప్రాణంగా బతికిన వ్యక్తి చక్రి. పూరీ జగన్నాధ్ బచ్చి సినిమాతో సంగీత దర్శకుడిగా కెరీర్ ఆరంభించిన ఆయన దాదాపు 85 సినిమాలకు పని చేశారు. సింహా సినిమాకు గానూ నంది అవార్డు అందుకున్నారు. మాస్ మహారాజ రవితేజకు క్లాస్‌తో పాటు మాస్ సంగీతాన్ని అందించారు. రవితేజ చేసిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, ఇడియట్, కృష్ణ, భగీరథ, నేనింతే, అమ్మానాన్న ఓ తమిళమ్మాయి సినిమాలకు చక్రియే సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. శివమణి, దేవదాసు, దేశముదురు, ఢీ వంటి ఎన్నో చిత్రాలు విజయవంతం కావడంలో పాలు పంచుకున్నారు. ఊబకాయ సమస్యతో బాధపడిన చక్రి 2014 డిసెంబర్ 15న నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. చక్రి సోదరుడు మహతి నారాయణ్ సైతం ఇండస్ట్రీలో సంగీత దర్శకుడిగా రాణిస్తున్నాడు. తాజాగా ఆయన చక్రి మరణం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. 'మ్యూజిక్ ఫీల్డ్‌లోకి రావద్దనుకున్నాను. కానీ చక్రి అన్నయ్య.. నెక్స్ట్ జెనరేషన్‌కు నా వారసులు ఉండొద్దా? అనేవాడు. తన ఇన్ఫ్లూయెన్స్ నా మీద పడకూడదనేవాడు. చివరకు ఆయన వెళ్లిపోయి నన్ను వారసుడిని చేస్తాడనుకోలేదు. అలాంటి వారసత్వం ఇచ్చినప్పుడు నేను ఎంతో కష్టపడాలి. ఇంకా చాలా సాధించాలి. అన్నయ్య మరణం మా జీవితంలో తీరని లోటు. అమ్మ ఇప్పటికీ ఆ విషాదం నుంచి కోలుకోవడం లేదు. తను పూర్తిగా ఆ బాధతోనే కాలం గడుపుతోంది. ఇంట్లో టీవీ పెట్టాలన్నా భయమేస్తోంది. అన్నయ్య పాటలొస్తే తను ఏడుస్తూనే ఉంటుంది. టీవీ పెట్టకపోతే అన్నయ్య గొంతు వినబడట్లేదు అని బాధపడుతుంది. తను ఇంకెప్పటికీ కోలుకోలేదు. ఒకవైపు మానసిక క్షోభ, మరోవైపు ఆర్థిక కష్టాలతో బతుకు వెళ్లదీస్తున్నాం. అన్నయ్య మరణించిన సమయానికి మేము ఇంట్లో లేము. వదినతో జరిగిన కొన్ని గొడవల వల్ల వేరే ఇంట్లో ఉన్నాం. ఆరోజు రాత్రి అన్నయ్య మా దగ్గరకు వచ్చి తన ఇంటికి వెళ్లిపోయాడు. తెల్లారేసరికి చనిపోయాడన్న వార్త వచ్చింది. కానీ అన్నయ్య మరణంపై నాకిప్పటికీ అనుమానం ఉంది. ఆయనది సహజ మరణమే అయితే పోస్ట్‌మార్టమ్ చేయించడానికి ఎందుకు భయపడ్డారు? రాత్రి మా ఇంటికి వచ్చినప్పుడు అమ్మ విషం పెట్టి చంపింది అని పోలీసులకు ఫిర్యాదు చేశారు.. గుండెల్లో పెట్టుకున్న కొడుకును కన్నతల్లి విషం పెట్టి చంపుతుందా? మా దురదృష్టవశాత్తూ ఆయన ఎలా చనిపోయారని మేము నిరూపించలేకపోయాం. అక్కడ నేను ఫెయిలయ్యాను. ఆయన చనిపోయాక తన స్టూడియో నాకు వచ్చేసిందని ప్రచారం నడిచింది. కానీ అందులో ఎలాంటి నిజం లేదు. చెప్పాలంటే ఎవరో కావాలని స్టూడియో బయట సోఫాలు తగలబెట్టి ఆ నేరం నాపై మోపారు. తీరా స్టూడియోకు వెళ్లి చూస్తే అందులో ఉన్న సామాను, అవార్డులంతా ఎత్తుకెళ్లారు. అన్నయ్య గుర్తులు ఏవీ లేకుండా పోయాయి' అని చెప్తూ కంటతడి పెట్టుకున్నాడు. మహిత్ నారాయణ విషయానికి వస్తే.. లవ్యూ బంగారం, నేనో రకం, రామప్ప, పరారీ, రెడ్డిగారి ఇంట్లో రౌడీయిజం వంటి పలు సినిమాలకు సంగీత దర్శకుడిగా వ్యవహరించాడు. -
అన్నయ్య భార్య ఆస్తులు అమ్ముకొని వెళ్లిపోయింది: చక్రి సోదరుడు
దివంగత సంగీత దర్శకుడు చక్రి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.ఇడియట్, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి, సత్యం, శివమణి, దేశముదురు సహా పలు సినిమాలకు సంగీతం అందించి అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే 2014లో గుండెపోటుతో కన్నుమూశారు. ఇక చక్రి మరణించిన తర్వాత కుటుంబంలో ఆస్తి పరమైన ఇబ్బందులో తలెత్తి అది మీడియా వరకు రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. తాజాగా చక్రి సోదరుడు మహిత్ నారాయణ ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఆయన మాట్లాడుతూ.. ''చక్రి అన్నయ్య ఉన్నప్పుడు మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ ఆయన చనిపోయాక ఆస్తి గొడవలు వచ్చాయి. ఓవైపు అన్నయ్య లేడనే బాధకి తోడు ఈ గొడవలతో ప్రతిరోజు నరకం అనుభవించాము. అన్నయ్య ఆస్తుల్లో కొన్నింటిని ఆమె భార్య అమ్మేసుకొని అమెరికా వెళ్లిపోయింది. అక్కడే ఇంకో పెళ్లి చేసుకొని హ్యాపీగా సెటిల్ అయ్యింది. ఆమెతో మాకెలాంటి సంబంధాలు లేవు. మరికొన్ని ఆస్తులు కోర్టు కేసులో ఉన్నాయి'' అంటూ మహిత్ పేర్కొన్నాడు. తాజాగా ఆయన ‘పరారీ’ అనే సినిమాకు సంగీతం అందించారు. -
మళ్లి కూయవే గువ్వా..?
-
చక్రి స్టూడియోలో అగ్ని ప్రమాదం
హైదరాబాద్: దివంగత సంగీత దర్శకుడు చక్రి స్టూడియోలో సోమవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు కమలాపురి కాలనీలో ఉన్న స్టూడియోను పెట్రోలు పోసి దహనం చేయటంతో ఆస్తి నష్టం సంభవించిందని చక్రి భార్య శ్రావణి మంగళవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు.. కమలాపురి కాలనీలో చక్రి పేరుతో సీ-స్టూడియో ఉంది. కాగా, దీనికి సంబంధించిన తాళం చెవి శ్రావణి వద్దే ఉంది. సోమవారం జూబ్లీహిల్స్ పోలీసుల అనుమతితో ఈ స్టూడియోను తెరిచి కార్యకలాపాలు నిర్వహించారు. అయితే అర్ధరాత్రి 11 గంటల సమయంలో స్టూడియోలోంచి మంటలు వస్తున్నట్లు ఇంటి యజమాని రమేష్‌చంద్ తమకు సమాచారం అందించారని వివరించారు. అదే రాత్రి వచ్చి చూడగా స్టూడియో మొత్తం దగ్ధమై ఉందని శ్రావణి తెలిపారు. తాను స్టూడియోను నడిపించటం కొంత మందికి నచ్చడం లేదని.. దీని వెనుక తన అత్త, మరిది ప్రమేయం ఉందని ఆరోపించారు. వారి నుంచి తనకు ప్రాణహాని ఉన్న విషయం కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. స్టూడియో దహనం వెనుక కారణాలపై దర్యాప్తు చేయాలని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, గుర్తు తెలియని దుండగులు దాడి చేసినట్లు చక్రీ సోదరుడు మహిత్ నారాయణ కూడా మంగళవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గతరాత్రి చక్రి ఆఫీస్‌పై దాడి చేసిన దుండగులు అక్కడ ఫర్నిచర్‌ను దగ్ధం చేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. -
చక్రిది సహజ మరణమే!!
-
చక్రిది సహజ మరణమే!!
ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి మృతిపై నెలకొన్న అనుమానాలన్నీ వీడిపోయాయి. ఆయన అస్థికల్లో ఎలాంటి విషపదార్థాలు లేవని ఫోరెన్సిక్ పరీక్షలలో వెల్లడైంది. చక్రి అస్థికలను ఫోరెన్సిక్ నిపుణులు విశ్లేషించి చూశారు. అయితే అందులో ఎలాంటి విష పదార్థాల ఆనవాళ్లు లేవని వాళ్లు తేల్చారు. దాంతో చక్రిది సహజమరణమే తప్ప అందులో అనుమానించాల్సిన విషయం ఏమీ లేదని తేల్చి చెప్పారు. టాలీవుడ్ సంగత దర్శకుడు చక్రి మరణంపై మిస్టరీ ఉందంటూ కుటుంబ సభ్యులు ఇంతకుముందు అనుమానాలు వ్యక్తం చేశారు. చక్రి భార్య శ్రావణి, ఆమె అత్తమామలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ఇప్పుడు అవన్నీ ఉత్త అనుమానాలు మాత్రమేనని తేలిపోయింది. -
చక్రి మృతిపై అనుమానాస్పద కేసు నమోదు
-
చక్రి మృతిపై అనుమానాస్పద కేసు నమోదు
హైదరాబాద్: ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి మరణంపై ఐపీసీ సెక్షన్ 174 కింద అనుమానాస్పద కేసుగా జూబ్లీహిల్స్ పోలీసులు నమోదు చేశారు. తన కొడుకు మరణంపై అనుమానాలున్నాయని ఆయన తల్లి విద్యావతి, సోదరుడు మహిత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. తన కోడలు శ్రావణి వల్లనే చక్రి చనిపోయాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతే కాకుండా తన కొడుకును చంపుతున్నానంటూ రెండుసార్లు తనకు ఫోన్ కూడా చేసిందని, ఆ ఫోన్ కాల్‌డేటాను పరిశీలిస్తే ఎన్నో వాస్తవాలు బయటకు వస్తాయంటూ ఆమె పేర్కొన్నారు. దీంతో పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కేటీఆర్ వద్దకు చక్రి పంచాయితీ..
-
కేటీఆర్ వద్దకు చక్రి పంచాయితీ..
హైదరాబాద్ : సంగీత దర్శకుడు చక్రి కుటుంబ వివాదం తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ వద్దకు చేరింది. చక్రి తల్లి విద్యావతి, సోదరుడు మహిత్ నారాయణ్ మంగళవారం ఆయన్ని కలిశారు. చక్రి కుటుంబసభ్యులు, అతని భార్య శ్రావణి పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. తన కోడలు శ్రావణి, ఆమె తల్లిదండ్రులు సురేఖ, మధుసూదన్‌రావు, సోదరుడు భరద్వాజ్ కలిసి విష ప్రయోగం చేసి తన కొడుకును చంపేశారని ఆరోపిస్తూ చక్రి తల్లి విద్యావతి ఆదివారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా శ్రావణి శనివారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ తన భర్త మరణం విష ప్రయోగం వల్లే జరిగిందని, అత్త విద్యావతితో పాటు ఆడపడుచులు వారి భర్తలు, మరిది మహిత్ కారకులంటూ తొమ్మిది మందిపై ఆరోపణలు చేశారు. ఈ మేరకు చక్రి కుటుంబ సభ్యులపై క్రిమినల్ కేసు నమోదైంది. ఇది జరిగి 24 గంటలు గడవకముందే చక్రి తల్లి... శ్రావణిపై ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో చక్రి తల్లి, సోదరుడు... కేటీఆర్‌ను కలవటం ప్రాధాన్యత సంతరించుకుంది. -
'చక్రి మరణంపై అనుమానాలున్నాయి'
-
'చక్రి మరణంపై అనుమానాలున్నాయి'
హైదరాబాద్ : చక్రి మరణంపై తనకు అనుమానాలున్నాయని ఆయన భార్య శ్రావణి అన్నారు. 'చక్రి చనిపోయే ముందురోజు మా అత్తగారింట్లో భోజనం చేశారు. చక్రి చనిపోగానే విలువైన డాక్యుమెంట్లు, ఆభరణాలు తీసేసుకున్నారు' అని ఆమె తెలిపారు. తన భర్త చనిపోగానే ఆయన కుటుంబ సభ్యులు తనను వేధించటం మొదలు పెట్టారని శ్రావణి చెప్పారు. కుటుంబ వ్యవహారం కావటంతో తాము దాసరి నారాయణరావు గారిని కలవటం జరిగిందని, ఆయన ఏం చెబితే అలా చేసేందుకు తాను సిద్దంగా ఉన్నా... చక్రి కుటుంబ సభ్యులు మాత్రం సహకరించలేదన్నారు. ఆ తర్వాతే పోలీసుల్ని ఆశ్రయించటం జరిగిందన్నారు. తనకు న్యాయం జరగాలని శ్రావణి అన్నారు. చక్రి కుటుంబ సభ్యుల్ని కోడలుగా చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని.. అయినా వారు తనకు సహకరించటం లేదన్నారు. మనిషి బతికి ఉన్నప్పుడు ఒకలాగా...చనిపోయిన తర్వాత మరోలా ఎలా ఉంటారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాగా చక్రి కుటుంబసభ్యులపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. -
చక్రి డెత్ సర్టిఫికెట్ కూడా ఇవ్వటం లేదు: శ్రావణి
-
చక్రి డెత్ సర్టిఫికెట్ కూడా ఇవ్వటం లేదు: శ్రావణి
హైదరాబాద్ : చక్రి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని అతని భార్య శ్రావణి ఆరోపించారు. సంగీత దర్శకుడు చక్రి గుండెపోటుతో దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. చక్రి చనిపోయిన రెండోరోజే కుటుంబ సభ్యులు డెత్ సర్టిఫికెట్ తీసుకున్నారని, తన భర్త చక్రి మరణ ధృవీకరణ పత్రాన్ని కూడా తనకు ఇవ్వడం లేదన్నారు. ఆస్తులు వారి పేరు మీద రాయాలని బలవంతం చేస్తున్నారని ఆమె తెలిపారు. గతంలో చక్రి సోదరి తమ వద్దనుంచి 50 లక్షల రూపాయలు అప్పుగా తీసుకుందని, ఇప్పుడు అడిగితే వేధిస్తున్నారని, ఇంట్లోనుంచి వెళ్లిపోమంటూ బెదిరిస్తున్నారని శ్రావణి ఆరోపించారు. ఈ నేపథ్యంలో అత్త, ఆడపడుచులు మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారంటూ శ్రావణి ..జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు అత్త విద్యావతి, మరిది మహిత్ నారాయణ, ఆడపడుచు వాణిదేవి, లక్ష్మణరావు, కృష్ణప్రియ, నాగేశ్వరరావు తదితరులపై 498, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా చక్రి కుటుంబంలో వివాదాల సుడిగుండాలు ఇదే మొదటిసారి కాదు. చక్రి చనిపోయిన రెండు, మూడు రోజులకే శ్రావణి హెచ్ఆర్సీని ఆశ్రయించారు. చక్రి కుటుంబ సభ్యులనుంచి తనకు రక్షణ కల్పించాలని కోరారు. -
చక్రి కుటుంబ సభ్యులపై కేసు నమోదు
-
చక్రి కుటుంబ సభ్యులపై కేసు నమోదు
హైదరాబాద్ : దివంగత సంగీత దర్శకుడు చక్రి కుటుంబ వివాదం మరోసారి తెరమీదకి వచ్చింది. డబ్బు కోసం చక్రి కుటుంబ సభ్యులు వేధిస్తున్నారంటూ అతని భార్య శ్రావణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్రావణి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు చక్రి కుటుంబసభ్యులు ఏడుగురిపై కేసు నమోదు చేశారు. గతంలో శ్రావణి అత్తింటివారు ఆస్తి కోసం తనను వేధిస్తున్నారంటూ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్రాణభయం వల్లే హెచ్చార్సీకి వెళ్లా
ఈ రెండు రోజుల్లో జరిగిన గొడవల వల్ల తనకు ప్రాణహాని ఉందన్న భయంతోనే తాను మానవ హక్కుల కమిషన్ వద్దకు వెళ్లినట్లు దివంగత సంగీత దర్శకుడు చక్రి భార్య శ్రావణి చెప్పారు. ఇన్నాళ్లుగా తమ కుటుంబాన్ని పట్టించుకోనివాళ్లు ఇప్పుడు ఆయన మరణించిన తర్వాత వచ్చి తనను వేధిస్తున్నారని, అందుకే తనకు ప్రాణభయం ఉందని భావించి మానవ హక్కుల సంఘాన్ని కలిశానని తెలిపారు. భవిష్యత్తులో ఏమైనా ఇబ్బంది అవుతుందేమోనన్న భయం వల్ల మాత్రమే తాను హెచ్చార్సీ వద్దకు వెళ్లానని శ్రావణి మీడియాకు చెప్పారు. చక్రి ఆత్మకు శాంతి కలగాలని, ఇప్పట్లో ఎలాంటి వివాదాలకు వెళ్లదలచుకోలేదని అన్నారు. సమస్యలు ఉన్నమాట వాస్తవమేనని, అయితే వాటిని చర్చలతో పరిష్కరించుకుంటామని తెలిపారు. దయచేసి సమస్యను పెద్దది చేయొద్దని ఆమె మీడియాను కోరారు. -
''ప్రాణభయం వల్లే హెచ్చార్సీకి వెళ్లా''
-
చక్రి భార్యకు అత్తింటి వేధింపులు?
గుండెపోటుతో మరణించిన సంగీత దర్శకుడు చక్రి తల్లి, అక్కాచెల్లెళ్లు తనను వేధిస్తున్నట్లు ఆయన భార్య శ్రావణి ఆరోపించారు. చక్రిని చంపే ప్రయత్నం నువ్వే చేశావంటూ ఆమెను అత్తమామలు వేధించడం మొదలుపెట్టారని ఆమె అన్నారు. మానసికంగా తనను వేధిస్తున్నారని ఆమె తెలిపారు. ఆమె చెప్పిన వివరాల ప్రకారం.. చక్రి, శ్రావణిలది ప్రేమవివాహం. పదేళ్ల క్రితం వాళ్లు పెళ్లి చేసుకున్నారు. దాంతో ఇటీవలి వరకు అయినవాళ్లంతా వాళ్లకు దూరంగా ఉన్నారు. ఇప్పుడిప్పుడే అంతా దగ్గరకు వస్తున్నారు. గతంలో శ్రావణి మీద దాడులు జరిగాయి. సుమారు నెల రోజుల క్రితం ఆమె అత్త, మరిది విడిగా వెళ్లిపోయారు. చక్రి మరణించిన తర్వాత వాళ్లంతా కలిసి చక్రి ఇంట్లోనే ఉంటున్నారు. కానీ.. శ్రావణి కనీసం నీళ్లు తాగిందో లేదో కూడా చూడట్లేదని చెబుతున్నారు. చక్రికి ఎలాంటి ఆస్తులున్నాయో కూడా ఆమెకు తెలియదని అంటున్నారు. కాగా, అత్తింటి వేధింపులపై స్పందించేందుకు సంగీత దర్శకుడు చక్రి భార్య శ్రావణి నిరాకరించారు. తన భర్త మరణించి ఇప్పటికి కేవలం మూడు రోజులే అయ్యిందని, అందువల్ల ముందు ఈ 11 రోజులు ఆయన కర్మకాండలన్నీ పూర్తి కానివ్వాలని ఆమె మీడియాను వేడుకున్నారు. ఇప్పుడు తానేమీ మాట్లాడే పరిస్థితిలో లేనని, కనీసం నిలబడే స్థితిలో కూడా లేనని చెప్పారు. తనకు మాటిమాటికీ స్పృహ తప్పుతోందని, నిన్న కూడా తాను ఫిట్స్‌తో పడిపోయానని అన్నారు. వేధింపులు ఉన్నట్లు ఏమైనా చెబుతారా అని అడగగా.. ఆ విషయం దేవుడికే తెలియాలంటూ కళ్లనీళ్లు పెట్టుకున్నారు. ఓసారి తనను వాళ్లు తల గోడకేసి కొట్టారని, కానీ ఆ విషయం ఆయన చూడలేదని శ్రావణి చెప్పారు. చక్రి ఆరోగ్యం గురించి ఫోన్లు చేసినా ఎవ్వరూ ఫోను ఆన్సర్ చేయలేదని తెలిపారు. తాను కనీసం చెప్పులు కూడా లేకుండా చక్రిని తీసుకుని అంబులెన్సులో ఆస్పత్రికి వెళ్లానన్నారు. వాళ్లు ఎప్పుడొచ్చారో తెలియదని, మధ్యాహ్నం ఫిలిం చాంబర్లో మృతదేహం ఉన్నప్పుడు.. వాళ్ల సామాన్లన్నీ తీసుకెళ్లిపోయారని చెప్పారు. తన కప్ బోర్డులన్నీ తాళాలు వేసేశారని, చక్రి డెబిట్ కార్డులు, చెక్కు పుస్తకాలు, ఉంగరాలు, గొలుసులు అన్నీ తీసుకెళ్లిపోయారని అన్నారు. భర్తను చంపుకొనేదాన్ని కాదని, వాళ్లే ముందు ఇంట్లోంచి వెళ్లిపోయారని శ్రావణి తెలిపారు. కనీసం తనకు కట్టుబట్టలు కూడా లేవని, కప్ బోర్డుల తాళాలన్నీ తీసుకెళ్లిపోయారని చెప్పారు. తనను బయటివాళ్లు తప్ప, ఇంట్లో వాళ్లు ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు. ఫిట్స్ వచ్చినా కూడా తన మొహం చూడలేదన్నారు. తనకు డబ్బు అక్కర్లేదని, డబ్బు ఆశించేదాన్ని కాదని తెలిపారు. తామిద్దరికీ ఎప్పుడూ గొడవలు లేవని, పొద్దున్న తన మొహం చూడకుండా లేవరని, కళ్లు మూసుకుని శ్రావణీ.. ఎక్కడున్నావని పిలిచేవారని వాపోయారు. -
ఆగిన సంగీత చక్రం
పిన్నవయసులోనే తెలుగు సినీసంగీత సామ్రాజ్యంలో తనదైన ముద్రవేసిన ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి సోమవారం కన్నుమూశారు. ఆయన మృతి చిత్రపరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. సంగీత ‘చక్రం’ ఆగిపోయిందంటూ పలువురు సినీ ప్రముఖులు కంటతడిపెట్టారు. ఉదయం అపోలో ఆస్పత్రి నుంచి చక్రి పార్థివ దేహాన్ని ఫిలించాంబర్‌కు తరలించారు. పలువురు సినీ ప్రముఖులు, సంగీత దర్శకులు, గాయకులు, ఆయన అభిమానులు అక్కడికి చేరుకొని నివాళులు అర్పించారు. సాయంత్రం చక్రి అంత్యక్రియలు పంజగుట్ట హిందూ శ్మవానవాటికలో ముగిశాయి. - సాక్షి, హైదరాబాద్ -
చక్రి అంత్యక్రియలు పూర్తి
-
చక్రి అంత్యక్రియలు పూర్తి
హైదరాబాద్: ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి (40) అంత్యక్రియలు పూర్తయ్యాయి. సోమవారం సాయంత్రం పంజాగుట్టలోని శ్మశాన వాటికలో చక్రి అంత్యక్రియలు నిర్వహించారు. జర్నలిస్టు కాలనీలో చక్రి స్వగృహం నుంచి పంజాగుట్ట వరకు అంతిమ యాత్ర సాగింది. సోమవారం తెల్లవారుజామున చక్రి గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. అపోలో ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. చక్రి ఆకస్మిక మృతి తెలుగు చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. రాజకీయ, చిత్ర పరిశ్రమ ప్రముఖులు తరలి వచ్చి ఆయన మృతికి సంతాపం తెలియజేశారు. ఆయన భౌతికకాయంపై పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. చక్రితో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుని పలువురు నటులు, గాయకులు కంటతడి పెట్టారు. చక్రి పూర్తి పేరు చక్రధర్ గిల్లా. 1974 జూన్ 15న వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలం కంభాలపల్లిలో జన్మించారు. ప్రముఖ దర్శకుడు పూరిజగన్నాధ్ దర్శకత్వం వహించిన 'బాచీ' సినిమాతో..... టాలీవుడ్‌కి సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న తమిళ అమ్మాయి, సత్యం, ఢీ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. -
మరణానికి కొన్ని గంటల ముందు వరకు రికార్డింగ్!
గుండెపోటుతో మరణించడానికి కొన్ని గంటల ముందు వరకు కూడా చక్రి పాటల రికార్డింగులోనే గడిపారు. రికార్డింగ్ పూర్తయిన తర్వాత బాగా పొద్దుపోయాక ఇంటికి వచ్చారు. రాగానే కొద్దిసేపటికే నిద్రపోయిన చక్రి.. ఆ నిద్రలోనే తీవ్ర గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారని వైద్యులు చెబుతున్నారు. నిర్విరామంగా పనిచేయడం వల్ల ఆయన తీవ్రంగా అలసిపోయి ఉంటారని, అదే గుండెపోటు రావడానికి తక్షణ కారణం అయి ఉంటుందని భావిస్తున్నారు. చిన్న వయస్సులోనే తెలుగు సినీ సంగీతంలో ఇమేజ్ సాధించిన చక్రి తన ఆరోగ్యంపై పెద్దగా శ్రద్ధ చూపలేదని సన్నిహితులు అంటున్నారు. సినీ రంగంలోకి అడుగుపెట్టిన తొలి నాళ్లలో చక్రి మరీ ఇంత లావుగా ఉండేవారు కారు. ఆ తర్వాత ఆహార అలవాట్లలో మార్పు, సినీ పరిశ్రమలో తీరికలేని పనులు ఆయన శరీరంపై తీవ్ర ప్రభావం చూపించాయి. దానికి తోడు చక్రికి మంచి భోజన ప్రియుడనే పేరుంది. అది కూడా తోడవడంతో తక్కువ కాలంలో బాగా లావైపోయారు. లైపోసెక్షన్ లాంటి చికిత్స చేయించుకోవాలనుకున్నా, ఎందుకో భయపడ్డాడని ఆయన సన్నిహితులు అంటారు. -
నా కల నిజమౌతుంది
‘‘ముంబై, చెన్నై నగరాలలోని రికార్డింగ్ థియేటర్లకు దీటుగా హైదరాబాద్‌లోనూ ఓ థియేటర్ నెలకొల్పాలనుకుంటున్నా. గత కొన్నాళ్లుగా నాకున్న కల ఇది. త్వరలోనే అది నెరవేరుతుంది’’ అని చక్రి చెప్పారు. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా చక్రి పత్రికలవారితో మాట్లాడుతూ -‘‘నాకు స్వామి వివేకానంద ఆదర్శం. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని నా ప్రతి పుట్టినరోజుకి అన్నదానం, రక్తదానం వంటి పలు సేవా కార్యక్రమాలు చేస్తుంటాను. కెరీర్ గురించి చెప్పాలంటే.. నా వరకూ వచ్చిన అన్ని అవకాశాలనూ ఒప్పుకుని ఉంటే ఇప్పటికి 120, 130 సినిమాలు పూర్తి చేసేవాణ్ణి. దాంతో పాటు కొత్త సంగీతదర్శకుల రాకతో కొంచెం వెనకపడ్డాను. వాస్తవానికి ‘రేయ్’ విడుదలై ఉంటే, ఇంకా బిజీ అయ్యుండేవాణ్ణి. ఎందు కంటే, సంగీత ప్రాధాన్యంగా సాగే సినిమాల్లో మంచి స్థాయి ఉన్న సినిమా అది. కల్యాణ్‌రామ్ హీరోగా రూపొందుతున్న ‘షేర్’ నాకు వందవ సినిమా అవుతుంది. హరిరామ జోగయ్య రూపొందిస్తున్న ‘టామీ’, మరో రెండు సినిమాలకు పాటలు స్వరపరుస్తున్నా. కొన్నాళ్ల క్రితం సంగీత దర్శకుల కోసం ఓ యూనియన్ ప్రారంభించాలనుకున్నా. కానీ, సహకరించడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆ ఆలోచనను విరమించుకున్నా’’ అని తెలిపారు. త్వరలో తన మిత్రుల ఆధ్వర్యంలో ‘పంచమిత్ర’ అనే నిర్మాణ సంస్థ మొదలవుతుందని, దానికి వెన్నుదన్నుగా నిలవబోతున్నానని ఈ సందర్భంగా చక్రి వెల్లడించారు.