
మరణానికి కొన్ని గంటల ముందు వరకు రికార్డింగ్!
గుండెపోటుతో మరణించడానికి కొన్ని గంటల ముందు వరకు కూడా చక్రి పాటల రికార్డింగులోనే గడిపారు. రికార్డింగ్ పూర్తయిన తర్వాత బాగా పొద్దుపోయాక ఇంటికి వచ్చారు. రాగానే కొద్దిసేపటికే నిద్రపోయిన చక్రి.. ఆ నిద్రలోనే తీవ్ర గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారని వైద్యులు చెబుతున్నారు. నిర్విరామంగా పనిచేయడం వల్ల ఆయన తీవ్రంగా అలసిపోయి ఉంటారని, అదే గుండెపోటు రావడానికి తక్షణ కారణం అయి ఉంటుందని భావిస్తున్నారు.
చిన్న వయస్సులోనే తెలుగు సినీ సంగీతంలో ఇమేజ్ సాధించిన చక్రి తన ఆరోగ్యంపై పెద్దగా శ్రద్ధ చూపలేదని సన్నిహితులు అంటున్నారు. సినీ రంగంలోకి అడుగుపెట్టిన తొలి నాళ్లలో చక్రి మరీ ఇంత లావుగా ఉండేవారు కారు. ఆ తర్వాత ఆహార అలవాట్లలో మార్పు, సినీ పరిశ్రమలో తీరికలేని పనులు ఆయన శరీరంపై తీవ్ర ప్రభావం చూపించాయి. దానికి తోడు చక్రికి మంచి భోజన ప్రియుడనే పేరుంది. అది కూడా తోడవడంతో తక్కువ కాలంలో బాగా లావైపోయారు. లైపోసెక్షన్ లాంటి చికిత్స చేయించుకోవాలనుకున్నా, ఎందుకో భయపడ్డాడని ఆయన సన్నిహితులు అంటారు.