చక్రి అంత్యక్రియలు పూర్తి
హైదరాబాద్: ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి (40) అంత్యక్రియలు పూర్తయ్యాయి. సోమవారం సాయంత్రం పంజాగుట్టలోని శ్మశాన వాటికలో చక్రి అంత్యక్రియలు నిర్వహించారు. జర్నలిస్టు కాలనీలో చక్రి స్వగృహం నుంచి పంజాగుట్ట వరకు అంతిమ యాత్ర సాగింది.
సోమవారం తెల్లవారుజామున చక్రి గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. అపోలో ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. చక్రి ఆకస్మిక మృతి తెలుగు చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. రాజకీయ, చిత్ర పరిశ్రమ ప్రముఖులు తరలి వచ్చి ఆయన మృతికి సంతాపం తెలియజేశారు. ఆయన భౌతికకాయంపై పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. చక్రితో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుని పలువురు నటులు, గాయకులు కంటతడి పెట్టారు.
చక్రి పూర్తి పేరు చక్రధర్ గిల్లా. 1974 జూన్ 15న వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలం కంభాలపల్లిలో జన్మించారు. ప్రముఖ దర్శకుడు పూరిజగన్నాధ్ దర్శకత్వం వహించిన 'బాచీ' సినిమాతో..... టాలీవుడ్‌కి సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న తమిళ అమ్మాయి, సత్యం, ఢీ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.