చక్రి డెత్ సర్టిఫికెట్ కూడా ఇవ్వటం లేదు: శ్రావణి
హైదరాబాద్ : చక్రి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని అతని భార్య శ్రావణి ఆరోపించారు. సంగీత దర్శకుడు చక్రి గుండెపోటుతో దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. చక్రి చనిపోయిన రెండోరోజే కుటుంబ సభ్యులు డెత్ సర్టిఫికెట్ తీసుకున్నారని, తన భర్త చక్రి మరణ ధృవీకరణ పత్రాన్ని కూడా తనకు ఇవ్వడం లేదన్నారు. ఆస్తులు వారి పేరు మీద రాయాలని బలవంతం చేస్తున్నారని ఆమె తెలిపారు.
గతంలో చక్రి సోదరి తమ వద్దనుంచి 50 లక్షల రూపాయలు అప్పుగా తీసుకుందని, ఇప్పుడు అడిగితే వేధిస్తున్నారని, ఇంట్లోనుంచి వెళ్లిపోమంటూ బెదిరిస్తున్నారని శ్రావణి ఆరోపించారు. ఈ నేపథ్యంలో అత్త, ఆడపడుచులు మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారంటూ శ్రావణి ..జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆమె ఫిర్యాదు మేరకు అత్త విద్యావతి, మరిది మహిత్ నారాయణ, ఆడపడుచు వాణిదేవి, లక్ష్మణరావు, కృష్ణప్రియ, నాగేశ్వరరావు తదితరులపై 498, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా చక్రి కుటుంబంలో వివాదాల సుడిగుండాలు ఇదే మొదటిసారి కాదు. చక్రి చనిపోయిన రెండు, మూడు రోజులకే శ్రావణి హెచ్ఆర్సీని ఆశ్రయించారు. చక్రి కుటుంబ సభ్యులనుంచి తనకు రక్షణ కల్పించాలని కోరారు.