కేటీఆర్ వద్దకు చక్రి పంచాయితీ..
హైదరాబాద్ : సంగీత దర్శకుడు చక్రి కుటుంబ వివాదం తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ వద్దకు చేరింది. చక్రి తల్లి విద్యావతి, సోదరుడు మహిత్ నారాయణ్ మంగళవారం ఆయన్ని కలిశారు. చక్రి కుటుంబసభ్యులు, అతని భార్య శ్రావణి పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. తన కోడలు శ్రావణి, ఆమె తల్లిదండ్రులు సురేఖ, మధుసూదన్‌రావు, సోదరుడు భరద్వాజ్ కలిసి విష ప్రయోగం చేసి తన కొడుకును చంపేశారని ఆరోపిస్తూ చక్రి తల్లి విద్యావతి ఆదివారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా శ్రావణి శనివారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ తన భర్త మరణం విష ప్రయోగం వల్లే జరిగిందని, అత్త విద్యావతితో పాటు ఆడపడుచులు వారి భర్తలు, మరిది మహిత్ కారకులంటూ తొమ్మిది మందిపై ఆరోపణలు చేశారు. ఈ మేరకు చక్రి కుటుంబ సభ్యులపై క్రిమినల్ కేసు నమోదైంది. ఇది జరిగి 24 గంటలు గడవకముందే చక్రి తల్లి... శ్రావణిపై ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో చక్రి తల్లి, సోదరుడు... కేటీఆర్ను కలవటం ప్రాధాన్యత సంతరించుకుంది.