
నా కల నిజమౌతుంది
‘‘ముంబై, చెన్నై నగరాలలోని రికార్డింగ్ థియేటర్లకు దీటుగా హైదరాబాద్‌లోనూ ఓ థియేటర్ నెలకొల్పాలనుకుంటున్నా. గత కొన్నాళ్లుగా నాకున్న కల ఇది. త్వరలోనే అది నెరవేరుతుంది’’ అని చక్రి చెప్పారు. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా చక్రి పత్రికలవారితో మాట్లాడుతూ -‘‘నాకు స్వామి వివేకానంద ఆదర్శం. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని నా ప్రతి పుట్టినరోజుకి అన్నదానం, రక్తదానం వంటి పలు సేవా కార్యక్రమాలు చేస్తుంటాను. కెరీర్ గురించి చెప్పాలంటే.. నా వరకూ వచ్చిన అన్ని అవకాశాలనూ ఒప్పుకుని ఉంటే ఇప్పటికి 120, 130 సినిమాలు పూర్తి చేసేవాణ్ణి.
దాంతో పాటు కొత్త సంగీతదర్శకుల రాకతో కొంచెం వెనకపడ్డాను. వాస్తవానికి ‘రేయ్’ విడుదలై ఉంటే, ఇంకా బిజీ అయ్యుండేవాణ్ణి. ఎందు కంటే, సంగీత ప్రాధాన్యంగా సాగే సినిమాల్లో మంచి స్థాయి ఉన్న సినిమా అది. కల్యాణ్‌రామ్ హీరోగా రూపొందుతున్న ‘షేర్’ నాకు వందవ సినిమా అవుతుంది. హరిరామ జోగయ్య రూపొందిస్తున్న ‘టామీ’, మరో రెండు సినిమాలకు పాటలు స్వరపరుస్తున్నా. కొన్నాళ్ల క్రితం సంగీత దర్శకుల కోసం ఓ యూనియన్ ప్రారంభించాలనుకున్నా. కానీ, సహకరించడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆ ఆలోచనను విరమించుకున్నా’’ అని తెలిపారు. త్వరలో తన మిత్రుల ఆధ్వర్యంలో ‘పంచమిత్ర’ అనే నిర్మాణ సంస్థ మొదలవుతుందని, దానికి వెన్నుదన్నుగా నిలవబోతున్నానని ఈ సందర్భంగా చక్రి వెల్లడించారు.