HBD Sachin: రికార్డులకు కవల సోదరుడు.. ఈ విషయాలు తెలుసా? | Sachin Tendulkar Birthday: These Can Define Genius of Master Blaster | Sakshi
Sakshi News home page

HBD Sachin Tendulkar: పరుగుల వీరుడి గురించి ఈ విషయాలు తెలుసా?

Published Thu, Apr 25 2024 3:53 PM | Last Updated on Thu, Apr 25 2024 3:53 PM

Sachin Tendulkar Birthday: These Can Define Genius of Master Blaster - Sakshi

రికార్డులు- అతడు కవల పిల్లల్లాంటివాళ్లు. 1990వ దశకంలో భారత క్రికెట్‌ ఎదుగుదలతో పాటే అతడూ ఎదిగాడు. కోట్లాది మందికి ఆదర్శమూర్తి అయ్యాడు. పాత రికార్డులు బద్దలుకొడుతూ.. సరికొత్త రికార్డులు సృష్టిస్తూ తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. ఆటతోనే కాదు అందమైన వ్యక్తిత్వంతోనూ సౌమ్యుడిగా పేరొంది వర్ధమాన క్రికెటర్లకు ఆరాధ్యదైవంగా మారాడు.

దాదాపు రెండు దశాబ్దాల పాటు క్రికెట్‌ ప్రపంచాన్ని ఏలిన మకుటం లేని మహరాజుగా వెలుగొందిన ‘మాస్టర్‌ బ్లాస్టర్‌’ సచిన్‌ టెండుల్కర్‌ ‘హాఫ్‌ సెంచరీ’ పూర్తి చేసుకుని నేడు(ఏప్రిల్‌ 24) 51వ పడిలో అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా... అంతర్జాతీయ క్రికెట్‌లో వంద సెంచరీలు కొట్టిన ఏకైక బ్యాటర్‌గా కొనసాగుతున్న ఈ టీమిండియా దిగ్గజం గురించి కొన్ని ఆసక్తికర అంశాలు మీకోసం..

అత్యధిక పరుగుల వీరుడు
అంతర్జాతీయ క్రికెట్‌లో వన్డే, టెస్టుల్లో అ‍త్యధిక పరుగుల వీరుడిగా సచిన్‌ టెండుల్కర్‌ కొనసాగుతున్నాడు. వన్డేల్లో 18,426, టెస్టుల్లో 15,921 రన్స్‌ సాధించాడు.

ఓవరాల్‌గా సచిన్‌ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో 34,357 రన్స్‌ స్కోరు చేశాడు. ఇక పరుగుల రికార్డుల్లో వన్డేల్లో సచిన్‌ తర్వాత కుమార్‌ సంగక్కర 14, 234 రన్స్‌తో రెండో స్థానంలో ఉండగా.. టెస్టుల్లో యాక్టివ్‌ ప్లేయర్లలో జో రూట్‌ 11,736 రన్స్‌తో ఉన్నాడు. 

అత్యధిక సెంచరీలు
1998లొ.. సెప్టెంబరు 26న బులావయోలో జింబాబ్వేతో వన్డే మ్యాచ్‌లో 127 పరుగులు సాధించిన సచిన్‌.. వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. యాభై ఓవర్ల ఫార్మాట్‌లో సచిన్‌కు ఇది 18వ శతకం. తద్వారా డెస్మాండ్‌ హైన్స్‌ పేరిట ఉన్న రికార్డు బ్రేక్‌ చేసిన సచిన్‌.. ఓవరాల్‌గా వన్డేల్లో 49 సెంచరీలు తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇక 2005, డిసెంబరులో ఢిల్లీ వేదికగా శ్రీలంకతో మ్యాచ్‌ సందర్భంగా టెండుల్కర్‌ టెస్టుల్లో 34వ శతకం సాధించి సునిల్‌ గావస్కర్‌ రికార్డు బద్దలు కొట్టాడు. ఆ తర్వాత తన కెరీర్‌ మొత్తంలో ఓవరాల్‌గా 51 టెస్టు సెంచరీలు సాధించి.. ఇప్పటికీ ఆ రికార్డును తన పేరిట పదిలంగా పెట్టుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్‌ మొత్తంగా వంద సెంచరీలు సాధించగా.. విరాట్‌ కోహ్లి 80 శతకాలతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

బెస్ట్‌ అగైనెస్ట్‌ వెరీ బెస్ట్‌
ప్రపంచ క్రికెట్‌ను శాసించిన ఆస్ట్రేలియా మీద వన్డే, టెస్టుల్లో సచిన్‌ టెండుల్కర్‌ మెరుగైన రికార్డులు సాధించాడు. 1992లో వన్డేల్లో రెండు సెంచరీలు.. 1998లో చెన్నై టెస్టులో 155 పరుగులతో దుమ్ములేపాడు. 

ఆస్ట్రేలియాతో 39 టెస్టుల్లో భాగమైన సచిన్‌ 3630, వన్డేల్లో 70 ఇన్నింగ్స్‌లో 3077 పరుగులు సాధించాడు. ఓవరాల్‌గా ఆస్ట్రేలియా మీద 20 శతకాలు బాది.. ఒకే ప్రత్యర్థి మీద ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు.

క్యాలెండర్‌ ఇయర్‌లో..
టెస్టు క్రికెట్‌లో ఒకే క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధికసార్లు వెయ్యికిపైగా రన్స్‌ సాధించిన బ్యాటర్‌గా సచిన్‌కు వరల్డ్‌ రికార్డు ఉంది. 1997, 1999, 2001, 2002, 2008, 2010లో సచిన్‌ ఈ ఫీట్‌ నమోదు చేశాడు. 

సచిన్‌ తర్వాత బ్రియన్‌ లారా, మాథ్యూ హెడెన్‌, అలిస్టర్‌ కుక్‌, కుమార్‌ సంగక్కర, జాక్వెస్‌ కలిస్‌, రిక్కీ పాంటింగ్‌ ఐదేసిసార్లు ఈ ఫీట్‌ నమోదు చేసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. వన్డేల్లోనూ ఈ ఘనత సచిన్‌ పేరిట(7 సార్లు) ఉండేది. అయితే, విరాట్‌ కోహ్లి(8 సార్లు) ఈ రికార్డును బ్రేక్‌ చేశాడు.

నాటి ఐసీసీ టోర్నీలో..
1996 వరల్డ్‌కప్‌, 2003 ప్రపంచకప్‌ టోర్నీల్లో సచిన్‌ అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. 2011లో భారత్‌ వేదికగా టీమిండియా వన్డే వరల్డ్‌కప్‌ గెలిచిన జట్టులో సభ్యుడు. ఓవరాల్‌గా ఐసీసీ టోర్నీల్లో ఆరు శతకాల సాయంతో 2278 పరుగులు సాధించి.. అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా సచిన్‌ కొనసాగుతున్నాడు.

అలా మొదలుపెట్టి.. 201 వికెట్లు కూడా
1989లో పాకిస్తాన్‌తో టెస్టుతో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన సచిన్‌ టెండుల్కర్‌.. 2006లో సౌతాఫ్రికాతో జరిగిన టీ20 మ్యాచ్‌ తర్వాత ఆటకు వీడ్కోలు పలికాడు. ఓవరాల్‌గా 664 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 34,357 పరుగులు సాధించాడు ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌. అంతేకాదు.. ఈ రైటార్మ్‌ లెగ్‌ బ్రేక్‌ స్పిన్నర్‌ 201 వికెట్లు కూడా పడగొట్టాడు. 2013లో తన చివరి ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడి.. రిటైర్‌ అయ్యాడు.

చదవండి: మొన్న రోహిత్‌.. ఇప్పుడు అక్షర్‌.. ఎందుకిలా? ఆ రూల్‌ వల్ల ఎవరికి నష్టం?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement