చక్రి మృతిపై ముదురుతున్న వివాదం
- ‘విషం’ చిమ్ముకుంటున్న చక్రి కుటుంబసభ్యులు
- విచారణ ఎలా జరపాలో తెలియక తలలు పట్టుకుంటున్న పోలీసులు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీ సంగీత దర్శకుడు చక్రి మృతిపై నెలకొన్న వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. చక్రి కుటుంబసభ్యులు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయిస్తున్నారు. తాజాగా తన కోడలు శ్రావణి, ఆమె తల్లిదండ్రులు సురేఖ, మధుసూదన్‌రావు, సోదరుడు భరద్వాజ్ కలిసి విష ప్రయోగం చేసి తన కొడుకును చంపేశారని ఆరోపిస్తూ చక్రి తల్లి విద్యావతి ఆదివారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
శనివారం శ్రావణి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ తన భర్త మరణం విష ప్రయోగం వల్లే జరిగిందని, అత్త విద్యావతితో పాటు ఆడపడుచులు వారి భర్తలు, మరిది మహిత్ కారకులంటూ తొమ్మిది మందిపై ఆరోపణలు చేశారు. ఈ మేరకు చక్రి కుటుంబ సభ్యులపై క్రిమినల్ కేసు నమోదైంది. ఇది జరిగి 24 గంటలు గడవకముందే చక్రి తల్లి... శ్రావణిపై ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేయడం కలకలం రే పింది.
మృతి చెందిన రోజు కోడలు శ్రావణి ఫోన్ చేసి చక్రిని తానే చంపానని చెప్పిందని చక్రి తల్లి విద్యావతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. చక్రి మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని విద్యావతితోపాటు చక్రి తమ్ముడు మహిత్ కోరారు. తనపై కేసు లేకుండా చేసుకోవడానికి ముందస్తుగా తమను నేరస్తులుగా చిత్రీకరించేందుకు పోలీస్ స్టేషన్ లో శ్రావణి ఫిర్యాదు చేసిందని వారు వెల్లడించారు.
దర్యాప్తు కష్టమేనంటున్న పోలీసులు
చక్రి మరణంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో విచారణ ఎలా చేయాలో తెలియక జూబ్లీహిల్స్ పోలీసులు తల పట్టుకుంటున్నారు. చక్రి మృతి చెంది నేటికి 29 రోజులు గడిచాయి. ఇప్పటి వరకూ అతని మరణంపై ఎవరికీ ఎలాంటి అనుమానాలు కలగలేదు. చక్రిపై నిజంగా విష ప్రయోగం జరిగిందా లేక ఆస్తుల పంపకంలో తలెత్తిన వివాదాలతో పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నారా అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇంతకూ చక్రి మరణం సహజమా లేక హత్యా అనే విషయం తేల్చేందుకు ఇప్పుడు పోలీసుల వద్ద ఎలాంటి ఆయుధం లేదు. అతని బౌతికకాయానికి పంజాగుట్ట శ్మశాన వాటికలో గత నెల 15న దహన సంస్కారాలు కూడా జరిగాయి. వాస్తవానికి చక్రి మృతదేహానికి పోస్టుమార్టం జరగలేదు. ఖననం చేసినా మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించే అవకాశం ఉండేది.
మరోపక్క చక్రి చనిపోయిన సమయంలో ఆయన్ని అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడి వైద్యులు అతన్ని పరీక్షించి ఆసుపత్రికి రాకముందే చనిపోయాడని ధ్రువీకరించారు. కనీసం అక్కడ చికిత్స చేసినా రిపోర్టుల ద్వారా విష ప్రయోగం జరిగిందా లేదా అనేది తెలిసేది. ఇప్పుడా అవకాశం కూడా లేదు. దీంతో ఈ కేసు దర్యాప్తు కష్టమేనని పోలీసులు భావిస్తున్నారు.