వండర్ కిడ్స్ రికార్డ్
విశాఖపట్నం: వంద ప్రశ్నలు.. ముప్పై మంది చిన్నారులు.. పది నిమిషాల 20 సెకన్లలో సమాధానాలు చెప్పి రికార్డ్ సృష్టించారు. రెండో తరగతి లెక్కల ప్రశ్నపత్రంలోని ప్రశ్నలకు యూకేజీ బుడతలు సమాధానాలిచ్చిన తీరు అబ్బురపర్చింది. విశాఖలోని కళాభారతి ఆడిటోరియంలో బుధవారం స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ విద్యార్థులు ఈ రికార్డ్ సృష్టించారు. ఏయూ ఉపకులపతి జి.ఎస్.ఎన్.రాజు, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికార ప్రతినిధి భరద్వాజ్, ఏయూ ఆచార్యుల సమక్షంలో వంద ప్రశ్నలకు బదులిచ్చారు.
వంద ప్రశ్నలను ఎల్‌ఈడీ ద్వారా ప్రజెంటేషన్ చేసి వాటి సమాధానాలను యూకేజీ చిన్నారులను అడిగారు. 30 మంది విద్యార్థులు తడుముకోకుండా టీచర్స్ అడిగిన ప్రశ్నలకు వెంటవెంటనే సమాధానాలు చెప్పారు. అనంతరం భరద్వాజ్ రికార్డు ధ్రువీకరణ పత్రాన్ని అందించారు. స్కూల్ డెరైక్టర్ మళ్ల రామునాయుడు, ఏయూ ఆచార్యులు పి.రంగారావు, బి.మునిస్వామి, మదన్‌మోహన్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పృథ్వీరాజ్, స్కూల్ ప్రిన్సిపాల్ మళ్ల వాణిశ్రీ పాల్గొన్నారు.