నిజంగా... నా భార్యకు థ్యాంక్స్ చెప్పాలి
మనోగతం
ఒక రోజు మా చెల్లెలు వినయ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ‘అన్నయ్యా...నాకు అమ్మనూ, నిన్నూ చూడాలనిపిస్తోంది. రేపు బయలుదేరి వస్తున్నాను’ అని ఫోన్ పెట్టేసింది. చెల్లి పెళ్లయి ఏడాది దాటింది. బెంగుళూరులో మకాం. నాన్న చిన్నప్పుడే చనిపోయారు. దాంతో వినయకు అన్నీ నేనే.
రాత్రి నా గదిలో కూర్చుని ఏవో అత్తింటి విషయాలు చెబుతోంది. ‘మొన్నే పండక్కి వచ్చి వెళ్లారు కదా వినయా! మళ్లీ ఇప్పుడు ఇంత సడెన్‌గా...అదీ ఏ కారణం లేకుండా....’ అని నా మాటలు పూర్తికాకుండానే... ‘ఏం రాకూడదా అన్నయ్యా?’ అంది కోపంగా. వెంటనే వాళ్ల వదిన ‘అదేంటి వినయా? ఇది నీ ఇల్లు. నువ్వు ఎప్పుడైనా రావొచ్చు, వెళ్ళొచ్చు. నీ భర్త విషయంలో ఏదైనా ఇబ్బంది పడుతున్నావేమోనని ఆయన భయం’ అంది. ‘నెలరోజుల నుంచి ఆయన ప్రవర్తన, మాటలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఆఫీసు నుంచి ఓ గంట ఆలస్యమైతే చాలు... ఎక్కడికెళ్లావు, ఎందుకు ఆలస్యం... అంటూ తిడుతున్నారు.
ఒకరోజు నేను షాపింగ్‌కి వెళ్లి వచ్చేసరికి ఓ రెండు గంటలు ఆలస్యమైంది. అంతే! ఎవరితో తిరగడానికి వెళ్లావు...అన్నారు. ఆ మాట విన్నాక నాకు ఆయన మీద అసహ్యం పుట్టింది’ అంది చిరాగ్గా మొహం పెట్టి.
పడుకునే ముందు సురేఖతో ‘వినయ అంత బాధపడుతుంటే ఓదార్చాల్సింది పోయి పట్టీపట్టన్నట్లు ప్రవర్తించడం నాకు నచ్చలేదు’ అన్నాను. ‘ప్రపంచంలో ఇలాంటి కష్టం మీ ఒక్క చెల్లెలికే వచ్చినట్టు ఫీలవడం చూస్తుంటే నాకు నవ్వొస్తోందండి’ అంది. వెంటనే నాకు పెళ్లయిన కొత్తలో రోజులు గుర్తొచ్చాయి. సురేఖ అప్పట్లో టీచర్‌గా పనిచేసేది.
ఒకరోజు సాయంత్రం బాగా ఆలస్యంగా వచ్చింది. ఆ రోజు ఎవరో తోటి ఉపాధ్యాయురాలు పదవీ విరమణ వేడుకేదో ఉంటే ఆలస్యమైంది. విషయం తెలుసుకోకుండా నేను సురేఖతో నోటికొచ్చినట్టు మాట్లాడాను. ‘అడ్డమైన తిరుగుళ్ల కోసం ఉద్యోగమైతే వెంటనే ఉద్యోగం మానేయ్’ అని నేనన్న మాటలకు సురేఖ వెంటనే ఉద్యోగం మానేసింది. నాకు బాగా గుర్తు ఓ నాలుగురోజులు అన్నం తినలేదు తను. పదిరోజులవరకూ నాతో మాట్లాడలేదు.
తర్వాత ఇంట్లో ఆర్థికంగా ఇబ్బందులు మొదలవడంతో మళ్లీ ఉద్యోగంలో చేరింది. ఈ రోజు నా చెల్లెలు ఏడవడం, సురేఖ నవ్వడం...ఏదీ తప్పు కాదని మనసులో అనుకుంటూ నిద్రపోయాను. మర్నాడు పొద్దున వంటింట్లో సురేఖ, వినయకు కౌన్సెలింగ్ ఇస్తోంది. ‘వాళ్లు మనని అంతకంటే పెద్దమాట ఏమనగలరు? ఈసారి అలాంటి మాటలన్నప్పుడు భోరుమంటూ ఏడవకుండా చిన్నగా నవ్వి ఊరుకో.
కొన్ని విషయాల్లో లెక్కచేయకపోవడమే పెద్ద శిక్ష. దెబ్బకు దార్లోకి వస్తారు’ అని సురేఖ చెబుతున్న మాటలు నా చెవిన పడ్డాయి. నిజంగా సురేఖకు థ్యాంక్స్ చెప్పాలనిపించింది. ఎక్కడ ‘మీ అన్నయ్యా అలాంటి వాడే’ అని చెబుతుందోనని భయపడ్డాను. ఆరోజు వినయ మొహంలో ఏదో తెలియని ధైర్యం కనిపించింది.
- కె. ఆనంద్‌సాయి, విశాఖపట్నం