ప్రముఖ సినీ సంగీత దర్శకుడు చక్రి మృతితో పొన్నూరు కంట తడిపెట్టింది. పక్కనే ఉన్న నిడుబ్రోలు గ్రామానికి చెందిన శ్రావణిని చక్రి వివాహమాడినప్పటికీ ఆయనను అంతా పొన్నూరు అల్లుడు అని పిలుస్తుంటారు. శ్రావణి చిన్నతనంలోనే కుటుంబం అంతా భద్రాచలం వెళ్లి స్థిరపడిపోయారు.
పొన్నూరు రూరల్: హైదరాబాద్‌లో సోమవారం ఉదయం కన్నుమూసిన ప్రముఖ సినీ సంగీత దర్శకుడు చక్రి పొన్నూరు అల్లుడని స్థానికులు పిలుస్తారు. ఆయన భార్య శ్రావణి సొంతూరైన నిడుబ్రోలు గ్రామం పొన్నూరు పక్కనే ఉండటం, చక్రి తరచూ పొన్నూరు రావటం, మండలంలోని నండూరు గ్రామంలో పలుసార్లు కచేరీలు చేయటమే ఇందుకు కారణం. శ్రావణి, తల్లిదండ్రులు అన్నంరాజు మధుసూదనరావు, సురేఖ తొలుత నిడుబ్రోలులోని నేతాజీనగర్‌లో నివాసం ఉండేవారు.
శ్రావణి చిన్నతనంలోనే వారంతా భద్రాచలం వెళ్ళిపోయారు. చక్రి మరణవార్త విన్న శ్రావణి నాయనమ్మ రాధాంబ హుటాహుటిన హైదరాబాద్ వెళ్లారు. ఇంత హడావుడిలోనూ దుఖాన్ని దిగమింగుకుంటూ ఆమె సాక్షితో మాట్లాడారు. ‘పెద్దలంటే చక్రికి ఎంతో గౌరవం. అయన లేరని నేను భావించడం లేదు. చక్రి ప్రతి పాటలోనూ వేణువై అందరి నోళ్లలో నర్తిస్తూనే ఉంటారు’ అని అంటూ కన్నీరు మున్నీరయ్యూరు.
గుప్తదానాలు చేసేవారు..
‘అల్లుడూ అని నేను పిలిస్తే మామగారూ అంటూ అప్యాయంగా స్పందించే చక్రి గొంతు మరోసారి వినలేనా?’ అని సినీ మాటల రచయిత కృష్ణేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. పొన్నూరు నేతాజీనగర్‌లో ఉన్న ఆయన చక్రి మరణవార్త విన్న వెంటనే హైదరాబాద్ బయలుదేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘గోపి గోపిక గోదావరి’ చిత్రం నుంచి చక్రితో పరిచయం ఏర్పడిందని చెప్పారు. స్నేహానికి మారుపేరైన చక్రి ఎందరికో గుప్తదానాలు చేశారని వెల్లడించారు. అనేకమంది సంగీత కళాకారులకు సినిమా రంగంలో స్థానం కల్పించిన వ్యక్తి అని కొనియాడారు. కొత్త రచయితలను పరిచయం చేయడమే కాకుండా వారు ఉండేందుకు సౌకర్యం కల్పించేవారని చెప్పారు.
పొన్నూరు అల్లుడు చక్రి!
Published Wed, Dec 17 2014 2:45 AM | Last Updated on Sat, Sep 2 2017 6:16 PM
Advertisement