సంగీత దర్శకుడు చక్రిపై నిర్భయ కేసు
సినీ సంగీత దర్శకుడు చక్రి వివాదంలో చిక్కుకున్నారు. చక్రి తనపట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ బేగంపేటకు చెందిన మాధవి అనే యువతి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. చక్రి ఇంట్లో ఆదివారం రాత్రి జరిగిన ఫ్రెండ్ షిప్ డే వేడుకల సందర్భంగా తన పట్ల ఆయన అసభ్యంగా ప్రవర్తించారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. చక్రితో పాటు నిర్మాత పరుచూరి ప్రసాద్‌పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
ఇడియట్ సినిమాతో పాపులరయిన చక్రి పెద్ద సంగీత దర్శకుడిగా ఎదిగారు. పలు హిట్ సినిమాలకు ఆయన సంగీతం అందించారు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, శివమణి, దేవదాసు, చక్రం, సింహా తదితర సినిమాలకు చక్రి అందించిన పాటలను శ్రోతలను ఆకట్టుకున్నాయి.
సినిమా వాళ్ల ఆకతాయి చేష్టలు ఇటీవల కాలంలో పెరిగాయి. మొన్నటి మొన్న ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు తన పట్ల అనుచితంగా ప్రవర్తించాడని ఓ యువతి జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అటు చిరంజీవి కుమారుడు హీరో రామ్చరణ్ నడిరోడ్డుపై ఓ వ్యక్తిపై చేయిచేసుకోవడంతో వివాదం చెలరేగిన సంగతి విదితమే.