పరిస్థితుల్ని మనకు అనుకూలంగా మార్చుకోవాలని అనుకున్నా
మన సానుకూల దృక్పథమే మన బలం
ఎన్టీఆర్ తర్వాత నేనే టాప్‌లో నిలిచా
‘ఆప్టా కేటలిస్ట్’సదస్సులో సినీ నటుడు చిరంజీవి
సాక్షి, హైదరాబాద్: ‘ఆంట్రప్రెన్యూర్‌షిప్’ అంటే స్పెల్లింగ్ కూడా నాకు తెలీదు. దాని గురించి పెద్దగా మాట్లాడలేను. నా గురించి చెప్తా. తిరుగులేని మనిషి అనే సినిమా ఎన్టీఆర్‌తో చేస్తే ఫ్లాప్ అయ్యింది. తర్వాత డేట్లు చెప్పిన వ్యక్తి సినిమా నుంచి నన్ను తీసేశారు. ఏమైందంటే సినిమా పోయింది కదా అన్నారు. ఆ పరిస్థితుల్లో కుంగిపోయాను. ఐరన్ లెగ్ అనే పేరొస్తుందని భయపడ్డా. ఆకాశంలో గద్ద గుర్తొచి్చంది. అది కొంతవరకే కష్టపడి ఎగరాలి. తర్వాత గాలితో పాటు సునాయాసంగా పైకి ఎగరగలుగుతుంది.
నన్ను నేను అలా మార్చుకోవాలని అనుకున్నా. నన్ను వద్దు అనుకున్న వ్యక్తితోనే ఎన్టీఆర్ కంటే ఎక్కువ చిత్రాలు తీసేలా మలచుకున్నా. పరిస్థితులు ఎలా ఉన్నా మనకు అనుకూలంగా మార్చుకోవాలి. మన సానుకూల దృక్పథమే మనకు బలం..’అని ప్రముఖ నటుడు చిరంజీవి చెప్పారు. ఆదివారం హైటెక్స్‌లో ఆప్టా (అమెరికన్ ప్రోగ్రెస్సివ్ తెలుగు అసోసియేషన్) కేటలిస్ట్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
దక్షిణాది రాజ్‌కపూర్ ఫ్యామిలీగా పేరు తెచ్చుకున్నాం
‘విమర్శించే వారు మన గురించి ఆలోచన చేసే విధంగా మనం ఉండాలి. సినిమాల్లోకి కొత్తవారు వస్తారు. టాలెంట్ ఉంటే నడిచిపోతుందనుకుంటారు. అది సెకెండరీ. ప్రవర్తన బాగుండాలి. నైపుణ్యంతో పాటు వ్యక్తిత్వం ఉండాలి. ఎన్టీఆర్ తర్వాత నేనే టాప్‌లో నిలిచా. కానీ స్థానం కోసం ఏనాడూ ఆరాట పడలేదు. మన కుటుంబంలో 9 మంది నటులు ఉన్నారు. రాజ్‌కపూర్ కుటుంబంలా మన కుటుంబం ఉండాలని పవన్ అన్నాడు. అన్నట్టుగానే దక్షిణ భాతర దేశపు రాజ్‌కపూర్ ఫ్యామిలీగా పేరు తెచ్చుకున్నాం..’అని చిరంజీవి చెప్పారు. అంతకుముందు జరిగిన ప్యానల్ చర్చలో పలువురు సభ్యులు మాట్లాడారు. ప్రతి ఒక్కరిలోనూ ఒక పారిశ్రామికవేత్త ఉంటాడని అన్నారు. వ్యాపారాన్ని ప్రారంభించడం, దాన్ని విజయవంతం చేయడానికి విశ్వాసం, దూర దృష్టి, సహనం, స్వీయ క్రమశిక్షణ, సంకల్పం ఉండాలన్నారు.
పోటీతత్వం లాంటి వాటిని ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు. ఉద్యోగులకు టీం, యాజమాన్య బాధ్యతలు అప్పగించడం వల్ల మరింత అంకితాభావంతో పనిచేస్తారని తెలిపారు. చిత్ర పరిశ్రమలో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉందని ప్యానలిస్టులు అభిప్రాయపడ్డారు. కేటలిస్ట్ బిజినెస్ పిచ్ పోటీలో టాప్ 5 స్టార్టప్‌లు ఫైనల్‌కు చేరుకున్నాయి. అందులో ముగ్గురిని విజేతలుగా ప్రకటించి నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. కార్యక్రమంలో ఆప్టా చైర్మన్ సుబ్బు కోట, బిజినెస్ ఫోరం చైర్మన్ రమేష్, కన్వినర్ సాగర్, కమిటీ సభ్యులు, పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment