bhaskarabhatla
-
డప్పుకొట్టి చెప్పుకోనా...
శివ కందుకూరి, రాశీ సింగ్ జంటగా పురుషోత్తం రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భూతద్దం భాస్కర్ నారాయణ’. స్నేహల్ జంగాల, శశిధర్ కాశి, కార్తీక్ ముడుంబై నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం నుంచి ‘డప్పుకొట్టి చెప్పుకోనా..’ అనే పాటను చిత్రబృందం రిలీజ్ చేసింది. విజయ్ బుల్గానిన్ స్వరపరచిన ఈ పా టకు భాస్కరభట్ల సాహిత్యం అందించగా అనురాగ్ కులకర్ణి పా డారు. ‘‘ఇందులో శివ డిటెక్టివ్‌గా కనిపిస్తారు’’ అని చిత్రయూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్ పా కాల, విజయ్ బుల్గానిన్, కెమెరా: గౌతమ్ జి. -
నీ మౌనమే మాటాడితే...
పాటతత్వం జో అచ్యుతానంద చిత్రంలోని ఈ పాట ఇద్దరు అన్నదమ్ములు విడిపోయిన సందర్భంలో వస్తుంది. ఈ పాట నా కెరీర్లోనే నాకు నచ్చిన పాట. నాలాంటి ‘మాస్’ బ్రాండ్ ఉన్నవారికి చాలా అరుదుగా ఇటువంటి మంచి పాటలు రాసే అవకాశాలు వస్తాయి. నాకు ఈ పాట చాలా ఇష్టం. ఈ పాట రాసే అవకాశం రావడం నా అదృష్టం. దర్శకులు అవసరాల శ్రీనివాస్‌గారు నా కవిత్వం విని, నచ్చిందన్నారు. సిచ్యుయేషన్‌కి తగ్గట్లుగా ఈ పాట పెద్ద రచయితలతో రాయిద్దామనుకుని కూడా నా కవిత్వం విన్నాక నా మీద నమ్మకంతో ఈ పాట శ్రీనివాస్, కల్యాణిమాలిక్ నాతో రాయించారు. వాళ్లకు నా మీద ఉన్న నమ్మకమే నా చేత ఈ పాట రాయించింది. పాట అందంగా వచ్చేలా కొంచెం కష్టపడమన్నారు. సరే అన్నాను. ఆ పాట అబ్స్ట్రాక్ట్గా రావాలి. జనరలైజ్ చేయాలి. ఇద్దరు అన్నదమ్ములు విడిపోయినప్పుడు అన్నయ్యకి ఎంతో బాధగా ఉంటుంది. కాని వ్యక్తపరచలేడు. తమ్ముడిది అదే భావన. అప్పుడు వచ్చిన సాంగ్. ఈ పాట ఎవరికైనా అన్వయించుకోవచ్చు. స్నేహితులు, తల్లికొడుకులు, భార్యాభర్తలు... ఇలా ఎవరికైనా అన్వయం కుదరాలి అన్నారు. ఈ పాటను చాలెంజ్‌గా తీసుకున్నాను. పాటలో లోతైన భావం ఉండాలి, కాని అందరూ పాడుకోవాలి. ఇదీ నా ఆలోచన. ఒక లాలన ఒక దీవెన సడిచేయవా ఎద మాటున తియతీయని ప్రియభావన చిగురించదా పొరపాటున కలబోసుకున్న ఊసులు ఏమైనవో అసలేమో పెనవేసుకున్న ప్రేమలు మెలమెల్లగా ఎటుపోయెనో పల్లవితో పాట ప్రారంభమవుతుంది. లాలనగా, దీవెనగా ఉంటే సడి చేయాలి కదా, కాని సడి చేయడం లేదు. మనసులో ఉన్న ప్రేమ వంటివి వ్యక్తపరచకపోవడం తప్పు కదా!? అనే భావనతో పాట ప్రారంభించాను. బాల్యంలో అన్నదమ్ములు.... గోళీలు, కర్రబిళ్ల... ఒకటేమిటి... వారు ఆడని ఆట ఉండదు. అందుకే ‘కలబోసుకున్న ఊసులు’ అంటూ కొనసాగించాను. బాల్యంలో ఒకరితో ఒకరు ఎంతో ప్రేమగా ఉంటాం. ‘పెనవేసుకున్న ఊసులు ఏమైనవో అసలేమో’ బాల్యంలో పెనవేసుకున్న ప్రేమలు మెలమెల్లగా ఎటు పోయాయో అనుకుంటారు. ఒక వయసు వచ్చాక అందరూ వారి వారి జీవితాలకు పునశ్చరణ చేసుకోవాలని చెబుతాయి ఈ వాక్యాలు. చిన్నప్పుడు ఎంతో చనువుగా ఉండే అన్నదమ్ములు, పెద్దయ్యాక విడిపోతున్నారు. ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. చిన్నప్పటి అనుబంధాలు ఎక్కడికి వెళ్లిపోతున్నాయో అర్థం కావట్లేదు. ఈ బాధను ఈ వాక్యంలో చెప్పాను. ఇంతకాలం దాచుకున్న ప్రేమనీ హాయినీ కాలమేమీ దోచుకోదు ఇమ్మనీపెదవంచు మీద నవ్వునీ పూయించుకోడం నీ పని నీ మౌనమే మాటాడితే దరిచేరుకోదా ఆమనిచాలామంది సర్వసాధారణంగా ఉపయోగించే మాట... ‘కాలక్రమంలో విడిపోయారు’అనేది. కాలం ఎవరినీ విడదీయదు. ఎవరి హాయినీ దోచుకోదు. మనలో విడిపోవాలనే భావన ఉంటేనే విడిపోతాం. అంతేకాని నేరం కాలం మీద మోపకూడదు. ఎంతోకాలంగా దాచుకున్న అనురాగాన్ని, ఆప్యాయతను ఎప్పుడో ఒకప్పుడు ప్రదర్శిస్తుండాలి. మనసు పొరల్లోంచి వాటిని బయటకు తీసుకురావాలి. పెదవుల మీద చిరునవ్వును పూయించడానికి ఎవ్వరూ రావక్కర్లేదు. ఎవరికి వారే ఆ చిరునవ్వుల పూలను పూయించాలి. ఇద్దరు మనుషుల మధ్య ఉండే మౌనాన్ని ఎవరో ఒకరు ఛేదించిననాడు ఆమని తప్పక దరిచేరుతుంది. అందనంత దూరమేలే నింగికి నేలకి వానజల్లే రాయబారం వాటికిమనసుంటె మార్గం ఉండదా ప్రతి మనిషి నీకే చెందడాఈ బంధమే ఆనందమే నువు మోసుకెళ్లే సంపద అనాదిగా నింగికి నేలకు మధ్య అందనంత దూరం ఉంటూనే ఉంది. కాని ఆ దూరాన్ని ఒక్క వానజల్లు దూరం చేసేస్తోంది. ఇద్దరినీ తాను ఆనందంగా కలుపుతుంటుంది వానచినుకు. తన వారిని దగ్గర చేసుకోవాలనే మనసు ఉండాలే కాని మార్గం దొరక్కపోదు. మనసుతో పలకరిస్తే ప్రతి మనిషి మనకే చెందుతాడు. ప్రతిమనిషి తన వెంట మోసుకెళ్లే సంపదలు బంధం, ఆనందం మాత్రమే. చిల్లిగవ్వ కూడా తన వెంటరాదు. ఏ మనిషీ తన వెంట రాడు. కాని బంధాలు, ఆనందాలు మాత్రం వెంట వస్తాయి. అవి పంచే మనుషులను వదులుకోకూడదనే భావాన్ని ఇక్కడ చెప్పాను. ఈ పాట నా జీవితంలో గుర్తుండిపోయే పాట. ఈ పాట రాశాక నాకు ఎంతోమంది ఫోన్ చేసి, నన్ను ప్రశంసలతో ముంచెత్తారు. మంచి పాట రాస్తే ఇంతమంది ప్రేమను పొందవచ్చా అనిపించింది నాకు. ‘మంచిపాటలు రాసుకోవడానికి వెతుక్కుందాం’ అనే మార్పు తీసుకువచ్చింది. ఒక తాత్విక దృష్టిని తీసుకొచ్చింది. గొడవపడి వెళ్లిపోయిన వాళ్లు ఈ పాట విని మళ్లీ మాట్లాడుకున్నట్లు చెబుతుంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది. – సంభాషణ: డా. వైజయంతి భాస్కరభట్ల గీత రచయిత -
‘ఐటమ్ సాంగ్‌లో ఫిలాసఫీ ఏంటి’ అన్నారు!!
పాటతత్వం ఓరోజు పూరీ జగన్నాథ్ నన్నో పాట రాయమని అన్నారు... ‘నేనింతే’ సినిమా కోసం. ఐటెమ్ సాంగ్. అంతకుముందు ‘పోకిరి’లో ‘ఇప్పటి కింకా నా వయసు నిండా పదహారే’ రాశాను. అయితే ఈసారి పాట అలా ఉండకూడదని, ఫిలసాఫికల్‌గా ఉండాలని అన్నారాయన. ఐటెమ్ సాంగ్ అంటే తన అందాల గురించే పాడాలా, మంచి ఫిలాసఫీ చెప్పకూడదా అన్నది ఆయన ఆలోచన. చాలా గొప్ప ఆలోచన. ఆయన ఆలోచనకు రూపమివ్వడానికి నేను సిద్ధపడ్డాను. అప్పుడు నా మనసులో మెదిలిన మొదటి ఫిలాసఫీ... కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటు ఈ జీవితం. దాన్ని ఆధారంగా చేసుకుని నా కలం కదిలింది. ‘పుడుతూనే ఉయ్యాల... నువ్ పోతే మొయ్యాల’ అన్న పాట పుట్టుకొచ్చింది. ఫిలాసఫీ అనగానే పెద్ద పెద్ద పదాల్లో చెప్పాల్సిన అవసరం లేదు. ఏ మంచి విషయమైనా అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి. ముఖ్యంగా ఇది సినిమా పాట కాబట్టి నేల టికెట్ తీసుకున్న మాస్ ప్రేక్షకుడి మనసులోకి పాట చొచ్చుకుపోగలగాలి. అందుకే ఈ ట్రెండ్‌కు తగ్గట్టుగానే పదాలు వేసుకుంటూ పోయాను. ‘పుడుతూనే ఉయ్యాల... నువ్ పోతే మొయ్యాల... ఈలోపే ఏదో చెయ్యాల/ఏలాల ఏలాల... దునియానే ఏలాల... చకచకచక చెడుగుడు ఆడాల’ జీవితం చాలా చిన్నది. పుట్టుక, చావు మన చేతుల్లో లేవు. మధ్యలో ఉండే జీవితం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఏదో ఒకటి సాధించాలి. ‘అవకాశం రాలేదంటూ గుక్కే పెట్టి ఏడొద్దే/ఏనాడో వచ్చి ఉంటాది నువ్వే వదిలేసుంటావే’ చాలామంది అవకాశాలు రాలేదని బాధ పడిపోతూ ఉంటారు. అది నిజం కాదు. అవకాశాలు వస్తుంటాయి. కానీ కొన్నిసార్లు గుర్తించం. కొన్నిసార్లు నిర్లక్ష్యం చేస్తుంటాం. ‘చీకటిని తిడుతూ తొంగుంటే వేకువకి చోటే లేదులే/నిన్నేం తిరిగి రాదు కదా రేపేం జరుగు తుందో కదా/నీకై మిగిలివుంది ఇక ఈరోజు/ టర్నే లేని దారులూ ట్విస్టే లేని గాథలూ రిస్కే లేని లైఫులూ బోరు బోరే’ జీవితమన్నాక సంతోషంతో పాటు బాధ, కష్టాలు కూడా ఉంటాయి. వాటిని పాజిటివ్‌గా తీసుకుని ముందుకెళ్లిపోవాలి తప్ప తిట్టుకుంటూ కూర్చుంటే ముందుకుపోలేం. ‘నువ్వెంతో ఎత్తుకు ఎదిగినా బోల్డంత సంపాదించినా ఒరే నాన్నా పొంగిపోకురా/ గెలుపెవ్వడి సొత్తు కాదురా అది నీతో మొదలవ లేదురా/అది ఫిఫ్టీ ఫిఫ్టీ చాన్సురా’ ఓడిపోతే కుంగిపోకూడదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో నీదే తొలి పరాజయం కాదు. అలాగే గెలిస్తే పొంగిపోకూడదు. ఎందుకంటే నీదే తొలి విజయం కాదు. గెలుపోటములన్నవి అనుకోకుండా వస్తాయి. అయితే గెలవొచ్చు. లేదంటే ఓడొచ్చు. దేనినైనా ఒకేలా స్వీకరించాలి. ‘నిలుచుంటే బస్ స్టేషన్లో బస్ వస్తాది ఎక్కొచ్చే/పడిపోతే ఫ్రస్టేషన్లో ఏముంటాది ఎక్కేకే/ఇన్నేళ్లూ చేసిన పొరపాట్లూ సక్సెస్‌తో సర్దేయొచ్చులే/పడినా తిరిగి లేవడం బాల్యం మొదటి లక్షణం/దాన్నే మరచిపోవడం వింతేగా’ బస్టాండులో నిలబడితే బస్ వస్తుంది. ఎక్కుతాం. ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తే ఫ్లయిట్ వస్తుంది. ఎక్కుతాం. అలాగే జీవితంలో పైకి వెళ్లాలంటే ఏదో ఒక మార్గం ఎంచుకోవాలిగా! పడిపోయి అక్కడే ఉండిపోతే ఎక్కడికి వెళ్ల గలం? బాల్యంలో తప్పటడుగులు వేస్తూ పడి పోతాం. కానీ లేచి మళ్లీ అడుగులేస్తాం. నడక నేర్చుకుంటాం. కానీ పెద్దయ్యాక పడిపోతే మాత్రం ఎందుకు లేవం? పడినచోటే ఎందుకు ఉండిపోతాం? పొరపాట్లు చేయడం సహజం. కానీ విజయం సాధించిన తర్వాత అవి మరుగున పడిపోతాయి. ఏమీ చేయకుండా ఖాళీగా తిరిగి, అల్లర్లు చేసి, గొడవల్లో ఇరుక్కుని చెడ్డపేరు తెచ్చుకుంటాడో వ్యక్తి. అతడు ఉన్న ట్టుండి మారిపోయి, ఏ విదేశాలకో వెళ్లి సెటిలై పోయాడనుకోండి, తన తల్లిదండ్రులను ఏ లోటూ లేకుండా చూసుకుంటున్నాడనుకోండి... అతడి పాత జీవితం ఎవరికైనా గుర్తుకొస్తుందా! ‘నిన్ను భయపెట్టే పనులేమిటో అవి చేసేయ్ రోజుకొక్కటీ/ఇక ఆపై జడుపే రాదురా’ మనకు ఏదంటే భయమో దాన్ని చూసి పారిపోతుంటాం. అలా కాకుండా వాటిని చేయడానికి ప్రయత్నిస్తే ఆ భయం పోతుంది. ఇలా స్ఫూర్తినిచ్చే ఎన్నో మాటలు ఇందులో రాశాను. నిజానికి నేను పాటించే సూత్రాలే అవన్నీ. అందుకే ఆ మాటల్లోని నిజాయితీ పాటను నిలబెట్టింది. నేను ఎన్నోసార్లు పడిపోయాను. లేచాను. గెలిచాను. స్క్రీన్‌మీద నా పేరు చూసుకోవాలని వచ్చాను. నా పేరు తెర మీద చూసుకున్నాక వెళ్లిపోవచ్చు. కానీ వెళ్లలేదు. మొదటి ఏడు సినిమాలూ పరాజయాన్ని చవిచూసినా కుంగిపోలేదు. ఓ సమయంలో వెళ్లిపోదాం అనిపించినా మంచి పేరుతో వెళ్లిపోదాం అనుకున్నాను. పేరు వచ్చాక, దాన్ని నిలబెట్టుకోకుండా వదిలేయ కూడదు అనుకున్నాను. అందుకే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. ఓడిపోవడం తప్పు కాదు. కానీ గెలవడానికి ప్రయత్నించకపోవడం తప్పు. ప్రయత్నం చేసి ఓడిపోయినా ఫర్వాలేదు కానీ ప్రయత్నమే చేయకుండా వెనకడుగు వేయడం చాలా తప్పు. ఈ వాస్తవాన్నే చెప్పింది నా పాట. ఐటమ్ సాంగ్‌లో ఫిలాసఫీ ఏంటి, ముమైత్‌ఖాన్ ఫిలాసఫీ చెప్తే ఎవరు వింటారు అన్నవాళ్లు ఉన్నారు. వాళ్లు అలా అంటారని ముందే ఊహించినా కావాలనే ఆ ప్రయోగం చేశారు పూరి. అలాంటి గట్స్ ఉన్న డెరైక్టర్ నాలాంటి రచయితకి తోడుగా ఉన్నంతకాలం ఇలాంటి మంచి పాటలు పుడుతూనే ఉంటాయి. - భాస్కరభట్ల, గీత రచయిత -
సినీ నటుడు రంగనాథ్ మృతికి నివాళిగా...
ఎలిజీ ఎంత బాగుండు! నిన్ను నువ్వు ప్రేమించుకోలేనప్పుడే ద్వేషం పది తలల రావణుడిలా భయపెడుతుంది. నీకు నువ్వే బరువనుకున్నప్పుడు ఏ ఓదార్పు ఊయల నిన్ను మోస్తుంది చెప్పు? అన్నీ నువ్వనుకున్నట్టే జరిగితే దాన్నేమంటారో తెలీదు కానీ, ఖచ్చితంగా జీవితం అనైతే అనరు. తప్పదు... అవమానాలుండొచ్చు... అవహేళనలుండొచ్చు నిరాశలుండొచ్చు... సహాయ నిరాకరణలూ ఉండొచ్చు తెగిన తలకాయాలా... నీ గుండె గుమ్మానికి ఒంటరితనం వేలాడుతూ ఉండొచ్చు అంతమాత్రానికే మరణంతో మంతనాలా? బలవంతంగా చచ్చిపోవాలనుకున్నావంటే... ఇంత కాలం బలహీనంగా బతికినట్టా? నూకలు చెల్లిపోయాక ఎలాగూ ఎవరికి వారు యమునా తీరే నువ్వు... నీ తరువాత నేను... వరుసలో చాలామందే..! ఎవరు మాత్రం ఉండిపోతాం? ఏం బావుకుంటాం? గోడలమీద రాతల్లా జ్ఞాపకాలు తప్ప. కాలిపోయిన కట్టెలో మనిషి జాడ వెతకలేం బతికున్నోళ్ల కన్నీటి ధారకి ఆనకట్టలూ కట్టలేం నువ్వు పోవడమంటే... నువ్వొక్కడివే పోవడం కాదు నీ చుట్టూ అల్లుకున్న అనుబంధాల దారాల్ని బలవంతంగా తెంపేసుకుపోవడమే! చచ్చిపోవడానికి చాలా ధైర్యం కావాలి అందులో కాస్తై బతకడానికి వాడుకుని ఉంటే ఎంత బాగుండు! - భాస్కరభట్ల -
పుష్కరాలకు... పాట చేద్దామనుకున్నాం!
చక్రి మరణం నాకు ఏ మాత్రం నమ్మశక్యంగా లేదు. అతను నాకు ఎంత ఆత్మీయుడంటే, గీత రచయితగా ఇవాళ నేను ఈ స్థాయిలో ఉండడానికి ముఖ్య కారణమే అతను. చక్రి కెరీర్లో అతని సంగీత దర్శకత్వంలో అత్యధిక పాటలు రాసిన రచయితను నేనే. అలాగే, గీతరచయితగా నా కెరీర్లో నా పాటలకు అత్యధికంగా సంగీతం అందించిన మ్యూజిక్ డెరైక్టర్ చక్రి. ‘ఇట్లు... శ్రావణి - సుబ్రహ్మణ్యం’తో మొదలైన మా కాంబినేషన్ ఇప్పటి దాకా ఆగకుండా సాగుతోంది. వ్యక్తిగతానికి వస్తే, చక్రితో గడిపిన క్షణాలు, జరిగిన సంగతులు అన్నీ ఇన్నీ కావు. నేను కారు కొనుక్కోవడానికి కారణం - చక్రి. గీత రచయితగా తొలి రోజుల్లో నేను టూవీలర్ మీద తిరిగేవాణ్ణి. ఒకసారి హైదరాబాద్‌లో జోరున వర్షం. తడిసిపోయిన నేను గణపతి కాంప్లెక్స్ దగ్గర చెట్టు కింద నిలుచున్నా. అయినా వర్షం ధాటికి తడిసిపోతున్నా. ఆ సమయంలో అటు నుంచి తన ‘మ్యాటిజ్’ కారులో వెళుతున్న చక్రి బండి ఆపి, నన్నూ కారులో రమ్మన్నాడు. నా టూవీలర్ అక్కడ వదిలేసి వెళ్ళడం ఇష్టం లేక, వద్దన్నాను. ఆ తరువాత నేను కలిసిన వెంటనే చక్రి, ‘నువ్విక కారు కొనుక్కోవాలి’ అంటూ బలవంతపెట్టాడు. అలాగే, పాట రాసినందుకు నాకివ్వాల్సిన పారితోషికం డబ్బులు తన దగ్గరే దాచి ఉంచి, కారు కొనుక్కోవడానికి తగినంత పోగయ్యాక ఇచ్చాడు. అలా నేను నా మొదటి కారు కొన్నది చక్రి వల్లే! అలాగే, నా డ్రెస్సింగ్ స్టైల్ మార్చింది కూడా చక్రే! స్టైల్స్ అంటే ఎలా ఉండాలి, ఏమిటనేది తనే నాకు చెప్పాడు. నన్ను ప్రత్యేకంగా సికింద్రాబాద్‌లోని ‘స్టైల్ జోన్’కు తీసుకువెళ్ళి, అన్నీ కొనిపెట్టాడు. అదీ అతనిలోని స్నేహశీలత. చక్రిలోని గొప్ప గుణం ఏమిటంటే, తాను ఎదుగుతూ పక్కవాళ్ళను కూడా ఎదగనిచ్చే వ్యక్తి. పక్కవాళ్ళ ఎదుగుదలను చూసి అమితంగా సంతోషించే వ్యక్తి. నా రచనలు అతనికి ఎంత ఇష్టమంటే, కెరీర్ తొలి రోజుల్లో ప్రతి పాటకూ రచయితగా నన్నే రికమెండ్ చేసేవాడు. కానీ, ఇతరులకు అది తప్పుగా అనిపిస్తుందేమోనని ఒక దశకు వెళ్ళాక నేనే వద్దన్నాను. నాకు నేనుగా ఎదగాలనుకుంటున్నా అన్నా. అతను నా మాటను అపార్థం చేసుకోలేదు. నా మనసులోని భావం గ్రహించాడు. చివరకు దర్శక, నిర్మాతలు వచ్చి, పాటలు నాతోనే రాయించమని అడిగినప్పుడు, ‘వాళ్ళే నిన్ను కోరుకొనే స్థితికి ఎదిగావు’ అంటూ ఆనందించాడు. అలాంటి వ్యక్తులు ఇవాళ అరుదు. గమ్మత్తేమిటంటే, గోదావరి తీరం నుంచి వచ్చిన నేను గోదావరి నది మీద రాసిన కవిత అంటే చక్రికి మహా ఇష్టం. అసలు ఆ కవితే మమ్మల్ని తొలిరోజుల్లో బాగా సన్నిహితం చేసి, కలిపింది. వచ్చే ఏడాదిలో గోదావరి పుష్కరాలు వస్తున్నాయనీ, ఏదైనా మంచి పాట చేద్దామనీ ఇటీవలే నాతో అన్నాడు. అందుకు సిద్ధమవుతున్నాం. రేపో, ఎల్లుండో ఆ పని మీద కలవాల్సింది. ఇంతలోనే అనుకోని ఈ దుర్వార్త వినాల్సి వచ్చింది. సినీ పరిశ్రమకనే కాదు... నాకు వ్యక్తిగతంగా కూడా చక్రి లేని లోటు ఎన్నడూ తీరనిదే! - భాస్కరభట్ల సినీ గీత రచయిత - చక్రికి సన్నిహితుడు -
ఎందుకు ప్రేమించాలి? ఎలా ప్రేమించాలి?
ప్రేమలో పడనివాళ్లు... వానలో తడవని వాళ్లు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు. ప్రేమకు వయసుతో సంబంధం లేదు, వర్ణంతో సంబంధంలేదు. ఇక్కడ మనసే ప్రధానం. అయితే అన్ని ప్రేమలూ ఒకలా ఉండవు. అసలు ప్రేమ అనేది సముద్రమంత సబ్జెక్ట్. ఎలా ప్రేమించాలి? ఎందుకు ప్రేమించాలి? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడం చాలా కష్టం. అయితే ‘ప్రేమించాలి’ సినిమా చూస్తే ఈ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది అంటున్నారు నిర్మాత సురేష్ కొండేటి. ఆయన నిర్మించిన పదో అనువాద చిత్రమిది. ఇటీవలే ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో ఓ పాట పాడించారు. ‘లాలిజో... అమ్మ ఒడి లేదు అని ఏడవకు...’ అనే ఆ పాటను భాస్కరభట్ల రచించారు. ఈ సందర్భంగా సురేష్ కొండేటి మాట్లాడుతూ -‘‘నా అభిమాన గాయకుడు బాలుగారితో పాట పాడించాలన్న నా కల ఇన్నేళ్లకు నెరవేరింది. ఆయన పాడటంతో ఈ సినిమాకే ఒక పరిపూర్ణత వచ్చింది. ఈ పాట లిరిక్స్ చదివి బాలుగారు నన్నూ భాస్కరభట్లనూ అభినందించారు. ‘నీ సినిమాలు చాలా బాగుంటాయి సురేష్’ అని బాలూగారు అన్నప్పుడు నా ఆనందానికి అవధులు లేవు. దాదాపు 1300 పాటలు రాసిన భాస్కరభట్ల కెరీర్లో టాప్ టెన్‌లో నిలిచే పాట ఇది. సుశీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తమిళనాట సంచలన విజయం సాధించింది. తెలుగు ప్రేక్షకులను కూడా తప్పక ఆకట్టుకుంటుందని నా నమ్మకం. యువతరంలో మార్పును తెచ్చే సినిమా ఇది. హీరో సంతోష్ తొలి సినిమా అయినా చాలా బాగా చేశాడు. హీరోయిన్ మనీషా యాదవ్ అద్భుతమైన నటనను ప్రదర్శించింది’’ అన్నారు. -
మనోగళం: వాటికే ఎక్కువ ఖర్చు పెడుతుంటా!
ఇతరుల్లో మీకు నచ్చేది/నచ్చనిది? నచ్చేది నిజాయితీ. నచ్చనిది... ఇక్కడి విషయాలు అక్కడ, అక్కడి విషయాలు ఇక్కడ చెప్పే తత్వం. మీలో మీకు నచ్చేది/నచ్చనిది? నచ్చేది కొత్తగా ఆలోచించడం, నాకు నచ్చినట్టు జీవించడం. నచ్చనిది కోపం. మీరు తరచుగా వాడే మాట/ఊతపదం? అందరినీ ‘అన్నయ్యా’ అంటుంటాను. మిమ్మల్ని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తి? పూరీ జగన్నాథ్. నన్ను సొంత తమ్ముడిలా చూసుకుంటారాయన. అందరినీ నవ్వుతూ పలకరించడం, చుట్టూ ఉన్న వాతావరణాన్ని మనకు కావలసినట్టు మలచుకోవడం వంటివి ఆయన్ను చూసే నేర్చుకోవాలి. కష్టంగా కాకుండా ఇష్టంగా పనిచేయడం నేనాయన నుంచే లవర్చుకున్నాను. ఎందుకిలా చేశానా అని మీరు బాధపడేది ఏదైనా ఉందా? పరిచయస్తులెవరో, స్నేహితులెవరో గుర్తించడంలో ఎప్పుడూ విఫలమవుతూనే ఉంటాను. అందరినీ స్నేహితులు అనేసుకుంటాను. ఆ తర్వాత చాలా ఇబ్బందులు పడుతుంటాను. ఎందుకిలా చేశానా అని తర్వాత బాధపడుతుంటాను. అత్యంత సంతోషపడిన సందర్భం? సైకిల్ తొక్కడం కూడా రాని నేను, ఏకంగా కెనైటిక్ హోండా కొనుక్కున్నాను. ఆ బండెక్కి హైదరాబాద్ రోడ్ల మీద తిరిగిన తొలిరోజున ప్రపంచాన్ని జయించినంత సంతోషం కలిగింది. అత్యంత బాధ కలిగించిన సందర్భం? పాటలు రాయడం మొదలుపెట్టిన తొలినాళ్లలో... ఒకే ట్యూన్‌ని చాలామందికి ఇచ్చి రాయించుకుంటారని నాకు తెలీదు. దాంతో రాత్రీ పగలూ కూర్చుని పాట రాసేవాణ్ని. బాగుంది అంటే ఎంతో సంతోషపడేవాణ్ని. తీరా క్యాసెట్ విడుదలయ్యాక నా పాట లేకపోవడం చూసి చాలా బాధ కలిగేది. ఇలాంటి నమ్మకద్రోహాలు జరిగిన ప్రతిసారీ ఏడుపొచ్చేది. మీరు నమ్మే సిద్ధాంతం...? బతికిన ప్రతి క్షణం నుంచీ మూల్యాన్ని రాబట్టుకోవాలి. ఏ క్షణాన్నీ వృథాగా పోనివ్వకూడదు. ఆకలి విలువ తెలిసిన క్షణం? నేను విపరీతమైన భోజన ప్రియుణ్ని. కానీ హైదరాబాద్ వచ్చిన కొత్తలో కడుపు నిండా తినడానికి సరిపడా డబ్బుండేది కాదు. దాంతో ఖైరతాబాద్ ‘రెడ్‌రోజ్ కేఫ్’లో ఉదయం రెండు బిస్కట్లు తిని, టీ తాగేవాడిని. లంచ్ టైమ్‌లో ‘పెరిక భవన్’ దగ్గర రెండు రూపాయలకు నాలుగు అరటిపళ్లు తిని, నీళ్లు తాగేవాడిని. రాత్రిపూట మాత్రమే మెస్‌లో భోం చేసేవాడిని. ఆకలి బాధ ఏంటో అప్పుడే తెలిసింది. అందుకే ఆకలి అని ఎవరైనా అంటే... కడుపు నిండా భోజనం పెట్టేస్తాను. ఎవరికైనా క్షమాపణ చెప్పాల్సి ఉందా? ఉంటే ఎవరికి? మా అమ్మానాన్నలకి చెప్పాలి. తెలిసో తెలియకో చాలాసార్లు వాళ్ల మనసుని నొప్పించాను. అలాగే... వాళ్లతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నాను. ఈ రెండు విషయాల్లోనూ వాళ్లకు క్షమాపణ చెప్పాలి. మీ గురించి ఎవరికీ తెలియని ఓ విషయం? నేను పాటల రచయితగానే అందరికీ తెలుసు. కానీ నేనో మంచి ఆర్టిస్టుని కూడా. బొమ్మలు చాలా బాగా గీస్తాను. చదువుకునే రోజుల్లో నేను వేసిన కార్టూన్లు కొన్ని పత్రికల్లో వచ్చాయి కూడా! మిమ్మల్ని భయపెట్టే విషయం ఏమైనా ఉందా? ఎత్తయిన ప్రదేశాల నుండి కిందికి చూడటమంటే మహా భయం. జెయింట్ వీలన్నా అంతే. అస్సలు ఎక్కను. ఎలాంటి వాటికి ఎక్కువ ఖర్చు పెడుతుంటారు? మ్యూజిక్ ప్లేయర్స్‌కి. నా దగ్గర చాలా ఉన్నాయి. పెన్నులకి, డ్రెస్సులకి కూడా బాగానే ఖర్చుపెడుతుంటాను. ఎప్పటికైనా చేసి తీరాలనుకునేది? చిన్నప్పుడే పాత్రికేయ వృత్తిలోకి రావడం వల్ల చదువు మధ్యలో ఆపేశాను. ఇప్పుడు మళ్లీ చదువుకోవాలనిపిస్తోంది. పీహెచ్డీ చేసి, డాక్టరేట్ తీసుకోవాలని ఉంది. దేవుడు ప్రత్యక్షమైతే ఏ వరం కోరుకుంటారు? ఇంత మంచి జన్మనిచ్చినందుకు కృతజ్ఞతలు చెబుతాను తప్ప ఏమీ అడగను. ఎందుకంటే నాకు అంత పెద్ద పెద్ద కోరికలేమీ లేవు. మీ జీవితంలో ఒకే ఒక్క రోజు మిగిలివుందని తెలిస్తే... ఆ రోజును ఎలా గడుపుతారు? మనసుకు నచ్చిన కవిత్వం రాసుకుంటూ గడిపేస్తా. మరణానికి భయపడతారా? ఎలాగూ తప్పదనుకున్నదాని గురించి భయపడటం అవసరమా! అందరికీ ఎలా గుర్తుండిపోవాలనుకుంటారు? తలలో నాల్కలా. మళ్లీ జన్మంటూ ఉంటే ఎలా పుట్టాలనుకుంటారు? నాకు సైన్స్ అంటే చాలా ఇష్టం. అందుకే సైంటిస్టులా పుట్టి కొత్త కొత్త అన్వేషణలు చేస్తా. - సమీర నేలపూడి