మనోగళం: వాటికే ఎక్కువ ఖర్చు పెడుతుంటా! | I spend more money on food: BhaskaraBhatla | Sakshi
Sakshi News home page

మనోగళం: వాటికే ఎక్కువ ఖర్చు పెడుతుంటా!

Published Sun, Sep 15 2013 2:00 AM | Last Updated on Fri, Sep 1 2017 10:43 PM

మనోగళం: వాటికే ఎక్కువ ఖర్చు పెడుతుంటా!

మనోగళం: వాటికే ఎక్కువ ఖర్చు పెడుతుంటా!

ఇతరుల్లో మీకు నచ్చేది/నచ్చనిది?
 నచ్చేది నిజాయితీ. నచ్చనిది... ఇక్కడి విషయాలు అక్కడ, అక్కడి విషయాలు ఇక్కడ చెప్పే తత్వం.
మీలో మీకు నచ్చేది/నచ్చనిది?
 నచ్చేది కొత్తగా ఆలోచించడం, నాకు నచ్చినట్టు జీవించడం. నచ్చనిది కోపం.
మీరు తరచుగా వాడే మాట/ఊతపదం?
 అందరినీ ‘అన్నయ్యా’ అంటుంటాను.
మిమ్మల్ని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తి?
 పూరీ జగన్నాథ్. నన్ను సొంత తమ్ముడిలా చూసుకుంటారాయన. అందరినీ నవ్వుతూ పలకరించడం, చుట్టూ ఉన్న వాతావరణాన్ని మనకు కావలసినట్టు మలచుకోవడం వంటివి ఆయన్ను చూసే నేర్చుకోవాలి. కష్టంగా కాకుండా ఇష్టంగా పనిచేయడం నేనాయన నుంచే లవర్చుకున్నాను.
     ఎందుకిలా చేశానా అని మీరు బాధపడేది ఏదైనా ఉందా?
 పరిచయస్తులెవరో, స్నేహితులెవరో గుర్తించడంలో ఎప్పుడూ విఫలమవుతూనే ఉంటాను. అందరినీ స్నేహితులు అనేసుకుంటాను. ఆ తర్వాత చాలా ఇబ్బందులు పడుతుంటాను. ఎందుకిలా చేశానా అని తర్వాత బాధపడుతుంటాను.
 
     అత్యంత సంతోషపడిన సందర్భం?
 సైకిల్ తొక్కడం కూడా రాని నేను, ఏకంగా కెనైటిక్ హోండా కొనుక్కున్నాను. ఆ బండెక్కి హైదరాబాద్ రోడ్ల మీద తిరిగిన తొలిరోజున ప్రపంచాన్ని జయించినంత సంతోషం కలిగింది.
     అత్యంత బాధ కలిగించిన సందర్భం?
 పాటలు రాయడం మొదలుపెట్టిన తొలినాళ్లలో... ఒకే ట్యూన్‌ని చాలామందికి ఇచ్చి రాయించుకుంటారని నాకు తెలీదు. దాంతో రాత్రీ పగలూ కూర్చుని పాట రాసేవాణ్ని. బాగుంది అంటే ఎంతో సంతోషపడేవాణ్ని. తీరా క్యాసెట్ విడుదలయ్యాక నా పాట లేకపోవడం చూసి చాలా బాధ కలిగేది. ఇలాంటి నమ్మకద్రోహాలు జరిగిన ప్రతిసారీ ఏడుపొచ్చేది.
 
  మీరు నమ్మే సిద్ధాంతం...?
 బతికిన ప్రతి క్షణం నుంచీ మూల్యాన్ని రాబట్టుకోవాలి. ఏ క్షణాన్నీ వృథాగా పోనివ్వకూడదు.   
     ఆకలి విలువ తెలిసిన క్షణం?
 నేను విపరీతమైన భోజన ప్రియుణ్ని. కానీ హైదరాబాద్ వచ్చిన కొత్తలో కడుపు నిండా తినడానికి సరిపడా డబ్బుండేది కాదు. దాంతో ఖైరతాబాద్ ‘రెడ్‌రోజ్ కేఫ్’లో ఉదయం రెండు బిస్కట్లు తిని, టీ తాగేవాడిని. లంచ్ టైమ్‌లో ‘పెరిక భవన్’ దగ్గర రెండు రూపాయలకు నాలుగు అరటిపళ్లు తిని, నీళ్లు తాగేవాడిని. రాత్రిపూట మాత్రమే మెస్‌లో భోం చేసేవాడిని. ఆకలి బాధ ఏంటో అప్పుడే తెలిసింది. అందుకే ఆకలి అని ఎవరైనా అంటే... కడుపు నిండా భోజనం పెట్టేస్తాను.
 
     ఎవరికైనా క్షమాపణ చెప్పాల్సి ఉందా? ఉంటే ఎవరికి?
 మా అమ్మానాన్నలకి చెప్పాలి. తెలిసో తెలియకో చాలాసార్లు వాళ్ల మనసుని నొప్పించాను. అలాగే... వాళ్లతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నాను. ఈ రెండు విషయాల్లోనూ వాళ్లకు క్షమాపణ చెప్పాలి.
     మీ గురించి ఎవరికీ తెలియని ఓ విషయం?
 నేను పాటల రచయితగానే అందరికీ తెలుసు. కానీ నేనో మంచి ఆర్టిస్టుని కూడా. బొమ్మలు చాలా బాగా గీస్తాను. చదువుకునే రోజుల్లో నేను వేసిన కార్టూన్లు కొన్ని పత్రికల్లో వచ్చాయి కూడా!
  మిమ్మల్ని భయపెట్టే విషయం ఏమైనా ఉందా?
 ఎత్తయిన ప్రదేశాల నుండి కిందికి చూడటమంటే మహా భయం. జెయింట్ వీలన్నా అంతే. అస్సలు ఎక్కను.
  ఎలాంటి వాటికి ఎక్కువ ఖర్చు పెడుతుంటారు?
 మ్యూజిక్ ప్లేయర్స్‌కి. నా దగ్గర చాలా ఉన్నాయి. పెన్నులకి, డ్రెస్సులకి కూడా బాగానే ఖర్చుపెడుతుంటాను.
  ఎప్పటికైనా చేసి తీరాలనుకునేది?
 చిన్నప్పుడే పాత్రికేయ వృత్తిలోకి రావడం వల్ల చదువు మధ్యలో ఆపేశాను. ఇప్పుడు మళ్లీ చదువుకోవాలనిపిస్తోంది. పీహెచ్‌డీ చేసి, డాక్టరేట్ తీసుకోవాలని ఉంది.
     దేవుడు ప్రత్యక్షమైతే ఏ వరం కోరుకుంటారు?
 ఇంత మంచి జన్మనిచ్చినందుకు కృతజ్ఞతలు చెబుతాను తప్ప ఏమీ అడగను. ఎందుకంటే నాకు అంత పెద్ద పెద్ద కోరికలేమీ లేవు.
     మీ జీవితంలో ఒకే ఒక్క రోజు మిగిలివుందని తెలిస్తే... ఆ రోజును ఎలా గడుపుతారు?
 మనసుకు నచ్చిన కవిత్వం రాసుకుంటూ గడిపేస్తా.
     మరణానికి భయపడతారా?
 ఎలాగూ తప్పదనుకున్నదాని గురించి భయపడటం అవసరమా!
     అందరికీ ఎలా గుర్తుండిపోవాలనుకుంటారు?
 తలలో నాల్కలా.
     మళ్లీ జన్మంటూ ఉంటే ఎలా పుట్టాలనుకుంటారు?
 నాకు సైన్స్ అంటే చాలా ఇష్టం. అందుకే సైంటిస్టులా పుట్టి కొత్త కొత్త అన్వేషణలు చేస్తా.
 - సమీర నేలపూడి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement