Manogalam
-
మనోగళం: శ్రీశ్రీ చెప్పారని ఆకలితో ఉన్నాను!
ఇతరుల్లో మీకు నచ్చేది/నచ్చనిది? నచ్చేది మంచి ప్రవర్తన, అర్థం చేసుకునే తత్వం. నచ్చనిది చిన్నవాటిక్కూడా అబద్ధాలు చెప్పడం, ఫాల్స్ ప్రెస్టీజ్. మీలో మీకు నచ్చేది/నచ్చనిది? పని మొదలెడితే అయ్యేదాకా వదలను. అది నచ్చుతుంది. అయితే నచ్చనిది కూడా అదే. ఎందుకంటే, ఒకదాని మీదే ఉండిపోవడం వల్ల మిగిలినవన్నీ మిస్ అయిపోతాను. తర్వాత బాధపడతాను. మీ ఊతపదం? దేన్నీ ఊతంగా తీసుకునే అలవాటు లేదు నాకు. మిమ్మల్ని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తి ఎవరు? వ్యక్తి కాదు, వ్యక్తులు. మా అమ్మానాన్నలు. కొందరు గురువులు, పరిశ్రమలో కొందరు పెద్దవాళ్లు... వీళ్లందరి ప్రభావమూ ఉంది నామీద. ఎందుకిలా చేశానా అని మీరు బాధపడేది ఏదైనా ఉందా? నా ప్రమేయం లేకుండానే ప్రొడ్యూసర్ని అయ్యి చాలా నష్టపోయాను. నా జీవితంలో అది చాలా పెద్ద లాస్. అలా చేయకుండా ఉంటే ఎంతో బాగుండేదని ఫీలవుతుంటా. అత్యంత సంతోషపడిన సందర్భం? ఇంకా చూడలేదు. అత్యంత బాధ కలిగించిన సందర్భం? ఇంకా చూడదలచుకోలేదు. ఆకలి విలువ తెలిసిన క్షణం? ఆకలితో అంతగా ఎప్పుడూ పోరాడింది లేదు. అయితే ఆకలేస్తే క్రియేటివిటీ బాగుంటుందని శ్రీశ్రీ గారు అన్న మాట చదివి, కావాలని ఆకలితో ఉండి, ఐడియాలు రాక కాగితాలు చింపేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎవరికైనా క్షమాపణ చెప్పాల్సి ఉందా? ఉంటే ఎవరికి? వాళ్ల తప్పు లేకపోయినా, నా వల్ల చెడ్డపేరు మూటగట్టుకున్న స్నేహితులు, స్నేహితురాళ్లందరికీ చెప్పాలి. మీ గురించి ఎవరికీ తెలియని ఓ విషయం? ఎవరికీ తెలియని విషయమా... (నవ్వుతూ) అది నాక్కూడా తెలియదు. మీ గురించి ఎదుటివాళ్లు తప్పుగా అనుకునేది? నన్ను అందరూ ఎప్పుడూ అపార్థమే చేసుకుంటారు. నా ఉద్దేశం అది కాకపోయినా, నా మాటల వల్ల దగ్గరివాళ్లు కూడా నన్ను తప్పుగా అనుకుంటూ ఉంటారు. అయితే నేను మళ్లీ సర్దిచెప్పేయగలను కాబట్టి బంధాలు విచ్ఛిన్నం కావు. మిమ్మల్ని భయపెట్టే విషయం ఏమైనా ఉందా? హారర్ సినిమాలంటే చచ్చేంత భయం. చూడ్డానికే కాదు, ఆలోచించడానిక్కూడా. చిన్నప్పుడు గాయత్రి అనే సినిమా సగం చూసి బయటికొచ్చేశాను. ఇంకెప్పుడూ చూడకూడదని డిసైడ్ చేసుకున్నాను. అయితే రామ్‌గోపాల్ వర్మ గారి హారర్ సినిమాలు చూస్తే నవ్వొస్తుంది కాబట్టి వాటిని చూస్తుంటాను. మీరు నమ్మే సిద్ధాంతం ఏమిటి? ఎంత కష్టపడితే అంతే దక్కుతుంది. అదృష్టవశాత్తూ దక్కాల్సిన దానికంటే ఎక్కువ దక్కినా... అది మన దగ్గర ఉండదు. ఎలాంటి వాటికి ఎక్కువ ఖర్చు పెడుతుంటారు? సినిమాలకి, పుస్తకాలకి, బట్టలకి. దేవుడు ప్రత్యక్షమైతే ఏ వరం కోరుకుంటారు? ఏమీ కోరుకోను. బ్లాంక్ అయిపోతాను. మామూలుగా గుడికెళ్లినప్పుడు ఏదైనా కోరుకుందామంటేనే నాకేమీ గుర్తు రావు. నాకు తెలిసి దేవుడు ప్రత్యక్షమైతే, మరుక్షణమే ఆయనలో ఐక్యమైపోతానేమో! ఒంటరిగా ఉంటే ఏం చేస్తారు? పాటలు పాడేసుకుంటూ ఉంటాను. జానే కహా గయే వో దిన్, జీనా యహా మర్నా యహా, ఇది తొలిరాత్రి, ఆగదు ఏ నిమిషము నీ కోసము, కుంతీకుమారి, ఏ నావదే తీరమో... ఇవన్నీ నాకిష్టమైన పాటలు. వాటిని పాడుకుంటాను. మీ జీవితంలో ఒకే ఒక్క రోజు మిగిలివుందని తెలిస్తే... ఆ రోజును ఎలా గడుపుతారు? హాయిగా నా ఆలోచనల్లో నేనుంటాను. భవబంధాల మీద, ఈ జంఝాటాల మీద నాకు మమకారం లేదు. అందుకే చావు తరువాత వచ్చే మరో లైఫ్‌ని తలచుకుంటూ ఆ రోజంతా హ్యాపీగా గడుపుతాను. మళ్లీ జన్మంటూ ఉంటే ఎలా పుట్టాలనుకుంటారు? అమ్మాయిగా పుట్టినా ఫర్లేదు, అబ్బాయిగా పుట్టినా ఫర్లేదు. కానీ ఈ తల్లిదండ్రులకే పుట్టాలి. కానీ నాకో డౌటు. మా అమ్మానాన్నలిద్దరూ కూడా వచ్చే జన్మలో భార్యభర్తలుగానే పుట్టాలని కోరుకుంటున్నారో లేదోనని! నాకైతే మాత్రం వచ్చే జన్మలో కూడా వాళ్లు అలాగే పుట్టాలని, నేను వాళ్లకి పుట్టాలని ఉంది. - సమీర నేలపూడి మా చిరునామా: ఫన్డే, సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34. Designer: Kusuma -
మనోగళం: వాటికే ఎక్కువ ఖర్చు పెడుతుంటా!
ఇతరుల్లో మీకు నచ్చేది/నచ్చనిది? నచ్చేది నిజాయితీ. నచ్చనిది... ఇక్కడి విషయాలు అక్కడ, అక్కడి విషయాలు ఇక్కడ చెప్పే తత్వం. మీలో మీకు నచ్చేది/నచ్చనిది? నచ్చేది కొత్తగా ఆలోచించడం, నాకు నచ్చినట్టు జీవించడం. నచ్చనిది కోపం. మీరు తరచుగా వాడే మాట/ఊతపదం? అందరినీ ‘అన్నయ్యా’ అంటుంటాను. మిమ్మల్ని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తి? పూరీ జగన్నాథ్. నన్ను సొంత తమ్ముడిలా చూసుకుంటారాయన. అందరినీ నవ్వుతూ పలకరించడం, చుట్టూ ఉన్న వాతావరణాన్ని మనకు కావలసినట్టు మలచుకోవడం వంటివి ఆయన్ను చూసే నేర్చుకోవాలి. కష్టంగా కాకుండా ఇష్టంగా పనిచేయడం నేనాయన నుంచే లవర్చుకున్నాను. ఎందుకిలా చేశానా అని మీరు బాధపడేది ఏదైనా ఉందా? పరిచయస్తులెవరో, స్నేహితులెవరో గుర్తించడంలో ఎప్పుడూ విఫలమవుతూనే ఉంటాను. అందరినీ స్నేహితులు అనేసుకుంటాను. ఆ తర్వాత చాలా ఇబ్బందులు పడుతుంటాను. ఎందుకిలా చేశానా అని తర్వాత బాధపడుతుంటాను. అత్యంత సంతోషపడిన సందర్భం? సైకిల్ తొక్కడం కూడా రాని నేను, ఏకంగా కెనైటిక్ హోండా కొనుక్కున్నాను. ఆ బండెక్కి హైదరాబాద్ రోడ్ల మీద తిరిగిన తొలిరోజున ప్రపంచాన్ని జయించినంత సంతోషం కలిగింది. అత్యంత బాధ కలిగించిన సందర్భం? పాటలు రాయడం మొదలుపెట్టిన తొలినాళ్లలో... ఒకే ట్యూన్‌ని చాలామందికి ఇచ్చి రాయించుకుంటారని నాకు తెలీదు. దాంతో రాత్రీ పగలూ కూర్చుని పాట రాసేవాణ్ని. బాగుంది అంటే ఎంతో సంతోషపడేవాణ్ని. తీరా క్యాసెట్ విడుదలయ్యాక నా పాట లేకపోవడం చూసి చాలా బాధ కలిగేది. ఇలాంటి నమ్మకద్రోహాలు జరిగిన ప్రతిసారీ ఏడుపొచ్చేది. మీరు నమ్మే సిద్ధాంతం...? బతికిన ప్రతి క్షణం నుంచీ మూల్యాన్ని రాబట్టుకోవాలి. ఏ క్షణాన్నీ వృథాగా పోనివ్వకూడదు. ఆకలి విలువ తెలిసిన క్షణం? నేను విపరీతమైన భోజన ప్రియుణ్ని. కానీ హైదరాబాద్ వచ్చిన కొత్తలో కడుపు నిండా తినడానికి సరిపడా డబ్బుండేది కాదు. దాంతో ఖైరతాబాద్ ‘రెడ్‌రోజ్ కేఫ్’లో ఉదయం రెండు బిస్కట్లు తిని, టీ తాగేవాడిని. లంచ్ టైమ్‌లో ‘పెరిక భవన్’ దగ్గర రెండు రూపాయలకు నాలుగు అరటిపళ్లు తిని, నీళ్లు తాగేవాడిని. రాత్రిపూట మాత్రమే మెస్‌లో భోం చేసేవాడిని. ఆకలి బాధ ఏంటో అప్పుడే తెలిసింది. అందుకే ఆకలి అని ఎవరైనా అంటే... కడుపు నిండా భోజనం పెట్టేస్తాను. ఎవరికైనా క్షమాపణ చెప్పాల్సి ఉందా? ఉంటే ఎవరికి? మా అమ్మానాన్నలకి చెప్పాలి. తెలిసో తెలియకో చాలాసార్లు వాళ్ల మనసుని నొప్పించాను. అలాగే... వాళ్లతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నాను. ఈ రెండు విషయాల్లోనూ వాళ్లకు క్షమాపణ చెప్పాలి. మీ గురించి ఎవరికీ తెలియని ఓ విషయం? నేను పాటల రచయితగానే అందరికీ తెలుసు. కానీ నేనో మంచి ఆర్టిస్టుని కూడా. బొమ్మలు చాలా బాగా గీస్తాను. చదువుకునే రోజుల్లో నేను వేసిన కార్టూన్లు కొన్ని పత్రికల్లో వచ్చాయి కూడా! మిమ్మల్ని భయపెట్టే విషయం ఏమైనా ఉందా? ఎత్తయిన ప్రదేశాల నుండి కిందికి చూడటమంటే మహా భయం. జెయింట్ వీలన్నా అంతే. అస్సలు ఎక్కను. ఎలాంటి వాటికి ఎక్కువ ఖర్చు పెడుతుంటారు? మ్యూజిక్ ప్లేయర్స్‌కి. నా దగ్గర చాలా ఉన్నాయి. పెన్నులకి, డ్రెస్సులకి కూడా బాగానే ఖర్చుపెడుతుంటాను. ఎప్పటికైనా చేసి తీరాలనుకునేది? చిన్నప్పుడే పాత్రికేయ వృత్తిలోకి రావడం వల్ల చదువు మధ్యలో ఆపేశాను. ఇప్పుడు మళ్లీ చదువుకోవాలనిపిస్తోంది. పీహెచ్డీ చేసి, డాక్టరేట్ తీసుకోవాలని ఉంది. దేవుడు ప్రత్యక్షమైతే ఏ వరం కోరుకుంటారు? ఇంత మంచి జన్మనిచ్చినందుకు కృతజ్ఞతలు చెబుతాను తప్ప ఏమీ అడగను. ఎందుకంటే నాకు అంత పెద్ద పెద్ద కోరికలేమీ లేవు. మీ జీవితంలో ఒకే ఒక్క రోజు మిగిలివుందని తెలిస్తే... ఆ రోజును ఎలా గడుపుతారు? మనసుకు నచ్చిన కవిత్వం రాసుకుంటూ గడిపేస్తా. మరణానికి భయపడతారా? ఎలాగూ తప్పదనుకున్నదాని గురించి భయపడటం అవసరమా! అందరికీ ఎలా గుర్తుండిపోవాలనుకుంటారు? తలలో నాల్కలా. మళ్లీ జన్మంటూ ఉంటే ఎలా పుట్టాలనుకుంటారు? నాకు సైన్స్ అంటే చాలా ఇష్టం. అందుకే సైంటిస్టులా పుట్టి కొత్త కొత్త అన్వేషణలు చేస్తా. - సమీర నేలపూడి -
మనోగళం: ఎప్పుడూ అంత ఆనందం కలగలేదు!
ఇతరుల్లో మీకు నచ్చేది/నచ్చనిది? నచ్చేది ప్లీజింగ్ పర్సనాలిటీ. నచ్చనిది అహంభావం. మీలో మీకు నచ్చేది? నాలోని ప్రేమతత్వం, మానవత్వం. నేను ప్రపంచాన్ని ప్రేమిస్తాను... మనస్ఫూర్తిగా! మీలో మీకు నచ్చనిది? కాస్త త్వరగా విసిగిపోతాను. కష్టపడి ఓ యాభై శాతం తగ్గించుకున్నాను. పూర్తిగా మారడానికి ట్రై చేస్తున్నాను. మీ ఊతపదం? నచ్చినవాళ్లందరినీ ‘బంగారం’ అంటుంటాను. మిమ్మల్ని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తి/ఎందుకు? మా అమ్మ. నిజమైన ఆత్మానందం ఎదుటివారికి సాయపడటంలోనే ఉంటుందని ఆవిడే చెప్పింది నాకు. ఎందుకిలా చేశానా అని మీరు బాధపడేది ఏదైనా ఉందా? లేదు. నేను వేసే ప్రతి అడుగూ భగవత్ప్రేరణతోనే పడుతుందని నమ్ముతాను. కాబట్టి చేసిన దానికి ఎప్పుడూ చింతించను. అత్యంత సంతోషపడిన సందర్భం? 2000వ సంవత్సరం, జూలై 30. నా కూతురు సంస్కృతి పుట్టిన రోజు. తనని నేను తొలిసారి చూసిన రోజు. నా జీవితంలో ఆ రోజు కలిగినంత ఆనందం మరెప్పుడూ కలగలేదు. అత్యంత బాధ కలిగించిన సందర్భం? సత్య సాయిబాబా మరణం. ఆ రోజు నేను పడిన బాధ వర్ణనాతీతం. ఆకలి విలువ తెలిసిన క్షణం? భారతీయ విద్యాభవన్‌లో పని చేస్తున్నప్పుడు ఓసారి (1986) నా ఫుడ్ కూపన్స్ అయిపోయాయి. మళ్లీ తీసుకోవాలంటే జీతం రావాలి. అంతవరకూ భోజనం పెట్టమని క్యాంటీన్ వాడిని అడగడానికి మనసు రాలేదు. దాంతో రెండు రోజుల పాటు నీళ్లు మాత్రమే తాగాను. అప్పుడు తెలిసింది ఆకలి బాధ ఎలా ఉంటుందో! ఎవరికైనా క్షమాపణ చెప్పాల్సి ఉందా? ఉంటే ఎవరికి? ఎవరినైనా బాధపెట్టానని గ్రహిస్తే వెంటనే క్షమాపణ చెప్పేస్తాను. ఒకవేళ గ్రహించలేకపోయి ఎవరికైనా చెప్పకుండా ఉంటే... ఈ ఇంటర్వ్యూ ద్వారా ఇప్పుడే చెప్పేస్తున్నాను. నన్ను క్షమించండి. మీ గురించి ఎవరికీ తెలియని ఓ విషయం? నేను పాటలు పాడతానని అందరికీ తెలుసు కదా! కానీ నేను డ్యాన్స్ కూడా చేస్తాను. ఇంట్లో నా చిట్టితల్లి సంస్కృతి, నేను పాటలు వింటూ డ్యాన్స్ చేస్తుంటాం! మిమ్మల్ని భయపెట్టే విషయం ఏమైనా ఉందా? మోసం అంటే భయం. మోసం చేసేవాళ్లంటే ఇంకా భయం. ఎలాంటి సమయాల్లో అబద్ధాలాడతారు? జీతం కోసం ఆడతాను తప్ప జీవితం కోసం ఆడను. వృత్తిపరంగా కొన్నిసార్లు చెప్పక తప్పదు. దానివల్ల ఎవరికీ నష్టం ఉండదు. కానీ వ్యక్తిగతంగా చెప్పే అబద్ధాలు అవతలివారికి హాని కలిగిస్తాయి. అందుకే అలాంటివి చెప్పను. ఎలాంటి వాటికి ఎక్కువ ఖర్చు పెడుతుంటారు? సేవా కార్యక్రమాలకు ఎక్కువ ఖర్చుపెడతాను. తర్వాత నా భార్య సురేఖ కోసం, నా కూతురి కోసం ఖర్చు పెడతాను. ఎప్పుడైనా ఏదైనా షాప్‌కి వెళ్తే వాళ్లిద్దరికీ పది, పదిహేను జతల బట్టలు ఒకేసారి కొనేస్తుంటాను! మీరు నమ్మే సిద్ధాంతం...? మనుషుల మెచ్చుకోలు కోసం కాకుండా భగవంతుని మెచ్చుకోలు కోసం బతకాలి. ఎప్పటికైనా చేసి తీరాలనుకునేది? ప్రపంచ శాంతి కోసం ఉద్యమించాలన్నది నేనేనాడో ఏర్పరచుకున్న లక్ష్యం. ఇన్నాళ్లూ అదే చేశాను. ఇప్పుడూ అదే చేస్తున్నాను. ఇక ముందు కూడా ఆ దిశగానే కృషి చేస్తాను. దేవుడు కనిపిస్తే ఏ వరం అడుగుతారు? అందరికీ సమదర్శన దృష్టి ఇవ్వమని అడుగుతాను. అది వచ్చిననాడు ఈ ప్రపంచమే మారిపోతుంది. నదికి సమదర్శన దృష్టి ఉంది. చెట్టుకు కూడా ఉంది. కానీ హార్దిక సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారిపోయాక మనిషికి ‘సమదర్శన దృష్టి’ పోయి ‘తన దర్శన దృషి’్ట వచ్చింది. మీ జీవితంలో ఒకే ఒక్క రోజు మిగిలివుందని తెలిస్తే... ఆ రోజును ఎలా గడుపుతారు? నా భార్యాబిడ్డలతో కలిసి భగవంతుడిని ధ్యానం చేస్తూ గడిపేస్తాను. మరణానికి భయపడతారా? చావుకు భయపడుతూ... ప్రతిరోజూ చస్తూ బతకడం నాకు నచ్చదు. మరణం రాక తప్పదు. ఎప్పుడొస్తుందో తెలియని దానికోసం భయపడటం అనవసరం. అందరికీ ఎలా గుర్తుండిపోవాలనుకుంటారు? గజల్ శ్రీనివాస్ ఒక కారణంతో పుట్టాడు, దానికోసమే జీవించాడు అని అంతా అనుకోవాలి. మళ్లీ జన్మంటూ ఉంటే ఎలా పుట్టాలనుకుంటారు? మళ్లీ జన్మ అంటే ఈ జన్మకు సీక్వెల్ కదా! అందుకే నేను గజల్ శ్రీనివాస్ 2గా పుట్టాలని కోరుకుంటాను. - సమీర నేలపూడి -
మనోగళం: అందుకే పీఎం అవ్వాలనుకున్నా!
ఇతరుల్లో మీకు నచ్చేది/నచ్చనిది? నచ్చేది ఏకాగ్రత. నచ్చనిది దేనిపైనా ఆసక్తి లేకుండా ఉండటం. మీలో మీకు నచ్చేది/నచ్చనిది? నచ్చేది తపన. నచ్చనిది కాస్త సమయ పాలన లోపించడం. మీరు తరచుగా వాడే మాట? ‘అలాగే’ అని ఎక్కువగా అంటుంటా. మిమ్మల్ని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తి/ఎందుకు? లోతైన భావం, అనుభూతితో సరళమైన భాషలో పాటలు రాసే విషయంలో ఆత్రేయ నుంచి స్ఫూర్తి పొందాను. ఎప్పుడూ కొత్తగా ఆలోచించడం, తక్కువ మాట్లాడుతూ ఎక్కువ పని చేయడం, ప్రతికూల పరిస్థితులు ఎదురైనా బెదరక నవ్వుతూ ఉండటం వంటి విషయాల్లో రాఘవేంద్రరావుగారు నాకు స్ఫూర్తి. ఎందుకిలా చేశానా అని మీరు బాధపడేది ఏదైనా ఉందా? రకరకాల కారణాల వల్ల కొన్ని మంచి సినిమాలకు రాయలేకపోయాను. అవి గుర్తొచ్చినప్పుడల్లా కాస్త బాధనిపిస్తూ ఉంటుంది. అత్యంత సంతోషపడిన సందర్భం? ఓ కార్యక్రమంలో బాలూగారు... ‘దేశమంటే మతం కాదోయ్’ అంటూ నేను రాసిన పాటను, అది రాసిన నన్ను ఎంతో మెచ్చుకున్నారు. అది నాకు అత్యంత సంతోషకరమైన సందర్భం. మీ హృదయం గాయపడిన సందర్భం? మనం గౌరవించి, అభిమానించి, ఆరాధించే వ్యక్తులు మన గురించి తప్పుగా మాట్లాడితే చాలా బాధగా ఉంటుంది. అలా నా హృదయం గాయపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆకలి విలువ తెలిసిన క్షణం? చదువుకునే రోజుల్లో కడుపునిండా ఇడ్లీలు తినడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు. అప్పుడు అనుకునేవాణ్ని... దేశానికి ప్రధానమంత్రిని కావాలని. ఎందుకో తెలుసా? రోజుకు యాభై ఇడ్లీలు కడుపునిండా తినొచ్చని! ఎవరికైనా క్షమాపణ చెప్పాల్సి ఉందా? ఉంటే ఎవరికి? ఉంది. ‘తడాఖా’ సినిమాకి పాటలు రాయమని మిత్రుడు కిషోర్ (ఆ చిత్ర దర్శకుడు) అడిగారు. కానీ ఏవో కారణాల వల్ల రాయలేకపోయాను. ఆయనకు క్షమాపణ చెప్పాలి. మీ గురించి ఎవరికీ తెలియని ఓ విషయం? నేను పాటలు ఇష్టంగా వింటానని, వ్యాయామం క్రమం తప్పకుండా చేస్తానని చాలామందికి తెలుసు. కానీ ఎవరికీ తెలియనిదేమిటంటే... నేను రోజూ ధ్యానం చేస్తాను. మిమ్మల్ని అత్యంత భయపెట్టే విషయం ఏమిటి? పరీక్షలు దగ్గరపడతాయి. కానీ ఇంకా చదవాల్సిన సిలబస్ చాలా ఉంటుంది. ఇదంతా ఎప్పుడు చదువుతాను, పరీక్షలు ఎలా రాసి పాసవుతాను అని చాలా టెన్షన్ పడుతుంటాను. ఈ కల ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంది నన్ను. నేను మంచి స్టూడెంట్‌నే. ఇంజినీరింగ్‌లో కూడా యూనివర్సిటీ లెవెల్లో మూడో ర్యాంకు వచ్చింది. అయినా పరీక్షలంటే అంత భయమెందుకో అర్థం కాదు. ఎలాంటి వాటికి ఎక్కువ ఖర్చు పెడుతుంటారు? హాలిస్టర్ కంపెనీ టీషర్టులకి. మీరు నమ్మే సిద్ధాంతం ఏమిటి? ఎటువంటి కల్మషము, కుటిలత్వమూ లేని సంస్కారాన్ని కలిగివుండాలి. హృదయ సంస్కారమే కాదు... జీవన సంస్కారం, భాషా సంస్కారం కూడా ఉండాలి. ఎప్పటికైనా చేసి తీరాలనుకునేది? అవినీతిని ఎండగడుతూ ఓ పాట రాయాలి. అందులో ఫలానావాడు దేశాన్ని దోచుకున్నాడు, ఫలానా వాడు అత్యాచారం చేశాడు, ఫలానావాడు హత్య చేశాడు అంటూ పేర్లతో సహా రాయాలి. దేవుడు ప్రత్యక్షమైతే ఏం అడుగుతారు? కాళ్లకు లేపనం పూసుకుని గాలిలో ఎగురుతున్నట్టుగా కలలు వస్తుంటాయి నాకు. నిజంగానే అలా ఎగురుతూ... ఈ బస్సులు, రైళ్లు, విమానాల వెంట పడకుండా... కోరుకున్న చోటికి వెళ్లిపోగల వరమివ్వమని అడుగుతాను. మీ జీవితంలో ఒకే ఒక్క రోజు మిగిలివుందని తెలిస్తే... ఆ రోజును ఎలా గడుపుతారు? నా భార్యాబిడ్డలతో సంతోషంగా గడుపుతాను. మరణానికి భయపడతారా? లేదు. మరణమంటే మరో జన్మకు శ్రీకారం అని ఓ పాటలో రాశాను కదా! నేను కూడా అదే నమ్ముతాను. అందరికీ ఎలా గుర్తుండిపోవాలనుకుంటారు? మంచి రచయితగా! మళ్లీ జన్మంటూ ఉంటే ఎలా పుట్టాలనుకుంటారు? మళ్లీ కవిగానే పుట్టాలి. ఏ రంగంలోనూ ఎవరికీ లేని స్వేచ్ఛ కవికి మాత్రమే ఉంటుంది! - సమీర నేలపూడి -
మనోగళం: నాకు చావంటే భయం లేదు!
ఇలా చేయాలి అలా చేయాలి అంటూ పని గట్టుకుని ఏదీ ప్లాన్ చేసుకునే అలవాటు లేదు నాకు. ఇది ఇలా చేస్తే బాగుంటుంది అని ఎప్పుడు అనిపిస్తే అప్పుడు చేసెయ్యడమే. - నందినీరెడ్డి, దర్శకురాలు ఇతరుల్లో మీకు నచ్చేది/నచ్చనిది? నచ్చేది నిజాయితీ. నచ్చనిది అబద్ధాలు చెప్పడం. మీలో మీకు నచ్చేది? నేనెప్పుడూ చాలా హ్యాపీగా ఉంటాను. ఎలాంటి టెన్షన్ పెట్టుకోను. అంతా మన మంచికే అనుకుంటాను. మీలో మీకు నచ్చనిది? బద్దకం. కాస్త ఎక్కువే ఉంది. మిమ్మల్ని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తి/ఎందుకు? మా అమ్మ. ఎన్ని కష్టాలొచ్చినా ధైర్యం కోల్పోలేదు. ఎంత పెద్ద సమస్య అయినా, అందులోంచి పాజిటివ్ ఫలితాన్ని ఎలా రాబట్టాలా అని చూసేది. షి ఈజ్ మై ఇన్స్పిరేషన్! ఎందుకిలా చేశానా అని మీరు బాధపడేది ఏదైనా ఉందా? ఎందుకుండవ్! అందరం తప్పులు చేస్తూనే ఉంటాం కదా! నేను కూడా చేశాను. కానీ వాటిని తలచుకుని బాధపడే తత్వం కాదు నాది. తప్పు చేస్తే దాన్నుంచి పాఠం నేర్చుకోవాలి తప్ప ఫీలవుతూ కూర్చోవడం నాకు నచ్చదు. అత్యంత సంతోషపడిన సందర్భం? చాలామంది అనుకుంటారు... ‘అలా మొదలైంది’ రిలీజైన రోజు నా జీవితంలో అత్యంత సంతోషకరమైనదని చెబుతానేమో అని. కానీ చెప్పను. ఎందుకంటే, అది నా జీవితంలో ఓ ముఖ్యమైన సందర్భం తప్ప, అన్నిటికంటే సంతోషకరమైనదేమీ కాదు. స్కూల్, కాలేజీ రోజుల్లో అంతకన్నా ఆనందాన్ని పంచిన సందర్భాలు చాలా ఉన్నాయి. మీ హృదయం గాయపడిన సందర్భం? నన్ను అంత త్వరగా ఎవరూ హర్ట్ చేయలేరు. ఎందుకంటే, చిన్న వాటికే ఫీలైపోయే తత్వం కాదు నాది. కాకపోతే బాగా దగ్గరనుకున్నవాళ్లు నెగిటివ్‌గా మాట్లాడినప్పుడు మనసు చివుక్కుమంటుంది. చెప్పను కానీ అలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి. ఒకరకంగా అది మంచిదే. ఎందుకంటే, అప్పుడే మనవాళ్లెవరో బయటివాళ్లెవరో తెలుస్తుంది. ఆకలి విలువ తెలిసిన క్షణం? ఆ పరిస్థితి నాకెప్పుడూ లేదు. అదేంటో కానీ... ఎక్కడ ఎవరింట్లో ఉన్నా నాకు భోజనం క్షణాల్లో వచ్చేస్తుంది. చిన్నప్పుడు మా అమ్మ ఎక్కడికైనా వెళ్తే చుట్టుపక్కల వాళ్లు ఎవరో ఒకరు భోజనం తెచ్చి పెట్టేసేవారు. ఎవరికైనా క్షమాపణ చెప్పాల్సి ఉందా? ఉంటే ఎవరికి? ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద కోపమొచ్చినా దాన్ని ఇంటికొచ్చాక అమ్మ మీదనే చూపిస్తాను. పాపం మౌనంగా భరిస్తుంది. అందుకే తనకు క్షమాపణ చెప్పి తీరాలి. మీ గురించి ఎవరికీ తెలియని ఓ విషయం? నాకు ఎవరైనా వంట చేస్తుంటే చూడటం ఇష్టం. కానీ చేయడం మాత్రం ఇష్టం ఉండదు. తీరిక దొరికితే కుకరీ షోలు తెగ చూస్తుంటాను! మిమ్మల్ని అత్యంత భయపెట్టే విషయం...? చిన్నప్పుడు దెయ్యాలంటే భయపడేదాన్ని. తర్వాత అది పోయింది. ఇప్పుడు పెద్దవాళ్లెవరికైనా ఒంట్లో బాగోకపోతే భయపడుతుంటాను... వాళ్లెక్కడ దూరమవుతారోనని! అబద్ధాలు చెబుతారా? భేషుగ్గా! ఇబ్బంది పెట్టే అబద్ధాలు కాదు, తప్పించుకునే అబద్ధాలు. ఫలానా టైముకి వస్తానని చెప్తాను. మావాళ్లు చూసి చూసి ఫోన్ చేస్తారు. వచ్చేశాను, మీ వీధి చివరే ఉన్నాను అంటాను. నిజానికి ఎక్కడో ఉంటాను. ఇలాంటివి బోలెడన్ని చెబుతాను. కానీ వాళ్లు కనిపెట్టేస్తారు. నా ఫ్రెండ్స్ అంటారు... అబద్ధం చెబితే నా ముక్కు ఎరుపెక్కుతుందని! మీరు నమ్మే సిద్ధాంతం ఏమిటి? నువ్వేంటో తెలుసుకో. నీ తప్పులు, ఒప్పులు ముందు బేరీజు వేసుకో. వాటిని సరిచేసుకుంటూ నిజాయితీగా ముందుకు సాగిపో. నిన్నెవరూ ఆపలేరు. ఎప్పటికైనా చేసి తీరాలనుకునేది? ఒక ఓల్డేజ్ హోమ్ కట్టించాలని చిన్నప్పట్నుంచీ అనుకుంటున్నాను. అది ఎలాగైనా చేయాలి. దేవుడు మీకేదైనా ప్రత్యేక శక్తినిస్తే... దానితో ఏం చేస్తారు? ఏ ఒక్కరూ ఆకలితో ఉండకుండా చూస్తాను. మీ జీవితంలో ఒకే ఒక్క రోజు మిగిలివుందని తెలిస్తే... ఆ రోజును ఎలా గడుపుతారు? నాకు ఏ రోజైనా ఒకటే. ఇప్పుడెలా నా ఫ్యామిలీతో, ఫ్రెండ్స్‌తో గడుపుతున్నానో ఆ రోజూ అలాగే గడుపుతాను. మరణానికి భయపడతారా? రెండుసార్లు చావు ముఖంలో ముఖంపెట్టి చూసొచ్చాను. చావంటే భయం లేదు నాకు! అందరికీ ఎలా గుర్తుండిపోవాలనుకుంటారు? నందిని కొన్ని చిరునవ్వులు పంచి వెళ్లిపోయిందని నా గురించి అందరూ చెప్పుకోవాలి. మళ్లీ జన్మంటూ ఉంటే ఎలా పుట్టాలనుకుంటారు? డాల్ఫిన్‌గా పుడతాను. నాకు నీళ్లంటే ఇష్టం. నీటిలో ఉండే డాల్ఫిన్లంటే మరీ ఇష్టం. అవి చాలా సరదా జంతువులు. ఎప్పుడూ హ్యాపీగా ఉంటాయి. అందుకే నేనూ అలా పుడతా! - సమీర నేలపూడి -
మనోగళం: వచ్చే జన్మలో ఆవిడలా పుట్టాలి!
ఎదుటివాళ్లు మీ గురించి తప్పుగా అనుకునేది? నా పని నేను చేసుకుపోతాను తప్ప ఎవరి జోలికీ పోను. పైగా ఏదైనా ముక్కు సూటిగా మాట్లాడేస్తాను. దాంతో కొందరు నాకు పొగరనుకుంటారు. అది నిజం కాదు. నాతో స్నేహం చేసిన వాళ్లను అడిగితే తెలుస్తుంది, నేనేంటో. ఒక్కసారి నాతో స్నేహం చేస్తే, నన్ను వదిలిపెట్టలేరు. ఇతరుల్లో మీకు నచ్చేది/నచ్చనిది! నచ్చేది నిజాయితీ, పాజిటివ్ థింకింగ్. నచ్చనిది... మన ముందు మంచిగా మాట్లాడి, అటు వెళ్లగానే చెడుగా మాట్లాడే గుణం. అలాంటి వాళ్లను అస్సలు భరించలేను. మీలో మీకు నచ్చేది/నచ్చనిది? నచ్చేది ముక్కుసూటితనం. నచ్చనిది షార్ట్ టెంపర్. మీ ఊతపదం? ఆయ్, ఏమ్మా, అయ్యబాబోయ్... మద్రాస్ వెళ్లినా, హైదరాబాద్ వచ్చి సెటిలైనా... ఇవి నన్ను వదలడం లేదు. మిమ్మల్ని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తి/ఎందుకు? నా భార్య అరుణ. చాలా సౌమ్యంగా ఉంటుంది. నేనేం చేస్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను అంటూ ఆరాలు తీయదు. తన బాధ్యతలు తను సెలైంట్‌గా నెరవేరుస్తుంది. ఇలాక్కూడా ఉండవచ్చా అనిపిస్తుంది నాకు. చాలా ఇన్స్పైర్ అవుతుంటాను తనని చూసి. అత్యంత సంతోషపడిన సందర్భం? నా మొదటి సినిమా ‘కళ్లు’ ప్రివ్యూ చూడటం నా జీవితంలోనే గొప్ప సందర్భం. నన్ను నేను తెరమీద చూసుకున్నప్పుడు పడిన సంతోషం మాటల్లో చెప్పలేనిది. మీ హృదయం గాయపడిన సందర్భం? ఎందుకో తెలీదు కానీ... నా అనుకున్న వాళ్లు ఒకరితో ఎప్పుడు మాట్లాడినా సంభాషణ డబ్బు చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అది నా మనసును గాయపరుస్తూ ఉంటుంది. ఆకలి విలువ తెలిసిన క్షణం? కెరీర్ ప్రారంభంలో మద్రాస్‌లో ఉన్నప్పుడు ఆకలంటే ఏంటో తెలిసింది. అలాగని మరీ ఎక్కువ కష్టమేమీ పడలేదు. ఓసారి వారం పాటు వర్షం పడుతూనే ఉంది. మెస్ చాలా దూరం. వెళ్దామంటే జేబులో డబ్బుల్లేవు. రెండు మూడు రోజులు చాలా అవస్థ పడ్డాను. ఎవరికైనా క్షమాపణ చెప్పాల్సి ఉందా? ఉంటే ఎవరికి? తెలిసి నేనెవరినీ బాధపెట్టలేదు. కాబట్టి చెప్పాల్సిన అవసరం ఉందనుకోను. మీ గురించి ఎవరికీ తెలియని ఓ విషయం? పొద్దున్నే ఐదున్నరకు లేస్తాను. వాకింగుకి వెళ్దామని ట్రాక్ సూట్, షూస్ వేసుకుని రెడీ అయిపోతాను. తలుపు తీసి బయటకొస్తాను. పేపర్ కోసం చూస్తాను. అప్పటికింకా రాదు. ఏడున్నర వరకూ రాదని కూడా తెలుసు. అయినా పేపర్ కోసం ఎదురుచూస్తూ కూర్చుంటాను. పేపర్ వచ్చాక చదువుతాను. మళ్లీ లోనికి వెళ్లి ట్రాక్‌సూట్, షూస్ తీసేసి పడుకుంటాను. అంత గొప్పగా ఉంటుంది నా వ్యాయామం! మిమ్మల్ని అత్యంత భయపెట్టే విషయం ఏమిటి? ప్రేమతో చేతులు కట్టేయడమంటారే... ఆ పరిస్థితి చాలా భయంగా ఉంటుంది. అటు నో అనలేం. ఇటు తేలిగ్గా ఎస్ అనీ అనలేం. అలాంటి ప్రేమకి తప్ప దేనికీ భయపడను. ఎలాంటి సమయాల్లో అబద్ధాలాడతారు? సాధారణంగా అబద్ధాలు చెప్పను, ఎవరినీ బాధపెట్టను. కానీ నా ఫ్రెండ్స్‌ని ఏడిపించడానికి ప్రాక్టికల్ జోక్స్ బాగా వేస్తాను. అవే నా అబద్ధాలు! మీరు నమ్మే సిద్ధాంతం ఏమిటి? ‘ప్రార్థించే పెదవుల కన్నా, సాయం చేసే చేతులు మిన్న’ అన్న మదర్ థెరిసా మాటలే నేను నమ్మే సిద్ధాంతం. ఎప్పటికైనా చేసి తీరాలనుకునేది? వంద దేశాలు తిరగాలన్నది నా కల. ఓ అరవై తిరిగేశాను. ఇంకా నలభై ఉన్నాయి. అవి కూడా పూర్తి చేయాలి. ఎలాంటి వాటికి ఖర్చు చేస్తారు? ఉపయోగం లేని వాటికి! అవసరం లేకపోయినా కంటికి నచ్చినదాన్ని కొనేస్తాను. అలా కొన్నవాటితో ఇంట్లోనే ఓ చిన్న మ్యూజియం పెట్టాను. (నవ్వుతూ) అందుకే నేనెక్కడికైనా వెళ్తుంటే మా ఆవిడ అంటుంది... దయచేసి శంఖాలు, ఫొటోఫ్రేముల్లాంటి అనవసర వస్తువులు కొనుక్కురాకండి అని. దేవుడు మీకేదైనా ప్రత్యేక శక్తినిస్తే... దానితో ఏం చేస్తారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో కనుక అలాంటి శక్తి వస్తే... తెలుగువారంతా ఒక్కటిగా ఉండేలా చేస్తాను! ఎలాంటి ముగింపును కోరుకుంటారు? ఎవరికీ ఒక్క పైసా కూడా బాకీ ఉండకూడదు. ఎవరూ నన్ను తిట్టుకోకూడదు. అలాంటి పరిస్థితుల్లోనే నేను పోవాలి. మరో విషయం... (నవ్వుతూ) నాకో ఇద్దరు శత్రువులు ఉన్నారు. నాతోపాటు వాళ్లను కూడా తీసుకునే పోవాలి. అందరికీ ఎలా గుర్తుండిపోవాలనుకుంటారు? మంచి మనిషిగా! (నవ్వుతూ) అది అసాధ్యమని తెలుసనుకోండి. అయినా అదే నా కోరిక! మళ్లీ జన్మంటూ ఉంటే ఎలా పుట్టాలనుకుంటారు? మదర్ థెరిసా పుట్టిన ఊరిలో, మదర్ థెరిసాలాగే పుట్టాలి. ఎక్కడో పుట్టి ఇక్కడికి వచ్చి సేవ చేస్తూ బతికిందా దేవత. అంతకన్నా గొప్ప జన్మ ఏదైనా ఉంటుందా! - సమీర నేలపూడి