మనోగళం: శ్రీశ్రీ చెప్పారని ఆకలితో ఉన్నాను! | V. N. Aditya's Interview in Sakshi Funday | Sakshi
Sakshi News home page

మనోగళం: శ్రీశ్రీ చెప్పారని ఆకలితో ఉన్నాను!

Published Sun, Sep 22 2013 2:34 AM | Last Updated on Fri, Sep 1 2017 10:55 PM

మనోగళం: శ్రీశ్రీ చెప్పారని ఆకలితో ఉన్నాను!

మనోగళం: శ్రీశ్రీ చెప్పారని ఆకలితో ఉన్నాను!

ఇతరుల్లో మీకు నచ్చేది/నచ్చనిది?
 నచ్చేది మంచి ప్రవర్తన, అర్థం చేసుకునే తత్వం. నచ్చనిది చిన్నవాటిక్కూడా అబద్ధాలు చెప్పడం, ఫాల్స్ ప్రెస్టీజ్.
     మీలో మీకు నచ్చేది/నచ్చనిది?
 పని మొదలెడితే అయ్యేదాకా వదలను. అది నచ్చుతుంది. అయితే నచ్చనిది కూడా అదే. ఎందుకంటే, ఒకదాని మీదే ఉండిపోవడం వల్ల మిగిలినవన్నీ మిస్ అయిపోతాను. తర్వాత బాధపడతాను.
     మీ ఊతపదం?
 దేన్నీ ఊతంగా తీసుకునే అలవాటు లేదు నాకు.
     మిమ్మల్ని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తి ఎవరు?
 వ్యక్తి కాదు, వ్యక్తులు. మా అమ్మానాన్నలు. కొందరు గురువులు, పరిశ్రమలో కొందరు పెద్దవాళ్లు... వీళ్లందరి ప్రభావమూ ఉంది నామీద.
     ఎందుకిలా చేశానా అని మీరు బాధపడేది ఏదైనా ఉందా?
 నా ప్రమేయం లేకుండానే ప్రొడ్యూసర్‌ని అయ్యి చాలా నష్టపోయాను. నా జీవితంలో అది చాలా పెద్ద లాస్. అలా చేయకుండా ఉంటే ఎంతో బాగుండేదని ఫీలవుతుంటా.
     అత్యంత సంతోషపడిన సందర్భం?
 ఇంకా చూడలేదు.
     అత్యంత బాధ కలిగించిన సందర్భం?
 ఇంకా చూడదలచుకోలేదు.
     ఆకలి విలువ తెలిసిన క్షణం?
 ఆకలితో అంతగా ఎప్పుడూ పోరాడింది లేదు. అయితే ఆకలేస్తే క్రియేటివిటీ బాగుంటుందని శ్రీశ్రీ గారు అన్న మాట చదివి, కావాలని ఆకలితో ఉండి, ఐడియాలు రాక కాగితాలు చింపేసిన సందర్భాలు చాలా ఉన్నాయి.
     ఎవరికైనా క్షమాపణ చెప్పాల్సి ఉందా? ఉంటే ఎవరికి?
 వాళ్ల తప్పు లేకపోయినా, నా వల్ల చెడ్డపేరు మూటగట్టుకున్న స్నేహితులు, స్నేహితురాళ్లందరికీ చెప్పాలి.
     మీ గురించి ఎవరికీ తెలియని ఓ విషయం?
 ఎవరికీ తెలియని విషయమా... (నవ్వుతూ) అది నాక్కూడా తెలియదు.
     మీ గురించి ఎదుటివాళ్లు తప్పుగా అనుకునేది?
 నన్ను అందరూ ఎప్పుడూ అపార్థమే చేసుకుంటారు. నా ఉద్దేశం అది కాకపోయినా, నా మాటల వల్ల దగ్గరివాళ్లు కూడా నన్ను తప్పుగా అనుకుంటూ ఉంటారు. అయితే నేను మళ్లీ సర్దిచెప్పేయగలను కాబట్టి బంధాలు విచ్ఛిన్నం కావు.
     మిమ్మల్ని భయపెట్టే విషయం ఏమైనా ఉందా?
 హారర్ సినిమాలంటే చచ్చేంత భయం. చూడ్డానికే కాదు, ఆలోచించడానిక్కూడా. చిన్నప్పుడు గాయత్రి అనే సినిమా సగం చూసి బయటికొచ్చేశాను. ఇంకెప్పుడూ చూడకూడదని డిసైడ్ చేసుకున్నాను. అయితే రామ్‌గోపాల్ వర్మ గారి హారర్ సినిమాలు చూస్తే నవ్వొస్తుంది కాబట్టి వాటిని చూస్తుంటాను.
     మీరు నమ్మే సిద్ధాంతం ఏమిటి?
 ఎంత కష్టపడితే అంతే దక్కుతుంది. అదృష్టవశాత్తూ దక్కాల్సిన దానికంటే ఎక్కువ దక్కినా... అది మన దగ్గర ఉండదు.
     ఎలాంటి వాటికి ఎక్కువ ఖర్చు పెడుతుంటారు?
 సినిమాలకి, పుస్తకాలకి, బట్టలకి.
     దేవుడు ప్రత్యక్షమైతే ఏ వరం కోరుకుంటారు?
 ఏమీ కోరుకోను. బ్లాంక్ అయిపోతాను. మామూలుగా గుడికెళ్లినప్పుడు ఏదైనా కోరుకుందామంటేనే నాకేమీ గుర్తు రావు. నాకు తెలిసి దేవుడు ప్రత్యక్షమైతే, మరుక్షణమే ఆయనలో ఐక్యమైపోతానేమో!
     ఒంటరిగా ఉంటే ఏం చేస్తారు?
 పాటలు పాడేసుకుంటూ ఉంటాను. జానే కహా గయే వో దిన్, జీనా యహా మర్‌నా యహా, ఇది తొలిరాత్రి, ఆగదు ఏ నిమిషము నీ కోసము, కుంతీకుమారి, ఏ నావదే తీరమో... ఇవన్నీ నాకిష్టమైన పాటలు. వాటిని పాడుకుంటాను.
     మీ జీవితంలో ఒకే ఒక్క రోజు మిగిలివుందని తెలిస్తే... ఆ రోజును ఎలా గడుపుతారు?
 హాయిగా నా ఆలోచనల్లో నేనుంటాను. భవబంధాల మీద, ఈ జంఝాటాల మీద నాకు మమకారం లేదు. అందుకే చావు తరువాత వచ్చే మరో లైఫ్‌ని తలచుకుంటూ ఆ రోజంతా హ్యాపీగా గడుపుతాను.
     మళ్లీ జన్మంటూ ఉంటే ఎలా పుట్టాలనుకుంటారు?
 అమ్మాయిగా పుట్టినా ఫర్లేదు, అబ్బాయిగా పుట్టినా ఫర్లేదు. కానీ ఈ తల్లిదండ్రులకే పుట్టాలి. కానీ నాకో డౌటు. మా అమ్మానాన్నలిద్దరూ కూడా వచ్చే జన్మలో భార్యభర్తలుగానే పుట్టాలని కోరుకుంటున్నారో లేదోనని! నాకైతే మాత్రం వచ్చే జన్మలో కూడా వాళ్లు అలాగే పుట్టాలని, నేను వాళ్లకి పుట్టాలని ఉంది.
 -  సమీర నేలపూడి
 మా చిరునామా: ఫన్‌డే, సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34.
 Designer: Kusuma
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement