అమరావతి, సాక్షి: ఏ ప్రభుత్వం అయినా అధికారంలోకి రాగానే పాలన మీద ఫోకస్ చేస్తుంది. కానీ, చంద్రబాబు మాత్రం శ్వేత పత్రాల పేరుతో, సమీక్షల పేరిట జగన్ పాలనపై నిత్యం నిందలు వేస్తున్నారు. చూస్తుంటే.. ఇలాగే ఐదేళ్లు గడిపిస్తారేమో అనిపించేలా ఉంది ఆయన వ్యవహారం. అయితే తాజాగా అసెంబ్లీ సాక్షిగా.. అదీ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేత గవర్నర్ ప్రసంగంలో అబద్ధాలు చెప్పించింది కూటమి ప్రభుత్వం.
తన పాలనలో ఏనాడూ సంక్షేమం, కనీస మౌలిక వసతుల గురించి పట్టించుకోని చంద్రబాబు.. విజనరీ నాయకుడని, విభజిత ఏపీ అభివృద్ధికి కృషి చేశారని గవర్నర్ ప్రసంగంలో చెప్పించుకున్నారు. అంతేకాదు 2014-19 మధ్య రాష్ట్రంలో పెట్టుబడుల వరద కొనసాగిందని, 2019లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక అన్ని రంగాలు నష్టాలను చవిచూశాయని, పెట్టుబడులు వెనక్కి వెళ్లాయని గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో అబద్ధపు ప్రసంగాన్ని చదివించారు.
వాస్తవానికి.. జగన్ పాలన చేపట్టే నాటికి అభివృద్ధి కుంటుపడి ఉంది. ఆ కారణంగానే 2019లో అధికార మార్పిడి జరిగింది కూడా. అయితే కరోనా లాంటి విపత్తుతో రెండేళ్లు గడిచినప్పటికీ.. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి రెండింటి మీద ఫోకస్‌తోనే జగన్ పాలన కొనసాగింది.
సంబంధిత వార్త: జగన్ వల్లే పెట్టుబడులు పైపైకి..
అమరావతిని కొంత మంది పెట్టుబడిదారుల కోసమే చంద్రబాబు తెర మీదకు తెచ్చారు. కానీ, జగన్ అమరావతి సహా అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం మూడు రాజధానుల ప్రతిపాదన చేశారు. ఈ మూడింటిలో అమరావతి కూడా ఒక రాజధానిగానే ఉంది కదా!.
సంబంధిత వార్త: ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు సహేతుకమే!
గత ఐదేళ్లలో ఏపీలో వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయన్న గవర్నర్ ప్రసంగం.. కూటమి ప్రభుత్వంలో గత 45 రోజులుగా శాంతి భద్రతల ఏ స్థాయిలో ఘోరంగా దెబ్బ తిన్నాయో స్పందించలేదు. కనీసం లా అండ్ ఆర్డర్ పునరుద్ధరణ ప్రస్తావన కూడా లేదు. వివిధ రంగాల్లో నష్టాలు వచ్చాయంటూ కాకి లెక్కలతో సాగింది గవర్నర్ ప్రసంగం. పైగా గత ఐదేళ్లుగా అవి ఎల్లో మీడియాలో వచ్చిన ఊహాగాన కథనాలు.. కల్పిత రాతలే.
సంబంధిత వార్త: సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఏపీ ముందడుగు
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలును ప్రారంభించామన్న చంద్రబాబు ప్రభుత్వం.. సూపర్‌సిక్స్ వాగ్దానాలు ఎన్ని నెరవేర్చారో మాత్రం చెప్పలేదు కానీ రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకుని రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు సహకరించాలన్న మాటతో గవర్నర్ ప్రసంగం ముగిసింది.
అయితే.. ఇప్పటికే జగన్ వల్లే ఖజానా ఖాళీగా ఉందంటూ చెబుతూ వస్తున్న చంద్రబాబు.. మళ్లీ ఎన్నికలొచ్చేదాకా ఇదే మాట చెబుతారేమో అనే అనుమానాలు ఉన్నాయి. దీనికి తోడు అసెంబ్లీలో శ్వేత పత్రాల పేరుతో అబద్ధాలకు ఆయన రెడీ అయ్యాడు కూడా. జనాలు కోరుకునేది తమకు ఇచ్చిన హామీల అమలు. అంతేకానీ ఇలా నిందలు వేస్తూ వెళ్లడం కాదు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మాత్రం.. చంద్రబాబును, ఆయన మాటలను, కూటమి పాలనను ప్రజలు అసహ్యించుకునే రోజులు తొందరగానే వస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment