మనోగళం: ఎప్పుడూ అంత ఆనందం కలగలేదు!
ఇతరుల్లో మీకు నచ్చేది/నచ్చనిది?
నచ్చేది ప్లీజింగ్ పర్సనాలిటీ. నచ్చనిది అహంభావం.
మీలో మీకు నచ్చేది?
నాలోని ప్రేమతత్వం, మానవత్వం. నేను ప్రపంచాన్ని ప్రేమిస్తాను... మనస్ఫూర్తిగా!
మీలో మీకు నచ్చనిది?
కాస్త త్వరగా విసిగిపోతాను. కష్టపడి ఓ యాభై శాతం తగ్గించుకున్నాను. పూర్తిగా మారడానికి ట్రై చేస్తున్నాను.
మీ ఊతపదం?
నచ్చినవాళ్లందరినీ ‘బంగారం’ అంటుంటాను.
మిమ్మల్ని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తి/ఎందుకు?
మా అమ్మ. నిజమైన ఆత్మానందం ఎదుటివారికి సాయపడటంలోనే ఉంటుందని ఆవిడే చెప్పింది నాకు.
ఎందుకిలా చేశానా అని మీరు బాధపడేది ఏదైనా ఉందా?
లేదు. నేను వేసే ప్రతి అడుగూ భగవత్ప్రేరణతోనే పడుతుందని నమ్ముతాను. కాబట్టి చేసిన దానికి ఎప్పుడూ చింతించను.
అత్యంత సంతోషపడిన సందర్భం?
2000వ సంవత్సరం, జూలై 30. నా కూతురు సంస్కృతి పుట్టిన రోజు. తనని నేను తొలిసారి చూసిన రోజు. నా జీవితంలో ఆ రోజు కలిగినంత ఆనందం మరెప్పుడూ కలగలేదు.
అత్యంత బాధ కలిగించిన సందర్భం?
సత్య సాయిబాబా మరణం. ఆ రోజు నేను పడిన బాధ వర్ణనాతీతం.
ఆకలి విలువ తెలిసిన క్షణం?
భారతీయ విద్యాభవన్‌లో పని చేస్తున్నప్పుడు ఓసారి (1986) నా ఫుడ్ కూపన్స్ అయిపోయాయి. మళ్లీ తీసుకోవాలంటే జీతం రావాలి. అంతవరకూ భోజనం పెట్టమని క్యాంటీన్ వాడిని అడగడానికి మనసు రాలేదు. దాంతో రెండు రోజుల పాటు నీళ్లు మాత్రమే తాగాను. అప్పుడు తెలిసింది ఆకలి బాధ ఎలా ఉంటుందో!
ఎవరికైనా క్షమాపణ చెప్పాల్సి ఉందా? ఉంటే ఎవరికి?
ఎవరినైనా బాధపెట్టానని గ్రహిస్తే వెంటనే క్షమాపణ చెప్పేస్తాను. ఒకవేళ గ్రహించలేకపోయి ఎవరికైనా చెప్పకుండా ఉంటే... ఈ ఇంటర్వ్యూ ద్వారా ఇప్పుడే చెప్పేస్తున్నాను. నన్ను క్షమించండి.
మీ గురించి ఎవరికీ తెలియని ఓ విషయం?
నేను పాటలు పాడతానని అందరికీ తెలుసు కదా! కానీ నేను డ్యాన్స్ కూడా చేస్తాను. ఇంట్లో నా చిట్టితల్లి సంస్కృతి, నేను పాటలు వింటూ డ్యాన్స్ చేస్తుంటాం!
మిమ్మల్ని భయపెట్టే విషయం ఏమైనా ఉందా?
మోసం అంటే భయం. మోసం చేసేవాళ్లంటే ఇంకా భయం.
ఎలాంటి సమయాల్లో అబద్ధాలాడతారు?
జీతం కోసం ఆడతాను తప్ప జీవితం కోసం ఆడను. వృత్తిపరంగా కొన్నిసార్లు చెప్పక తప్పదు. దానివల్ల ఎవరికీ నష్టం ఉండదు. కానీ వ్యక్తిగతంగా చెప్పే అబద్ధాలు అవతలివారికి హాని కలిగిస్తాయి. అందుకే అలాంటివి చెప్పను.
ఎలాంటి వాటికి ఎక్కువ ఖర్చు పెడుతుంటారు?
సేవా కార్యక్రమాలకు ఎక్కువ ఖర్చుపెడతాను. తర్వాత నా భార్య సురేఖ కోసం, నా కూతురి కోసం ఖర్చు పెడతాను. ఎప్పుడైనా ఏదైనా షాప్‌కి వెళ్తే వాళ్లిద్దరికీ పది, పదిహేను జతల బట్టలు ఒకేసారి కొనేస్తుంటాను!
మీరు నమ్మే సిద్ధాంతం...?
మనుషుల మెచ్చుకోలు కోసం కాకుండా భగవంతుని మెచ్చుకోలు కోసం బతకాలి.
ఎప్పటికైనా చేసి తీరాలనుకునేది?
ప్రపంచ శాంతి కోసం ఉద్యమించాలన్నది నేనేనాడో ఏర్పరచుకున్న లక్ష్యం. ఇన్నాళ్లూ అదే చేశాను. ఇప్పుడూ అదే చేస్తున్నాను. ఇక ముందు కూడా ఆ దిశగానే కృషి చేస్తాను.
దేవుడు కనిపిస్తే ఏ వరం అడుగుతారు?
అందరికీ సమదర్శన దృష్టి ఇవ్వమని అడుగుతాను. అది వచ్చిననాడు ఈ ప్రపంచమే మారిపోతుంది. నదికి సమదర్శన దృష్టి ఉంది. చెట్టుకు కూడా ఉంది. కానీ హార్దిక సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారిపోయాక మనిషికి ‘సమదర్శన దృష్టి’ పోయి ‘తన దర్శన దృషి’్ట వచ్చింది.
మీ జీవితంలో ఒకే ఒక్క రోజు మిగిలివుందని తెలిస్తే... ఆ రోజును ఎలా గడుపుతారు?
నా భార్యాబిడ్డలతో కలిసి భగవంతుడిని ధ్యానం చేస్తూ గడిపేస్తాను.
మరణానికి భయపడతారా?
చావుకు భయపడుతూ... ప్రతిరోజూ చస్తూ బతకడం నాకు నచ్చదు. మరణం రాక తప్పదు. ఎప్పుడొస్తుందో తెలియని దానికోసం భయపడటం అనవసరం.
అందరికీ ఎలా గుర్తుండిపోవాలనుకుంటారు?
గజల్ శ్రీనివాస్ ఒక కారణంతో పుట్టాడు, దానికోసమే జీవించాడు అని అంతా అనుకోవాలి.
మళ్లీ జన్మంటూ ఉంటే ఎలా పుట్టాలనుకుంటారు?
మళ్లీ జన్మ అంటే ఈ జన్మకు సీక్వెల్ కదా! అందుకే నేను గజల్ శ్రీనివాస్ 2గా పుట్టాలని కోరుకుంటాను.
- సమీర నేలపూడి