మనోగళం: వచ్చే జన్మలో ఆవిడలా పుట్టాలి!
ఎదుటివాళ్లు మీ గురించి తప్పుగా అనుకునేది?
నా పని నేను చేసుకుపోతాను తప్ప ఎవరి జోలికీ పోను. పైగా ఏదైనా ముక్కు సూటిగా మాట్లాడేస్తాను. దాంతో కొందరు నాకు పొగరనుకుంటారు. అది నిజం కాదు. నాతో స్నేహం చేసిన వాళ్లను అడిగితే తెలుస్తుంది, నేనేంటో. ఒక్కసారి నాతో స్నేహం చేస్తే, నన్ను వదిలిపెట్టలేరు.
ఇతరుల్లో మీకు నచ్చేది/నచ్చనిది!
నచ్చేది నిజాయితీ, పాజిటివ్ థింకింగ్. నచ్చనిది... మన ముందు మంచిగా మాట్లాడి, అటు వెళ్లగానే చెడుగా మాట్లాడే గుణం. అలాంటి వాళ్లను అస్సలు భరించలేను.
మీలో మీకు నచ్చేది/నచ్చనిది?
నచ్చేది ముక్కుసూటితనం. నచ్చనిది షార్ట్ టెంపర్.
మీ ఊతపదం?
ఆయ్, ఏమ్మా, అయ్యబాబోయ్... మద్రాస్ వెళ్లినా, హైదరాబాద్ వచ్చి సెటిలైనా... ఇవి నన్ను వదలడం లేదు.
మిమ్మల్ని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తి/ఎందుకు?
నా భార్య అరుణ. చాలా సౌమ్యంగా ఉంటుంది. నేనేం చేస్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను అంటూ ఆరాలు తీయదు. తన బాధ్యతలు తను సెలైంట్‌గా నెరవేరుస్తుంది. ఇలాక్కూడా ఉండవచ్చా అనిపిస్తుంది నాకు. చాలా ఇన్‌స్పైర్ అవుతుంటాను తనని చూసి.
అత్యంత సంతోషపడిన సందర్భం?
నా మొదటి సినిమా ‘కళ్లు’ ప్రివ్యూ చూడటం నా జీవితంలోనే గొప్ప సందర్భం. నన్ను నేను తెరమీద చూసుకున్నప్పుడు పడిన సంతోషం మాటల్లో చెప్పలేనిది.
మీ హృదయం గాయపడిన సందర్భం?
ఎందుకో తెలీదు కానీ... నా అనుకున్న వాళ్లు ఒకరితో ఎప్పుడు మాట్లాడినా సంభాషణ డబ్బు చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అది నా మనసును గాయపరుస్తూ ఉంటుంది.
ఆకలి విలువ తెలిసిన క్షణం?
కెరీర్ ప్రారంభంలో మద్రాస్‌లో ఉన్నప్పుడు ఆకలంటే ఏంటో తెలిసింది. అలాగని మరీ ఎక్కువ కష్టమేమీ పడలేదు. ఓసారి వారం పాటు వర్షం పడుతూనే ఉంది. మెస్ చాలా దూరం. వెళ్దామంటే జేబులో డబ్బుల్లేవు. రెండు మూడు రోజులు చాలా అవస్థ పడ్డాను.
ఎవరికైనా క్షమాపణ చెప్పాల్సి ఉందా? ఉంటే ఎవరికి?
తెలిసి నేనెవరినీ బాధపెట్టలేదు. కాబట్టి చెప్పాల్సిన అవసరం ఉందనుకోను.
మీ గురించి ఎవరికీ తెలియని ఓ విషయం?
పొద్దున్నే ఐదున్నరకు లేస్తాను. వాకింగుకి వెళ్దామని ట్రాక్ సూట్, షూస్ వేసుకుని రెడీ అయిపోతాను. తలుపు తీసి బయటకొస్తాను. పేపర్ కోసం చూస్తాను. అప్పటికింకా రాదు. ఏడున్నర వరకూ రాదని కూడా తెలుసు. అయినా పేపర్ కోసం ఎదురుచూస్తూ కూర్చుంటాను. పేపర్ వచ్చాక చదువుతాను. మళ్లీ లోనికి వెళ్లి ట్రాక్‌సూట్, షూస్ తీసేసి పడుకుంటాను. అంత గొప్పగా ఉంటుంది నా వ్యాయామం!
మిమ్మల్ని అత్యంత భయపెట్టే విషయం ఏమిటి?
ప్రేమతో చేతులు కట్టేయడమంటారే... ఆ పరిస్థితి చాలా భయంగా ఉంటుంది. అటు నో అనలేం. ఇటు తేలిగ్గా ఎస్ అనీ అనలేం. అలాంటి ప్రేమకి తప్ప దేనికీ భయపడను.
ఎలాంటి సమయాల్లో అబద్ధాలాడతారు?
సాధారణంగా అబద్ధాలు చెప్పను, ఎవరినీ బాధపెట్టను. కానీ నా ఫ్రెండ్స్‌ని ఏడిపించడానికి ప్రాక్టికల్ జోక్స్ బాగా వేస్తాను. అవే నా అబద్ధాలు!
మీరు నమ్మే సిద్ధాంతం ఏమిటి?
‘ప్రార్థించే పెదవుల కన్నా, సాయం చేసే చేతులు మిన్న’ అన్న మదర్ థెరిసా మాటలే నేను నమ్మే సిద్ధాంతం.
ఎప్పటికైనా చేసి తీరాలనుకునేది?
వంద దేశాలు తిరగాలన్నది నా కల. ఓ అరవై తిరిగేశాను. ఇంకా నలభై ఉన్నాయి. అవి కూడా పూర్తి చేయాలి.
ఎలాంటి వాటికి ఖర్చు చేస్తారు?
ఉపయోగం లేని వాటికి! అవసరం లేకపోయినా కంటికి నచ్చినదాన్ని కొనేస్తాను. అలా కొన్నవాటితో ఇంట్లోనే ఓ చిన్న మ్యూజియం పెట్టాను. (నవ్వుతూ) అందుకే నేనెక్కడికైనా వెళ్తుంటే మా ఆవిడ అంటుంది... దయచేసి శంఖాలు, ఫొటోఫ్రేముల్లాంటి అనవసర వస్తువులు కొనుక్కురాకండి అని.
దేవుడు మీకేదైనా ప్రత్యేక శక్తినిస్తే... దానితో ఏం చేస్తారు?
ఇప్పుడున్న పరిస్థితుల్లో కనుక అలాంటి శక్తి వస్తే... తెలుగువారంతా ఒక్కటిగా ఉండేలా చేస్తాను!
ఎలాంటి ముగింపును కోరుకుంటారు?
ఎవరికీ ఒక్క పైసా కూడా బాకీ ఉండకూడదు. ఎవరూ నన్ను తిట్టుకోకూడదు. అలాంటి పరిస్థితుల్లోనే నేను పోవాలి. మరో విషయం... (నవ్వుతూ) నాకో ఇద్దరు శత్రువులు ఉన్నారు. నాతోపాటు వాళ్లను కూడా తీసుకునే పోవాలి.
అందరికీ ఎలా గుర్తుండిపోవాలనుకుంటారు?
మంచి మనిషిగా! (నవ్వుతూ) అది అసాధ్యమని తెలుసనుకోండి. అయినా అదే నా కోరిక!
మళ్లీ జన్మంటూ ఉంటే ఎలా పుట్టాలనుకుంటారు?
మదర్ థెరిసా పుట్టిన ఊరిలో, మదర్ థెరిసాలాగే పుట్టాలి. ఎక్కడో పుట్టి ఇక్కడికి వచ్చి సేవ చేస్తూ బతికిందా దేవత. అంతకన్నా గొప్ప జన్మ ఏదైనా ఉంటుందా!
- సమీర నేలపూడి